pongal

16:31 - January 12, 2017

హైదరాబాద్: గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేసి ఇంటిముంగిటకు తీసుకొచ్చి ఆటలాడించి అందరినీ ఓలలాడించే గంగిరెద్దుల వృత్తి కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి.. ఆ వృత్తికి ఆదరణ లేకుండా పోయింది. సంచార జీవనం గడిపే వారికి సొంత ఇల్లు, స్థిరాస్తి లాంటివి లేవు. సమాజంలో వారికి గుర్తింపు లేకుండా పోయింది. కుల కట్టుబాట్లు మరింత కుంగదీస్తున్నాయి. గంగిరెద్దు వృత్తిదార్లు చదువు రాకపోయినా సమయస్ఫూర్తితో మాట్లాడి మెప్పించగలరు. ప్రమాదమని తెలిసినా ఎటువంటి సెట్టింగులు లేకుండా గంగిరెద్దుతో విన్యాసాలు చేయించి అందరినీ ఆశ్యర్యపర్చేలా నిలబెట్టుతారు. అబ్బురపరిచే గంగిరెద్దుల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తీ కాదు..

అన్ని రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం....

అన్ని రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం పడినట్లు గంగిరెద్దుల వాళ్లపై పట్టణీకరణ ప్రభావం పడింది. గతంలో లాగా గ్రామాలలో గ్రాసం రాక బయట వేరే వృత్తులలోకి వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వృత్తి క్రమంగా కనుమరుగై ఇతర పనులకు మళ్లిపోతున్నారు. విశాఖ జిల్లాలో దాదాపు మూడు వేల వరకు గంగిరెద్దుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వృత్తిని నమ్ముకొని బతుకుతున్న దాదాపు ఆరు వేల కుటుంబాలకు జీవనోపాధి దెబ్బతిన్నది. ప్రభుత్వం నుంచి సరైన ఆదరణలేక, ప్రోత్సాహం ఇవ్వక నానా అవస్థలు పడుతున్నారు. సంచారజాతులుగా జీవనం సాగిస్తున్న ఆ కళాకారులకు రక్షణ కరువైంది. వృత్తిలేక, ఉపాధిలేక, ఆదుకొనే నాధుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జానపదకళలకు రక్షణ కల్పించాల్సిందిపోయి తిండిపెట్టే వృత్తి కనుమరుగవుతున్నా పట్టించుకొని దుస్థితి ఏర్పడింది.

500 కుటుంబాలు గంగిరెద్దుల వృత్తిపై జీవనం...

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో ముద్దుర్తి, లంకెలపాలెం, సబ్బవరం, మల్లునాయుడుపాలెం, చోడవరం, పెద్దబోడేపల్లి, మామిడిపాలెం, కె.కోటపాడు, వేపగుంట తదితర గ్రామాల్లో దాదాపు 500 కుటుంబాలు గంగిరెద్దుల వృత్తిపై జీవనం సాగిస్తున్నాయి. ఏడాదిలో సంక్రాంతి రోజుల్లో తప్ప ఇతర రోజుల్లో వీరికి ఆదరణ లేక కూలీ పనులకు వెళ్తుంటారు. పట్ణణాలు, గ్రామాలకు విసిరిపడేసినట్లు దూరంగా పాకలు వేసుకొని గంగిరెద్దును తిప్పుకొనే వారికి ఇప్పుడు స్థిర నివాస స్థలాల్లేవు. గంగిరెద్దులను మేపుకొనేందుకు కాసింత స్థలమూలేదు. గంగిరెద్దులను పోషించుకోలేక ఆ వృత్తిని విడిచి ప్లాస్టిక్‌, సిల్వర్‌ సామాన్లు అమ్ముకొని జీవిస్తున్నారు. పనులు, వ్యాపారం చేసే శక్తిలేని వారు భిక్షాటన చేసుకొని బతుకు వెళ్లదీస్తున్నారు. అత్యంత వెనుకబడిన తమను ఎస్‌టి జాబితాలో చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉన్నత తరగతికి చెందిన బి.సి(ఎ)లో చేర్చి ఎదగనీయకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైన ప్రభుత్వం తమను అదుకోవాలని....

