Poet

13:12 - March 19, 2017

ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు
ఒళ్ళంతా పువ్వులతో
తనను తాను తిరిగి పొందేవేళ..
అంటూ అద్భుత భావనా బలంతో కవిత్వం రాసిన అరుదైన కవి విన్నకోట రవిశంకర్. మనిషి తనలోని ఆత్మను అందంగా ఆవిష్కరించడమే కవిత్వమని భావించే రవిశంకర్ ఏ వస్తువునైనా అద్బుతమైన కవితా శిల్పంగా మార్చగలరు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంతో వస్తూ వస్తూనే తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశారు. అదే వరుసలో వచ్చిన వేసవివాన, రెండో పాత్ర లాంటి కవితా సంపుటాలు కవిత్వాభిమానులను మరితంగా ఆకట్టుకున్నాయి. 
"కవిత్వంలో నేను" వ్యాసం
కవిత్వం రాయడంతో పాటు ఇతర కవులు రాసిన కవిత్వాన్ని ఆకళింపజేసుకొని వారి కవితా సంపుటాలలోని వస్తుశిల్పాలను "కవిత్వంలో నేను" అనే వ్యాస సంకలనంలో అందంగా విశ్లేషించారు విన్నకోట రవిశంకర్. కవిత్వంలో నూతన అభివ్యక్తికి ఈ కవిరాసిన కుండీలో మర్రి చెట్టు కవిత్వం అద్దం పడుతుంది.
సున్నితమైన జ్ఞాపకాల వేలికొసల తాకిడికి
శ్రుతి చేసిన వీణలా ఆమె ధ్వనిస్తుంది
కనిపించని విషాదపు ఒత్తిడికి
చిగురుటాకులా  ఆమె  చలిస్తుంది
అంటూ సరికొత్త అభివ్యక్తితో కవిత్వాన్ని శిల్పీకరించారు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంలో 29 కవితలున్నాయి. హోళీ, ఉదయాలు, ప్లూ, నిద్రానుభవం, గాయం, కెరీరిజం, పాప మనసు, చలనచిత్రం, మెుదలైన కవితలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. 

కవిత్వం రాయడాన్ని చాలా సీరియస్ యాక్టివిటీగా భావిస్తారు రవి శంకర్ . అతని ప్రతి కవితా సంకలనంలో, ప్రతి కవితలోనూ ఈ స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. అతడు వెలువరించిన మరో కవితా సంపుటి వేసవివాన .అందులో
నేల కురిసే వాన
గుండ్రంగా తిరుగుతుంది
ఎప్పుడంటే అప్పడు
ఇంటి ముందు ఇంద్రధనుస్సులల్లుతుంది
 అంటూ వానను సరికొత్త భావనతో కవిత్వం చేసి అబ్బురపరుస్తారు. 
అగ్ని పర్వతం ఒకటి
హఠాత్తుగా మనసు మార్చుకుని
మంచుకొండగా మారిపోయినట్టుగా ఉంది
అంటూ ఒక వస్తును ఎవరూ ఊహించని ఇమేజరీతో తళుక్కుమనిపిస్తారు. ఇది  రవిశంకర్ ప్రత్యేక కవితా శిల్పకళ అని చెప్పాలి. 
విన్నకోట కవిత్వంలో ఏ వస్తువైనా అందంగా శిల్పీకరించబడుతుంది. కవిత్వ భాష , పదచిత్రాలు, ఇమేజరి, అభివ్యక్తి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అందమైన కవిత్వంగా ఆవిష్కరించబడుతుంది.. 

ఇక రెండో పాత్ర కవితా సంపుటిలో మెుత్తం 77 కవితలున్నాయి. అందులో గొడుగు, వానపాట, బాధ, సహచరిలాంటి కవితలు శిల్ప సోయగంతో కవితా ప్రియులను అలరిస్తాయి. 
జలజలమంటూ కురిసే వాన
కిటికీపై నీటిపరదాలు జార్చినట్టు
నీ పాట నా కంటిమీద
కన్నీటి తెరలు దించుతుంది..

వెలిసిన వాన వేరే ఊరు 
వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
ముగిసిన నీ పాట మాత్రం
కొన్నాళ్ల వరకు 
తలపుల్లో గూడుకట్టుకుని
కలలో కూడా వెంటాడుతుంది.. అంటాడు విన్నకోట రవిశంకర్..

