rating

19:38 - January 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు, భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి. రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు.

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ

ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు.

2013 చట్టాన్ని అమలు చేయాలంటున్న భూ నిర్వాసితులు....

భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత 220 రోజులుగా ఇంకా రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి.

ఏపీలోనూ బలవంతపు భూసేకరణ

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది.

. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

18:46 - January 11, 2017

ఆఫ్టర్ ఎ గ్యాప్... బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ 150వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పదేళ్ళ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందనగానే అభిమాన ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలన్నీ దృష్టిలో పెట్టుకుని తిరుగులేని మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దేందుకు హేమాహేమీ రచయితలంతా తలా ఓ చేయి వేశారు. తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి రీమేక్ గా దర్శకుడు వివి వినాయక్ తీర్చిదిద్దిన ఖైదీ నంబర్ 150... ఆ అంచనాలను అందుకోగలిగిందా? ప్రపంచాన్ని ఒక మార్కెట్ గా, మనుషుల్ని కేవలం వినియోగదారులుగా మార్చేసిన కార్పొరేట్ క్యాపిటలిస్ట్ వ్యవస్థలో గ్రామీణ జీవనం ఛిన్నాభిన్నం అయిపోతోంది. పల్లె రైతుల కాళ్ళ కింద నుంచి కార్పొరేట్ శక్తులు వాళ్ళ భూముల్ని కబళిస్తున్నాయి. ఈ అమానవీయ పరిణామాన్ని, దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ఉదాత్తమైన కథాంశంతో తీసిన చిత్రం ఖైదీ నంబర్ 150. కార్పొరేట్ శక్తుల దుర్మార్గాలకు రైతులు బలి అయిపోవడం చూసి కలత చెందిన... శంకర్, రైతుల భూముల్ని కాపాడడమే ధ్యేయంగా చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తాడు. అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. చిల్లర దొంగతనాలు చేస్తూ... సరదాగా బతికేందుకు స్నేహితుడితో కలిసి బ్యాంకాక్ వెళ్ళాలని దొంగ పాస్ పోర్టులు తయారు చేసుకున్న కత్తి శీను.. శంకర్ స్థానంలోకి వస్తాడు. డేరింగ్ డాషింగ్ అయిన శంకర్ ప్రవేశంతో... రైతులకు ఓ బలమైన అండ లభించినట్లవుతుంది. రైతు సమస్యలను ప్రభుత్వం, మీడియా, అందరూ పట్టించుకోవడం లేదని... వారి దృష్టిని మళ్ళించేందుకు ఆరుగురు రైతులు ఆత్మబలిదానం చేసుకుంటారు. చివరకు నీరూరు అనే ఆ గ్రామంలోని రైతుల ప్రాణాలను, వారి భూములను హీరో ఎలా కాపాడారు, అసలు ఉద్యమకారుడు శంకర్ ఏమయ్యారు.. అనే ప్రశ్నలకు సమాధానంగా కథ కొనసాగుతుంది.

 

ఓ హోల్సమ్ ఎంటర్ టైనర్ గా.....

దేశంలో ఇప్పుడు చాలా చోట్ల రగులుతున్న భూమి సమస్యను కథాంశంగా ఎంచుకున్నందుకు చిరంజీవిని అభినందించాల్సిందే. ఆర్థిక సరళీకరణ పేరుతో మార్కెట్ సరిహద్దులు చెరిగిపోతున్న పెట్టుబడి దారీ వ్యవస్థలో, భూమి అత్యంత విలువైన సంపదగా మారింది. వ్యవసాయమే మెజారిటీ ప్రజల జీవికగా ఉన్న మనదేశంలో భూమితో రైతులకు ఉన్న సంబంధం చాలా ఆత్మీయమైనది. వాల్యూతో పాటు సెంటిమెంటల్ వాల్యూ కూడా ఉన్న భూములను అభివృద్ధి పేరుతో రైతుల నుంచి లాక్కోవడం మన కళ్ళ ముందే జరుగుతోంది. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ వంచనను ప్రశ్నించడమే ప్రధాన ఇతివృత్తంగా ఉన్న ఈ కథలో.. చిరంజీవి మార్క్ డాన్సులు, కామెడీ సీనులు, ఫైట్స్ బాగా దట్టించారు దర్శకుడు వినాయక్. అయితే, చిరంజీవి ఇమేజ్ ను పదేళ్ళ గ్యాప్ ను దాటించి.. రీఎస్టాబ్లిష్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో, అసలు కథ తెరమరుగైంది. డిస్కస్ చేయాల్సిన ఇష్యూ తెరమరుగైపోయి...స్టార్ మార్కెట్ కోసం పడిన వెంపర్లాట్ డామినేట్ చేసింది. అయితే, చిరంజీవి సినిమాలో సీరియస్ కథేమిటి... బాస్ ఈజ్ బ్యాక్... ఆయనేం చేసినా మెస్మరైజ్ అయిపోతారు మాస్... అనుకునేవాళ్ళకు ఈ సినిమా ఓ హోల్సమ్ ఎంటర్ టైనర్.