ఇప్పటికైన ప్రభుత్వం తమను అదుకోవాలని ధీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమను ఎస్టీలలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమలో చదువుకున్న యువకులకు భవిష్యత్ అందంగా మారుతుందన్నారు. లోన్లు రాక సొంత వ్యాపారాలు ఏవైనా చెసుకునే పరిస్థితి లేక దిక్కు తోచక ఇదే వృత్తిలో కొనసాగుతున్నామంటున్నారు.

21:28 - January 11, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో రద్దీ పెరిగింది. పన్నెండో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో.. ఏపీకి చెందిన వారు.. చిన్నా పెద్ద సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

మహానగరం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రయాణీకుల కష్టాలు అన్నిఇన్నీ కావు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. ట్రైన్లు లేక పోవడంతో ప్రయాణీకులు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దొరికిన రైళ్లు, బస్సులలో సీట్లు దోరకక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు జూబ్లి బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్ధితి ఉండటంతో మరిన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేయాలని డిమాండ్ చేసారు.

పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ఆంధ్రాప్రజలు...

హైదరాబాద్ మహానగరంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం వారివారి ప్రాంతాలకు తరలివెళతారు. వీరితో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళతారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులు నడపడంలో ఆర్టీసీ విఫలమైంది. దీనికి తోడు రైల్వే శాఖ కూడా అదనపు రైళ్లను వేయకపోవడంతో సంక్రాంతి రద్దీ మరింతగా పెరిగింది.

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్....

సందేట్లో సడేమియాల్లా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు బస్సు ఛార్జీలు మూడింతలుగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీని అరికట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ఆర్టీసీ , రైల్వే శాఖలు స్పందించి రద్దీకి తగ్గటుగా అదనపు బస్సులను, రైళ్లను నడపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

09:41 - January 9, 2017

నర్సరావుపేట : గుంటూరు జిల్లా నరసరావుపేట స్టేడియలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు, సంస్కృతి సంప్రదాయలు ఉట్టిపడేలా రంగవల్లులు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఒంగోలు జాతి గిద్దల ప్రదర్శనతోపాటు, జాతీయ స్థాయి ఎండ్ల పందేలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈ పోటీలను ప్రారంరభించారు.

07:43 - January 15, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రంగురంగుల రంగవల్లులు కొత్త శోభను తీసుకొస్తున్నాయి. డూడూ బసవన్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.హరిదాసు కీర్తనలు అలరిస్తున్నాయి. తప్పెటగుళ్లు, కర్రసాము, పులివేషాలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సంక్రాంతి పిండివంటకాలతో తెలుగు లోగిళ్లు..ఘుమఘుమలాడుతున్నాయి. 
లోగిళ్లలో రంగుల హరివిల్లు
ఊరూవాడా సంక్రాంతి సందడి..తెలుగు లోగిళ్లులో రంగుల హరివిల్లు..ఎటుచూసినా సంబరమే... అతిపెద్ద పండగ సంక్రాంతి కొత్త కళను తెచ్చిపెట్టింది. పట్నమంతా పల్లెబాట పట్టడంతో గ్రామాలు పిల్లాపాపలు, బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి.
పండగ విశిష్ఠతను వివరిస్తున్న హరిదాసులు 
పండగ సమయంలోనే కనపడే హరిదాసులు పండగ విశిష్ఠతను లయబద్దంగా వివరిస్తున్నారు. సంక్రాంతి శోభతో ప్రతి ఇళ్లూ కళకళలాడుతోంది. ఇంటిముందు రంగవల్లులు ఇంద్రధనస్సులను తలపిస్తున్నాయి. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పంట చేతికి వచ్చిన సమయం కావడంతో రైతన్నలు ఆనందంతో పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక పిండి వంటలతో తెలుగు వాకిళ్లు ఘుమఘుమలాడాయి. 
గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. పరుగు పందేలు, మ్యూజికల్‌ చైర్స్‌, పలు రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. 
ఆకాశంలో సందడి చేస్తున్న పతంగులు 
సంక్రాంతి అనగానే పంతంగుల పండుగ గుర్తుకు వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ పతంగులు ఎగరవేస్తూ.. పండుగను ఎంజాయ్‌ చేస్తున్నారు. రంగు రంగుల పతంగులు ఆకాశంలో సందడి చేస్తున్నాయి. మేఘాలను తాకుతున్నట్లుగా సొగసైన నాట్యంతో చూపురులను కట్టిపడేస్తున్నాయి.యువకులు పోటీపడి మరీ పతంగులు ఎగరవేశారు 

