review

19:38 - January 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు, భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి. రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు.

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ

ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు.

2013 చట్టాన్ని అమలు చేయాలంటున్న భూ నిర్వాసితులు....

భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత 220 రోజులుగా ఇంకా రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి.

ఏపీలోనూ బలవంతపు భూసేకరణ

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది.

. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

18:46 - January 11, 2017

ఆఫ్టర్ ఎ గ్యాప్... బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ 150వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పదేళ్ళ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందనగానే అభిమాన ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలన్నీ దృష్టిలో పెట్టుకుని తిరుగులేని మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దేందుకు హేమాహేమీ రచయితలంతా తలా ఓ చేయి వేశారు. తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి రీమేక్ గా దర్శకుడు వివి వినాయక్ తీర్చిదిద్దిన ఖైదీ నంబర్ 150... ఆ అంచనాలను అందుకోగలిగిందా? ప్రపంచాన్ని ఒక మార్కెట్ గా, మనుషుల్ని కేవలం వినియోగదారులుగా మార్చేసిన కార్పొరేట్ క్యాపిటలిస్ట్ వ్యవస్థలో గ్రామీణ జీవనం ఛిన్నాభిన్నం అయిపోతోంది. పల్లె రైతుల కాళ్ళ కింద నుంచి కార్పొరేట్ శక్తులు వాళ్ళ భూముల్ని కబళిస్తున్నాయి. ఈ అమానవీయ పరిణామాన్ని, దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ఉదాత్తమైన కథాంశంతో తీసిన చిత్రం ఖైదీ నంబర్ 150. కార్పొరేట్ శక్తుల దుర్మార్గాలకు రైతులు బలి అయిపోవడం చూసి కలత చెందిన... శంకర్, రైతుల భూముల్ని కాపాడడమే ధ్యేయంగా చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తాడు. అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. చిల్లర దొంగతనాలు చేస్తూ... సరదాగా బతికేందుకు స్నేహితుడితో కలిసి బ్యాంకాక్ వెళ్ళాలని దొంగ పాస్ పోర్టులు తయారు చేసుకున్న కత్తి శీను.. శంకర్ స్థానంలోకి వస్తాడు. డేరింగ్ డాషింగ్ అయిన శంకర్ ప్రవేశంతో... రైతులకు ఓ బలమైన అండ లభించినట్లవుతుంది. రైతు సమస్యలను ప్రభుత్వం, మీడియా, అందరూ పట్టించుకోవడం లేదని... వారి దృష్టిని మళ్ళించేందుకు ఆరుగురు రైతులు ఆత్మబలిదానం చేసుకుంటారు. చివరకు నీరూరు అనే ఆ గ్రామంలోని రైతుల ప్రాణాలను, వారి భూములను హీరో ఎలా కాపాడారు, అసలు ఉద్యమకారుడు శంకర్ ఏమయ్యారు.. అనే ప్రశ్నలకు సమాధానంగా కథ కొనసాగుతుంది.

 

ఓ హోల్సమ్ ఎంటర్ టైనర్ గా.....

దేశంలో ఇప్పుడు చాలా చోట్ల రగులుతున్న భూమి సమస్యను కథాంశంగా ఎంచుకున్నందుకు చిరంజీవిని అభినందించాల్సిందే. ఆర్థిక సరళీకరణ పేరుతో మార్కెట్ సరిహద్దులు చెరిగిపోతున్న పెట్టుబడి దారీ వ్యవస్థలో, భూమి అత్యంత విలువైన సంపదగా మారింది. వ్యవసాయమే మెజారిటీ ప్రజల జీవికగా ఉన్న మనదేశంలో భూమితో రైతులకు ఉన్న సంబంధం చాలా ఆత్మీయమైనది. వాల్యూతో పాటు సెంటిమెంటల్ వాల్యూ కూడా ఉన్న భూములను అభివృద్ధి పేరుతో రైతుల నుంచి లాక్కోవడం మన కళ్ళ ముందే జరుగుతోంది. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ వంచనను ప్రశ్నించడమే ప్రధాన ఇతివృత్తంగా ఉన్న ఈ కథలో.. చిరంజీవి మార్క్ డాన్సులు, కామెడీ సీనులు, ఫైట్స్ బాగా దట్టించారు దర్శకుడు వినాయక్. అయితే, చిరంజీవి ఇమేజ్ ను పదేళ్ళ గ్యాప్ ను దాటించి.. రీఎస్టాబ్లిష్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో, అసలు కథ తెరమరుగైంది. డిస్కస్ చేయాల్సిన ఇష్యూ తెరమరుగైపోయి...స్టార్ మార్కెట్ కోసం పడిన వెంపర్లాట్ డామినేట్ చేసింది. అయితే, చిరంజీవి సినిమాలో సీరియస్ కథేమిటి... బాస్ ఈజ్ బ్యాక్... ఆయనేం చేసినా మెస్మరైజ్ అయిపోతారు మాస్... అనుకునేవాళ్ళకు ఈ సినిమా ఓ హోల్సమ్ ఎంటర్ టైనర్.

