rajath kumar

08:20 - December 9, 2018

హైదరాబాద్:  తెలంగాణా శాసన సభకు జరిగిన ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోనూ, ఏబూత్ స్ధాయిలోనూ రీపోలింగ్  అవసరంలేకుండా ఎన్నికలు జరగటం ఇదే తొలిసారని ఎన్నికల సంఘం అధికారులు పేర్కోన్నారు. శనివారం హైదరాబాద్ లోని  కార్వాన్ నియోజకవర్గంలోని ఒక బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్ధనలను  రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి రజత్ కుమార్ తిరస్కరించారు. కార్వాన్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి  పోలింగ్  కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు స్ధానిక రిటర్నింగ్ అధికారికి సమర్పించిన  స్టేట్ మెంట్సలో  కొన్నిపేపర్లు మొదట కనిపించలేదని, తర్వాత ఆ స్టేట్ మెంట్ పేపర్లు  వేరే పత్రాల్లో కలిసి పోయినట్లు గుర్తించామని రజత్ కుమార్ చెప్పారు.  ఈవిషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని ఇందుకు కేంద్ర ఎన్నికలు సంఘం సమ్మతించింది కనుక ఇంక కార్వాన్ లో రీపోలింగ్ అవసరం లేదని రజత్ కుమార్ వివరించారు. 
 

22:09 - December 8, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో  73.20 శాతం ఓట్లు పోలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి రజత్ కుమార్ చెప్పారు. గత ఎన్నికల కంటే  ఈ ఎన్నికల్లో  పోలింగ్ శాతం పెరిగిందని ఆయన తెలిపారు. తుది పోలింగ్ శాతాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాం అని ఆయన తెలిపారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం

ఆసిఫాబాద్ 
85.97
మంచిర్యాల  78.72
ఆదిలాబాద్     83.37
నిర్మల్        81.22
నిజామాబాద్   76.22
కామారెడ్డి      83.05
జగిత్యాల      77.89
పెద్దపల్లి       80.58
కరీంనగర్     78.20
సిరిసిల్ల        80.49
సంగారెడ్డి       81.94
మెదక్          88.24
సిద్దిపేట         84.26
రంగారెడ్డి         61.29
వికారాబాద్       76.87
మేడ్చల్           55.85
హైదరాబాద్        48.89
మహబూబ్ నగర్    79.42
నాగర్ కర్నూల్       82.04 
వనపర్తి                81.65
జోగులాంబ గద్వాల    82.87
నల్గొండ          86.82
సూర్యాపేట       86.63
యాదాద్రి భువనగిరి  90.95
జనగాం  87.39
మహబూబాబాద్ 86.70
వరంగల్ రూరల్  89.68
వరంగల్ అర్బన్   71.18
భూపాలపల్లి  82.31
భద్రాద్రి   82.46
ఖమ్మం  85.99

 

21:26 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని.. పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, 100శాతం పారదర్శకంగా పోలింగ్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ రాత్రిలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. వంద శాతం ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని చెప్పారు.
ఓటరు గుర్తింపు కార్డు లేనివారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటరు ఐడీ కార్డు లేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, లోపలకు సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ధూమపానంపై నిషేధం ఉందన్నారు. మద్యం తాగి ఓటింగ్‌కు రావడం కరెక్ట్ కాదన్నారు. చట్టపరంగానూ నిషేధం ఉందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయచ్చుని చెప్పారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, జాబ్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, ఫొటో గుర్తింపు కార్డులు, పెన్షన్ డాక్యుమెంట్లు చూపి ఓటు వేయొచ్చుని తెలిపారు. ఈసారి కొత్తగా 20లక్షలమంది ఓటర్లుగా చేరారని రజత్‌కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి మళ్లీ ఓటర్ల జాబితా సవరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఓట్ల సవరణ కార్యక్రమం మొదలవుతుందన్నారు.
సా.5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఎంత సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నకిలీ ఓటర్లను తొలగించామన్నారు. ఎన్నికల సందర్బంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 135 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు రజత్‌కుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో దొరికిన దానికంటే రెట్టింపు నగదును ఈసారి స్వాధీనం చేసుకున్నామన్నారు. డబ్బు పంపిణీ కింద 250 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లు తగినంత సఖ్యంలో ఉన్నాయన్నారు. ఈవీఎంలు ఫెయిల్ అయ్యాయంటూ ప్రచారం ఉందని.. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామని రజత్‌కుమార్ వెల్లడించారు.
గుర్తింపు కార్డులు ఇవే..
పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌.