నటీనటులు...

నటీనటులు విషయానికి వస్తే... మెగా స్టార్ చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది? నటుడిగా బలమైన పునాదిరాళ్ళ మీద స్వయంకృషితో ఎదిగిన 150 చిత్రాల స్టార్... ఎప్పట్లానే ఈ చిత్రంలో జోరుగా పర్ఫార్మ్ చేశారు. పదేళ్ళ గ్యాప్ తరువాత చిరంజీవి... గ్యాంగ్ లీడర్ లుక్ తో.. ఫిజిక్ తో మార్వలెస్ గా కనిపించారు. స్టెప్పుల్లో తనదైన రిథమ్ తో ప్రేక్షకులకు జోష్ ను పంచారు. రౌడీ అల్లుడి తరహా పాత్ర అయిన కత్తి శీనుగా మాస్ చేత చప్పట్ల మోత మోగించారు. కాజల్ పాత్ర పాటలకే పరిమితమైంది.. ఇందులో ఆమె నటనా కౌశలాన్ని ప్రదర్శించాల్సిన సన్నివేశాలేవీ లేవు. ఒక పాటలో నటిస్తే ఐటం సాంగ్ అంటారు, మూడు పాటల్లో కనిపిస్తే హీరోయిన్ అంటారు అన్నట్లే ఉంది కాజల్ పాత్ర చిత్రణ. ఇక, ఆలీ, బ్రహ్మానందం చేసిన పాత్రలు వారికి బాగా అలవాటైనవే. కామెడీ సన్నివేశాలను వారు బాగా పండించారు. విలన్ గా తరుణ్ అరోరా... ఎలా నటిస్తారో చూద్దామంటే.. దర్శకుడు ఆయనకంత స్కోప్ ఇవ్వలేదు.

 

టెక్నీషియన్స్ విషయానికి వస్తే...

టెక్నీషియన్స్ విషయానికి వస్తే... శంకర్ దాదా ఎంబీబీఎస్ సిరీస్ లో చిరంజీవికి మూడో హిట్ ఆల్బమ్ అందించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆర్ రత్నవేలు ఫోటోగ్రఫీ కథానుగుణంగా సాగింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లు చిరంజీవికి ఆకట్టుకునే మూమెంట్స్ డిజైన్ చేయగలిగారు. వైర్ వర్క్స్ మరీ ఎక్కువగా లేకుండా సింపుల్ మూమెంట్స్ తో రామ్ లక్ష్మణ్ లు ఫైట్స్ కొరియోగ్రఫీ ఇంప్రెసివగా ఉంది. ఇక, కాస్ట్యూమ్స్ డిజైనర్ కొణిదెల సుస్మిత పనితనం... పాటల్లో బాగా కనిపిస్తుంది. చిరంజీవిని అప్ టుడేట్ ఫ్యాషన్స్ తో ఆకట్టుకునే చూపించగలిగారు.

హేమాహేమీ రచయితలు...

పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, బుర్రా సాయిమాధవ్... వంటి హేమాహేమీ రచయితలు ఈ స్క్రిప్టు కోసం పని చేశారు. కానీ, ఇంత మంది కలిసినా పెద్దగా పంచ్ డైలాగులేమీ కనిపించలేదు. మీడియాతో కత్తి శీను సంభాషణలో పరుచూరి మార్క్ కనిపిస్తుంది. మొత్తంగా, చిరంజీవి మ్యాజిక్ ను ఎలివేట్ చేయడానికి చూపించిన శ్రద్ధలో... కొంత భాగమైనా కథను ఎలివేట్ చేయడానికి, చిరంజీవికి దీటైన విలన్ ను ఎలివేట్ చేయడానికి పెట్టి ఉంటే సినిమా ఇతివృత్తానికి న్యాయం జరిగేది. ముఖ్యంగా, కథలోని కీలక సమస్య మీద పోరాటానికి నడుం బిగించిన అసలు కథానాయకుడు పూర్తిగా అండర్ ప్లే అయిపోవడం ఈ నెరేషన్ లోని విషాదం. భూమి సమస్య ఒక కార్పొరేట్ ప్రతీకను హతమార్చితే పరిష్కారమయ్యేది కాదన్న వాస్తవం తెలిసి...దాని వెనుక ఉన్న మార్కెట్ వ్యూహాలను కొంతవరకైనా చూపించే ప్రయత్నం చేసి ఉంటే సినిమాకు ఒక పర్పస్ ఫుల్ మూవీ అన్న గౌరవం దక్కేది. ఫలితంగా... చిరంజీవి 150వ చిత్రం ఒక రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.