 

20:25 - January 14, 2016

సంక్రాంతి అంటే ఏమిటీ ? మూడు రోజుల పాటు పండుగ ఎందుకు నిర్వహిస్తారు. ఈ అంశంపై టెన్ టివి మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో 'మల్లన్న' వివరించారు. భోగి మంటలు..చిన్నారులపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు ? అలాగే రంగు రంగుల ముగ్గులలు..హరిదాసులు గంగిరెద్దులు..పిండివంటలు కథ..సంక్రాంతికి నల్లనువ్వులతో తర్పణం..సంక్రాంతి పండుగలో వచ్చే కనుమ ఎందుకు చేస్తారు ? సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటలు..పాటలు.అంశాలపై 'మల్లన్న' ముచ్చట్లు చెప్పారు. మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:35 - January 14, 2016

హైదరాబాద్ : సంక్రాంతి సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పతంగుల పండుగ సంబురాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. రైట్ టు ఓట్ ఛాంపియన్‌ను ప్రారంభించారు. సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారని తెలిపారు. సూర్యుడు తన దిశను మార్చుకుని మకర రాశిలోకి ప్రవేశిస్తాడని అందుకే మకర సంక్రాంతి అంటామని వివరించారు. ఈసారి ప్రత్యేకంగా కైట్ మీద జీహచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని రాయడం గొప్ప విషయమన్నారు. ఈ ఫెస్టివల్ కి ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు దేశాల వారు కైట్ కాంపిటేషన్ లో పాల్గొన్నారు.

14:26 - January 14, 2016

ఉభయ గోదావరి : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి జోరందుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం భోగి మంటలతో మొదలైన సదండి.. కోడి పందాలతో ఊపందుకుంది. పందాలపై పోలీసులు ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని నిర్వాహకులు.. ఎప్పటిలాగానే... పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రౌండ్స్ ఏర్పాటు చేసి... పోటీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్న పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పోటీలను ప్రారంభించడం విశేషం. మరోవైపు నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బంధువులు వేడుకగా పండుగ జరుపుకుంటున్నారు.  కోనసీమలో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. హైటెక్‌ హంగుల బరుల మధ్య కోడిపందాల్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మరోవైపు కోడిపందాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. దీంతో కోడి పందాలు ప్రాంతాలు పెద్ద జాతరను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన కోడిపందాల బరులే కన్పిస్తున్నాయి. ఒక్కో పందెం 5 లక్షల నుంచి 50లక్షల వరకు సాగుతున్నాయి. మరోవైరపు పందెంలో ఓడిపోయిన కోళ్లకు కూడా బాగా గిరాకీ ఏర్పడింది. పందెంలో ఓడిపోయిన కోడిని వండుకుని తినేందుకు వేలరూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు కోడిపందాలు జోరుగా సాగుతుంటే..అంతే జోరుగా మద్యం అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. కోడి పందెం బరుల పక్కనే డ్రమ్ముల్లో ఐస్‌ను వేసి మరి బీర్లు, మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు వ్యాపారులు. 

