review meeting

21:47 - October 14, 2017

వరంగల్‌ : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈనెల 22న సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో... వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్‌.. టెక్స్‌టైల్‌ పార్క్‌ను దేశంలోనే అగ్రగామికి నిలిచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు జిల్లాలో పెండింగ్‌ పనులపై అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులకు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వరంగల్‌లో ఈనెల 22న సీఎం కేసీఆర్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో... ప్రారంభ ఏర్పాట్లు, బహిరంగ సభ నిర్వహణపై వరంగల్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్క్‌ స్థలాన్ని పరిశీలించి... టెక్స్‌టైల్‌ పార్క్‌ లోగోను ఆవిష్కరించారు. 

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలుస్తుందన్నారు కేటీఆర్‌. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అన్ని రకాల వస్త్రాలన్నీ ఇక్కడే తయారవుతాయన్నారు. టెక్స్‌టైల్‌ రంగం కార్మికులకు రెండింతల పనితో పాటు.. ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సూరత్‌ లాంటి ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న స్కిల్డ్‌ లేబర్‌ను స్వరాష్ట్రానికి రప్పిస్తామన్నారు. పార్క్‌ ఏర్పాటుతో లక్షా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కళాశాలతో ఎంఓయు కుదుర్చుకుంటున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

అనంతరం నిట్‌ ప్రాంగణంలో టాస్క్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌... విద్యార్థులతో సమావేశమయ్యారు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని ఎదుర్కొని... మరింత కసితో పని చేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు కేటీఆర్‌. జీవితలంలో రాణించాలంటే మానసికంగా, దృఢంగా ఉండాలన్నారు. అలా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. యువత సమస్యలను తట్టుకునే విధంగా టాస్క్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు కేటీఆర్‌.

టాస్క్‌ ఏర్పాటు కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ హాజరయ్యారు. ఇక సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలో దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. కేటీఆర్‌ కూడా చాలామందికి సెల్ఫీలు తీసేందుకు అవకాశం కల్పించారు.

వరంగల్‌ పర్యటనలో అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన కేటీఆర్‌... ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని మండిపడ్డారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో... అధికారులు, ఎమ్మెల్యే పని తీరు ఆశాజనకంగా లేదన్నారు మంత్రి. ఈసారి సమీక్ష నిర్వహించే సమయానికి పెండింగ్‌ పనులకు టెండర్లు పిలిచి.. పూర్తి చేయాలన్నారు కేటీఆర్‌. 

17:53 - October 14, 2017

వరంగల్ : జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదని అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి...అధికారులు, ఎమ్మెల్యే పనితీరు చాలా డిసప్పాయింట్ గా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపోజల్ తెచ్చి ప్రతి పనికి టెంటర్లు పిలవాలని ఆదేశించారు. నెక్ట్స్ రివ్యూ వరకు అన్ని పనుల్లో క్లారిటీ ఉండాలని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయాలని షరతు విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:29 - August 30, 2017

హైదరాబాద్ : భూ రికార్డుల ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్‌ వేగం పెంచింది. రేపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇవాళ రెవెన్యూ అధికారులతో సమావేశమైన కేసీఆర్‌... అనేక అంశాలపై చర్చించారు. భూరికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా జరగాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. తొలుత చిక్కులు, సమస్యలు లేని 95 శాతం వివరాలను ఖరారు చేయాలని... తుది జాబితాపై రైతులందరి సంతకాలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఇక భూరికార్డుల సరళీకరణ, ప్రక్షాళనపై రేపు కలెక్టర్లు, ఆర్డీవో సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం 1193 బృందాలు ఏర్పాటు చేశారు.

 

18:40 - August 30, 2017

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి ... ఉమ్మడి వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు... ఐదు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. శాఖలవారీగా సమీక్ష నిర్వహించిన కడియం... ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై అధికారులను నిలదీశారు. తీరు మార్చుకోకపోతే... చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. ప్రధానంగా మూడు పథకాలపై చర్చ జరిగిందని...  ప్రతి నెలా మిషన్‌ భగీరథ పనులపై ఇదే విధంగా సమావేశం జరుగుతుందన్నారు.

15:51 - August 14, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తైనంత వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం నిర్మాణ పురోగతిపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో అలసత్వాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రణాళికా బద్ధంగా పనులు జరిగితే చెప్పిన సమయానికి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వొచ్చని అధికారుల దృష్టికి తెచ్చారు. పోలవరం పనులను సవాల్‌గా తీసుకుని పూర్తి చేయడంలోనే ఇంజినీర్ల సమర్థత బయటపడుతుందని చెప్పారు. 

07:26 - May 20, 2017

గుంటూరు : ఏపీ పునర్విభజన చట్టం.. కేంద్రం ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్షించారు.. ఈ సమావేశానికి మంత్రి కాల్వ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.. ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని కాల్వ ఆక్షేపించారు. 9, 10 షెడ్యూల్‌లో 231 విద్యాసంస్థలు ఉంటే, షీలాబేడీ కమిటీ 64 సంస్థలకు సంబంధించి మాత్రమే నిర్ణయాలు తీసుకుందని అన్నారు. హెడ్‌ క్వార్టర్స్‌పై నిన్న కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కాల్వ తెలిపారు.. 9, 10 షెడ్యూల్‌ ఆస్తుల విషయంలో కేంద్ర నిర్ణయం అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు.. ఆస్తుల పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి సెక్షన్‌ 108ని మరో రెండేళ్లు కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు .

జూన్‌ 1తో ముగుస్తోన్న స్థానికత...
రెండు రాష్ట్రాలమధ్య స్థానికత అంశం జూన్‌ 1తో ముగుస్తోంది.. దీన్ని మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరతామని పరకాల ప్రభాకర్‌ చెప్పారు.. దీనితోపాటు.. సెక్షన్‌ 108, 66లను మరో రెండేళ్లు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని వివరించారు. విభజన చట్టంలోని హక్కులు సాధించుకోవడంలో రాజీపడబోమని కాల్వ స్పష్టం చేశారు.. ఈ విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

 

19:05 - May 19, 2017

అమరావతి: జూన్ 2 నుండి 8వరకు జరగనున్న నవ నిర్మాణ దీక్ష ఏర్పాట్లను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. మంత్రులు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి , కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాస్, కామినేని కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. నవ నిర్మాణ దీక్షకు సంబంధించిన వేదిక ఎంపిక, ఏర్పాట్లు, సూచనలపై ఈ కమిటి నిర్ణయం తీసుకోనుంది. 2015 లో గుంటూరులో, 2016లో తిరుపతిలో నవ నిర్మాణ దీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది ఎక్కడ నిర్వహించాలనేది కమిటీ నిర్ణయించనుంది. 

16:42 - May 19, 2017

అమరావతి: ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని మంత్రి కాల్వ విమర్శించారు.. కేంద్ర హోంశాఖ నిర్ణయం రద్దు చేయాలని కోరుతూ లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పునర్విభజన చట్టం... కేంద్రం ఇచ్చిన హామీల ఆమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాల్వ మాట్లాడుతూ... ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖ నిర్ణయం పై మంత్రి కాల్వ జూన్‌లో ఢిల్లీ వెళతామన్నారు.-కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరతామని, కేంద్రం నిర్ణయం అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టుకు వెళతాం- కాల్వ స్పష్టం చేశారు. స్థానికతను మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రానికి లేఖరాయనున్నట్లు తెలిపారు. 

08:36 - May 2, 2017

హైదరాబాద్ : ప్రతి నివాసానికి మంచినీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమలుపై కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు హాజరైన ఈ సమీక్షలను పలు అంశాలపై కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మిషన్‌ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా పనుల వేగాన్ని పెంచాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఏడాది చివరి నాటికి గోదావరి, కృష్ణా జలాలు గ్రామాలకు సరఫరా అయ్యేలా చూడాలిని కోరారు. పథకం అమల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు చర్చించుకుని, సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించేంది లేదని హెచ్చరించారు. భగీరథ పైపు లైన్లతోపాటు ఫైబర్‌ కేబుల్‌ కూడా వేసి ఇంటింటికి మంచినీళ్లతోపాటు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ అమెరికా సరసన నిలవాలన్న ఆకాంక్షను కేసీఆర్‌ వ్యక్తం చేశారు. ఇన్‌టేక్‌ వెల్స్‌, నీటి శుద్ధి కర్మాగారాల నిర్మాణాన్ని తర్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోగా పంటపొలాల్లో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తైన ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ ద్వారా నీరు అందించాలని కోరారు. ఈ పథకానికి కావాల్సిన కరెంటును అందించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

 

06:33 - February 5, 2017

హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టరేట్లకు భవన నిర్మాణ డిజైన్లను సీఎం కేసీఆర్‌ ఈరోజు ఫైనల్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త జిల్లాలతో పాటు.. పాత జిల్లాల కలెక్టరేట్లు కూడా ఒకే నమూనాలో ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. వీటితో పాటు అనేక కీలక అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశంలో సాదా బైనామాలు, అసైన్డ్‌ భూములు, కలెక్టర్‌, జిల్లా పోలీసు కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, ఎస్సీ సంక్షేమ విభాగానికి సంబంధించిన హాస్టళ్ల స్థితిగతులు, కుల వృత్తుల జీవన పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక ప్రధానంగా కొత్త జిల్లా కేంద్రాలలో భవనాల నిర్మాణాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాల ఎంపిక పూర్తయింది. మిగతా పనులపై చర్చించనున్నారు. అలాగే అధునాతన కలెక్టరేట్ల నిర్మాణనానికి సంబంధించి ఆర్‌ అండ్‌ బీ రూపొందించిన డిజైన్లపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసీఆర్‌ ఫైనల్‌ చేయగానే అన్ని జిల్లా కేంద్రాలను ఒకే నమూనాలో నిర్మించనున్నారు.

దిశా నిర్ధేశం..
గొర్రెల పెంపకందారులు, మత్స్యకారుల జీవితాలలో కొత్త వెలుగును తేవడానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఏ విధంగా క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుపరచాలనే విషయంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాలోని యాదవుల స్థితిగతులపై కేసీఆర్‌ కలెక్టర్ల నుంచి నివేదిక కోరే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలవారీగా విభిన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు అందించే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి మరింత మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్ర చర్చ జరిగే అవకాశముంది. సాయంత్రం వరకు జరగనున్న ఈ సమావేశంలో వీటితో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - review meeting