polavaram project

17:23 - October 10, 2018

అనంతపురం: శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయిదు నదులు అనుసంధానం చేసి మహాసంగమం  సృష్టిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భైరవానితిప్ప వద్ద కుందుర్పి ఎత్తిపోతల పధకానికి శంకుస్దాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గంటడికోటకు నీళ్లిస్తే పార్టీ ఉనికికి ప్రమాదమని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. 
ఈ రోజు రాయలసీమలో  అన్ని జిల్లాలకు నీళ్లివ్వగలుగుతున్నానని, తాను చేసే అబివృధ్ది పనులకు అడ్డుపడితే బుల్లెట్లా దూసుకుపోతానని చంద్రబాబు అన్నారు. ప్రతి సోమవారం నీరు-ప్రగతి మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానని, సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని దాని మీద శ్రధ్దపెట్టానని ,ఇప్పటికి 60 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని 2019 కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నానని వీటిలో 47 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని,గోదావరి,కృష్ణా, నదులు అనుసంధానం చేసామని, గోదావరి,పెన్నా నదుల అనుసంధానానికి చెందిన పనులు త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్య్తతులో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా వంశధార,నాగావళి,గోదావరి,కృష్ణ,పెన్నా,నదులు అనుసంధానం చేసి మహా సంగమాన్నిసృష్టిస్తానని  చంద్రబాబు అన్నారు.

21:39 - August 22, 2018

అమరావతి : భారీ వర్షాలు, వరదలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పైర్ల సాగుకు సహాయం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

తూ.గో. జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే
ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. గ్రామాల్లో నిలిచివున్న వరదనీటిని చూసి చలించిపోయారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

తూ.గో.జిల్లాలో 6,600 హెక్టార్లలో పంటనష్టం
తూర్పుగోదావరి జిల్లా 19 మండల్లాలోని 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరార్శించిన చంద్రబాబు.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 6,600 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు నివేదించారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 600 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాల్వ పొంగిపొర్లడంతో ఎక్కువ నష్టం జరిగినట్టు తేల్చారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆర్‌ అండ్‌ బీ రోడ్ల మరమ్మతులకు 35 కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలు
కోస్తా జిల్లాలు వరదలతో తల్లడిల్లుతుంటే.. రాయసీమ నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సీజన్‌లో ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంపాలు కావడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో పోలవరం పనులకు ఆటంకం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంతవరకు 57.5 శాతం పనులు పూర్తైన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం కోసం చేసిన ఖర్చులో కేంద్రం నుంచి ఇంకా 2,600 కోట్ల రూపాయల రావాల్సి ఉందన్నారు. నిర్మాణ బాధ్యతలను పూర్తిగా కేంద్రం తీసుకున్నా అభ్యంతరంలేదని చంద్రబాబు చెప్పారు.

ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు : చంద్రబాబు
మరోవైపు ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, 16 పూర్తయ్యాయని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు విపక్షాలకులేదని మండిపడ్డారు.వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే, పంటనష్టంపై సమీక్ష నిర్వహించిన తర్వాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. 

20:21 - August 22, 2018

విశాఖపట్నం : ఆవిష్కరణ, సాంకేతిక, సాంస్కృతిక, ప్రతిభ, ఆధ్యాత్మికతల మేళవింపుగా... జ్ఞానభేరి మోగించేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం సిద్దమైంది. విశాఖ వేదికగా జరగబోయే రెండో జ్ఞానభేరిలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ఏయూకి రానున్నారు. .. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీరంతా ముఖాముఖి మాట్లాడనున్నారు.

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం రెండో జ్ఞానభేరికి వేదిక కానుంది. గురువారం ఉదయం పది గంటలకు జ్ఞానభేరి ప్రారంభం అవుతుంది. జ్ఞానభేరి నిర్వహణకు సంబంధించి... మంత్రి గంటా శ్రీనివాసరావు.. వివిధ యూనివర్సిటీల వీసీలతో సమీక్ష నిర్వహించారు. ఇదే సందర్భంలో జ్ఞానభేరి ట్రోఫీని ఆవిష్కరించారు.

