roads development

14:48 - May 19, 2017

హైదరాబాద్: గ్రామీణ రహదారులు..నరకానికి నకళ్లు. ఎక్కడ చూసినా గుంతలే. బైక్‌ మీద వెళ్లినా, ఆటోలు, బస్సులో ప్రయాణించినా నడుములు విరిగే పరిస్థితి. ఇటువంటి రోడ్లకు ఇకపై మహర్దశ పట్టనుంది. అన్ని రహదారులను అద్దంలా మెరిసిపోయేలా అందంగా తీర్చి దిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

రోడ్లు సౌకర్యంలేని పంచాయతీలు 423 ......

తెలంగాణలో ఇంకా చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. మొత్తం 423 గ్రామ పంచాయతీలకు రహదారులు లేవు. అలాగే 5,534 కాలనీలకు రోడ్డు సౌకర్యంలేదు. కొత్త రోడ్లు మంజూరులో వీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కానీ రోడ్ల నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీంతో గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మెరుగుపడంలేదు. ఇకపై ఈ దుస్థితికి స్వస్తి పలికేందుకు గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఎంజీఎస్‌వై కింద 2001 నుంచి ఇప్పటి వరకు 2,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం 10,184 కి.మీ. రోడ్లు నిర్మించారు. మరో 51 రోడ్లు, 26 వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింది 2016-17లో మంజూరైన 205.65 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటితో చేపడుతున్న 37 రోడ్లు, 117 వంతెనల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యతతో పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిఘా పెడతారు.

రోడ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు .....

కొత్తగా నిర్మించాల్సిన రహదారులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వారం రోజుల్లో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంచనాలు పెంచకుండా చూసేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. నిధుల కొరత ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు వేసే కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంతలు పడినా కాంట్రాక్టర్లే మరమ్మతులు చేసేలా నిబంధనలను రూపొందించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా ప్రస్తుతం ఉన్న రోడ్లకు రిపేర్లు చేయాలని సర్కారు నిర్ణయించింది. 

10:23 - April 14, 2017

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత ర‌హదార్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌నీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. ప‌నుల్లో అల‌స‌త్వం ప్రదర్శించే ఏజెన్సీలపై చ‌ర్యలు తీసుకోవడంతో పాటు ఇష్టానుసారం ఎస్టిమేట్‌లు పెంచ‌డాన్ని అరిక‌ట్టాల‌ని అధికారుల‌కు నిర్థేశించారు మంత్రి. అందుకు అవ‌స‌ర‌మైతే అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీల‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల‌నీ అధికారుల‌కు స్పష్టం చేసారు మంత్రి జూప‌ల్లి. గ్రామీణ ప్రాంత రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యాన్ని, నాణ్యతా లోపాన్ని సహించేదిలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీలతో నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణంలో ఇష్టారాజ్యంగా అంచనాలను పెంచడం, అసాధారణ జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. వర్క్ ఏజెన్సీలేవైనా పనుల్లో జాప్యం చేస్తే ఎప్పటికప్పుడు మెమోలు జారీ చేయడంతో పాటు,..ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులకు సూచించారు. అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పనులకు అనుమతి వచ్చిన వారంలోపే ప్రారంభించాలని,..15 రోజుల్లోగా శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా లేఖలు రాస్తామన్నారు.

వారం రోజుల్లో ప్రతిపాదనలు..
ప్రస్తుతం జరుగుతున్న నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రహదారులు వంతెనల పనులను 3నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాల్లో PMGSY కింద జరుగుతున్న 71 వంతెనలు, 37 రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే నాబార్డ్ కింద నాలుగు సర్కిళ్లలో 334.72 కోట్లతో జరుగుతున్న 181 పనుల్లో 40 మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన వాటిని జూన్ నెలాఖారులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఇచ్చే కాల పరిమితిని తగ్గించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన మార్పులకు సంబందించి వారం రోజుల్లో ప్రతి పాదనలు అందజేయాలని ఈఎన్సీ సత్యనారాయణ రెడ్డిని ఆదేశించారు. గతంలో రెండు, మూడేళ్లపాటు కూడా రోడ్డు నాణ్యత పరీక్షలు జరగని పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలా జరగకూడదని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రధానంగా సాయిల్ టెస్ట్, డిజైనింగ్‌ల్లో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

