rahul gandhi

21:54 - September 20, 2017

ప్రిన్స్ టన్ : యుపిఏ వైఫల్యాలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అంగీకరించారు. రోజుకు 30 వేల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయామని రాహుల్‌ అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగినవిధంగా ఉద్యోగాల సృష్టిలో ఎన్డీయే ప్రభుత్వం కూడా విఫలమవుతోందని తెలిపారు. తమ మీద ఆగ్రహం వ్యక్తం చేసినవారు ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై కూడా ఆగ్రహంతో ఉన్నారని రాహుల్‌ చెప్పారు. నిరుద్యోగం భారత ఆర్థికవ్యవస్థకు పెను సవాల్‌గా మారిందన్నారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. విద్య, ఆరోగ్యంపై కేంద్రం నిధులు వెచ్చించడం లేదని విమర్శించారు. మేక్‌ ఇన్‌ ఇండియాను పెద్ద పారిశ్రామికవేత్తలకే పరిమితం చేశారని... చిన్న వ్యాపారులను ప్రోత్సహించేలా చూడాలని అభిప్రాయపడ్డారు.

21:38 - September 4, 2017

అహ్మదబాద్: గుజరాత్‌ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల పేదలు, రైతులే నష్టపోయారని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ధ్వజమెత్తారు. గుజరాత్‌ మోడల్‌ తరహా అభివృద్ధి పనిచేయలేదని...దీనివల్ల యువత, రైతులు, చిన్న వ్యాపారులకు ఎలాంటి లబ్ది చేకూరలేదని చెప్పారు. మోది బడా వ్యాపారుల కోసమే పనిచేస్తున్నారని సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పార్టీని సమాయత్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికే టికెట్ కేటాయిస్తామని కార్యకర్తలకు తెలిపారు.

17:29 - August 19, 2017

యూపీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. బిఆర్‌డి ఆసుపత్రిలో ఇటీవల మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు. పిల్లలు మృతి చెందడానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ కూడా ఉన్నారు. ఆక్సీజన్‌ కొరత కారణంగా 36 మంది మృతి చెందారు. పిల్లల మరణాలకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అంతకుముందు గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిని పిక్‌నిక్‌ స్పాట్‌గా మార్చొద్దని రాహుల్ పర్యటననుద్దేశించి ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.

 

18:45 - August 17, 2017

ఢిల్లీ : శ‌ర‌ద్ యాద‌వ్ నిర్వహిస్తున్న 'స‌భా విరాస‌త్ బ‌చావో స‌మ్మేళ‌న్‌'కు హాజ‌రైన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ .. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మోది ప్రభుత్వం అన్ని సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులతో నింపేస్తోందని ధ్వజమెత్తారు. పోలీస్‌, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, మీడియా ఇలా అన్ని సంస్థల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ తమ వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటోందని మండిపడ్డారు. మరోవైపు మోది చెప్పేటివన్నీ అబద్ధాలేనని రాహుల్‌ తెలిపారు. మోదీ  'స్వచ్ఛ భార‌త్ కావాలంటున్నారు.. కానీ మాకు మాత్రం స‌చ్ భార‌త్‌' కావాల‌ని రాహుల్ ఎద్దేవా చేశారు.  మేకిన్‌ ఇండియా, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంతో మోది ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు ప్రతిపక్ష నేతలు సీతారాం ఏచూరి, అఖిలేష్‌ యాదవ్ తదితరులు హాజరయ్యారు. నితీష్‌కు తమ బలమేంటో చూపడానికే శరద్‌ యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

21:55 - August 16, 2017

బెంగళూరు : తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల తరహా కర్ణాటకలో పేదల ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిర క్యాంటీన్‌లను ప్రారంభించింది. అతి తక్కువ ధరకే కార్మికులు, పేదలకు టిఫిన్‌, భోజనం అందజేయనుంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బెంగళూరులో ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇందిరా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. తొలిదశలో బెంగళూరులో101 క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో ఉదయం ఐదు రూపాయలకు టిఫిన్... మధ్యాహ్నం, రాత్రి వేళలో 10 రూపాయలకు భోజనం అందజేస్తారు. బెంగళూరులో క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

 

19:40 - August 5, 2017

ఢిల్లీ : గుజరాత్‌ పర్యటనలో రాళ్ల దాడుల వెనక బిజెపి హస్తం ఉందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కార్యకర్తలే తన కారుపై దాడి చేశారని స్పష్టం చేశారు. దాడులు చేయడం మోది, ఆర్‌ఎస్‌ఎస్‌ల నైజమని పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డవారే దాడిని ఎలా ఖండిస్తారని ప్రధాని నరేంద్ర మోది నుద్దేశించి రాహుల్‌ అన్నారు. తన కారుపై ఓ కార్యకర్త పెద్ద రాయి విసిరాగా అది తన గార్డుకు తగిలిందన్నారు. 