07:37 - December 3, 2018

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొడంగల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. డిసెంబర్ 4న జరగబోయే కేసీఆర్‌ సభను అడ్డుకుంటానని ప్రకటించిన రేవంత్‌రెడ్డిపై ఈసీ సీరియస్‌ అయ్యింది. వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక కూడా ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ కోరారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు:
తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. డిసెంబర్ 4న కొడంగల్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు.. సీఎం కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌ ప్రజలను అకారణంగా రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను సైతం ఈసీకి అందించారు. రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుపై స్పందించిన రజత్‌కుమార్‌... తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. రేవంత్‌ ఎపిసోడ్‌పై ఏం చర్యలు తీసుకున్నారో కూడా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
రంగంలోకి హరీష్:
ఇక రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్‌రావు రంగంలోకి దిగుతున్నారు. కొడంగల్‌‌లో జరిగే సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్లతో పాటు.. నేతలు, కార్యకర్తలకు మనోస్థైర్యం కలిగించేందుకు అక్కడికి వెళ్లనున్నారు. అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కొడంగల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.

18:53 - November 29, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన సెలవు ప్రకటించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కచ్చితంగా, విధిగా సెలవు ఇవ్వాలని కూడా ఆదేశించారు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. సెలవు ఇవ్వని సంస్థలపై కార్మిక, ఎన్నికల చట్టాలను ప్రయోగించి మరీ చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. సెలవు ఎందుకంటే.. ఓటు వేయటానికి. ఓటు అనేది ప్రాథమిక హక్కు. వచ్చే ఐదేళ్లు ప్రజల తలరాతను మార్చే ఓటు అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఓటు వేయటానికి అవకాశం కల్పించటంలో భాగంగానే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
ఓటు హక్కు వినియోగించుకోండి :
ఓటర్లు అందరూ కూడా ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు కృషి చేయాలని సూచించారు.

19:12 - November 20, 2018

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు 3 వేల 583 నామినేషన్లు  దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్పారు.  ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచటానికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఓటరుస్లిప్పులు పంపిణీ చేపడతామని ఆయన తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో 32వేల769పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచమని కొన్ని, మార్చమని కొన్ని విజ్ఞప్తులు వచ్చాయని వాటి అనుమతి కోసం సీఈసీని కోరామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18వేల  మంది పోలీసు సిబ్బంది ఉన్నారని పోలింగ్ ప్రశాంతంగా జరపటానికి చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ నుంచి అదనంగా 12వేల మంది పోలీసు బలగాలను రప్పిస్తున్నామని  రజత్ కుమార్ తెలిపారు.  పోలింగ్ రోజు  ఓటర్ల జాబితాను  పోలింగ్ బూత్ వద్ద ఉంచుతామని, పంపిణీ చేయగా మిగిలిన  ఓటర్ స్లిప్పులు  ఎన్నికల రోజు పోలింగ్ బూత్ వద్ద ఉంచుతామని ఆయన చెప్పారు.  

07:53 - October 30, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో ఎవరి ఫోన్లు ట్యాపింగ్ కు గురవ్వట్లేదని రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి రజత్కుమార్ చెప్పారు. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని పలువురు ప్రతిపక్షనేతలు ఇటీవల సీఈవోకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రజత్కుమార్ డీజీపీని  వివరణ కోరారు. జాతీయభద్రత, నేరాల అదుపుకోసం కట్టుదిట్టమైన విధి,విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్ జరుపుతున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి సీఈవో కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఎవరి ఫోన్ ఐనా ట్యాపింగ్ చేయాలంటే కేంద్రహోంశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిఉంటుందని, దేశరక్షణ,శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే అలాంటి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్ధితులు లేవని డీజీపీ నివేదిక ఇచ్చినట్లు రజత్కుమార్ తెలిపారు. 