నటీనటులు...

నటీనటులు విషయానికి వస్తే... మెగా స్టార్ చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది? నటుడిగా బలమైన పునాదిరాళ్ళ మీద స్వయంకృషితో ఎదిగిన 150 చిత్రాల స్టార్... ఎప్పట్లానే ఈ చిత్రంలో జోరుగా పర్ఫార్మ్ చేశారు. పదేళ్ళ గ్యాప్ తరువాత చిరంజీవి... గ్యాంగ్ లీడర్ లుక్ తో.. ఫిజిక్ తో మార్వలెస్ గా కనిపించారు. స్టెప్పుల్లో తనదైన రిథమ్ తో ప్రేక్షకులకు జోష్ ను పంచారు. రౌడీ అల్లుడి తరహా పాత్ర అయిన కత్తి శీనుగా మాస్ చేత చప్పట్ల మోత మోగించారు. కాజల్ పాత్ర పాటలకే పరిమితమైంది.. ఇందులో ఆమె నటనా కౌశలాన్ని ప్రదర్శించాల్సిన సన్నివేశాలేవీ లేవు. ఒక పాటలో నటిస్తే ఐటం సాంగ్ అంటారు, మూడు పాటల్లో కనిపిస్తే హీరోయిన్ అంటారు అన్నట్లే ఉంది కాజల్ పాత్ర చిత్రణ. ఇక, ఆలీ, బ్రహ్మానందం చేసిన పాత్రలు వారికి బాగా అలవాటైనవే. కామెడీ సన్నివేశాలను వారు బాగా పండించారు. విలన్ గా తరుణ్ అరోరా... ఎలా నటిస్తారో చూద్దామంటే.. దర్శకుడు ఆయనకంత స్కోప్ ఇవ్వలేదు.

 

టెక్నీషియన్స్ విషయానికి వస్తే...

టెక్నీషియన్స్ విషయానికి వస్తే... శంకర్ దాదా ఎంబీబీఎస్ సిరీస్ లో చిరంజీవికి మూడో హిట్ ఆల్బమ్ అందించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆర్ రత్నవేలు ఫోటోగ్రఫీ కథానుగుణంగా సాగింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లు చిరంజీవికి ఆకట్టుకునే మూమెంట్స్ డిజైన్ చేయగలిగారు. వైర్ వర్క్స్ మరీ ఎక్కువగా లేకుండా సింపుల్ మూమెంట్స్ తో రామ్ లక్ష్మణ్ లు ఫైట్స్ కొరియోగ్రఫీ ఇంప్రెసివగా ఉంది. ఇక, కాస్ట్యూమ్స్ డిజైనర్ కొణిదెల సుస్మిత పనితనం... పాటల్లో బాగా కనిపిస్తుంది. చిరంజీవిని అప్ టుడేట్ ఫ్యాషన్స్ తో ఆకట్టుకునే చూపించగలిగారు.

హేమాహేమీ రచయితలు...

పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, బుర్రా సాయిమాధవ్... వంటి హేమాహేమీ రచయితలు ఈ స్క్రిప్టు కోసం పని చేశారు. కానీ, ఇంత మంది కలిసినా పెద్దగా పంచ్ డైలాగులేమీ కనిపించలేదు. మీడియాతో కత్తి శీను సంభాషణలో పరుచూరి మార్క్ కనిపిస్తుంది. మొత్తంగా, చిరంజీవి మ్యాజిక్ ను ఎలివేట్ చేయడానికి చూపించిన శ్రద్ధలో... కొంత భాగమైనా కథను ఎలివేట్ చేయడానికి, చిరంజీవికి దీటైన విలన్ ను ఎలివేట్ చేయడానికి పెట్టి ఉంటే సినిమా ఇతివృత్తానికి న్యాయం జరిగేది. ముఖ్యంగా, కథలోని కీలక సమస్య మీద పోరాటానికి నడుం బిగించిన అసలు కథానాయకుడు పూర్తిగా అండర్ ప్లే అయిపోవడం ఈ నెరేషన్ లోని విషాదం. భూమి సమస్య ఒక కార్పొరేట్ ప్రతీకను హతమార్చితే పరిష్కారమయ్యేది కాదన్న వాస్తవం తెలిసి...దాని వెనుక ఉన్న మార్కెట్ వ్యూహాలను కొంతవరకైనా చూపించే ప్రయత్నం చేసి ఉంటే సినిమాకు ఒక పర్పస్ ఫుల్ మూవీ అన్న గౌరవం దక్కేది. ఫలితంగా... చిరంజీవి 150వ చిత్రం ఒక రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.

 

 

ప్లస్

చిరంజీవి యంగ్ లుక్,

సమకాలీన కథ

నేపథ్య సంగీతం

చిరంజీవి డాన్సులు

 

మైనస్

రొటీన్ కామెడీ

బలహీనమైన ఇతర పాత్రలు

విలన్ తేలిపోవడం

తేలిపోయిన క్లైమాక్స్

 

రేటింగ్ : Watch Video

19:20 - December 16, 2016

అందరూ కొత్తవారితో వస్తున్న సినిమా `అమీర్ పేట‌లో` కెరీర్ కోసం అమీర్ పేట వచ్చినవారి జీవన శైలిని అభివర్ణిస్తూ తీసిన సినిమా అమీర్ పేటలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'శ్రీ' హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన అమీర్ పేటలో సినిమా.ప్రస్తుతం యూత్ జీవన శైలి..సాఫ్ట్ వేర్ ఉద్యోగం..వంటి లక్ష్యంతో అమీర్ పేట వచ్చిన యూత్ ఎక్కడో ఓ చోట ఈ సినిమా మ్యాచ్ అవుతుంది. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది? కొత్తవారు చేసిన ఈ ప్ర‌య‌త్నం ప్రేక్షకులను ఎంత వ‌ర‌కూ ఆక‌ట్టుకొంది? అనేది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..టెన్ టీవీ ఇచ్చిన రేటింగ్ చూడాలంటే కూడా ఈ వీడియో చూసి తీరాల్సిందే..

18:57 - December 16, 2016

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన కామెడీ ఎంటర్ టైనర్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ . బండి భాస్కర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ జనాన్ని మెప్పించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. టాలీవుడ్ లో కొత్త కొత్త దర్శకులు, అందులోనూ కుర్ర దర్శకులు వస్తుండడం వల్ల ఒక విధంగా మంచే జరుగుతోంది. కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్తగా తీయాలని ఆలోచిస్తున్నారు, జనానికి ఏది కావాలో అదే ఇవ్వాలనుకుంటున్నారు, నేల విడిచి సాము చేయకుండా ఉన్నంతలోనే సినిమాని జనరంజకంగా మలిచి నిర్మాతలకు కాసులు కురిపించాలని తపిస్తున్నారు. అలాంటి ఓ మంచి ప్రయత్నమే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరుకూ ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు కొత్త దర్శకుడు బండి భాస్కర్. అంతేకాదు కథను ఏమాత్రం డీవియేట్ చేయకుండా, తనేం చెప్పాలనుకున్నాడో అదే విషయాన్ని చాలా సెన్సిటివ్ గా స్మూత్ గా చెప్పాడు దర్శకుడు. ఒకమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించి ఫైనల్ గా ఒకర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం చాలా ఫన్నీ పాయింట్ . అలాంటి ఫన్నీ ఆలోచనతోనే బోలెడన్ని కామెడీ సీన్స్ రాసుకొని ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించాడు దర్శకుడు. ఈ సినిమాకు టెన్ టీవీ ఇచ్చింన రేటింగ్ కోసం ఈ వీడియో చూడండి..

