rajnath singh

15:59 - November 16, 2018

ఢిల్లీ: " గజ " తుపాను వల్ల నష్టపోయిన తమిళనాడును కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ.కే.పళని స్వామితో మాట్లాడి పరిస్ధితి తెలుసుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్ధితి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సాయపడాల్సిందిగా ఆయన హోంశాఖ కార్యదర్శికి కూడా సూచించారు. 
కాగా....ఈతెల్లవారు ఝూమున తమిళనాడులోని నాగపట్నం-వేదారణ్యం మధ్య "గజ" తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.  సహాయక చర్యల కోసం 2500 మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాగపట్నం, కడలూరుల్లో సహాచక చర్యల్లో పాల్గోంటున్నాయి. బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహరం సరఫరా చేస్తున్నారు. సముద్రతీరంలో తూర్పు నావికాదళం యుధ్దనౌకలను, హెలికాప్టర్లను సిధ్దంగా ఉంచింది. 

20:15 - October 24, 2018

ఢిల్లీ: భారతదేశంలో సినీ,క్రీడా,రాజకీయ రంగాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న" మీటూ" ఉద్యమంలో చాలా మంది ప్రముఖులు అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇందులోవాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో ప్రస్తుతానికి తేలనప్పటికీ, మీటూ ఉద్యమం పేరు చెపితేనే పలువురు హడలిపోతున్నారు. మీటూ దెబ్బకు కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ఏకంగా తన పదవినే కోల్పోవాల్సివచ్చింది.  ఈ  పరిస్ధితుల్లో పనిప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన నలుగురు మంత్రులతోకూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, నిర్మలాసీతారామన్, మేనకాగాంధీ ఈబృందంలో ఉన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్నలైంగిక వేధింపులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలను ఈబృందం పరిశీలిస్తుంది.  పనిప్రదేశాల్లో వేధింపులకు గురైన మహిళలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా షీబాక్స్ (www.shebox.nic.in) ద్వారా, wcd@nic.in  ను కేంద్రమంత్రి  మేనకాగాంధీ ఏర్పాటు చేయించారు. 

15:11 - October 18, 2018

శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. అటు కేంద్ర ప్రభుత్వంపైన ఇటు రాష్ట్రంలోని విపక్షాలపైన మండిపడ్డారు. బీజేపీ, జగన్, పవన్‌ల తీరుని తప్పుపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

జిల్లాలోని తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు.. బీజేపీతో పాటు జగన్‌, పవన్‌లపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లాలో సహాయక చర్యలు నిలిచిపోవాలని కేంద్రం కోరుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి, తనను విమర్శించి వెళ్లపోయారని, తుపాను బాధితులను పరామర్శించేందుకు మాత్రం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా ఉండాల్సిన కేంద్రం ఏపీపై దాడులు చేయిస్తూ ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని, కానీ కేంద్రం పప్పులు ఇక్కడ ఉడకవని చంద్రబాబు తేల్చి చెప్పారు.

పక్క జిల్లాలో పాదయాత్రతో బిజీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి గంట దూరంలో ఉన్న శ్రీకాకుళం వచ్చి తుపాను బాధితులను పరామర్శించేంత తీరిక లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అని ఎదురుచూస్తున్న ఆయనకు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే సమయం ఉంటుందని, కానీ తుపానుతో అల్లాడిపోతున్న ప్రజలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఇక, అంతా అయిపోయాక పవన్ వచ్చి పరామర్శించి వెళ్లారని చంద్రబాబు అన్నారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో, తనను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారాయన. 

మరోవైపు తిత్లీ తుఫాను కారణంగా రూ.3,466 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు నివేదిక సమర్పించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను  పర్యవేక్షించిన సీఎం.. నిత్యవసరాల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొబైల్ రైతు బజార్ల ద్వారా కూరగాయలు అమ్మేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

11:49 - October 17, 2018

విజయవాడ : తిత్లీ తుపాను సాయంపై కేంద్రంపై టీడీపీ ఒత్తిడి పెంచుతోంది. తిత్లీ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు .. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖను రాశారు. రెండు జిల్లాలను ఆదుకోవడానికి తక్షణ సాయంగా 1200 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు.  టీడీపీ ఎంపీలు  కేశినేని నాని, కొనకళ్ల  నారాయణ, మాగంటి బాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి గన్నవరం విమానాశ్రయంలో రాజ్‌నాథ్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు అందజేశారు. తుఫానుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 3,435.29 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోనే మకాం వేసిన ఏపీమంత్రి నారా లోకేష్‌.... సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా సహాయం అందిస్తున్నామన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని,  పునరావాసం కల్పించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాకు కేంద్ర బృందాలను వెంటనే పంపాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. రాజ్‌నాథ్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది. మరి దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

16:53 - September 14, 2018

న్యూఢిల్లీ:  ఓ యవతిని జుట్టుపట్టుకొని నిర్దాక్షణ్యంగా కాలుతో తంతున్న యువకుడి వీడియో వైరల్ అవ్వడంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