14:21 - January 14, 2016

పశ్చిమగోదావరి : సంక్రాంతి..అనగానే అక్కడ కోళ్ల పందేలు గుర్తుకొస్తాయి. కోర్టులు..ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోరు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు ఈ పందేలలో మునిగితేలుతుంటారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. స్వయంగా ప్రజాప్రతినిధులే ఈ పందేలలో పాల్గొంటుండడంతో ఇతరులు కూడా విచ్చలవిడిగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. సుమారు 500 ప్రాంతాల్లో కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. ఓ ప్రాంతంలో బీజేపీ నాయకుడు కోళ్ల పందేలను ప్రారంభించగా ఒంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పందేలను ప్రారంభించారు. పాలకొల్లులో సంగీత దర్శకుడు కోటి పాల్గొన్నారు. దీనితో పాటు ఇతర జూద క్రీడలు యదేచ్చగా సాగుతున్నాయ. ఈ సంవత్సరం కోళ్ల పందేలలో పాల్గొనేందుకు హైదరాబాద్ ప్రాంతం నుండి ఎక్కువ మంది వచ్చినట్లు సమాచారం. వీరికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కోర్టులు..ప్రభుత్వాలు హెచ్చరికలు చేసినా కోళ్ల పందేలు..ఇతర జూద క్రీడలు జరుగుతున్నాయని స్వయంగా టెన్ టివి రిపోర్టర్లు ఫోన్ చేసి సమాచారం అందించినా పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు. 

11:54 - January 14, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని కోనసీమలో భోగి పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింభించే సంక్రాంతి పండుగలో భాగంగా తొలిరోజు భోగి మంటలు పల్లెల్లో కాంతులు నింపాయి. తెల్లవారుజామున గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వెలిగించి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు కోనసీమవాసులు. తెలుగు వారికి సంక్రాంతే పెద్ద పండుగని..ముఖ్యంగా కొత్త పంట ఇంటికొచ్చిన వేళ..రైతులు చాలా ఆనందంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నామని కోనసీమ వాసులు చెప్తున్నారు. 
విశాఖలో 
విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెల్లవారుజామునే బోగి మంటలతో పండుగను ఘనంగా ఆరంభించారు. దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణం ప్రవేశిస్తున్న వేళ భోగి పండుగను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని విశాఖ వాసులు చెప్తున్నారు. 

 