జ్ఞానభేరికి హాజరయ్యే విద్యార్థులతో యోగా నిర్వహింపజేసి.. పన్నెండు గంటల ప్రాంతంలో పోలవరంపై డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. జ్ఞానభేరికి హాజరవుతారు. కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించే డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. జ్ఞానభేరికి హాజరయ్యే విద్యార్థులతో.. నాలుగు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి సంభాషిస్తారు.

జ్ఞానభేరి కార్యక్రమానికి సుమారు 20 వేల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సభలోట్రోఫీలు బహూకరించనున్నారు. మొత్తం 35 స్థాయుల్లో బహుమతులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కాలేజీల విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు.

జ్ఞానభేరి కార్యక్రమానికి విశాఖ ఏయూలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూఫ్‌ టెంట్‌లు ఏర్పాటు చేశారు. జ్ఞానభేరి కార్యక్రమానంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖ మ్యూజియంలో వైజాగ్‌ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు హాజరవుతారు. 

21:48 - July 26, 2018

విజయవాడ : ప్రతిపక్ష నేత జగన్‌ సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే జగన్‌ చరిత్రహీనుడవుతారని హెచ్చరించారు. పట్టిసీమ ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడలేదని జగన్‌ ఆరోపించడంపై దేవినేని ఉమ మండిపడ్డారు. 

21:27 - July 26, 2018

పశ్చిమగోదావరి : రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీలను వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేసిన ప్రధాని మోదీని ఢిల్లీలో గజగజలాడిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే తెలుగుదేశం నిర్ణయించిన నేతే ప్రధాని అవుతారని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన నగరదర్శిని సభలో చంద్రబాబు చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన..
ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పశివేదలలో జరిగిన గ్రామదర్శిని, కొవ్వూరు నిర్వహించిన నగరదర్శిని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిపాలనలో పారదర్శకత కోసం ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్నిచంద్రబాబు గుర్తు చేశారు. కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ, వైపీసీ అధినేత జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీకి వంతపాడుతూ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్న రాజకీయ కుట్రదారులను వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే తెలుగుదేశం చక్రం తిప్పుతుంది : చంద్రబాబు
రాజీనామాలు చేసి ఇంట్లో పడుకున్న వైసీపీ ఎంపీలు ఇప్పుడు టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమని కోరడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. టీడీపీ అండలేకపోతే రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశంలేదన్న ఉద్దేశంతోనే బీజేపీ నాయకులు వైసీపీకి అండగా నిలుస్తున్నారని చందబ్రాబు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే తెలుగుదేశం నిర్ణయాత్మక శక్తిగా మారి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించి రాష్ట్రానికి న్యాయం చేస్తుందని చంద్రబాబు చెప్పారు. కొవ్వూరు పేరును గోవూరుగా మార్చాలని పట్టణ ప్రజలు చంద్రబాబును కోరగా.. ఇందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. మొదట్లో గోవూరుగా ఉన్న పేరును బ్రిటీషు పాలకులు కొవ్వూరుగా మార్చిన విషయాన్నిగుర్తు చేసిన ముఖ్యమంత్రి... కొవ్వూరు పేరు మార్పుపై నగరదర్శిని సభకు హాజరైన ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. ఎక్కువ మంది చేతులు ఎత్తి గోవూరుగా మర్చాలని కోరడంతో... ఈ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ... అధికారులను ఆదేశించారు. 

16:34 - July 26, 2018

పశ్చిమగోదావరి : కొవ్వూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో నగర దర్శిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతు..ఏపీ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా..ప్రజలు సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకరించకున్నా ప్రజల సహకారం వుంటే అభివృద్ధి చేసే విషయంలో ఏమాత్రం రాజీ పడమని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజ్యసభలో కేంద్రం ద్వంద వైఖిరి మరోసారి బైటపడిందన్నారు. బీజేపీ నేతలు మాట్లాడుతు..ఏపీలో పెన్షన్లు పెంచేసి, రైతు రుణమాఫీలు చేస్తు వాటికి కేంద్రం నిధులు ఇవ్వాలంటే ఎలాగని మాట్లాడుతున్నారనీ..ఏపీలో ప్రజలకు పెన్షన్లు, రైతు రుణమాఫీ విషయాలు తన ఇష్టమనీ..దానికి కేంద్రాన్ని నిధులు అడగటంలేదని స్పష్టంచేశారు. కానీ కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులను విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని వాటికోసం డిమాండ్ చేస్తున్నాం తప్ప మరొకటి కాదన్నారు.

పోలవరం నా జీవితాశయం : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం తన జీవితాశయమనీ..పోలవరాన్ని పూర్తి చేసి తెలుగు జాతికి అంకింత చేస్తానని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. కేంద్రం కేటాయించే బడ్జెట్ విషయంలో కూడా ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. ఏపీకి న్యాయం చేస్తారనే ఉద్ధేశ్యంతోనే ఎన్డీయే ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నామనీ కానీ నమ్మించి మోసం చేసిన బీజేపీ పార్టీ నుండి బైటకొచ్చామన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. అవిశ్వాస తీర్మానంతో నైతికంగా విజయం సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ అశాస్త్రీయంగా ఏపీని విభజించిందనీ..పుట్టెడు కష్టాలతో..లోటు బడ్జెట్ తో వేరుపడిన ఏపీని అభివృద్ధిపథంలో నడిపించేందుకు కష్టపడుతున్నామనీ..దానికి ప్రజల సహకారం ఎంతో అవరసరమన్నారు. ప్రజల సహకారం వుంటే ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కష్టపడతామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా ప యత్నిస్తామని..దాని బాధ్యతను తాను తీసుకుంటానని ధీమా వ్యక్తంచేశారు.

ఎన్ని సమస్యలు వచ్చిన అభివృద్ధి ఆపేది లేదు : చంద్రబాబు
ఎన్ని సమస్యలు వచ్చినా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగదన్నారు. కేంద్రం ఎన్ని సమస్యలు సృష్టించినా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కొనసాగించేలా కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను మాత్రం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

కేసులకు భయపడి జగన్ బీజేపీకి వంత : చంద్రబాబు
ఏపీకి ద్రోహం చేసని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేసులకు భయపడి వైసీపీ అధినేత జగన్ బీజేపీకి వంత పాడుతు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారనా..ప్రతీ శుక్రవారం కోర్టుకెళ్లి వచ్చే నేరస్థులు తనను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

15:29 - July 26, 2018

ఢిల్లీ : టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ ఎంపి శివప్రసాద్ కాటన్‌ దొర వేషదారణలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని మోది వితండ వాదాన్ని ఆపి సకాలంలో నిధులు ఇచ్చి పోలవరాన్ని పూర్తిచేయించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్ర రాష్ట్రం పోలవరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

15:21 - July 26, 2018

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సమస్య వెంటాడుతోంది. వచ్చే ఏడాదికల్లా గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయాలన్న సంకల్పానికి అవరోధాలు అడ్డుతుగులుతున్నాయి. బీజేపీ, టీడీపీ మధ్య నెలకొన్న రాజకీయాల కారణంగా పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోంది. ప్రధాన పనులు, డిజైన్లకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

పోలవరం నిర్మాణంపై నీలినీడలు..
ఆంధ్రప్రదేశ్‌కు వరప్రధాయినగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 నాటికి పూర్తి చేయగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ పోలవరాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని చెబుతున్నాయి. కానీ ఆచరణలో జరుగుతోంది ఇందుకు పూర్తిగా విరుద్దం. పోలవరం పూర్తిచేసే దిశగా పనులు సాగడం లేదు.