 

 

ప్లస్

చిరంజీవి యంగ్ లుక్,

సమకాలీన కథ

నేపథ్య సంగీతం

చిరంజీవి డాన్సులు

 

మైనస్

రొటీన్ కామెడీ

బలహీనమైన ఇతర పాత్రలు

విలన్ తేలిపోవడం

తేలిపోయిన క్లైమాక్స్

 

రేటింగ్ : Watch Video

16:13 - December 23, 2016

కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్న సప్తగిరి తొలిసారిగా హీరోగా ఎంట్రి ఇచ్చిన కామెడీ మూవీ సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జనాన్ని మెప్పించిందా..? నవ్వులతో ముంచెత్తిందా ? తెలియాలంటే .. రివ్యూ లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ గా ప్రూవ్ చేసుకున్న సప్తగిరిని ప్రధాన పాత్రగా కామెడీ ని పండించి క్యాష్ చేసుకున్నాయి బోలెడన్ని సినిమాలు. అయితే సప్తగిరి కూడా అందరి కమెడియన్స్ లాగానే హీరోగా వస్తాడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. హీరో అవ్వాలని తన సొంత డెసిషనో లేక బలవంతం మీద వచ్చాడా అనే విషయాలు పక్కన పెడితే సప్తగిరిని హీరోగా జనం చూస్తారు ఫర్వాలేదు అనిపించుకున్నాడు ఈ సినిమాతో. అయితే ఈ సినిమా అందరూ ఊహిస్తున్నట్టు పక్కా కామెడీ మూవీయే కాకుండా ఎమోషన్ ను కూడా బాగానే క్యారీ చేసారు. సీరియస్ కథతో వచ్చిన తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా నుంచి మంచి కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకొని దానికి కామెడీ తో కలరింగిచ్చి బాగానే తెరకెక్కించారు. అయితే అనవసరమైన కామెడీ సీన్స్ తో మంచి కథను స్పాయిల్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కొన్ని కొన్ని సీన్స్ లో అయితే ఎమెషనల్ సీన్స్, కామెడీ సీక్వెన్సెస్ జనాన్ని బాగానే కూర్చోబెడతాయి. అయితే సినిమా బిగినింగ్ లో వచ్చే నాటకం సీన్, తండ్రి దగ్గర చెప్పే దానవీర శూరకర్ణ డైలాగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

కథ..
సినిమా నటుడౌదామని నాటకాలతోనూ, చిల్లర వేషాలతోనూ కాలక్షేపం చేస్తుంటాడు సప్తగిరి. అతడి తండ్రి సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్. తన లాగే తన కొడుకును కూడా పోలీస్ ను చేసి మురిసిపోదామనుకుంటాడు. కానీ సప్తగిరి చేష్టలు ఆయన్ను బాగా బాధపెడతాయి. ఇదిలా ఉండగా కొన్ని అనూహ్యపరిస్థితుల్లో సప్తగిరి తండ్రి మరణిస్తాడు. తండ్రి ఉద్యోగం కొడుక్కి ఇస్తారు. కానిస్టేబుల్ గా డ్యూటీ లో చేరతాడు. అప్పుడు ఆ ఉద్యోగంలో తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఆయనది సహజ మరణం కాదని, తన తండ్రిని ఎవరో మర్డర్ చేసారని దానికి కారకులు కూడా ఎవరో తెలుసుకుంటాడు. తండ్రి గొప్పతనం తెలుసుకున్న సప్తగిరి చివరికి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడన్నదే మిగతా కథ. తమిళ్ సినిమాను యాజిటీజ్ గా తీసుకున్నా సరే తమిళ్ లో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఎన్ని కష్టాలున్నాయో హీరో తెలుసుకునే క్రమంలో వచ్చే సీన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవనిపిస్తుంది. కొత్త దర్శకుడు అరుణ్ పవార్ అనుభవరాహిత్యం ఆ సీన్స్ లోనే తెలుస్తుంది. మొత్తం మీద సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి.

పాత్రల తీరుతెన్నులు...
కానిస్టేబుల్ సప్తగిరిగా సప్తగిరి బాగానే నటించాడు. అయితే అతి లేకుండా, హీరో బిల్డప్పుల్లేమీ లేకుండా మామూలు హీరోగానే నటించడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. హీరోయిన్ సంగతి అయితే చెప్పుకోడానికి ఏమీలేదు. అసలు ఆమె హీరోయిన్ మెటీరియలే కాదనిపిస్తుంది. అంతేకాదు, ఆమె పాత్రను ఈ సినిమాలో లైట్ తీసుకున్నారనిపిస్తుంది. ఇక ఇల్లీగల్ బిజినెస్ లు చేయించే సి.ఐ గా కన్నింగ్ విలన్ గా పోసాని కృష్ణమురళి పర్వాలేదనిపిస్తాడు. అజయ్ ఘోష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. అసలు ఆయన్ను దర్శకుడు ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయాడనిపిస్తుంది. హీరో తండ్రి పాత్రలో డా.శివప్రసాద్ బాగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్ గా మరో కానిస్టేబుల్ పాత్రలో షకలక శంకర్ ఈ సినిమాకు ఎంతో రిలీఫ్ గా అనిపిస్తాడు. అతడు పండించిన కామెడీ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక గేస్ గా నటించిన జబర్దస్త్ కమెడియన్స్ గ్యాంగ్ చేసే కామెడీ కూడా బాగానే నవ్విస్తుంది. టోటల్ గా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ నే హిలేరియస్ గా పేలాయి. అయితే తమిళ్ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేరు. కానీ బి, సి సెంటర్స్ జనం మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. మొత్తం మీద హీరోగా సప్తగిరి ఓకె అనిపించుకున్నాడు.

ప్లస్ పాయింట్స్
కామెడీ
సప్తగిరి నటన
మైనస్ పాయింట్స్
ల్యాగ్ సీన్స్
హీరో్యిన్
సంగీతం
రేటింగ్ : 2 / 5...

18:57 - December 16, 2016

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన కామెడీ ఎంటర్ టైనర్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ . బండి భాస్కర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ జనాన్ని మెప్పించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. టాలీవుడ్ లో కొత్త కొత్త దర్శకులు, అందులోనూ కుర్ర దర్శకులు వస్తుండడం వల్ల ఒక విధంగా మంచే జరుగుతోంది. కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్తగా తీయాలని ఆలోచిస్తున్నారు, జనానికి ఏది కావాలో అదే ఇవ్వాలనుకుంటున్నారు, నేల విడిచి సాము చేయకుండా ఉన్నంతలోనే సినిమాని జనరంజకంగా మలిచి నిర్మాతలకు కాసులు కురిపించాలని తపిస్తున్నారు. అలాంటి ఓ మంచి ప్రయత్నమే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరుకూ ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు కొత్త దర్శకుడు బండి భాస్కర్. అంతేకాదు కథను ఏమాత్రం డీవియేట్ చేయకుండా, తనేం చెప్పాలనుకున్నాడో అదే విషయాన్ని చాలా సెన్సిటివ్ గా స్మూత్ గా చెప్పాడు దర్శకుడు. ఒకమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించి ఫైనల్ గా ఒకర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం చాలా ఫన్నీ పాయింట్ . అలాంటి ఫన్నీ ఆలోచనతోనే బోలెడన్ని కామెడీ సీన్స్ రాసుకొని ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించాడు దర్శకుడు. ఈ సినిమాకు టెన్ టీవీ ఇచ్చింన రేటింగ్ కోసం ఈ వీడియో చూడండి..

20:45 - August 13, 2016

మెగా మేనల్లుడు సాయిధర్మ్ తేజ హీరోగా , మన్నారా చోప్రా, లారిస్సాబొనోసీ హీరోయిన్స్ గా సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టరైన సునీల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ యాక్షన్ మూవీ తిక్క. ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో సుప్రీమ్ స్టార్ సాయిధర్మ్ తేజ మరో హిట్టు కొడతాడా లేడా? ఇంతకీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతుందా లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

20:44 - July 29, 2016

హాస్య నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక ఆయన హీరో కెరీర్‌ను అయోమయంలో పడేశాయి. దీంతో మళ్ళీ ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాలని సునీల్ ప్రస్తుతం ‘జక్కన్న’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సుదర్శన్ రెడ్డి నిర్మించారు. సునీల్ సరసన మన్నారా చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.
కథ...
ఈ సినిమా కథ విషయానికొస్తే...వైజాగ్ సిటిలో డేగ అనే పేరు మోసిన రౌడిని మెకానిక్ అయిన బైరాగి చంపుతాడు. బైరాగి వైజాగ్ లో పేరు మోసిన రౌడి గా ఎదుగుతాడు. తన ముఖం జనాలకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. గణేష్ అనే వ్యక్తి బైరాగి ని చంపడానికి వైజాగ్ వచ్చి అతనిని వెతుకుతూ ఉంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలని బైరాగి శత్రువులు కూడా అతన్ని హతమార్చడానికి వెతుకుతూ ఉంటారు. ఇలా ఉంటాడు అని  ముఖం కూడా తెలియని బైరాగి, తీరా ఇతనే భైరాగి అని తెలిసే సమయానికి, అతని  శత్రువులు, భైరాగిని చంపడానికి ప్రయత్నిస్తారు. బైరాగిని చంపడానికి వచ్చిన గణేష్ ఆ టైంలోఆ శత్రువుల నుండి భైరాగిని  కాపాడుతాడు. అసలు భైరాగిని చంపాలని వచ్చిన గణేష్ భైరాగిని ఎందుకు కాపాడాడు. భైరాగికి గణేష్ కి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెరపైన చూడాలి. 
విశ్లేషణ... 
నటీనటుల పర్ఫామెన్ కి వస్తే... సునిల్ తనదైన మార్క్ కామెడీ తో, డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. హీరోయిన్ మన్నారా చోప్రా ఎక్స్ పోజింగ్ కే పరిమితం అయ్యింది తప్ప, పర్ఫామెన్ పై దృష్టి పెట్టలేదనే చెప్పాలి. కొన్ని కొన్ని సన్నివేశాలలో బాగా చేసి ఉండాలి అనిపించింది. కమెడియన్  పృధ్వీ కామెడీ సినిమాకే హైలెట్. అలాగే సప్తగిరి చేసిన కామెడీ అలరిస్తుంది.   ఇక మిగితా నటీనటులు కబీర్ సింగ్, పోసాని, నాగినీడు మొదలగు నటులు తమ పాత్రలు పరిది మేరకు బాగానే చేసారు. 

టెక్నీషియన్స్ విషయానికొస్తే.... దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది కాని కథ, కధనాలను జనరంజకంగా తీయలేకపోయాడు.. మారుతున్న కాలానికి అనుగూణంగా మార్పులేని తన ఆలోచనలతో.... సినిమాను ప్రేక్షకులు అనుకున్న స్థాయిలోతీయలేక పోయాడు. ఈసినిమాకు దినేష్ మంచి  మ్యూజిక్ అందించాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. డిఓపి రాంప్రసాద్ కెమెరా పనితనం సూపర్. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా చూపించాడు. భవాణీ ప్రసాద్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి...  ఎడిటర్ ఎమ్.ఆర్ వర్మ పనితనం బావుంది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. మొత్తనికి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతగా ఆకట్టుకోలేకపోయినా... సెకండ్ ఆఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. హిట్ కోసం తపిస్తున్న సునిల్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్
సునిల్ 
కెమెరా పనితనం
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
డైలాగ్స్

మైనస్ పాయింట్స్
కథ, కథనం
డైరక్టర్
హీరోయిన్

టెన్ టి రేటింగ్.. 1.75/5

20:38 - July 29, 2016

నేటి యువతరం ఆలోచనలు, కెరీర్ మీద వాళ్లకున్న శ్రద్ధ, పెళ్లిగురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు లాంటి అంశాల్ని పూసగుచ్చినట్టు విప్పి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా పెళ్ళిచూపులు . ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నేడే విడుదలైంది. మరి ఈ సినిమా నేటి యువతను ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో చూద్దాం. 
విశ్లేషణ
ఈ మధ్యకాలంలో పెళ్లిచూపులు అనే అచ్చ తెలుగు టైటిల్ తో సినిమా రావడం గొప్ప విశేషంగానే చెప్పుకోవాలి. పెళ్ళిగురించి నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి, తల్లి దండ్రులు  పిల్లల కెరీర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు లాంటి అంశాలతో చక్కటి సందేశాత్మకంగా పెళ్లిచూపులు సినిమా సాగుతుంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా అసలు ఆ ఫీలింగ్ ఏ మాత్రం కలగకుండా సినిమాను  సాధ్యమైనంత వరుకూ చాలా రిచ్ గానే తెరకెక్కించారు. కొత్త డైరెక్టర్ తరుణ్ భాస్కర్  తొలి సినిమాతోనే అందరినీ కట్టిపడేసాడు. ముఖ్యంగా నేటి యంగ్ జనరేషన్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ప్రేమ , కెరీర్ ను సమంగా బాలెన్స్ చేసుకుంటే  పెళ్లి  అనే అంశాన్ని చాలా సున్నితంగా చెప్పాడు దర్శకుడు. చక్కటి సంభాషణలతో బోర్ కొట్టని కథనంతో ఫన్నీ సన్నివేశాలతో సినిమాను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు.  
కథ... 
ఈ జనరేషన్ కి తగిన ప్రశాంత్ ఇంజినీరింగ్ చదువుకుంటున్నా, తన ఆలోచనలకు తగ్గట్టు ఓ చెఫ్‌గా పనిచేయాలని అనుకుంటాడు. ప్రశాంత్ చదువుకు తగినట్టు మంచి ఉద్యోగం లో స్థిరపడాలని తండ్రి కోరిక. కానీ ప్రశాంత్ కి ఇష్టం ఉండదు. ఇక జీవితం పట్ల ఎటువంటి స్పష్టత లేనట్లు కనిపించే అతడికి పెళ్ళి చేస్తే అయినా అన్నీ కుదురుతాయని చిత్ర  అనే అమ్మాయితో అతడి తండ్రి పెళ్ళి నిశ్చయిస్తాడు. అయితే చిత్ర తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అతనితో పెళ్ళిని నిరాకరిస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు చేస్తుండగా, వాళ్ళ దగ్గర్నుంచి కూడా ప్రశాంత్‌కి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కునేందుకే చిత్రతో కలిసి ప్రశాంత్ ఫుడ్ బిజినెస్ మొదలుపెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? చివరకు వీరి కథ ఎక్కడివరకు వచ్చిందీ? అన్నదే మిగతా సినిమా. పెళ్లిచూపులకని ఒకరింటికి వెళ్లబోయి మరొకరింటికి వెళ్ళి అమ్మాయిని చూడడం ఈ సినిమాకి సరికొత్త పాయింట్. అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో లాక్ అవడంతో ఒకరి లవ్ స్టోరీని మరొకరు చెప్పుకోవడం మరింత కొత్తగా అనిపిస్తుంది. 
విశ్లేషణ... 
'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా మొదటి సినిమా అయినా, జనానికి బాగా దగ్గరయ్యే పాత్ర పోషించాడు విజయ్ దేవర కొండ. సరిగ్గా రెండో సినిమా పెళ్లిచూపులు సినిమాలో కూడా తనదైన శైలిలో మంచి నటనతో చెలరేగాడు. ఇక హీరోయిన్ రీతూ వర్మ కూడా  అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ అమ్మాయి సినిమాని తన భుజాలమీదే వేసేసుకుంది. ఇక హీో తండ్రిగా నటించిన నటుడు కూడా చాలా సహజం గా నటించి మంచి మార్కులు కొట్టేస్తాడు.  ఇక ఇందులో చెప్పుకోదగ్గ మరో పాత్ర హీరో ఫ్రెండ్ . ఈ సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. కామెడీ పంచులతో సినిమా మొత్తం అదరగొట్టేసాడు.  ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ కి ఇది మొదటి సినిమా అయినా,  రొమాంటిక్ కామెడీకి ఎంత వరకు స్క్రిప్ట్ అవసరమో అంతే వాడుకున్నాడు. ఏయే సన్నివేశాలు ఎలా తీస్తే ఎలాంటి ఫలితాలు చూపిస్తాయో తరుణ్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే రుజువు చేసుకున్నాడు. ఈతరం ఆలోచనలను సరిగ్గా బంధిస్తూ, వాళ్ళ భావోద్వేగాల చుట్టూ ఓ సరికొత్త కథ చెప్పాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేం. ఇక టోటల్ గా చెప్పాలంటే మన జీవితం లో ‘పెళ్ళిచూపులు’ ఎలాంటి మంచి అనుభూతినిస్తాయో? ఈ చిత్రం చూసి అలాంటి ఫీల్ ని అనుభవించవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే ఇష్టపడే వారికి ఈ తరహా సినిమా అంతగా నచ్చకపోవచ్చు. అయినా నేటి జనరేషన్ కి ఈ సినిమా బాగానే నచ్చుతుంది అని చెప్పుకోవచ్చు. 

ప్లస్ పాయింట్స్ :
చక్కటి కథ, కథనాలు
ఆహ్లాదకరమైన సన్నివేశాలు
హీరో, హీరోయిన్స్ నటన 
ఆలోచింపచేసే సంభాషణలు
కామెడీ 
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ స్లోగా సాగడం

టెన్ టివి రేటింగ్ : 2.75/5

16:00 - May 19, 2016

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా ఇంక విడుదలె కాలేదు..అప్పుడే రేటింగ్ ఇవ్వడం ఏంటీ ? గురువారం రిలీజ్ చేశారా ? అని ఆశ్చర్యపోతున్నారా ? కాదండి..ప్రపంచ వ్యాప్తంగా 'బ్రహ్మోత్సవం' విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్స్ లను భారీగా అలంకరించారు. 'శ్రీమంతుడు' సినిమా తరువాత విడుదల అవుతున్న మహేష్ సినిమా కావడంతో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్రాలకు సంబంధించిన రేటింగ్ విషయంలో 'దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్', 'ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్' ఉమా సంధు పేరు మీడియాలో తరచూ వినిపిస్తోంది. టాప్ హీరోల సినిమాలకు రేటింగ్ ఇస్తూ హల్ చల్ చేస్తున్నాడు. 'బాహుబలి’సినిమా విడుదలకు ముందు 2 స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ‘'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ముందుగా ఇతడు చెప్పినా ఆ జోస్యం ఫలించలేదు. అయితే ఇతడు అల్లుఅర్జున్ సినిమా 'సరైనోడు' విషయంలో చెప్పింది నిజం అయినట్లు టాక్. ఇక 'ప్రిన్స్' మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కూడా రేటింగ్ ఇచ్చేశాడు. మూవీకి '5 స్టార్' రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది అంటూ మహేష్ అభిమానులకు మంచి జోష్ ను ఇచ్చే ట్వీట్ ను చేసాడు. అంతేకాదు ఈసినిమాలో మహేష్ నటన అద్భుతం అని ప్రశంసిస్తూ 'బ్రహ్మోత్సవం'ను ఉమర్ సంధు ఆకాశంలోకి ఎత్తేశాడు. మరి ఆయన మాటలు నిజం అవుతాయా ? లేదా ? అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

19:32 - May 6, 2016

చిల్లర డాన్సులు, ఫైట్లు, ఛీప్ కామెడీతో నిండిన సినిమాలు మన ప్రాంతీయ భాషా చిత్రాలను చులకన చేస్తున్నాయి. కానీ వందలో ఒకటిగా వినూత్న ఆలోచనలతో వచ్చే 24లాంటి సినిమాలు మళ్లీ మన గౌరవాన్ని నిలబెడుతున్నాయి. విశ్వ సమస్తానికి కారణ భూతమైన సమయాన్ని ఆపగలిగితే, వెనక్కి, ముందుకు పంపించగలిగితే మనిషి అద్భుతాలు చేయగలడు, చూడగలడు. ఈ అంశాన్ని మూలకథగా ఎంచుకుని దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఒక బ్రిలియెంట్ అండ్ బ్యూటిఫుల్ సినిమాను తెరకెక్కించాడు.
కథ..
24 కథను చూస్తే...శివకుమార్, ఆత్రేయ కవలలు. ఒకరు పేరున్న శాస్త్రవేత్త కాగా..మరొకరు స్వార్థానికి మారుపేరు. శివకుమార్ ఏళ్ల పాటు కష్టపడి ఒక అద్భుతమైన వాచ్ ను తయారుచేస్తాడు. ఆ వాచ్ తో కాలంలో ప్రయాణించవచ్చు. ఈ విషయం తెల్సుకున్న ఆత్రేయ తమ్ముడు శివకుమార్ ను అతని భార్యను చంపి ఆ వాచ్ చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. అన్న క్రూరత్వం తెలిసిన శివకుమార్ తన నెలల కొడుకుతో పాటు వాచ్ ఉంచి వేరే ఒక మహిళకు ఇస్తాడు. భార్యతో సహా శివకుమార్ ను చంపిన ఆత్రేయకు వాచ్ దొరకదు. దీంతో నిరాశపడతాడు. ఆ గొడవలో జరిగిన ప్రమాదంలో ఆత్రేయ గాయాల పాలై కోమాలోకి వెళ్తాడు. వేరే మహిళ చేతికి చేరిన శివకుమార్ కొడుకు పెరిగి హీరో సూర్య అవుతాడు. శివకుమార్ తయారు చేసిన వాచ్ వీళ్లింట్లోనే నిరుపయోగంగా పడి ఉంటుంది. ఒకరోజు ఈ వాచ్ చేసే అద్భుతాన్ని తెల్సుకుంటాడు సూర్య. సమంతను ప్రేమలో పడేసేందుకు వాచ్ ను వాడుకుంటాడు. ఈ లోగా కోమాలోంచి బయటకు వచ్చిన ఆత్రేయ ఆ వాచ్ కోసం మళ్లీ వేట మొదలుపెడతాడు. అది సూర్య దగ్గర ఉందని తెల్సుకుని దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరి ఈ అరుదైన వాచ్ విలన్ చేతికి చిక్కకుండా సూర్య ఎలా కాపాడాడు. తండ్రిని , తల్లిని చంపిన ఆత్రేయపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది మిగిలిన కథ.
విశ్లేషణ...
తన ప్రతి సినిమాను విభిన్నంగా రూపొందించే దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ కథను అరుదైన ఆలోచనతో తెరకెక్కించాడు. కథలో చాలా సంక్లిష్టత ఉన్నా...చాలా క్లారిటీగా స్క్రీన్ ప్లే అల్లాడు. దశాబ్దాల కిందటి వాతావారణాన్ని సహజంగా సృష్టించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రేమ పరిచయమే...., మనసుకే మధువువే అని సాగే పాటలు బాగున్నాయి. ఇక నటనలో సూర్య అరుదైన ప్రతిభను చూపించాడు. సైంటిస్ట్ శివకుమార్, విలన్ ఆత్రేయ, కొడుకు పాత్రల్లో వైవిధ్యంగా నటించాడు. సమంత అప్పీయరెన్స్ ప్లెజంట్ గా ఉంది. ఐతే మనం సినిమాలోలా నటనకు ఎక్కువగా అవకాశం లేని పాత్ర సమంతది. సెకండాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్, సమంత సూర్య మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు తగ్గిస్తే సినిమా ఇంకా బలంగా తయారయేది. ఎక్కువైన సినిమా నిడివి మరో మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఈ లోపాలు వదిలేస్తే 24 కాలదోషం పట్టని సినిమాగా మిగిలిపోతుంది.

ఫ్లస్ పాయింట్స్

సూర్య నటన

అరుదైన కథ

స్క్రీన్ ప్లే

ప్రొడక్షన్ వ్యాల్యూస్

సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ లో కొన్ని సీన్స్

సినిమా నిడివి

టెన్ టివి రేటింగ్... 2.75/5

 

19:47 - April 29, 2016

ఇది ష్యూర్ హిట్ అని ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఎవరూ జోస్యం చెప్పలేరు. కథ వినేప్పుడు కలిగే ఆసక్తి...దాన్ని సినిమా మలిచాక...ప్రేక్షకుల్లో  కలగకపోవచ్చు. ఇది కథను సినిమాగా మలిచే అనేక స్థాయిల్లో జరిగే మార్పు. ఈ మార్పులు బాగుంటే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే కౌంటర్ లో టికెట్లపై ఎవరూ చేయి వేయకుండా తయారవుతుంది. రోహిత్ కొత్త సినిమా రాజా చెయ్యి వేస్తే దీన్నే ఫాలో అయ్యింది.
కథ...
సినిమా దర్శకుడు అవుదామనుకుని ప్రయత్నాలు చేస్తుంటాడు నారా రోహిత్.  స్నేహితులతో కలిసి షార్ట్ ఫిలింస్ తీయడం..అవి పట్టుకుని..ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగడం అతని పని. ఓ షార్ట్ ఫిలిం తీస్తుండగా...ఇషా తల్వార్ ను చూసి రోహిత్ లవ్ లో పడిపోతాడు. రోహిత్ ప్రేమలోని నిజాయితీ చూసి తనూ ప్రేమిస్తుంది. మరోవైపు దందాలతో, దౌర్జన్యాలతో ఊరి జనాలను పీడిస్తుంటాడు తారకరత్న. వీడిని హత్య చేయాలని...లేకుంటే ఇషా తల్వార్ ను చంపేస్తామని రోహిత్ కు ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు. వాస్తవానికి ఈ ఫోన్ కాల్ చేయించింది హీరోయినే అన్నది కథలో ట్విస్ట్. ఈ మలుపు వెనుకున్న ప్లాష్ బ్యాక్ ఏంటో తెరపై చూడాలి.
విశ్లేషణ... 
బలమైన హీరోను అడ్డుపెట్టుకుని... హీరోయిన్ తన శత్రువులను సాధించడం అనేది పాత కథే. రాజా చెయ్యి వేస్తే లోనూ ఇదే చూపించారు. ఐతే ఈ తెలిసిన కథను కూడా దర్శకుడు ప్రదీప్ ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు. రోహిత్ ఎప్పటిలాగే పాత్రోచితంగా నటించాడు. తారకరత్న విలనీ ఫర్వాలేదు. ఇషా తల్వార్ లో అందం, నటన రెండూ లేవు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మరోసారి తన పాటలతో ఆకట్టుకున్నాడు. వారాహి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి రాజా పాత కథపైనే చేయి వేశాడు.

ఫ్లస్ పాయింట్స్

సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్

పాత కథ
అనాసక్తిగా సాగే స్క్రీన్ ప్లే
ప్రధాన పాత్రల చిత్రణ
దర్శకత్వం
    
టెన్ టివి రేటింగ్... 1.5/5
    

Pages

Don't Miss

Subscribe to RSS - rating