21:37 - October 26, 2018

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ మహాకూటమి నేతలు చేసిన ఫిర్యాదులపై ఈసీ స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ డీజీపీని ఆదేశించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో చెప్పాలని డీజీపి ఆదేశించారు. 
ఎంఎంటీఎస్ రైళ్లలో సీఎం కేసీఆర్ ప్రకటనలతో కూడిన ఫొటోలు పెట్టారన్న ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని రజత్ కుమార్ దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని రజత్ కుమార్ ఆదేశించారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మహాకూటమి నేతలు నిన్న రజత్ కుమార్‌ను కలిసి తమ ఫోన్లు ట్యాప్ చేస్తూ అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఈసీ దృష్టికి తెచ్చారు. ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని.. తమ భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గుతుందని కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తానని రజత్ కుమార్ మహాకూటమి నేతలకు హామీ ఇచ్చారు. దానికనుగునంగానే ఇవాళ రజత్ కుమార్ రాష్ట్ర డీజీపికి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఎందుకు జరుగుతోంది? ఇది నిజమేనా? కాదా? ఇంటెలిజెన్స్ అధికారులు దీని ద్వారా వివరణ ఇవ్వాలని డీజీపీకి ఆయన లేఖ రాశారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అలాగే ప్రభుత్వ ప్రకటనలు ముఖ్యమంత్రి ఫోటోల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఎంఎంటీఎస్, మెట్రో రైల్వే స్టేషన్లలోని ప్రతి కటౌట్‌పై ముఖ్యమంత్రి ఫొటోలు కొనసాగుతున్నాయని...ఇవ్వన్నీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించరాదని.. ఇది కూడా ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని నేతలు చెప్పారు.

మీడియా సంస్థలు కూడా కొంతమంది అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాటిలో జరిగే ప్రచారాన్ని కూడా వారి ఖాతాలో జమ చేయాలని.. పెయిడ్ ఆర్టికల్ గా పరిగణించాలని పలు ఫిర్యాదులు చేశారు. 

వీటన్నింటిపైనా ఈసీ రజత్ కుమార్ అధికారులతో సమావేశమై వాటి సాధ్యాసాధ్యాలు...ఏవి ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయి..? ఏవి రావు అనే అంశాలను పరిశీలించి..ఆయా డిపార్టుమెంట్లు రైల్వే, పోలీసులు డిపార్టుమెంట్లకు లేఖలు రాశారు. వారు ఇవ్వాలని కోరారు. రెండు రోజుల్లో వివరణ వస్తే, అది సంతృప్తికరంగా ఉంటే చర్యలు తీసుకుంటామని..లేదంటే వదిలి వేయడానికి అవకాశం ఉందని రజత్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. 

 

20:38 - October 22, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘ బృంద సభ్యులు రాష్ట్రంలోని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో సీఈసీ ఓపీ రావత్ సమావేశమై త్వరలో జరగబోయే ఎన్నికలపై చర్చించారు. మొత్తం 9 పార్టీల  వారిని పిలవగా ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున హాజరయ్యారు. ఆయా పార్టీల సభ్యులతో ఎన్నికల బృందం విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది. ఒకో పార్టీకి  19 నిమిషాలు సమయం కేటాయించారు. రాజకీయపార్టీలతో సమావేశమై వారి అభిప్రాయాలు,  అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రాత్రికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌‌, పోలీసు నోడల్ అధికారులతో సీఈసీ బృందం  సమావేశం అవుతుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఎస్పీలు,డీఐజీలు, ఐజీలతో సమావేశమై  శాంతి భద్రతల అంశంపై  చర్చించిన అనంతరం  మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు  డీఈవోలు ,ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమై  ఓటర్ల జాబితా, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై వారితో చర్చిస్తారు.  24 వ తేదీ బుధవారం ఉదయం 10  గంటలనుంచి 11 గంటల వరకు  ఐటీ,అబ్కారీ  శాఖల అధికారులతో భేటీ అయి  ఎన్నికల్లో మద్యం, డబ్బు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమై ఢిల్లీకి  బయలుదేరి వెళ్తారు. 

14:35 - October 20, 2018

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 91 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్పారు. ఈరోజు ఆయన హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల  సంఘం ఇటీవల ప్రకటించిన ఓటర్ల లిస్టులో జరిగిన అవకతవకలు సవరించి ఈనెల 25వ తేదీ  లోగా కొత్త ఓటర్ల లిస్టును రాజకీయ పార్టీలకు పంపిణీ చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు పక్కా భవనాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, శిదిలావస్ధలో ఉన్నపోలింగ్ బూత్ లను గుర్తించి వాటిని మార్చాలని,  పోలింగ్ కేంద్రాలకు  విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ సూచించారు. పోలింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని,  రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని రజత్ కుమార్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 91 సమస్యస్మాత్మక ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, సమస్యత్మాక ప్రాంతాల గుర్తింపుపై పునరాలోచించుకుని ఒక నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన  జిల్లా అధికారులను కోరారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - rajath kumar