పోలవరం డిజైన్లు, తుది అంచనాలకు ఆమోదం తెలపని కేంద్రం..
ఇప్పటి వరకు కేంద్రం పోలవరం డిజైన్లతోపాటు తుది అంచనాలపై ఆమోదం తెలుపలేదు. కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, గేట్ల బిగింపు కార్యక్రమాలన్నీ అక్టోబర్‌కల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ జరుగాలంటే ముందుగా నిర్వాసితుల సమస్య పరిష్కరిస్తే తప్ప పనులు ముందుకుసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే 2019 ఖరీఫ్‌లో గ్రావిటీ ద్వారా సాగునీరు అందించడం కష్టతరంగా మారుతుందని జలవనరులశాఖ నిపుణులు చెప్తున్నారు.

వివిధ పనులకు రూ.10వేల కోట్లు ఇవ్వాల్సిన కేంద్రం..
41.5 మీటర్ల ఎత్తులో కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ల నిర్మాణ జరగాలంటే కేంద్రం నుంచి పదివేల కోట్లకుపైగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో 7వేల కోట్లకుపైగా నిర్మాణానికి అవసరమని తెలుస్తోంది. ఇప్పటి వరకు 56.69 శాతం పనులు జరుగగా.. స్పిల్‌వే, స్పిల్‌చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్, లెఫ్ట్‌ఫ్లాంక్‌ పనుల కోసం 851.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తి చేశారు. మొత్తం పనుల్లో 75.30శాతం పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. స్పిల్‌ చానల్‌, స్పిల్‌వే, స్టిల్లింగ్‌బేసిన్‌ కాంక్రీట్‌ పనులు 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్ల పనులు 61.55 శాతం, జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు 93శాతం పూర్తి చేశారు.

సవరించిన ప్రతిపాదనలు తప్పుల తడకగా ఉన్నాయన్న కాగ్‌..
పోలవరం ప్రాజెక్ట్‌పై కాగ్‌ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. సవరించిన ప్రతిపాదన తప్పుల తడకగా ఉందని, కాంట్రాక్టర్లకే లబ్ది చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంటూ కాగ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. పోలవరం ఎడమ కాలువలో మూడు ప్యాకేజీల పనుల్లో 256.7 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడిందని కాగ్‌ తేల్చింది. దేశంలోని 16 జాతీయ నీటి ప్రాజెక్ట్‌ల్లోకెల్లా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు కాగ్‌ తన నివేదికలో పొందుపర్చింది. కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ది చేకూరుతోందని తూర్పారబట్టింది.

పోలవరం నిధుల విడుదలపై కేంద్రం కొర్రీలు..
మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదలపై కేంద్రం కొర్రీలు పెడుతోంది. పోలవరం పనులకు , అంచనాలకు పొంతన లేదని... లెక్కలు చూపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రభుత్వం లెక్కలతో కూడిన నివేదికలు పంపినా... అందులో లోపాలు ఉన్నాయంటూ పోలవరానికి ఇవ్వాల్సిన నిధులను క్రమేణా కుదిస్తూ వస్తోంది. ఇప్పుడు పోలవరం విషయంలో రెండు పార్టీలు చెరొకమాట చెబుతుండటంతో పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తామంటే తామే పూర్తి చేస్తామని చెబుతున్నాయి. కేంద్రమైతే నిధులు విడుదల చేయకుండానే పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ గొప్పలుపోతోంది. మొత్తానికి రాజకీయాల కారణంగా పోలవరం మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్‌ అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇన్ని ప్రతికూలతల మధ్య 2019 జూన్‌ నాటికి పోలవరం పూర్తిచేయాలన్న లక్ష్యం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.

12:48 - July 26, 2018
12:46 - July 23, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పోలవరం నిర్మాణం వల్ల సమస్యలేంటో చెప్పాలని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. తమ సమస్యలు చెప్పాలని ఎన్నిసార్లు కోరినా... ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి ఏపీ తీసుకువచ్చింది. దీంతో ఈనెల 30లోగా ఏయే అంశాలపై విచారణ చేపట్టాలో చెప్పాలని తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గడ్‌ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది... లేకపోతే ఏయే అంశాలను విచారణకు చేపట్టాలో నిర్ణయిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - polavaram project