కవిత్వం రాయడంతో ఆగి పోకుండా, ఇతరుల కవిత్వాన్ని చదువుతూ  కవిత్వాన్ని విశ్లేషించడం నిరంతరం కొనసాగిస్తున్నారు విన్నకోట రవిశంకర్.  కవిత్వంలో నేను సంకలనంలో నల్లగేటు నందివర్ధనం చెట్టు, నిరంతరయాత్ర, పడవనిద్ర, సాలె పురుగులాంటి వ్యాసాలు ఆయా కవుల సృజన పట్ల కొత్త ఆలోచలను రేకెత్తిస్తాయి. 

విన్నకోట రవిశంకర్ కు కవిత్వం వారసత్వంగా వచ్చింది. తండ్రి విన్నకోట వేంకటేశ్వరావు స్వయానా పండితుడు ..ఆయన తెలుగు తోట అన్న ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు. ఇందులో 85 మంది కవుల కవితలను ప్రచురించారు. 

ఇక రవిశంకర్ జీవిత విశేషాల్లోకి వెళితే ఆయన తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో  విన్నకోట వేంకటేశ్వరరావు, శ్యామల దంపతులకు జన్మించారు. పిఠాపురం, కాకినాడల్లో హైస్కూల్ వరకు చదువుకున్నారు. వరంగల్ లో యం.టెక్ ను పూర్తి చేశారు. తర్వాత ఎ.పి.ఎస్.ఇ.బి లోను తర్వాత  సి.యం.సిలో ఇంజనీర్ గా పనిచేశారు. 1998 లో అమెరికా వెళ్లి సౌత్ కెరొలినాలో ఉద్యోగం చేస్తున్నారు. 

ప్రముఖ కవి ఇస్మాయిల్ ప్రభావంతో  తనదైన మార్గంలో కవిత్వం రాస్తున్న అరుదైన కవి, సాహితీ సమీక్షకులు విన్న కోట రవిశంకర్. ఆయన కలం నుండి భవిష్యత్ లో మరెన్నో కవితా సంపుటాలు వెలువడాలని ఆశిద్దాం....

13:26 - February 19, 2017
13:13 - January 15, 2017

హైదరాబాద్ : సాహిత్యం సమాజానికి దర్పణం పడుతోంది. కవులు, రచయితలు తమ రచనలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. అలాంటి రచయితల్లో ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు ఒకరు. రాగమేదైనా కళ్లుమూసుకుని వినలేను...కవిత్వమైనా సరే... దృశ్య చంచలం కావాలి అంటున్న కవి దాట్ల దేవదానం రాజు. యానాం కు చెందిన ప్రముఖ కథకుడు కవి దాట్ల దేవదానం రాజు అనేక కథలు కవితా సంపుటాలు వెలువరించారు. యానాంలో సాహిత్య సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ సాహిత్యం పట్ల ప్రేమను ప్రకటిస్తున్నారు.. ప్రముఖ కవి కథకులు దాట్ల దేవదానం రాజుపై మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

13:33 - January 1, 2017

'నేను పుట్టకముందే దేశ ద్రోహుల జాబితాలో నమోదైఉంది నా పేరు. కన్నబిడ్డను సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర'.. అంటూ తెలుగులో ఓ కవితోద్యమానికి నాంది వాక్యం పలికిన కవి ఖాదర్ మొహిద్దీన్. 'పుట్టుమచ్చ' అనే కవితా సంకలనంతో తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయిగా నిలిచారు. ఆ సంకలనం వచ్చి పాతికేళ్లు అవుతున్న సందర్భం ఒకటైతే... ఆయన ఆరుణ్ సాగర్ అవార్డు అందుకోకపోవడం మరో విషయం. ఈ సందర్భంగా టెన్ టివి అక్షరం ఆయన్ను పలకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

