PM Modi

21:31 - February 25, 2017

ఢిల్లీ: పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీల మధ్య వార్‌ కొనసాగుతోంది. జైట్లీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అరుణ్‌జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను బయట పెట్టాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నసమయంలో జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలతో తన వ్యక్తిత్వానికి భంగం కలిగించారంటూ కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ నేతలపై అరుణ్‌జైట్లీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మార్చి 25 లోపు హాజరు కావాలని కేజ్రీవాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

21:30 - February 25, 2017

హైదరాబాద్: కాంగ్రెస్‌ ముఠా ప్రాజెక్టులను అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్‌ దోపిడీకి పాల్పడుతుందని.. దీన్ని ఊరుకోబోమన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టులను వారికి అప్పగించింది కేసీఆరే అన్నారు. దేశంలోనే నీచమైన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు ఉత్తమ్‌.

21:28 - February 25, 2017

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక అక్కడ మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. తనకు వ్యతిరేకంగా మీడియా వార్తలు రాస్తోందని ఆరోపణలు చేస్తూవచ్చిన ట్రంప్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు. తాజాగా వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రట‌రీ సీన్ స్పైస‌ర్ నిర్వహించిన మీడియా స‌మావేశాన్ని క‌వ‌ర్ చేసేందుకు వచ్చిన దిగ్గజ మీడియా సంస్థల‌ ప్రతినిధులను అనుమతించలేదు. సిఎన్‌ఎన్‌, న్యూయార్క్‌ టైమ్స్, లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌, బిబిసి, గార్డియన్‌ వంటి పలు మీడియా సంస్థల ప్రతినిధులను సమావేశానికి హాజరు కాకుండా వైట్‌హౌజ్‌ అడ్డుకుంది. ట్రంప్‌తో సన్నిహితంగా ఉండే ద వాషింగ్టన్‌ టైమ్స్‌, వన్‌ అమెరికా న్యూస్‌ నెట్‌వర్క్‌ లాంటి మీడియా సంస్థలను మాత్రమే లోనికి అనుమతించారు.

పైకి మాత్రం తప్పుడు వార్తలు రాసే మీడియాకే తాను వ్యతిరేకమని, పత్రికా స్వేచ్ఛకు, మీడియాకు కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నారు. మంచి వార్తలు చదవడం తనకిష్టమని చదవడానికి ఒక్క మంచివార్త కూడా ఉండడం లేదని సిపిఏసి సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫేక్‌ వార్తలు రాసే మీడియాకు తాను వ్యతిరేకమని చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ట్రంప్‌ మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో తొలి మీడియా సమావేశంలో సిఎన్‌ఎన్‌ రిపోర్టర్‌పై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఇటీవల ట్రంప్‌ విధానాలు వ్యతిరేకిస్తూ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా అమెరికా ప్రజలకు వ్యతిరేకమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నప్పటికీ మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని దుయ్యబట్టారు. ఏడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోకి రాకుండా బ్యాన్‌ చేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ఫోకస్‌ చేయడమే ఇందుకు కారణం.

ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్లను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై... ట్రంప్ చేసిన కామెంట్స్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి. కన్సర్వేటివ్‌ పొలిటికల్ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ -తాను కేవలం అమెరికాకే ప్రతినిధినని.. ప్రపంచానికి కాదన్నారు. అమెరికా ప్రజలకు రక్షణ కల్పించడం, వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేయడం తన పని అంటూ విదేశీ వలసదారులపై ట్రంప్ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ఇతర దేశస్తులను అమెరికా నుంచి వెళ్ళగొట్టేందుకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటూ విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్ అంటూ ఏదో రకంగా విదేశీయులను వారి స్వస్థలాలకు పంపించేసి.. దేశ పౌరులతోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలతో, అమెరికాలో ఉంటున్న ప్రవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

21:26 - February 25, 2017

హైదరాబాద్: అగ్ర రాజ్యం అమెరికా జాత్యాహంకారంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది. ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయులపై జరుగుతున్న దాడులను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. భారతీయులపై దాడుల్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ ముందు ఆలిండియా శాంతి సంఘం ఆందోళన చేపట్టింది. తెల్ల జాతీయుల దాడులపై వెంటనే స్పందించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అమెరికాలోని భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు. వరుస హత్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెచ్చగొట్టే ధోరణి మాని అమెరికాలో విదేశీయులపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

