rs 500

21:30 - January 11, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. అసలు దొంగలను వదలి.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ కరెన్సీని అరికట్టడంలో.. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. నల్లడబ్బు స్విస్‌ బ్యాంకుల్లోనే కాకుండా.. బంగారం, రియల్‌ ఎస్టేట్‌ రూపంలో ఉందన్నారు.

15:22 - November 30, 2016

ఏంటీ రూ. 500తో పెళ్లా ? జోక్ చేస్తున్నారా ? అసలు సాధ్యమేనా అని అనుకుంటున్నారు కదా..సాధ్యం అని అనుకుంటే అసాధ్యం కాదేమో..అవును వేలు..లక్షలు..కోట్లు..ఖర్చు పెట్టి అట్టహాసంగా పలువురు పెళ్లిళ్లు చేసుకుంటున్న రోజులివి. ఇటీవలే ఓ ప్రముఖ వ్యాపారి తన కుమార్తె కోసం వందల కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ ఓ జంట మాత్రం రూ. 500తో తమ పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సలోని సిదానా 2013 బ్యాచ్ టాపర్. ఈమెది పంజాబ్. రాజస్థాన్ కు చెందిన ఆశిష్ వశిష్ట కూడా ఐఏఎస్ కు ఎంపికయ్యారు. వీరిదదరూ ట్రైనింగ్ కోసం ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో చేరారు. ఇక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరువాత సిదానా..ఆశిష్ లు ఇతర రాష్ట్రాల్లో పనిచేయడం ప్రారంభించారు. దూరం..రోజులు పెరుగుతున్న కొద్దీ వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలోపేతం అవుతూ వచ్చింది. చివరకు వివాహం చేసుకోవాలని ఆశిష్..సిదానాలు నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించారు. కానీ అట్టహాసంగా కాకుండా చాలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారంట. అంతేగాకుండా ఇదిలా ఉంటే పెద్దనోట్ల రద్దు వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని బింద్ కోర్టులో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఇందుకు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 28వ తేదీన కోర్టుకు అమ్మాయి, అబ్బాయి తరుపు బంధువులు వచ్చారు. చట్టపరంగా చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. కోర్టుకు ఫీజుగా కేవలం రూ.500 చెల్లించారు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. రూ.500తో వారి పెళ్లి జరిగిపోయింది. అదండి సంగతి...