14:51 - September 25, 2016

సాహిత్యం సమాజంలో మార్పును ఆశిస్తుంది. సమానత్వం కావాలంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పులను నేటి కవులు రచయితలు గుర్తించారు. నూతనత్వాన్ని ఆహ్వానించారు. అలాంటి వారిలో అన్నం రాజు శ్రీనివాసమూర్తి ఒకరు. ఆయన కథల పరిచయంపై ప్రత్యేక కథనం చూద్దాం....
పాఠకుల హృదయాలను కదిలించే అన్నంరాజు  
కథలు అందరూ రాస్తారు. కొందరే పాఠకుల హృదయాలను కదిలిస్తారు. తీవ్రంగా ఆలోచింపజేస్తారు. అలాంటి కథలురాశారు అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి. ఆయన మూడు పదులు అన్న కథాసంకలనాన్ని వెలువరించారు.కథావస్తువులో కొత్తదనం,కథనంలో ఉత్కంఠత,వాతావరణ కల్పనలో సహజత్వం ఉట్టిపడే కథలు రాసిన కథారచయిత అన్నంరాజు శ్రీనివాసమూర్తి పరిచయ కథనం మీకోసం.....
అనేక కథలు రాశాడు
తెలుగు కథాసాహిత్యంలో ఎందరో కొత్త రచయితలు ప్రవేశిస్తున్నారు. కథాసంకలనాలు వెలువరిస్తున్నారు. వస్తువైవిధ్యంతో కథలు రాస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి ఒకరు. ఆయన మూడు పదులు అనే కథా సంకలనాన్ని వెలువరించారు. ఒక సాధారణ సందర్భాన్ని అసాధారణంగాను, ఒక అపురూపమయిన సంఘటనను చాలా సహజంగాను మలుస్తూ అనేక కథలు రాశాడు. మూడు పదుల కథాసంకలనంలో మెుత్తం 30 కథలు ఉన్నాయి. అందులో భావన, మనిషితనం, సాయం, డ్యూటి, అరుణ తరంగం, సహచరి, వలపు వీచిక, బాధ్యతాబంధం, మనిషికథ, ధ్వని, పంథా మెుదలైన కథలు ఉన్నాయి. పేదరికం వ్యక్తుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో రచయిత కరుణ రసాత్మకంగా శిల్పీకరించారు. స్వేచ్ఛాపిపాసతో, స్వతంత్ర జీవనాభిలాషతో ముందడుగువేసిన అమ్మాయికథ ధ్వని.. అలాగే తనదైన జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో, ఎంత ఆదర్శవంతంగా జీవించవచ్చో తెలియజెప్పిన మనసిజ కథ.. ఇలా ప్రతి కథలో ఏదో ఒక జీవిత వాప్తవికతను తెలియ జేస్తూ రచయిత చాలా కథలు రాశాడు. చక్కని భాష, కథల్లో సహజమైన వాతావరన కల్పన, మనకళ్ళముందు కనిపించే మనుషుల్లాంటి పాత్రచిత్రణ, ఉత్కంఠత రేకెత్తించే కథాకథనం ..ఇలా శ్రీనివాసమూర్తి కథలన్నీ చదివించే విధంగా శిల్పీకరించబడ్డాయి. శ్రీనివాసమూర్తి అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో శ్రీనివాసమూర్తి కలం నుండి మరెన్నో కథాసంపుటాలు వెలువడాలని ఆశిద్దాం.

 

14:43 - September 25, 2016

సాహిత్యం సమాజంలో మార్పును ఆశిస్తుంది. సమానత్వం కావాలంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పులను నేటి కవులు రచయితలు గుర్తించారు. నూతనత్వాన్ని ఆహ్వానించారు. అలాంటి వారిలో ప్రముఖ కవి కాంచనపల్లి కవిత్వంపై ప్రత్యేక కథనం... 
చిన్నతనం నుండే కవిత్వం రాస్తున్న కాంచన పల్లి....
రాత్రి దండానికి వెలువడే ఊపిరి తీగకు ఒక కుచ్చుకున్న జ్ఞాపకం అంటూ కవిత్వం రాసిన అభ్యుదయకవి కాంచన పల్లి. ఆయన చిన్నతనం నుండే కవిత్వం రాస్తున్నారు. పాఠశాలలో పద్యాలు రాసి, కళాశాలలో వచనకవితలకు శ్రీకారం చుట్టారు. కవిత్వాన్ని అమితంగా ప్రేమించే ఆయన గతేడాది ` కలఇంకా మిగిలే ఉంది` అన్న కవితా సంపుటిని వెలువరించారు. ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు సమీక్షకులు కాంచనపల్లి పై ప్రత్యేక కథనం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:49 - August 7, 2016