 

12:41 - August 5, 2017

హైదరాబాద్‌ :నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు.. నిన్న గుజరాత్‌లో రాహుల్‌ గాంధీపై రాళ్లదాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు.. కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు... కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్‌ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

06:45 - August 5, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ బీసీ కార్డ్‌కు ప‌దును పెడుతున్నారా..? రాహుల్‌ అమల్లో పెట్టనున్న బీసీఫార్ములా ఏంటీ..? 2019 ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచే బీసీల కు మ‌రింత దగ్గరయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారా..? కాంగ్రెస్‌ నేతల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

2019 ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్‌ వ్యూహాలు

గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకే ప‌రిమితం అయిన‌ కాంగ్రెస్ పార్టీ 2019కి ప‌క్కాగా పావులు కదుపుతోంది. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్క‌డ న‌ష్టం జ‌రిగిందో గుర్తించిన కాంగ్రెస్ పార్టీ .. మ‌ళ్లీ ఆ పొర‌పాటు జ‌ర‌గ‌కుండా.. జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం దీనిపైనే దృష్టిపెట్టారు కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ.

మోదీని బీసీ నేతగా జరిగిన ప్రచారంతో దెబ్బతిన్న కాంగ్రెస్‌..!

గ‌త ఎన్నిక‌ల్లో మోదీని బీసీ నేత‌గా బీజేపీ ప్రచారం చేయ‌డం కూడా తమకు వ్యతిరేక ఫలితాన్నిచ్చిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికి తోడు ఆయా రాష్ట్రాల‌లో రాష్ట్ర నాయ‌క‌త్వాల తీరుతో బీసీలు దూర‌మ‌య్యార‌ని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు... వీట‌న్నిటిని స‌రిదిద్దుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యారు. దీని కోసం ఇపుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోడానికి ఓవైపు స‌మాయ‌త్తం అవుతూనే... 2019 నాటికి హ‌స్తానికి బీసీల‌ను దగ్గర చేయ‌డానికి ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగా దేశ‌వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల‌లోని పార్టీ బీసీ నేత‌ల‌తో ప్రత్యేకంగా స‌మావేశమ‌వుతున్నారు.

పంజాబ్, హ‌ర్యాణా, గుజ‌రాత్ బీసీ నేతలో రాహుల్‌ భేటీ

బీసీ వ్యూహంలో భాగంగా వరుసగా పంజాబ్, హ‌ర్యానా, గుజ‌రాత్ లకు చెందిన బీసీ నేత‌ల‌తో రాహుల్‌ భేటీ అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి అమల్లో పెట్టాల్సిన బిసి మంత్రాగాన్ని ఉప‌దేశించారని కాంగ్రెస్‌నేతలు చెబుతున్నారు.

తెలంగాణపై రాహుల్‌ ప్రత్యేక దృష్టి

ఇటు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్‌ ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాక‌పోవ‌డానికి పార్టీకి బీసీలు దూరం కావడం కూడా ఓ ప్రధానకార‌ణ‌మ‌ని రాహుల్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా ప్రయోగిస్తున్న బీసీ కార్డ్ తెలంగాణలో మ‌రింతగా కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పెద్దలు నమ్ముతున్నట్టు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే శ‌నివారం తెలంగాణకు చెందిన పార్టీ బీసీ నేత‌ల‌తో రాహుల్ భేటీ అవుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో బీసీల‌కు మ‌రింత దగ్గరయ్యేందుకు.. ఏలాంటి పథకాలు ప్రకటించాలన్న నేత‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటారని టీ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ స‌మావేశంలో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌పార్టీ బీసీ నేతలతో రాహుల్‌ చర్చలు జరపనున్నారు.

రాహుల్‌ బీసీ మంత్రాంగం కాంగ్రెస్‌కు కలిసి వచ్చేనా..!

మొత్తానికి రాహుల్ గాంధీ.. పార్టీ సార‌థ్య బాధ్యతలను భుజానికి ఎత్తుకోవ‌డానికి సిద్ధమవుతూనే.. 2019లో విక్టరీ కొట్టేందుకు ఇప్పడి నుండే పార్టీ ప్రణాళికలకు ప‌దును పెడుతున్నారు. మ‌రీ రాహుల్ ప్రయోగిస్తున్న బీసీ మంత్రం.. ఏమేర‌కు పార్టీని అధికారంలోకి తెస్తుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయవ విశ్లేషకులు.