06:52 - September 25, 2015

హైద‌రాబాద్‌ : నగరంలో మ‌రో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని తయారుచేస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు..మూసిన‌దిపై ఈస్ట్ వెస్ట్ కారిడర్‌ను నిర్మించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం భారీ ప్రాజెక్టులను నిర్మించే అనుభవం ఉన్న చైనా స‌హ‌కారాన్ని తీసుకుంటోంది. సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్తే ల‌క్ష్యంగా జీహెచ్ఎంసీ వేస్తున్న అడుగులకు మ‌రో ముంద‌డుగు ప‌డుతోంది.

రూ. 22వేల కోట్లతో రోడ్ల నిర్మాణం.....

హైద‌రాబాద్‌ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దాలన్న ల‌క్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరంలో దాదాపు 22వేల కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చేపడుతోంది. ఇందులో మొదటి దశ పనులకు 1100కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. న‌గ‌రంలో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసులకు సులువైన ప్రయాణాన్ని క‌ల్పించాల‌ని ప్రభుత్వం చూస్తోంది. దాంతో ఎక్కడెక్కడ రోడ్లు అవ‌స‌రం ఉన్నాయో గుర్తించి వాటిని నిర్మించాలని సర్కార్‌ ప్రణాళికల్ని తయారుచేస్తోంది. అందులో భాగంగానే ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఈస్ట్ వెస్ట్ కారిడర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికల్ని రూపొందించింది.

మొత్తం 42 కిలోమీటర్ల మేర....

మొత్తం 42 కిలోమీట‌ర్ల మేర నిర్మించ‌నున్న ఈ కారిడార్‌ను నార్సింగ్ ఔట‌ర్ రింగ్ రోడ్డు నుండి బీబీన‌గ‌ర్ వ‌ద్ద ఉన్న కొర్రెముల ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ప్లాన్ చేస్తున్నారు. 6లైన్లుగా ఉండే ఈ రోడ్డు ఎలివేటేడ్ ప‌ద్దతిలో పూర్తిగా మూసీన‌దిపై నిర్మించ‌నున్నారు. అయితే దీనిని ఎలా నిర్మించాలన్న దానిపై చైనా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతిపాదిత రోడ్డు నిర్మాణంతో పాటు..నగరంలో ఎత్తైన టవర్ల నిర్మాణంపై కూడా కేసీఆర్‌ చైనా ప్రతినిధులతో చర్చించారు. అయితే ఈ ప్రతిపాదిత వంతెన నిర్మాణ ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు చైనా బృందం ఏరియ‌ల్ స‌ర్వే నిర్వహించింది. ఇందులో అంజు ఇన్‌ఫ్రా, బ్రిడ్జి డిజైనింగ్, రాడిక్ క‌న్సల్‌టెన్సీల ప్రతినిధుల‌తో పాటు జీహెచ్ఎంసి కమిష‌న‌ర్ కూడా పాల్గొన్నారు. ఈస్ట్‌-వెస్ట్ కారిడార్ వంతెన నిర్మాణానికి ఏ విధ‌మైన అడ్డంకులు ఎదుర‌వుతాయి,.భూసేక‌ర‌ణ ఎంత మేర‌కు అవ‌స‌రమవుతుంద‌న్న అంశాల‌ను ప్రాథ‌మికంగా అంచ‌నా వేయ‌డానికి ఈ బృందం ఏరియ‌ల్ స‌ర్వే నిర్వహించింది. ఏ ప్రాంతంలో మూసీన‌ది వైశాల్యం ఎక్కువ‌గా ఉంది. ఏ ప్రాంతంలో త‌క్కువ నిడివితో ఉంది, ఎక్కడ ఎక్కువ‌ క‌బ్జాకు గురైంది త‌దిత‌ర అంశాల‌ను కూడా ఈ బృందం ప‌రిశీలించిన‌ట్లు స‌మాచారం.

న‌గ‌రంలో స్కైవేస్., ప్లైఓవ‌ర్స్ నిర్మాణం.....

ఇప్పటివరకు ఔట‌ర్ రింగ్ రోడ్డు, అలాగే పీవీ ఎక్స్ ప్రెస్‌వే మాత్రమే న‌గ‌రంలో వేగంగా ప్రయాణించడానికి రోడ్డు మార్గాలుగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో న‌గ‌రంలో స్కైవేస్., ప్లైఓవ‌ర్స్ నిర్మాణం ప్రారంభం కాబోతుంది. తాజాగా మూసిన‌దిపై ఈస్ట్ వెస్ట్ కారిడార్ వంతెన నిర్మాణం కూడా ప్రారంభ‌మైతే మ‌రో భారీ రోడ్డు హైద‌రాబాద్ ఖాతాలో చేర‌బోతుంది. అయితే నెల రోజుల్లో ప్రతిపాదిత రోడ్డు నిర్మాణంపై చైనా బృందం ఓ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాతే..ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కానుంది. 

13:32 - September 10, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధానిలో తాత్కాలిక రహదారుల అభివృధ్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విజయవాడ నుండి రాజధాని ప్రాంతానికి చేరుకోవడానికి సరైన రహదారి లేకపోవడం, అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేయబోతుండడంతో తాత్కాలికంగా రహదారులు అభివృద్దికి నడుం బిగించింది. ఇప్పటికిప్పుడు పెద్ద రహదారులు అంటే సాధ్యం కాకపోవడంతో, ఉన్న రహదారులను విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజి నుంచి ఉండవల్లి మీదుగా.....

నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన ముహుర్తం దగ్గర పడుతుండడంతో , తాత్కాలిక వసతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది..రాజధానికి చేరుకోవాలంటే విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి మీద వెళ్లాల్సి ఉంది..అయితే ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి సెంటర్ మీదగా రాజధానిలోకి రావాలంటే సాధారణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

రాజధాని ,సీఎం క్యాంపు ఆఫీసుతో ట్రాఫిక్ సమస్య .....

సాధారణంగా ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి వరకు ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం రాజధాని ,సిఎం అతిథి గృహం కారణంగా ఊహించని స్థాయిలో ట్రాఫిక్ సమస్య పెరిగింది. రాజధాని కి వెళ్లాలంటే అతి చిన్న రహదారి మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇక్కడికి వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రహదారుల విస్తరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు .

ఉండవల్లి సెంటర్ నుండి తుళ్లూరు వరకు......

ఉండవల్లి సెంటర్ నుండి తుళ్లూరు వరకు ప్రస్తుతం రహదారిని విస్తరించేందుకు అధికారుల కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఉండవల్లి సెంటర్ నుండి ఉండవల్లి గ్రామం వరకు రోడ్డు పై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించారు. అలాగే పెనమాక నుండి తుళ్లూరు వరకు రహదారిని విస్తరించేందుకు అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు.

అక్టోబర్‌ 22 లోగా రహదారుల విస్తరణ పూర్తి ......

వచ్చే నెల 22 లోపు రహదారులు విస్తరణ పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులు భావిస్తున్నారు..రాజధాని శంకుస్థాపనకు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు రాబోతున్నారు. అప్పటిలోగా రహదారులు విస్తరణ పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో ఏర్పాటైన సీఎం అతిథి గృహం......

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న అతిథి గృహానికి కావాల్సిన అన్ని వసతులను ఆగమేఘాల మీద అధికారుల ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకునే రోడ్డు ఇరుకుగా ఉండడంతో , ఆగమేఘాల మీద నూతన రహదారిని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మద్రాస్ కాలువ పై నిర్మించిన నూతన వంతెన మీదగా కరకట్టకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న కొన్ని ఇళ్లను తొలగిస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ మార్గంలో భారీ భద్రతను ఏర్పాటు.....

ఇప్పటికే ముఖ్యమంత్రి అతిథి గృహం కారణంగా ఆ మార్గంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రస్తుతం రహదారి కోసం ఇళ్లును తొలగించడంతో, భవిష్యత్తులో సీఎం అవసరాల కోసం ఇంకేం చేస్తారో అని అక్కడి వాసులు హడలెత్తి పోతున్నారు...

Don't Miss

Subscribe to RSS - roads development