అమెరికాలో కాల్పుల ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఘటన తనను బాగా కలిచివేసిందన్న కేటీఆర్... బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. విదేశాంగ శాఖ సహాయంతో... మృతదేహాన్ని త్వరగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. బందర్‌ రోడ్డుల్లోని మాకినేని బసవపున్నయ్య విగ్రహం వద్ద జరిగిన ధర్నాల్లో ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటికైనా వలస నిబంధనలు వెనక్కి తీసుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. భారతీయులపై మరిన్ని దాడులు జరగకముందే... ట్రంప్ నిబంధనలు మార్చేలా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని మధు డిమాండ్‌ చేశారు.

అమెరికాలో ఇటీవల తెలుగువారిపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలను సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ పాలన పగ్గాలు చేపట్టాక.. భారతీయులపై దాడులు పెరగడం బాధాకరమని, వలసదారుపై జరగుతున్న దాడులు పునరావృతం కాకుండా.. భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సీపీఎం కేంద్రానికి సూచించింది.

14:48 - February 25, 2017

హైదరాబాద్: పదిహేనేళ్లుగా మణిపూర్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ భ్రష్టుపట్టించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. మణిపూర్‌ని తూర్పున ఉన్న స్విట్జర్లాండ్‌ అనేవారని, కానీ అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ఇంఫాల్‌లో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ప్రధాని కాంగ్రెస్‌ పాలనను ఎండగట్టారు. బిజెపికి మణిపూర్‌ ఆదరణ పెరిగిందని మోది అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ను గద్దె దింపినట్లే మణిపూర్‌లోనూ కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని మోది ఓటర్లకు పిలుపునిచ్చారు. మణిపూర్‌ రైతులకు నష్టం కలిగించిన కాంగ్రెస్‌కు అధికారంలో ఉండే అర్హత లేదని విమర్శించారు. గత 6 నెలల్లో కాంగ్రెస్‌ నుంచి పలువురు మంత్రులు, నేతలు బిజెపిలో చేరారు. 60 మంది సభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీకి మార్చి 4, 8 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది.

13:10 - February 25, 2017

విజవాయడ : అమెరికాలో భారతీయులను తరిమివేయడాన్ని నిరసిస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన జరుగుతంది. బందర్‌ రోడ్‌లోని మాకినేని బసవపున్నయ్య విగ్రహం వద్ద జరుగుతున్న ఈ నిరసనలో... సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. 

 