20:29 - August 4, 2017

గుజరాత్‌ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడి జరిగింది.  బనాస్‌కాంతా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులనుద్దేశించి రాహుల్‌ మాట్లాడుతుండగా రాహుల్‌ కాన్వాయ్‌పై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. రాహుల్‌ సెక్యూరిటి సిబ్బందికి గాయాలయ్యాయి.  మరికొందరు రాహుల్‌ పర్యటనను నిరసిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించారు. తన పర్యటన చూసి ఓర్వలేక రాళ్ల దాడి చేశారని వీటికి తాను భయపడనని రాహుల్‌ అన్నారు. బీజేపీ పార్టీకి చెందిన గూండాలు రాహుల్ కారును ధ్వంసం చేసిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనను అవ‌మాన‌క‌ర‌మైన దాడిగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుర్జేవాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

07:25 - August 2, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్‌గా దిగ్విజ‌య్‌సింగ్‌ ప్రయాణం ముగిసింది. 2013 నుండి ఇంచార్జ్ బాధ్యత‌లు మోసిన దిగ్విజ‌య్‌సింగ్‌ ను త‌ప్పిస్తూ పార్టీ హైక‌మాండ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పార్టీ వ్యవ‌హారాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న దిగ్విజ‌య్‌ను బాధ్యత‌ల నుండి త‌ప్పించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014 లో పార్టీ ఓట‌మి త‌ర్వాత దిగ్విజ‌య్ ను త‌ప్పించాల‌ని చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఎన్నికల్లో ఓట‌మి, టీ-పీసీసీలో స‌మ‌న్వయం సాధించడంలో ఇంచార్జ్ గా దిగ్విజ‌య్ విఫ‌ల‌మ‌య్యార‌ని టీకాంగ్‌ నేతలు వరుసకట్టి మరీ ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే అధిష్టానం ఆ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదు.

ఏఐసీసీ ప్రక్షాళ‌న
కాని సెప్టెంబ‌ర్‌లో ఏఐసీసీ ప్రక్షాళ‌న స‌మ‌యంలో మార్పులు ఉంటాయ‌న్న సంకేతాల‌ను రాష్ట్ర నేత‌లకు ఇస్తూ వ‌చ్చింది. అయితే ఇప్పటికిప్పుడు దిగ్విజ‌య్‌ను త‌ప్పిస్తూ నిర్ణయం తీసుకోవ‌డం స్టేట్ లీడ‌ర్స్‌ను ఆశ్చర్యంలో ముంచింది. అయితే దిగ్విజ‌య్‌ను నిజంగానే హైక‌మాండ్ త‌ప్పించిందా..? లేక ఆయ‌నే త‌ప్పుకున్నారా..? ఇపుడు ఇదే అంశంపై పార్టీలో గుసగుసలు జోరుగా సాగుతున్నాయి. ఇంచార్జిగా ఉండి..అందరినీ కలుపుకుని పోవాల్సిన దిగ్విజయ్‌.. త‌న‌కు అనుకులంగా ఉన్న వారికి ప్రాధాన్యత క‌ల్పిస్తూ.. పార్టీకి ప‌నికి వ‌చ్చేవారిని దిగ్విజ‌య్ నిర్లక్ష్యం చేశారని టీకాంగ్‌ నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో పార్టీ ఆశించిన విధంగా స‌మ‌యాన్ని కూడా దిగ్గిరాజా కేటాయించలేక పోయారనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో కేవ‌లం ట్విట్టర్ల కే పరిమితం కావ‌డంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సమన్వయం కొరవడింది. దీంతో ఢిల్లీ అధిష్టానం ఆయన్ను తప్పిస్తూ.. ఆర్‌సీ కుంతియాకు కొత్తగా బాధ్యతలు అప్పగించిందని హస్తంపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

స్వంత రాష్ట్రం పై దిగ్విజ‌య్ చూపు
మ‌ధ్యప్రదేశ్ లో ఎన్నిక‌లు రానుండంట‌తో.. దిగ్విజ‌య్ చూపు స్వంత రాష్ట్రం పై ప‌డింద‌ని కొంద‌రు అంటున్నారు. అందుకే వ‌చ్చే నెల నుంచి .. న‌ర్మదా ప‌రిక్రమ యాత్రను త‌ల‌పెట్టారన్న చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిలో భాగంగా దిగ్విజ‌య్ ఆరు నెల‌ల పాటు పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఇది పూర్తి అధ్యాత్మిక యాత్ర అని పైకి చెబుతున్నా.. స్టేట్ పాలిటిక్స్‌పై ప‌ట్టుపెంచుకునేందుకు దీనిని ఉప‌యోగించుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ యాత్రకు ఇప్పటికే సోనియా, రాహుల్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ మార్పు ..రాష్ట్రవ్యవహరాల ఇంచార్జ్ వ‌ర‌కే పరిమితం అవుతుందా.. లేక రాష్ట్ర నాయ‌కత్వానికీ, ముఖ్యంగా టీపీసీసీ పీఠాన్ని కూడా తాకుతుందా.. అసలు ఢిల్లీ పెద్దల మ‌న‌సులో ఏంవుందనేది టీ-కాంగ్రెస్‌ నేతలకు అంతుపట్టని విషయంగా మారింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - rahul gandhi