07:41 - January 14, 2016

హైదరాబాద్ : రంగురంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు... కోడిపందాలు, ఎడ్ల పోటీలు... ఇవన్నీ తలుచుకుంటే కళ్లముందు సంక్రాంతి మెదలుతుంది. సంక్రాంతి వచ్చిందంటే అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సంక్రాంతి పండగ గ్రామాల్లో నూతన శోభను చేకూర్చింది.
తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి
తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పర్వదినానాన్ని రైతులు వైభవంగా జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో అన్నదాతలు ఈ వేడుకను నిర్వహిస్తారు. అందుకే సంక్రాంతి రైతుల పండుగగా ఖ్యాతి గడించింది. పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలోనే సంక్రాంతి పండుగ కన్నులపండుగగా జరుపుకుంటారు. అందుకే పట్టణవాసులు వ్యయ ప్రయాసలకు ఓర్చి పల్లెలకు పయనమవుతారు. 
ఇళ్ల ముంగిళ్లలో రంగవల్లులు 
సంక్రాంతి నెల ప్రారంభం కాగానే ప్రతి రోజూ ఇళ్ల ముంగిళ్లలో రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆవుపేడతో తయారు చేసే గొబ్బెమ్మలు, రకరకాల పువ్వులతో ముఖ్యంగా గుమ్మెడిపూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. మరోవైపు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడుబుక్కల వాళ్లు, పగటి వేశగాళ్లు, జానపద కళాకారుల పద్యాలు పల్లెల్లో మారుమోగేవి. అయితే నేటి యాంత్రిక జీవితంలో గ్రామాల్లో కూడా ఇవి కనుమరుగవుతున్నాయి. పండగన్న ఆ మూడురోడు రోజుల్లో మాత్రమే సందడి కనిపిస్తోంది. 
సంక్రాంతి అంటేనే పిండివంటలు 
సంక్రాంతి అంటేనే పిండివంటల గుమగుమలు. కొత్త బియ్యం ఇంటికి చేరడంతో పలు రకాల రుచులను ఆస్వాదిస్తాం. నువ్వుల అరిసెలు, జంతికలు, సున్నుండలు, బొబ్బట్లు, బూరెల గుమగుమలు నోరూరిస్తుంటాయి. ఏ ఇంటికి వెళ్లినా పిండివంటలను వారం ముందునుంచే తయారుచేసేవారు. అయితే పట్టణాల్లో మాత్రం రెడిమేడ్‌ రుచులను ఆస్వాదించాల్సిందే. తయారు చేసే ఓపిక లేక స్వీటు షాపులను ఆశ్రయిస్తున్నారు.  
సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి
సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి. భోగి రోజు మంటలు వేయడం ఆనవాయితీ. ఇంటినిండా పేరుకుపోయిన చెత్తను పోగుచేసి మంటలు వేస్తారు. ఇందులో పిడకలు, కర్రలు వేసి అగ్గి రాజేస్తారు.  ఎముకలు కొరికే చలిని భోగిమంటలతో పారదోలుతారు. తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరించి,  పిల్లలు,  పెద్దలు సందడి చేస్తారు. ఇళ్లలో బొమ్మల కొలువులు, చిన్నపిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ఈ పండగకు అల్లుళ్లు అత్తగారింటికి రావడం ఆనవాయితీ. 
రెండో రోజు మకర సంక్రాంతి
ఇక రెండో రోజు మకర సంక్రాంతి. ఈ రోజున చేతికి వచ్చిన కొత్త బియ్యంతో తీపి పొంగలి చేస్తారు. పిండివంటలను నలుగురికీ పంచిపెట్టి.. తాము తింటారు. సంక్రాంతికి ఏ పల్లెలో చూసినా కోడిపందాలు, ఎండ్ల పందాలు జోరుగా సాగుతుంటాయి. ఇళ్లలో ఉండే పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి ఊరేగిస్తారు.
మూడవ రోజున కనుము పండుగ
మూడవ రోజున జరుపుకునే పండుగ కనుము. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. చేతికి వచ్చిన పంటను తామే కాకుండా పశు, పక్షులు పాలు పంచుకునేలా పిట్టల కోసం ధాన్యం కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. పశు, పక్షులే రైతుకు వెన్ను దన్ను. పశువులు లేకపోతే.. అన్నదాత లేడు. నేడు ఆధునిక యంత్రాలు పశువుల స్థానాన్ని లాగేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాలుగోరోజును ముక్కనుమ అని జరుపుకుంటారు. ఈ రోజున స్నేహితులకు, పనివారికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.
దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతి పండుగ  
తెలుగువారు జరుపుకునే సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో నిర్వహిస్తారు. కర్ణాటకలో సంక్రాంతి అంటే.. తమిళనాడులో పొంగల్‌ అని.. మహారాష్ట్ర, గుజరాత్‌లతో మకర సంక్రాంతి అని అంటారు. పంజాబ్‌, హర్యానల్లో లోరీలు అని పిలుస్తారు. గుజరాత్‌లో పతంగుల పండుగగా నిర్వహిస్తారు. పేర్లు వేరైనా పండగ మాత్రం ఒక్కటే. అదే రైతు పండగ. సంక్రాంతిని ప్రజలంతా ఆనందంతో జరుపుకోవాలని మనమూ ఆశిద్దాం. 

Pages

Don't Miss

Subscribe to RSS - pongal