Revanth Reddy

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

13:55 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వాహణ సంతృప్తికరంగా సాగుతోందన్న రజత్ కుమార్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృ‌షి చేస్తున్నారు. ఇక శాంతిభద్రతల విషయానికి వస్తే..ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా..భద్రతా అంశాలపై రాజీ లేకుండా చర్యలు చేపట్టమన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ కుమార్ రెడ్డి అరెస్టుపై స్పందించారు. కొడంగల్ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ఆయన కొడంగల్ మినహా రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. 
> మద్యం సేవించిన వారిపై చర్యలు..
అందరికీ కార్డులు..లేని వారికి 12 రకాల గుర్తించిన ఆధారాలతో ఓటు హక్కు...
ఈవీఎంలు..వీవీ ప్యాట్స్ సిద్ధం...
స్ట్రాంగ్ రూం నుండి పోలింగ్ స్టేషన్‌కు ఈవీఎంలు..వీవీ ప్యాట్స్ తరలించేందుకు సిద్ధం...
ప్రతి పీఎస్ మానిటరింగ్...

07:23 - December 2, 2018

వికారాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారని అభిమానులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొడంగల్‌లో శనివారం (డిసెంబర్ 1) అర్థరాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాగా, డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించామని పోలీసులు చెబుతున్నారు.

కొడంగల్‌ బంద్‌కు పిలుపు:
పోలీసుల సోదాలపై రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తన అనుచరులపై కుట్రపూరితంగా కేసీఆర్ ఐటీ దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 4న కొడంగల్ నియోజకవర్గ బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. అలాగే 4న కేసీఆర్ కోస్గి పర్యటనను అడ్డుకుంటామని చెప్పారు. ఐటీ దాడులను నిరసిస్తూ కొడంగల్‌లో శనివారం అర్థరాత్రి చేపట్టిన ఆందోళనను రేవంత్ విరమించారు.

ఓటుకు నోటు..?
కొడంగల్‌లో శనివారం రాత్రి పోలీసుల సోదాలు కలకలం రేపాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రేవంత్ అనుచరుడు యూసఫ్‌తో పాటు పలువురు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. యూసఫ్, రామచంద్రారెడ్డి, మదుసూదన్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న రేవంత్ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం రేవంత్‌తో పాటు పలువురు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
రేవంత్ అనుచరుడు యూసఫ్ డబ్బులు పంచుతున్నారనే సమాచారంతోనే సోదాలు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రతి చోట తనిఖీలు జరుపుతామని ఏడీజీ జితేందర్ తెలిపారు. అయితే సోదాల్లో ఏం దొరికాయన్న విషయం మాత్రం బయటకు రాలేదు. రేవంత్ ఇంట్లో సోదాలు చేయలేదని పోలీసులు తెలియజేశారు.

16:30 - November 30, 2018

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి 4+4 భద్రత పెంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈభద్రత ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేంతవరకు కొనసాగించాలని, రేవంత్ రెడ్డి భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తనను హత్య చేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి గతంలోనే హైకోర్టును కోరారు. దీనిపై  వాదనలు విన్నసింగిల్ జడ్జి కేంద్ర భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ  హైకోర్టులో అప్పీల్ చేసింది. రేవంత్ రెడ్డి కూడా తనకు భద్రత పెంచాలని ఈరోజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని ఆదేశించింది. 

19:15 - November 24, 2018

హైదరాబాద్ : కుటుంబ పాలనపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తన కుటుంబాన్ని తప్ప ప్రజల బాధలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కొడుకు కోసం కేసీఆర్ బడి దొంగగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఈమేరకు రేవంత్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  
స్వయం పాలనను గాలికొదిలేసి..కుటుంబ పాలన 
కేసీఆర్ మార్క్ పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పారు. స్వయం పాలనను గాలికొదిలేసి..కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ డిక్షనరీలో సామాజిక న్యాయం అనే పదమే లేదని ఎద్దేవా చేశారు. ఎందుకంటే గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాల ప్రాతినిధ్యం లేదన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమాజంలో సగ భాగమైన మహిళలకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. మహిళలను రెండో శ్రేణి పౌరులుగా కూడా చూడకపోవడం వంటి పరిస్థితులను కేసీఆర్ కళ్లకు కట్టినట్టుగా చూపించారని తెలిపారు. 
ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపారు..
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శృతి, వివేక్, వెంకట్‌రాంరెడ్డి లాంటి.. పీజీలు చదువుతున్న చాలా మంది యువకులను పట్టుకొచ్చి ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపి, తన ఫ్యూడల్ మనస్తత్వాన్ని, రాచరికపు పోకడలను ప్రదర్శించారని ఆరోపించారు. నక్సలైట్ల ఎజెండాలోని ఏ ఒక్క అంశం కూడా ప్రజలకు చేరలేదన్నారు. నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అని చెప్పిన కేసీఆర్... ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఆయన కొడుకు మంత్రి కావాలని, ఆయన అల్లుడు మంత్రి కావాలని, బిడ్డ ఎంపీ కావాలని, ఆయన సడ్డకుని కొడుకు రాజ్యసభ ఎంపీ కావాలని ఏ నక్సలైట్ ఎజెండాలో ఉందో చూపించాలని డిమాండ్ చేశారు.

 

17:25 - November 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని..అనుకుంటున్న గులాబీ బాస్‌కు కొంతమంది నేతలు తలనొప్పిగా మారారు. ప్రచార పర్వంలో దూసుకపోతున్నా పార్టీకి కొందరు నేతలు గుడ్ బై చెప్పడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తాజాగా టీ.టీడీపీ నుండి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం స‌ృష్టించాయి. టీఆర్ఎస్ ఎంపీలలో ఇద్దరు కాంగ్రెస్ వైపు వస్తారని సంచలన ప్రకటన చేశారు. దీనిని టీఆర్ఎస్ ఖండించినా..అటువైపు చర్చ కూడా జరగలేదు. టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ‘కారు’ దిగి ‘చేయి’ అందుకున్నారు. ఒక్కసారిగా రాజకీయ పొలికల్ స్క్రీన్ మారిపోయింది. గులాబీ దళంలో చర్చ మొదలైంది. రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో సగం పూర్తయ్యిందని..మరి రెండో ఎంపీ ఎవరనే దానిపై తెగ చర్చ జరుగుతోందంట. 
Image result for four more trs mps shock trs before election ?కొండారెడ్డి జంప్...
తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసిపోయింది. ఈ తరుణంలో ఎంపీ పార్టీ మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ కూడా అయ్యారు. ఈ నెల 23న మేడ్చ‌ల్‌లో జ‌రిగే సోనియాగాంధీ బ‌హిరంగ స‌భ‌లో పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. కొండారెడ్డి బాటలో మరో ఎంపీ వెళుతారనేది తెలియడం లేదు. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కారు దిగి, కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు తెగ పుకార్లు షికారు చేశాయి. అంతేగాకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి, సీతారాం నాయక్‌లు పార్టీ మారతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు మారుతారనే దానిపై గులాబీ దండులో టెన్షన్ పుట్టిస్తోంది. 
Image result for four more trs mps shock trs before election ?జితేందర్ రెడ్డి ఈయన లోక్ సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ చేపడుతున్న వాటిపై అంతగా యాక్టివ్ లేరని ప్రచారం జరుగుతోంది. ఈయన జంప్ జిలానీ అవుతారా అనే చర్చ జరుగుతోంది. 
రైతు సమాఖ్య నేతగా..కేబినెట్ ర్యాంకుగా కొనసాగుతున్న గుత్తా మారుతారా ? అనే చర్చ కూడా జరుగుతోందంట. కాంగ్రెస్ నుండి వచ్చిన ఈయన మరోసారి జంప్ కూడా కావచ్చనే టాక్ వినిపిస్తోంది. 
ఇక సీతారాం నాయక్..పార్టీ వీడుతారని గతంలో జరిగింది. వీటిని సీతారాం నాయక్ కూడా ఖండించారు. టీఆర్ఎస్‌లో మాత్రం ఆయన సంతోషంగా లేరని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 
ఎన్నికల్లో తన అనుచరగణానికి టికెట్లు కేటాయించకపోవడంతో మరో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నట్లు టాక్. ఇటీవలే ఈయన కంపెనీలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. 
కొద్ది రోజుల్లో సోనియా..రాహుల్ పర్యటనలో..వారు నిర్వహించే సభల్లో ఎవరైనా ఎంపీలు చేరుతారా ? లేదా ? ఏం జరుగబోతోందనేది ఇప్పుడు చర్చగా మారింది. 

12:48 - November 19, 2018

వికారాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. కొడంగల్‌లో నామినేషన్ దాఖలుకు ర్యాలీగా వెళ్లేందుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. నామినేషన్ ర్యాలీలు చేపట్టరాదని ఉత్తర్వులు జారీచేశారు. పోలీసుల తీరుపై రేవంత్ వర్గీయులు మండిపడుతున్నారు. నామినేషన్‌ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో రేవంత్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను విధించారు.
నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో రేవంత్‌రెడ్డి సోమవారం(19వ తేదీ) నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీగా వెళ్లాలని అనుకున్నారు. అయితే నామినేషన్ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తమను వేధించడంలో భాగంగానే పోలీసులను అధికార పార్టీ ఆయుధంగా వాడుతోందని రేవంత్ వర్గీయులు ఆరోపించారు. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని వారు హితవు పలికారు.
నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లొ ఆయా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21, 22 తేదీలలో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. డిసెంబర్‌ 7న ఎన్నికలు నిర్వహించి.. 11న రిజల్ట్స్ ప్రకటిస్తారు.

19:53 - November 15, 2018

హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని, తనకు పార్టీ మారే ఆలోచనే లేదని ఆయన స్ఫష్టం చేశారు. గురువారం(15వ తేదీ) ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసి వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.
కాగా టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. దీనికి తోడు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని, ఆ లేఖను కేసీఆర్‌కు పంపారని మీడియాలో వార్తలు హల్‌హల్ చేశాయి. దీంతో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెబుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎంపీ సీతారాం నాయక్ అనూహ్యంగా గురువారం(15వ తేదీ) మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. పేపర్లలో రావడం.. ఓ మైండ్‌గేమ్‌లా ఉందని సీతారాం నాయక్ పేర్కొన్నారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలు ఎవరో వెల్లడించాలని సీతారాం నాయక్ సవాల్ చేశారు.

08:46 - October 23, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... ఇవాళ ఉదయం 10గంటలకు ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. బషీర్‌బాగ్‌లోని ఐటీ శాఖ కార్యాలయంలో జరిగే విచారణకు రేవంత్ రెడ్డి అటెండవనున్నారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల తర్వాత ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల మూడున విచారణకు హాజరైన రేవంత్ రెడ్డిని  దాదాపు నాలుగున్నర గంటలపాటు అధికారులు విచారించారు. ఈనెల 23వ తేదీన మరోసారి తమ ముందుకు రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ మరోసారి అధికారుల ముందు హాజరవనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు ఉదయ్ సింహా, మామ పద్మనాభరెడ్డి, శ్రీ సాయి మౌర్యా కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేశ్ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇళ్లలో రెండు రోజులకు పైగా సోదాలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంటు స్వాధీనం చేసుకున్నారు. ఓటు నోటు కేసు, రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రయివేటు లిమిటెడ్‌లో రూ.20 కోట్ల లెక్క తేలని ఆదాయాన్ని గుర్తించిన అధికారులు.. రేవంత్ రెడ్డి భాగస్వామ్యం పై ఆరా తీసే అవకాశాలున్నాయి.  సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్‌ఫ్రా కంపెనీతో రేవంత్‌కు ఉన్న సంబంధాలపైనా వివరాలు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్ ఇంటి అడ్రస్ పైన పలు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని ఐటీ అధికారులు గుర్తించారు. అయితే, తమ ఇంట్లో అద్దెకు ఉన్న వారి కంపెనీల పేర్లు అని రేవంత్ చెప్పారు. ఆయా కంపెనీలతో రేవంత్‌కు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు. మొత్తంగా ఓటుకు నోటు డబ్బులు, రూ.20 కోట్ల లెక్క, సోదరుడి కంపెనీలో వాటా, తన ఇంటి అడ్రస్‌లోని కంపెనీలపై ఆరా తీయనున్నారని తెలుస్తోంది.

17:08 - October 20, 2018

హైదరాబాద్: రాష్ట్ర్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి 105మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికలలో అన్ని పార్టీల కంటే ముందు దూసుకు పోతున్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో రెడ్డి సామాజికవర్గం ఆనందోత్సాహాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి పై ఓటుకు నోటుకేసు, ఐటీ దాడుల నేపధ్యంలో రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం పార్టీకి దూరం అవుతోందనే ఊహాగానాలు జరుగుతున్న వేళ ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డికార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో ఆ సామాజికవర్గంలోని అట్టడుగు వర్గాలకు ఈవార్త ఊరట కల్పించిందనటంలో సందేహం లేదు. రెడ్డి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేతలు నిన్న కేటీఆర్ ను కలిసి అభినందనలు తెలిపారు.  టీఆర్ఎస్ కు చెందిన రెడ్డి సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, మరికొందరు రెడ్డిసామాజికవర్గ నాయకులతో కలిసి శనివారం బేగంపేటలోని  సీఎం క్యాంపు కార్యాలయంలో ఆపధ్దర్మ మంత్రి కేటీఆర్ ను  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  కేటీఆర్ ను  కలిసిన వారిలో ఎంపీలు మ‌ల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు తాజా మాజీఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు ఉన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Revanth Reddy