ఆదేశాల మేరకు ఓ పోలీసు ఆఫీసరు కొడుకు రోహిత్ సింగ్ తోమర్ ను పోలీసులు అరెస్టుచేసారు. వీడియోలో రోహిత్ ఆ యువతిని లాగుతూ.. కాలుతో తంతూ విచక్షణారహితంగా కొట్టడం రికార్డయ్యింది. ఆ యువతి కొట్టవద్దని వేడుకొంటున్నా వినకుండా చెంపమీద కొడుతూ లాక్కెళ్లుతున్న దృశ్యాలు చూపరులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఓ ప్రయివేటు ఆఫీసులోకి ఈ నెల 2న చొరబడ్డ నిందితుడు యువతిని హింసించడం వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయ్యింది.  ఆ యువతి శుక్రవారం పోలీసుస్టేషన్ కు వెళ్లి తనను బలత్కరించాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వీడియో తన దృష్టికి రావడంతో వెంటనే తాను ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టు రాజనాథ్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే..ఈ వీడియోను స్వయంగా నిందితుడే తన కాబోయే భార్యకు పంపినట్లు తెలుస్తోంది. ఆమె వివాహానికి సుముఖంగా లేకపోవడంతో ఈ దాడికి దిగి ఆ వీడియోను ఆమెకే పంపాడని.. ఆమె ఈ  వీడియోను ట్విట్టర్ లో పోస్టుచేసి అతని బండారం బయటపెట్టాలని యత్నించింది.  అయితే... తాను వీడియో చూసిన తర్వాతే తన వివాహం రద్దు చేసుకున్నట్టు పోలీసులకు ఆమె తెలిపింది.

బాధితురాలు ఈ రోజు పోలీసు స్టేషన్ కు స్వయంగా వెళ్ళి రోహిత్ తనను అతని స్నేహితుని ఆఫీసుకు రమ్మని అక్కడ తనపై అఘాయిత్యం చేశాడని ఆరోపించింది. పొలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో తనను హింసించాడని బాధితురాలు వివరించింది.

21:55 - July 18, 2018

ఢిల్లీ : ఎస్‌సి ఎస్టీలు, వెనకబడిన తరగతులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యసభలో స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎస్పీ ఆరోపించింది. ఎస్‌సి ఎస్టీలకు సామాజిక న్యాయం జరగడం లేదని సిపిఐ సభ్యులు డి.రాజా అన్నారు. ఎస్‌సి ఎస్‌టి యాక్టును మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాజ్‌నాథ్‌ చెప్పారు.

 

13:30 - June 15, 2018

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలుగు రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌ కలిశారు. ఇరు రాష్ర్టాల్లో  పరిస్థితులను హోంమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. సాయంత్రం నాలుగున్నరకు గవర్నర్‌ ప్రధాని మోదీని కలవనున్నారు.

 

18:03 - May 28, 2018

ఢిల్లీ : కేంద్రహోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హోంశాఖ కార్యాలయంలో కలిశారు. తెలంగాణలో నూతన జోనల్‌ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని సీఎం కేసీఆర్‌ రాజ్‌నాధ్‌సింగ్‌ను కోరారు. జోన్ల వ్యవస్థ ఏర్పాటుకై.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసం ప్రధానమంత్రిని కలవడానికి ఆదివారం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. అయితే ప్రధాని అపాయింట్మెంట్‌ ఖరారు కాకపోవడంతో కేసీఆర్‌ రాజ్‌నాధ్‌ను కలిశారు. కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ పై మోడీ గుర్రుగా ఉన్నారని.. అందుకే అపాయింట్మెంట్‌ ఖరారు కాలేదని ప్రధాని కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

21:44 - March 12, 2018

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా నినాదాలు మార్మోగుతున్నాయి. టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ మరోసారి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ప్రధాని మోదీ మనసు కరగాలని నాదస్వరం ఊదుతూ నిరసన తెలిపారు.

పోటాపోటీ నిరసనలు
పార్లమెంటు ముందు ఏపీ ఎంపీలు పోటాపోటీగా నిరసనలు తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని..ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ.. ఓసారి ఆలోచించండి.. అందరికీ న్యాయం చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నినాదాలతో హెరెత్తించారు.

సన్నాయి వాయించి నిరసనతెలిపిన ఎంపీ శివప్రసాద్
పార్లమెంటు భవనం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగిన టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఐదకోట్ల మంది ఏపీ ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంపీ శివప్రసాద్‌ అయితే మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. పార్లమెంటుకు రావడమే నాదస్వర కళాకారుడి వేషంలో వచ్చారు. నాదస్వరం ఊదుతూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రధాని మోదీది రాతి గుండె అని...సంగీతంతోనైనా ఆయన గుండె కరుగుతుందోమోనన్నారు శివప్రసాద్‌. విభజన హామీల అమలుకోసం తాము పోరాటం చేస్తున్నామని.. కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూస్తామన్నారు మాజీ మంత్రి అశోకగజపతి రాజు.

హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు : వైసీపీ
అటు వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటు ముందు ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. తాము గత మూడేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాడుతూనే ఉన్నామని తెలిపారు వైసీపీ ఎంపీలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలకోసం చిత్తశుద్ధితో పనిచేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. పార్లమెంటు లోపల, బయట వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న ఏపీ ఎంపీలు.. ప్రత్యేక హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. మోదీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

15:16 - March 12, 2018

ఢిల్లీ : ఏపీ టీడీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ఎంపీ శివప్రసాద్‌ వినూత్నంగా నిరసన తెలిపారు. నాదస్వరం ఊదుతూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ప్రధాని మోదీది రాతి గుండె అని...సంగీతంతోనైనా ఆయన గుండె కరుగుతుందోమోనన్నారు శివప్రసాద్‌. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మోదీ భవిష్యత్‌ శూన్యమే అన్నారు శివప్రసాద్‌.

Pages

Don't Miss

Subscribe to RSS - rajnath singh