నేను అక్షరాలతో ఆయుధాల్ని చేస్తాను. మాటల్తో మనుషులుగా మారుస్తాను. మనువాదాన్ని జయిస్తాను. పదాలతో పద్యం కట్టి వాక్యాలతో కొత్త జాతికి పునాదులు నిర్మిస్తాను. అంటూ కవిత్వమై ఎగసిపడిన అభ్యుదయ కవి లోసారి సుధాకర్ . కరువుసీమ ప్రజల కష్టాలను కన్నీళ్లను కవిత్వంగా మార్చి ఒక ఆర్ధ్రతనిండిన చినుకు కోసం ఆకాశమంత దు:ఖం పిడికెడంత గుండెలో పిడిచగట్టుకు పోతుందని కవిత్వమై విలపించిన హృదయమున్న కవి ఆయన. మైనపు బొమ్మలు, తడియారని స్వప్నం లాంటి కవితా సంపుటాలు వెలువరించిన ప్రముఖ కవి లోసారి సుధాకర్ గురించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:43 - July 10, 2016

మన ఓటుతో మనం చెక్కిన కుర్చీమీద కూర్చుందాం. తాటాకుల మీద కాల జ్ఞానాన్ని రాసిన వీరబ్రంహంగారి వారసులం అంటూ బహుజన కవిత్వాన్ని రాసిన కవి దాసోజు కృష్ణమాచారి. ఆయన బహుజన కులాల అస్తిత్వాన్ని గురించి అద్బుతమైన కవితలు రాశాడు. 'వన్నె' అన్న కవితా సంపుటిని వెలువరించాడు. కవి దాసోజు కృష్ణమాచారి పరిచయకథనం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:28 - May 15, 2016

పాటను తూటాలా ప్రజలగుండెల్లో పేల్చిన గేయ రచయితలెందరో ఉన్నారు. సమాజంలోని అనేక అంశాలపై వీరు పాటలు రాశారు. ప్రజా చైతన్యమే వీరి లక్ష్యం. అలాంటి వారిలో ఆర్.ఎ.వాసు ఒకరు. 

రైతుల కష్టాలను, వలసలను, చేనేత పరిశ్రమ దుస్థితిని, పేదపిల్లలు చదువుకునే హాస్టళ్ళ పరిస్థితిని, నిరుపేదలు జానెడు స్థలానికి కూడా నోచుకోని కడు దయనీయ పరిస్థితులను ఈ గేయ కవి తన పాటల్లో హృదయ విదారకంగా వర్ణించాడు. సమస్యలకు పరిష్కారం తిరగబడటమే అంటాడు.. 

ప్రపంచీకరణ సృష్టించిన విధ్వంసాలవల్ల మెట్ట మెదట బలిపశువులైంది  భారతదేశంలోని రైతులు, కులవృత్తులవాళ్లే... అందుకే ఈ కవి రైతుల దైన్యస్థితిని , దుస్థితిని, విషాద పరిస్థితిని  వర్ణిస్తూ... ఊరునిడువ మన్నది కరువు... ఉరితాడై ఉన్నది పరువు.. వ్యవసాయమన్నది రైతుల పాలిట వనవాసమయ్యిందంటూ గేయమై విలపించాడు.

ఒప్పుడు కులవృత్తులతో  హాయిగా బతికే బడుగువర్గాల  ప్రజలు పాలకుల తప్పుడు విధానాల వల్ల నేడు కులవృత్తులను  కోల్పోయారు. దుర్భరంగా బతుకులు వెల్లదీస్తున్నారు . గ్లోబలైజేషన్ కువృత్తుల వారి కడుపులు కొట్టింది. జీవన దృశ్యాలను  చెరిపేసింది . పాలకుల కంటితుడుపు  సంక్షేమ పథకాలు  పేదల కంటనీరు తుడవలేక పోతున్నాయి.. ఈ నేపథ్యంలో కులవృత్తిని నమ్ముకున్న చాకలి వారికి రేవు ..ఒ కప్పుడు జీవనాధారంగా ఉండేది. ఆ రేవు గురించి రేవూ.. నిన్నిడువా జాలనే.. నా సాకీరేవు.. అంటూ ఒక అద్భుత గీతం రాశాడీ గేయ రచయిత.

పక్షులకు గూడు ఉంది.. పశువులకు కొట్టం ఉంది. నిరుపేదలు తల దాచుకోడానికి ఒక గుడిసె ఉండదు. పాలకుల స్వార్థం వల్ల ఈ దేశంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతున్నారు . ఆకాశ హర్మ్యాలలో నివసిస్తున్నారు . పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారిపోతున్నారు .. చివరకు గుడిసె వేసుకోడానికి  కాసింత జాగాను  కూడా పొందలేక పోతున్నారు .ఇదే విషయాన్ని ఈ గేయ కవి ఆర్ద్రస్వరంతో వినిపిస్తాడు....

తరతరాలుగా నేతపని వాళ్లు మగ్గాలను నమ్ముకునే బతుకుతున్నారు . ఇవాళ హ్యాండ్లూమ్ ల స్థానంలో పవర్ లూమ్స్ వచ్చాయి. చేనేత కార్మికుల పొట్టలు కొట్టాయి. ఒకప్పుడు అగ్గి పెట్టెలో దాచిన చీరలల్లిన చేనేత కార్మికులు... అదే చీరలతో ఉరేసుకుని చస్తున్నారు. మరికొందరు  ఆ కులవృత్తిని వదులుకోలేక వేరే ఆధారం లేక జీవశ్చవాలుగా బతులకు వెళ్లదీస్తున్నారు . అందుకే ఈ కవి  ` మగ్గమా నీ వొడిని వొదిగి ఎదిగానమ్మా.. నిన్నిడిసి నేనెట్ల బతుకీడ్వగలను` అంటూ తానే ఒక నేత కార్మికుడై నేతల గోడును  విషాదస్వరంతో  వినిపిస్తున్నాడు..

చాలామంది బాగుపడే యోగం లేదు..  బాధ పడీ ఫలితంలేదని నిరాశకు గురవుతుంటారు. కాని అట్టడుగు వర్గాలనుండి వచ్చిన కవులు పోరాటమే అన్నింటికీ సమాధానమంటారు. ఈ వ్యవస్థలో దగా పడిన ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయాలి. హక్కులకై  ఉక్కుపిడికిళ్లు బిగించాలి. ఉప్పెనలా ఉద్యమించాలి. ఆధిపత్య సంస్కృతి కోటలు కూలగొట్టాలి. ఇదే విషయాన్ని చెబుతూ ఈ కవి పిడికెలెత్తి నిలబడతా హక్కులకై ఉద్యమిస్తానంటూ ఓ పోరాటగేయమై రగిలిపోతాడు. 

ఇలా సమాజంలోని శ్రమజీవుల పక్షంవహిస్తూ అనేక పాటలు రాసిన ఆర్.ఎ .వాసు రాయలసీమలో కరువుకు నిలయమైన కర్నూల్ జిల్లాలో జన్మించాడు. వామపక్ష భావాలతో ఎదిగాడు. పేదలకోసం కలం పట్టి తన సృజనాత్మకతతో  అనేక గేయాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం  చేస్తున్నారు . భవిష్యత్తులో ఈ గేయకవి కలం నుండి మరెన్నో గేయాలు జాలువారాలని ఆశిద్దాం.

14:23 - May 15, 2016

షాజహానా

        ఈ భూమి మీద నీ పాదమెంతో 
        నా పాదమూ అంతే
        అయినా కాలు బయట పెట్టడానికి 
        నాకు అవకాశమే లేదు
        అలసిన నామనసు  ఆనుకోడానికి
        ఇక్కడ స్థలం లేదు
        మరోగ్రహం ఏదైనా ఉందేమో వెతుక్కోవాలి
అంటూ పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛలేదని.. మనిషిగా జీవించే హక్కు కూడా లేదని వాపోతూ అద్భుత కవిత్వమై ఎగసిపడిన కవయిత్రి షాజహానా.
షాజహానాది ఓ ప్రత్యేకమైన గొంతు.
ముస్లిం అస్థిత్వవాద కవిత్వంలో, కథాసాహిత్యంలో షాజహానాది ఓ ప్రత్యేకమైన గొంతు. సున్నిత సుకుమార భావాలతో పాటు మతం, రాజకీయాలను ఎండగట్టడంలోనూ, తీవ్రవివక్ష, దోపిడీ, అణచివేతలకు గురవుతున్న స్త్రీల తరపున వకాల్తా పుచ్చుకొని కవితలు కథలు రాయడంలోనూ షాజహానా సృజన వేయి పూలుగా  విచ్చుకుంది.

పూలు విసిరినా-కత్తులు విసిరినా 
అక్షరం మొక్కువోదు
హృదయాల తర్జుమా ఆగిపోదు
ఉరుములు మెరుపులు ఏమైనా సరే
మొగ్గలు వికసిస్తాయి
అక్షరాలు తలెత్తుకునే ఉంటాయి..
అంటూ బంగ్లాదేశ్ రచయిత్రీ తస్లీమాకు అంకితమిస్తూ రాసిన ఈ కవితలో అక్షరానికి ముసుగులు తొడగలేను అంటూ నిజాలను నిర్భయంగా కవిత్వీకరించిన కవయిత్రి షాజహానా.

2012 లో దర్దీ కవితా సంకలనం   

షాజహానా రాసిన దర్దీ కవితా సంకలనం 2012 లో వెలువడింది. ఇందులో . ...చమ్కీ, బ్లాక్ హోల్స్, సిద్ధార్థి, అబ్ నార్మల్ పెయిన్, ఆయేషా కోసం, జఖ్ మీ, ఈద్ ముబారక్, పాటగాడు, అన్వేషణ, మృత్యువుకో ప్రేమలేఖ,  దేశాంతరదు:ఖం, మాదిగ బుచ్చమ్మ, ఖఠ్ఠామిఠ్ఠా దోస్తానా, నువ్విప్పుడు నాభూమివి మెుదలైన కవితలు కనిపిస్తాయి. షాజహానా కవితలు భావస్ఫోరకంగా శిల్పశోభితంగా, అభివ్యక్తి నవ్యతతో, సరికొత్త మెటాపర్లతో అలరిస్తాయి. వాటిలో భావాలు ఎంత సున్నితంగా ఉంటాయో.. భాష అంత సరళంగా ఉంటుంది. అభివ్యక్తి ఎంత తీవ్ర భావోద్వేగంతో ఉంటుందో .. ఆవేశం అంత కవితాత్మకంగా పరిమళిస్తుంది..
నువ్వే మంచివాడివి, దేవుడివి
ఉత్తమ పురుషుడివి, పాలకుడివి, అధికారివి
చాలా ఎక్కువగా భర్తవి, తండ్రివి, ప్రేమికుడివి
నేను నీవు చెప్పినట్లు వినే రోబోట్ ని అంతే..
అంటూ సమాజంలోఎన్నిరూపాల్లో పురుషాధిక్యత ఉంటుందో, స్త్రీలు ఎలా రోబోట్ లుగా మర యంత్రాలుగా మిగిలి పోయారో, అనేక కవితల్లో ప్రతీకాత్మకంగా ధ్వనింపజేశారు.

నవ్వుకోవడం, నృత్యించడం, దు:ఖించడం ఏమిచేస్తున్నా నా అవయవాలు మాత్రమే ప్రపంచానికి కనిపిస్తున్నాయి. నేను కనిపించడం లేదు అంటూ, స్త్రీల  అస్తిత్వం గురించి ప్రశ్నిస్తూ కవితా పాదాలుగా విరుచుకు పడతారు... అలాగే హాస్టళ్లలోనో, కాలేజీల్లోనో, పుస్తకాల నీడన సేదదీరే ఆదమరచిన అమాయక ప్రాణాల ఆయేషాల హత్యలకు న్యాయం ఏనాటికీ అందదని ఆవేశపు కవిత్వమై రగిలిపోతారు. అంతేకాదు, 
ప్రేమ ఎప్పుడూ
రెండు హృదయాలలోంచి రావాలనుకునే పసికూన
యాసిడ్లు, కత్తులు, కిడ్నాపులై అహంకారం
జీవితాల్నే మింగేస్తుంటే
బతుకుల్ని మృత్యువుకేసి రకేస్తున్న నీ కర్కశం ముందు
ఇంకే పశుజాతైనా నయమేననిపిస్తుంది..
అంటూ, ప్రేమ పేరుతో యువతులను వంచించి, మోసగించి వారి  జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్న మగాళ్ళకు కనువిప్పు కలిగించేలా కవిత్వం రాశారు.

అంతులేని వస్తు వైవిధ్యంతో కవిత్వం రాసిన షాజహానా, కేవలం కవిత్వమే గాక అద్భుతమైన కథలు కూడా రాసింది. వాటిని లద్దాఫ్ని ముస్లిం స్త్రీ కథలు` పేరుతో ఈ మధ్యే ఆవిష్కరించారు. ఈ కథలన్నీ జీవనోత్సాహాన్ని నింపే కథలని ఓల్గా...,  కవిత్వం వొంపిన తాత్విక వ్యక్తీకరణలని జూపాక సుభద్ర.. కొత్త కథకు పట్టుగొమ్మ అంటూ అంబటి సురేంద్రరాజులు షాజహానా కథలకు కితాబిచ్చారు. 

బిల్లి, కంచెకాకర, మనిషి పగిలిన రాత్రి, దీవారే, సిల్ సిలా మెుదలైన కథల్లోముస్లిం స్త్రీల మానసిక లోకాలు.. మానవత్వపు పార్వ్వాలు, కన్నీటి తడులు, జీవన సంఘర్షణలు, దయనీయ బతుకుచిత్రాలు, అక్షర దృశ్యాలుగా ఆవిష్కరించబడ్డాయి. ఈ కథల్లో పాత్రలు వాతావరణ కల్పన సహజాతి సజహజంగా ఉంటూ మన కళ్లముందు దృశ్యాలు దృశ్యాలుగా కదిలిపోతుంటాయి. మనసులను కదిలిస్తాయి. ఒక్కోచోట కన్నీటి పొరలుగా మిగిలిపోతాయి. కథలు చదివాక మనసంతా ఆర్ద్రతతో నిండిపోతుంది. ఆలోచనలన్నీ వేడి నిట్టూర్పుల సెగలుగా ఎగసిపడతాయి. 

ఇక షాజహానా జీవిత విశేషాల్లో కెళితే ఈమె ఖమ్మం జిల్లా కమలాపురం లో దిలావర్, యాకుబ్బీ దంపతులకు జన్మించారు. నాన్న దిలావర్ నుంచి సాహిత్యాన్ని వారసత్వంగా పొందారు. కవి, ఉద్యమకారుడు స్కైబాబాను సహచరునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ కోఠీ ఉమెన్స్ కళాశాలలో ఎం.ఎ వరకు చదువుకున్నారు. ముస్లిం వాద  కవిత్వం-వస్తు రూప వైవిధ్యం పై ఎం.ఫీల్ చేశారు. తెలుగులో ముస్లింవాద సాహిత్యంపై పిహెచ్ డి చేశారు. అస్మిత, షాహీన్, అన్వేషి లాంటి స్వచ్ఛంద సేవాసంస్థల్లో పనిచేసారు. స్వయంశక్తి సంఘాల ద్వారా మహిళాసాధికారతను పెంచాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెలుగు ప్రాజెక్టులోనూ పనిచేశారు.

2005లో షాజహానా నఖాబ్ ముస్లిం స్త్రీ కవిత్వం, స్కైబాబాతో కలసి చాంద్ తారా మినీ కవిత్వం వెలువరించటంతో పాటు, అలావా పేరుతో వచ్చిన  ముస్లిం సంస్కృతి కవిత్వానికి సంపాదకురాలిగా వ్యవహరించారు. షాజహానా కథలు, కవితలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. భారత ప్రభుత్వం తరపున గౌరవ అతిథిగా జర్మనీ, రష్యాలాంటి దేశాలు పర్యటించి కవితా పఠనం చేశారు. 

షాజహానా సాహితీ కృషికి ఎన్నో అవార్డులు లభించాయి. రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, రంగినేని యల్లమ్మ అవార్డు, రంజని అవార్డు, గుర్రం జాషువా పురస్కారం, రొట్టమాకురేవు కవితా పురస్కారం .. ఇలా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. భవిష్యత్తులో ఈమె కలం నుండి మరెన్నో కథా కవితా సంపుటాలు వెలువడాలని ఆశిద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - Poet