23:19 - October 28, 2016

తమిళ స్టార్ హీరో కార్తీక్ కథనాయకుడిగా నయనతార, శ్రీదివ్య, వివేక్ ప్రధాన పాత్రదారులుగా గోకుల్ దర్శకత్వంలో పీవీపీ, ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన హారర్ కామెడీ చిత్రం కాష్మోరా. తమిళంతోపాటు తెలుగులోనూ కార్తీక్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు భాషల్లో ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్లలో రీలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా వుందో తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే... సినిమా రేటింగ్.. వంటి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:46 - October 21, 2016

నందమూరి కళ్యాణ్ రామ్ , పూరీ తొలి కలయిక లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఇజం. పటాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకొచ్చిన కళ్యాణ్ రామ్ , పూరీతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. పూరీ తనదైన స్టైల్లో కళ్యాణ్ రామ్ ను సరికొత్త మేకోవర్ తో చూపిస్తూ రూపొందించిన ఈ సినిమా జనం అంచనాల్ని అందుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం...

పటాస్ తో కళ్యాణ్ రామ్ హిట్టుకొట్టగానే స్టార్ స్టాటస్ వచ్చేసినట్టే ఫీలయ్యారు అభిమానులు. అయితే పూరీ లాంటి డైరెక్టర్ నుంచి హిట్టు పడితేనే స్టార్ డమ్ వచ్చినట్టు అని ఫీలయ్యాడో ఏంటోగానీ , తన సొంత బ్యానర్ లోనే పూరీ డైరెక్షన్ లో ఇజం అనే సినిమా ను యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద సొంతంగా తీసుకున్నాడు కళ్యాణ్ రామ్ . అయితే కళ్యాణ్ రామ్ పాత సినిమాలతో పోల్చితే ఈ సినిమా రేంజ్ ఎక్కువ, పూరీ పాత సినిమాలతో పోల్చితే ఈ సినిమా రేంజ్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కథేమీ లేదు, కథనంతో సినిమా ను నెట్టుకురావాలనే ఉద్దేశంతో కొన్ని మంచి సీన్సే రాసుకున్నాడు. కాకపోతే పూరీ ఇదివరకు తీసిన సినిమాల తాలూకు వాసనలు కనిపిస్తాయి. ముఖ్యంగా పోకిరి, కెమెరా మేన్ గంగతో రాంబాబు సినిమాల ఛాయలు కొంత వరుకూ కనిపిస్తాయి. మొత్తానికైతే పూరీ కొత్త గా తీసిన ఈ సినిమా యాజిటీజ్ గా ఆయన పాత సినిమాలాగానే అనిపించడమే విచిత్రం.

సత్యనారాయణ మార్తాండ్ అనే జర్నలిస్ట్ కొందరి అక్రమాల్ని బైటపెడతాడు. ఆ ప్రయత్నంలో ఆయన రెండు కాళ్ళూ పోగొట్టుకుంటాడు. దాన్ని కళ్లారా చూసిన ఆయన కొడుకు కక్షతో హిడెన్ జర్నలిస్ట్ అవుతాడు. ఎవరి కంటా పడకుండా అతి పెద్ద నెట్ వర్క్ తో గ్రాండ్ లీక్స్ పేరుతో పెద్ద పెద్ద వాళ్ల అవినీతుల్ని బైట పెడుతూ ఉంటాడు. అందులో ఇంటర్నేషనల్ మాఫియా డాన్ జావేద్ ఇబ్రహీం ఒకడు. బ్యాంక్ ఆఫ్ పేరడైజ్ లో డిపాజిట్ చేసుకున్న పెద్ద పెద్ద వాళ్ల అకౌంట్లను హ్యాక్ చేసి వాళ్ల వేల కోట్లను ఇండియాలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి పేదవాడి అకౌంట్ లోకి హీరో ట్రాన్స్ ఫర్ చేయడమే మిగతా కథ. అయితే సాధారణమైన హీరో , ఏకంగా ఇంటర్నేషనల్ డాన్ కూతుర్ని లైన్ లో పెట్టడం తేలికగా పడగొట్టేయడం లాంటి సీన్స్ కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అంతేకాదు హై టెక్ సెక్యూరిటీ ఉన్నవిలన్ ఇంట్లోకి హీరో దూరడం కూడా లాజిక్ లెస్ అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని సీన్స్ తప్ప ఫస్టాఫ్ అంతా తాపీగా నడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తిగానే ఉంటుంది.