12:40 - February 25, 2017

నిజామాబాద్ : ఆరుగాలం శ్రమించి.. పంట పండించే అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. నేల తల్లినే నమ్ముకున్న రైతన్నలు సకాలంలో రుణం చేతికందక నానా తంటాలకు గురవుతున్నారు. రబీ సీజన్‌ ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా.. పంట రుణాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఆశించిన మేర రుణసాయం అందకపోవడంతో పాటు.. జనవరి 10 వరకు ఉన్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కూడా గడువు ముగిసినా బ్యాంకర్లు మాత్రం కనికరించడం లేదు. దీంతో రైతన్నలు పంటలు ఎలా సాగు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 
రుణ మాఫీకి నోచుకోక దిక్కులు చూస్తున్న రైతన్నలు
అటు పాత రుణం మాఫీ కాదు.. ఇటు కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వవు... ఈ పరిస్థితుల్లో సాగు చేసేదెలా అంటున్నారు నిజామాబాద్‌ జిల్లా అన్నదాతలు. రబీ ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ప్రభుత్వం ప్రకటించిన రుణమాపీ పథకం అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటుండటంతో హలం పట్టి..పొలం దున్నాలంటేనే గుబులు పుడుతోందని అన్నదాతలు చిన్నబోతున్నారు.
1.7 లక్షల రైతులకు పంట రుణాలు అందాల్సి ఉంది... 
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో దాదాపు 1.7 లక్షల రైతులకు పంట రుణాలు అందాల్సి ఉంది. కానీ సీజన్ మొదలై నాలుగు నెలలు కావస్తోన్నా ఇప్పటి వరకు 41 వేల 18 మంది రైతులకు మాత్రమే రుణాలిచ్చారు. అటు రుణాలు ఇవ్వకపోవడం, ఇటు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కూడా గడువు ముగియడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. రబీ రుణాలు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇచ్చే వీలున్నా సకాలంలో రుణాలు చేతికందకపోతే పెట్టుబడికి ఇబ్బందులుంటాయని రైతులు వాపోతున్నారు. 
రుణం అందక రైతులు ఆందోళన 
జిల్లాలో ఇప్పటికే ఆరుతడి పంటలు వేసిన రైతులు.. పెట్టుబడికి కావాల్సిన రుణం అందక ఆందోళనకు గురవుతున్నారు. కొందరు రైతులు చేసేది లేక వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు  తెస్తున్నారు. ఇక ప్రధాని మోదీ పిలుపు మేరకు జన్‌ధన్‌ ఖాతాలను తెరిచిన సన్న, చిన్నకారు రైతులు సరైన సమయంలో రుణం చేతికందక తీవ్ర కష్టాలు పడుతున్నారు. చేతిలో డబ్బుల్లేక యాసంగి పంటలకు పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
అగమ్యగోచర పరిస్థితిలో అన్నదాతలు
జీరో బ్యాలెన్స్‌తో జన్‌ధన్‌ ఖాతాలు తెరిచిన రైతులు.. పెద్ద నోట్ల రద్దుతో వాటిలో పంట అమ్మగా వచ్చిన డబ్బుల్ని కూడా జమ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఖరీఫ్‌ పంటలు చేతికి వచ్చినా వ్యాపారులు ఇచ్చిన చెక్కులను ఎక్కడ జమ చేయాలో తెలియని అగమ్యగోచర పరిస్థితిలో అన్నదాతలున్నారు. కేసీఆర్‌ ఇచ్చిన రుణ మాఫీ హామీ నెరవేరక అనేక మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్థానిక సీపీఎం నేతలు అన్నారు. రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని, భూముల్ని బలవంతంగా లాక్కుంటున్న కేసీఆర్‌ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడతున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. రుణ మాఫీ పథకం అమలు కాకపోవడం వల్ల పురుగుల మందే పెరుగన్నం అవుతోందని, సాగు భారమై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీకి చర్యలు తీసుకోవాలని రైతులు,  ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు. 

 

10:51 - February 24, 2017

సెమినార్ నిర్వహిస్తుంటే ఏబీవీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్ తో దాడి చేయడం కరెక్టేనా.. అని ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నత తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ ప్రధాన కార్యదర్శి టి.ఆచారి, టీఆర్ ఎస్ అధికార ప్రతనిధి తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. సెమినార్ ను అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

22:08 - February 23, 2017

న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్‌జస్‌ కళాశాలలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులు ఢిల్లీ యూనివర్సీటీ నుంచి  పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. ఏబివిపి విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ప్రయివేట్‌ సైన్యంలా ఎబివిపికి కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబివిపి హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులను సస్పెండ్‌ చేయాలని లెఫ్ట్‌ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల్లో దళిత, మైనారిటీ విద్యార్థులపై దాడులు పెరిగాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం డీయూలోని రామ్‌జాస్‌ కళాశాలలో 'కల్చర్‌ ఆఫ్‌ ప్రొటెక్ట్‌' సెమినార్‌లో ప్రసంగించడానికి వచ్చిన జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ను ఏబివిపి విద్యార్థులు అడ్డుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌, బస్తర్‌ ప్రాంతాలకు స్వాతంత్రం కోరుతూ కొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న  ఓ వీడియోను ఏబివిపి విడుదల చేసింది.

20:26 - February 23, 2017

అలహాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ రణరంగమైంది. రైతుల ఆత్మహత్యలపై అధికార విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. అమ్రేలి జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పరేష్‌ దహ్నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఒక బిజెపి ఎమ్మెల్యే గాయపడ్డారు. దీంతో స్పీకర్‌ రమణ్‌లాల్‌వోరా సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభించగానే స్పీకర్‌ ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్‌ నేత శక్తిసిన్హాగోహిల్‌- ప్రజాస్వామ్యానికి ఇది చీకటిరోజన్నారు.  బీజేపీ ఎమ్మెల్యేల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఈ దాడిలో గాయ‌ప‌డిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బ‌ల్దేవ్‌జీ ఠాకూర్‌ చెప్పారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - PM Modi