10:05 - September 7, 2016

మెదక్  : జైలు..! నేరస్తులను ఇరవై నాలుగ్గంటలూ నాలుగ్గోడల మధ్యే బంధించే హాలు. బయట ప్రపంచంతో కించిత్తు సంబంధం కూడా లేకుండా..  కోర్టు ఉత్తర్వుల మేరకు నేరస్తులు శిక్షను అనుభవించే చోటు. నేరం చేసిన వారికే జైలు జీవితం. కానీ ఇప్పుడు ఎలాంటి తప్పు చేయని వారు కూడా..  జైలు జీవితం అనుభవించే  వెసులుబాటు ఉంది. ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు.. మెదక్‌ జైలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆ కథాకమామిషేంటో ఈ కథనంలో చూడండీ...
జైలు అంటే విభిన్న ప్రపంచం..
జైలు జీవితం అంటే.. నేరస్తుల పాలిట శాపం. నేరస్తులకు శిక్ష. చిన్నా చితకా నేరాలు మొదలు.. ఎంతటి ఘోరాలు చేసినా న్యాయస్థానాల్లో విధించిన శిక్షను అనుభవించే చోటే జైలు. జైలుకు వెళ్లిన ఖైదీలకు అదో విభిన్న ప్రపంచం. అక్కడి నియమాలు, నిబంధనలు బయటి ప్రపంచపు జీవనానికి ఏ మాత్రం పొంతన ఉండదు. అంతేకాదు... తిండి తినాలన్నా, నిద్రపోవాలన్నా అంతా కూడా జైలు నిబంధనల మేరకే ఉంటుంది. విలాసాలకు దూరంగా.. బంధువుల కులాసాలతో  సంబంధం లేకుండా.. స్వేచ్ఛకు దూరంగా నిందితులు, నేరస్థులు జీవించాల్సి వుంటుంది. 
అనుభవించిన వారికే తెలుస్తుంది జైలు జీవితం అంటే 
జైలు జీవితం.. దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ.. ఇప్పుడు సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని.. అది కూడా ఏ తప్పూ చేయకుండానే అనుభవించ వచ్చు. అవును. ఇటీవల జైళ్లశాఖ ఈ వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. అసలు జైలంటే ఎలా ఉంటుందో తెలియని వారికి.. జైలును చూసే... జైల్లో ఉండి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 
తెలంగాణ జైళ్లశాఖ వినూత్న  అవకాశం
జైల్లో ఖైదీలను ఎలా చూస్తారు.. వాళ్లకెలాంటి ఆహారం అందిస్తారు. బందిఖానాలో ఉన్నప్పుడు వారి దినచర్యలేంటి..? ఇలా.. మొత్తానికి జైలు జీవితం రుచి చూపించేందుకు తెలంగాణ జైళ్లశాఖ ఓ అవకాశాన్ని కల్పించింది. కాకపోతే.. జైలుకెళ్లాలనుకునే వాళ్లు చేయాల్సిందల్లా కొంత మొత్తం చెల్లించాలి. ఐదు వందల రూపాయలు చెల్లించిన వారెవరైనా సరే ఒక్కరోజు జైలు జీవితం అనుభవించవచ్చు. మామూలు ఖైదీల్లాగే గడుపుతూ అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. 
జైలు జీవితాన్ని పరిచయం చేస్తున్న సంగారెడ్డి జిల్లా పాత జైలు
డబ్బులు చెల్లించి జైలు జీవితం అనుభవించాలనుకునే వారెవరైనా మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి జిల్లా పాత జైలుకు వస్తే చాలు. జైలు జీవితం పరిచితమైపోతుంది. హైదరాబాద్‌కు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి జైలు సాలర్‌జంగ్‌ హయాంలో 1796లో నిర్మితమైంది. 1981లో  జైళ్ల శాఖ ఆధీనంలోకి తీసుకొని జిల్లా జైలుగా మార్చింది. పెరుగుతున్న ఖైదీలకు అనుగుణంగా ఈ జైలు సరిపోక పోవడంతో.. జిల్లా జైలును 2012  సంగారెడ్డి మండలంలోని కంది గ్రామ శివారుకు మార్చారు. పాత జైలు నిరుపయోగంగా మారడంతో.. జైళ్లశాఖ డీజీ వినయ్‌ కుమార్‌ సింగ్‌ ఈ సరికొత్త ఆలోచనకు ఓ రూపమిచ్చి... ఫీల్‌ ది జైల్‌ కార్యక్రమాన్ని రూపొందించారు. 
 మ్యూజియంగా మారిన చారిత్రక జైలు
సాధారణ పౌరులకు జైలు జీవితం అనుభవం కల్పించడం ద్వారా వాస్తవ పరిస్థితులపై అవగాహన పెరుగుతోందన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు.  చారిత్రక జైలును మ్యూజియంగా మార్చడం నిజంగా విశేషమే అంటున్నారు సంబంధిత అధికారులు.  
పురాతన కట్టడాల సోయగం..మెదక్‌ జిల్లా పాత జైలు 
మెదక్‌ జిల్లా పాత జైలు కేవలం ఖైదీల బందిఖానాయే కాదు.. అక్కడ తరచి చూస్తే చరిత్ర కూడా తెలుసుకునే వీలుంటుంది. పురాతన కట్టడాల సోయగం.. అప్పటి శిక్షా విధానం అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. మొత్తానికి ఒక్కరోజు జైలు జీవితం సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  
నేటి తరానికి ఎన్నో విశేషాలను అందిస్తున్న మెదక్ జైలు
మెదక్‌ జిల్లా పాత జైలు.. నేటి తరానికి ఎన్నో విశేషాలను అందిస్తోంది. జీవితంలో ఒక్కసారి కూడా జైలు ముఖం చూడని వారు.. ఒక్కసారైనా జైలు జీవితాన్ని చవిచూడాలనుకునే వారు.. ఈ జైలుకు వెళ్లి ఖైదీల శిక్షలు, వారికి అందించే భోజనం, జైలు గదులు... ఇలా మొత్తానికి ఖైదీల దినచర్యను ఆకళింపు చేసుకునే అవకాశం ఉంటుంది. జైలులో పురాతన వస్తువులు, ఫొటోలు, ప్రముఖులు ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు ఉపయోగించిన వస్తువులను సందర్శించే వీలుంది. సెల్‌లో జీవితానికి... స్వేచ్ఛా జీవితానికి తేడా ఏంటో ప్రత్యక్షంగా తెలుసుకునే వీలు ఇక్కడ కలుగుతోంది. 
జైలు గదుల్లో తెలంగాణ చరిత్ర
జైలు గదుల్లో పురాతన వస్తువులను  భద్రపచడంతో పాటు తెలంగాణ చరిత్ర, ఖైదీలకు విధించే శిక్షల గురించి కళ్లకు కట్టినట్లుగా చిత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి బయటకు జైలుగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం పర్యటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. 
జైలు గోడలపై చరిత్ర స్మృతులు
జైలు గోడలపై చరిత్ర స్మృతులు, నేరాలకు వేసే శిక్షల దృశ్యాలను కళాత్మకంగా చిత్రీకరించారు. నేరాలు చేసిన ఖైదీలకు కఠిన శిక్షలు అమలు చేయడం, కాళ్లు..చేతులకు సంకెళ్లు వేసి.. నడిపించడం, ఇనుప రింగులతో కూడిన బరువైన రాయిని భుజాలపై మోపి సెంట్రల్‌ టవర్‌ చుట్టూ ఖైదీలను తిప్పించడం, తిరగలిలో ధాన్యాన్ని పిండి చేయించడం లాంటి విషయాలపై అవగాహన కలిగే అవకాశం ఉంది. ఖైదీలకు సమాచారం, వినోదం కోసం 1901లో రేడియో వినే ఏర్పాటు చేశారు.  ఇక్కడి జైలులో చెక్కతో రూపొందించిన భారీ తాళం చెవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 
జైల్లో కచ్చితంగా పాటించాల్సిన  టైమ్ టేబుల్
జైలు మ్యూజియం. నిజమైన జైలు జీవితానికి ఏ మాత్రం తీసుపోకుండా.. అన్ని దినచర్యలు ఇక్కడ ఉంటాయి. జైల్లో పాటించాల్సిన టైమ్‌ టేబుల్‌ కచ్చితంగా ఇక్కడ కూడా ఉంటుంది.   ఒకరోజు ఖైదీలకు మంచి భోజనం, శుభ్రమైన బ్యారక్, దుప్పట్లను అందిస్తారు. ఆసక్తి గల వారికి వ్యాయమం యోగాతో పాటు కంప్యూటర్‌ శిక్షణనూ 
సంగారెడ్డి మ్యూజియం జైలులో ఒకరోజు ఖైదీలుగా ఉండేందుకు వచ్చే వారికి మంచి భోజనం, శుభ్రమైన బ్యారక్, నిద్రించేందుకు దుప్పట్లను అందిస్తారు.  టీ, టిఫిన్‌తో పాటు  సాధారణ ఖైదీల మాదిరిగా యోగా, క్రమశిక్షణను నేర్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచుతారు. 
వేకువ ఝామునే నుండే  దినచర్య
6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉంటుంది. 7.30 గంటలకు టీ తో పాటు టిఫిన్ ఇస్తారు. తర్వాత పరేడ్ నిర్వహిస్తారు. 8 నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం కార్యక్రమం, 9.30 గంటలకు మ్యూజియం పర్యవేక్షణ అధికారి రౌండ్‌కు వస్తుంటారు.  ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు భోజన సమయం. 10.30 గంటల నుంచి తిరిగి విద్యాదానం కార్యక్రమం కొనసాగుతుంది. 
టీ టైమ్ టూ లాకప్  
మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి, 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి విద్యాదానంలో భాగంగా ఖైదీల ఆసక్తిని బట్టి కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేసుకోవడం వంటి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత తిరిగి 6 గంటలకు లాకప్ చేస్తారు.
మరచిపోలేని అనుభూతులతో జైలు జీవితం
మొత్తానికి ఒక్కరోజు జైలు జీవితం తీక్షణంగా పరిశీలిస్తే జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరింకెందుకు ఆలస్యం.. మీకూ జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఉంటే ఛలో సంగారెడ్డి జైలు మ్యూజియం...!

 

Don't Miss

Subscribe to RSS - rs 500