ఇక లవ్ ట్రాక్ రొటీన్ గానే అనిపిస్తుంది. జగపతి బాబు ఎంట్రీ కూడా పెద్ద గా ఎఫెక్ట్ ఇవ్వదు. ఆయన్ను ఫవర్ ఫుల్ గా చూపించడంలోనూ పూరీ విఫలమయ్యాడు. క్లైమాక్స్ ను మరీ సిల్లీగా , ఇల్లాజికల్ గా తీసాడు పూరీ. కానీ డైలాగ్స్ కొన్ని జనంచేత కేకపెట్టిస్తాయి.

ఇజం సినిమాకి అతి పెద్ద ప్లాస్ పాయింట్ కళ్యాణ్ రామ్ మేకోవర్. అతడి డిక్షన్ , బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని పూరీ భలేగా మార్చేసాడు. మంచి ఈజ్ తో కూడా పెర్ఫార్మ్ చేసి , తరువాత సినిమాలకి చక్కటి బాట వేసుకున్నాడు కళ్యాణ్ రామ్ . ఇక హీరోయిన్ గా నటించిన అదితి ఆర్య పర్వాలేదనిపిస్తుంది. విలన్ జగపతి బాబు పాత్ర ను పవర్ ఫుల్ గా రాసుకున్నాడు కానీ, చూపించడంలో పూరీ కొంచెం గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ఇందులో జగపతి బాబు కొత్తగా చేసిందేమీ ఉండదు. ఇక మినిస్టర్ గా నటించిన పోసాని, హీరో తండ్రిగా నటించిన తనికెళ్లభరణి పాత్రలు మామూలుగానే అనిపిస్తాయి. టోటల్ గా ఈ సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ , ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కళ్యాణ్ రామ్ కోర్ట్ సీన్ జనాన్ని బాగా కుర్చీలో కూర్చోబెడుతుంది. లైవ్ లో పెద్ద వాళ్ల అకౌంట్లలోని డబ్బుల్ని పేదవాళ్ల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసే సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. మరి ఈ సీన్ వల్లగానీ, కళ్యాణ్ రామ్ నటన వల్లగానీ జనం ఈ సినిమాని పూర్తిగా కాకపోయినా కొంతైనా ఆదరిస్తారేమో మరి చూడాలి. ఇజం సినిమా.రేటింగ్ కోసం ఈ వీడియో చూడండి..

17:17 - September 29, 2016

హైదరాబాద్ : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో రోడ్లపరిస్థితిపై సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లపై సమాచారం ఇచ్చేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను పంచాయతీరాజ్‌ శాఖా ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లాలవారీగా కూడా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ..వచ్చిన ఫిర్యాదుల మేరకు వెంటనే రోడ్ల మరమ్మత్తుచేయాలని అధికారులకు సూచించారు. 

 

16:41 - September 26, 2016
11:28 - September 26, 2016

కరీంనగర్ : గత కొద్ది రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో మిడ్ మానేర్ నిండుకుండను తలపిస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రులు హరీష్ రావు, ఈటెల మిడ్ మానేర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాసేపటి క్రితం ఆరు గేట్లను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేసీఆర్ పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోడంతో ఏటీసీ అనుమతినివ్వలేదు. దీనితో గజ్వేల్ ఫాం హౌస్ నుండి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ బయలుదేరారు. మిడ్ మానేరు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం తరువాత ఏరియల్ సర్వే చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లాకు చేరుకున్న అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎలాంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

09:21 - September 26, 2016

కరీంనగర్ : ఎడతెరపి లేని వర్షాలతో కరీంనగర్ జిల్లా అతలాకుతలమవుతోంది. జలాశయాలు నిండుకుండాల తలపిస్తున్నాయి. మధ్యమానేరుకు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీనితో కట్టకోతకు గురయింది. జిల్లా పరిస్థితులను తెలుసుకొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకతీయ కాలువకు గండి పడి వందల ఎకరాల పంట నీట మునిగిపోయింది. వాతవరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారా జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్నరని తెలుస్తోంది. వాతావరణం ప్రతికూలంగా ఉంటే పర్యటన రద్దవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

భారీగా వరద నీరు...
ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతుండటంతో మిడ్‌ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మానేరు అలుగుతోపాటు పక్కన మట్టికట్టపై నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. మానేరు, మోయతుమ్మెద వాగు, ఎల్లమ్మ, మూలవాగు, బిక్కవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తడంతో.. మిడ్‌మానేరు దిగువ ప్రాంతాలైన చీర్లవంచ, మాన్వాడ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితి మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - review