rtc

07:22 - June 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో మరో కొత్త యూనియన్‌ ఏర్పాయింది. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఇపుడున్న తెలంగాణ మజ్దార్‌ యూనియన్‌ విఫలం అవుతోందని.. కొత్త యూనియన్‌ నాయకులు అంటున్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి. 

08:39 - June 16, 2017

హైదరాబాద్ : తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించడంపై దృష్టి పెట్టారు ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ పన్ను తక్కువగా ఉండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై కన్నేశారు. టూరిజంను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అరుణాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని కొంతమంది ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బస్సులను తిప్పుతున్నారు. అక్కడ స్లీపర్‌ సీట్ల విధానం అమలులో ఉండటం.. బస్ బాడీ నిర్మాణానికి కూడా తక్కువ ఖర్చు అవుతుండటంతో ట్రావెల్స్‌ యజమానులు అరుణాచల్‌ వైపు క్యూ కడుతున్నారు.

నెలలో ఒక్కసారైనా బస్సులు
నిబంధనల ప్రకారం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తే అక్కడకు నెలలో ఒక్కసారైనా బస్సులు వచ్చి వెళ్తుండాలి. అలా చేయక పోవడంతో అనుమానం వచ్చిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన ఇతర రాష్ట్రాల బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో మేల్కొన్న తెలంగాణ రవాణా శాఖ అధికారులు అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి వస్తున్న బస్సులను సీజ్‌ చేసే పనిలో పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ అయ్యి పలు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సులు 935 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో తెలంగాణకు చెందినవి సగంపైనే ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టి ఇతర రాష్ట్రాల బస్సులను ఇక్కడ తిప్పి ఆర్టీసి నష్టాలకు కారణం అవుతున్నారని కార్మిక నేతలు చెబుతున్నారు.

ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖ
టోల్‌గేట్ల వద్ద చెక్ పోస్టుల వద్ద సర్వే చేపట్టి అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాల వివరాలను రవాణా శాఖ అధికారులకు ఇచ్చినా స్పందన లేదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖా అధికారులు ప్రయివేటు బస్సుల వివరాలు తమ వద్ద లేవనే విచిత్ర సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పేరుతో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను రవాణాశాఖ అధికారులు నిలిపివేయాలనిఆర్టీసీ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు . 

12:59 - June 8, 2017

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకీ మంచి గుర్తింపు ఉండేది. ఆర్టీసీ కార్మికుల ఆర్ధిక అవసరాల కోసం 1952లో ఈ సొసైటీ ఏర్పడింది. ఈ సొసైటీ ద్వారా ఆర్టీసీ కార్మికులు రుణాలు తీసుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ పూర్తిగా స్వతంత్ర సంస్థ. దీనికి ఆర్టీసీ నుంచి కానీ... రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏవిధమైన ఆర్ధికసాయం అందడంలేదు. ఈ సంస్థను నడిపించేందుకు ఆర్టీసీ కార్మికులు ఒక కమిటీని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ప్రతిడిపో, ఇతర యూనిట్ల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా సభ్యుల ఎన్నికల జరుగుతుంది. ఎన్నికైన ప్రతినిధితులు మేనేజ్‌మెంట్‌ బాడీని ఎన్నుకుంటారు. దీనికి ఆర్టీసీ ఎండీ... చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈడీ స్థాయి అధికారి వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. సంస్థ కార్యకలాపాలు యావత్తు సెక్రటరీ నిర్వహిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి సెక్రటరీ గుండెకాయలాంటి వారన్నమాట.

పదవీ విరమణ తర్వాత కూడా పొస్టింగ్
ఆర్టీసీ కార్మికుల కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ కార్యదర్శి ఎంవీ నాగరాజుపై అవినీతి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఆర్టీసీ పాలనాపరంగా విడిపోయినప్పుడు నాగరాజు ఆర్టీసీ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి కార్యదర్శి అయ్యారు. గతేడాది ఆయన పదవీ విరమణ చేశారు. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదుకానీ..పదవీ విరమణ చేసిన నాగరాజును మళ్లీ కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో నాగరాజుకు వేతనం ఇస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అంతేకాదు.. రుణపరిమితికి మించి నాగరాజు రుణంపొందారని...ఆయన నియామకే చెల్లదంటూ కొన్ని సంఘాలు కోర్టుకెక్కాయి. రిటైర్డ్‌ అయిన వ్యక్తిని సహకారశాఖా నిబంధనల ప్రకారం తిరిగి నియమించే అవకాశం లేదని వాదించాయి.

విచారణ కమిటీ నివేదిక...
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిజాలను నిగ్గుతేల్చేందుకు ఓ విచారణ కమిటీని నియమించాలని సహకారశాఖను ఆదేశించింది. దీంతో విచారణ కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను సమర్పించింది. సెక్రటరీ నాగరాజు ప్రతిరోజు ఉదయం డబ్బులు తీసుకుని మధ్యాహ్నం తిరిగి జమచేసేవారని.. అలా 45 లక్షల మేర లావాదేవీలు జరిగాయని విచారణ కమిటీ తేల్చింది. ఇక నాగరాజు తీసుకుంటున్న వేతనం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేసింది. అతనికి ఇచ్చిన వేతనాన్ని రికవరీ చేయాలని నివేదికలో విచారణ కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం నాగరాజుకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం దుమారం రేపింది. విచారణ కమిటీ నివేదికతో తాము చేసిన ఆరోపణలన్నీ నిజమయ్యాయని ... అన్నిరకాలుగా నాగరాజు అక్రమాలకు పాల్పడ్డారని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన ఆర్టీసీ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశం రసాభాసగా మారింది. నాగరాజు అవినీతిపై కొంతమంది నిలదీశారు. నాయకులతో వాగ్వాదానికి దిగారు. నాగరాజును వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సెక్రటరీకి వెనుకేసుకొస్తున్న టీఎంయూ
ఇంతజరిగినా గుర్తింపు సంఘం మాత్రం నాగరాజును వెనుకేసుకొస్తోంది. కొంతమంది నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నారని... కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కంకణం కట్టుకున్నారని గుర్తింపు సంఘం నేతలు అంటున్నారు.వందలాది కోట్ల రూపాయల కార్మికుల సొమ్ముకు జవాబుదారిగా ఉండాల్సిన అధికారులకే అవినీతి మరక అంటడంతో కార్మికుల్లో ఆందోళన మొదలయింది. ఇలాంటి విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన యాజమాన్యం... అవినీతికి పాల్పడిన నాగరాజుకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం విమర్శలకు దారితీసింది.

07:58 - April 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీలో పొదుపు చర్యలు కార్మికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కార్యకలాపాల పరంగా వేర్వేరుగా ఉన్నా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు అధికారికంగా ఇంకా విడిపోలేదు. కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులకు మంగళం పాడే ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఏపిఎస్‌ఆర్టీసి అధికారులు. తాజాగా అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల్లో పదిహేను వేల వరకు పెన్షనబుల్‌ వేతనం ఉన్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే సంస్థ పీఎఫ్ జమచేస్తుంది. బేసిక్ పే, డీఏ కలిపి 15 వేలు దాటితే తన వాటా పీఎఫ్‌ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసి పీఎఫ్‌ బోర్డు సమావేశానికి తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం ఓ లేఖ రాసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
పూర్తికాని ఆర్టీసీ విభజన...
ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. ఇందులో యాజమాన్యం, కార్మిక సంఘాల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పిఎఫ్ కోత విధించడం వల్ల రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసిలకు ఆరువందల కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

17:21 - March 29, 2017

హైదరాబాద్ : నగరాలు మహానగరాలుగా మారుతున్నాయి. బస్సులు పెరిగిపోతున్నాయి. ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ.. ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు పెరగడం లేదు. నగరాభివృద్దిలో భాగంలో మోడ్రన్‌ బస్టాపులు నిర్మిస్తామన్నారు. బస్‌బేలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అవన్నీ ఉట్టి ప్రకటనలకే పరిమితమని తేలిపోయింది. ఓవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు బస్టాపులలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రయాణం అంటేనే భయమేస్తోంది. ఓవైపు పాడైన రోడ్లు.. మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే అదో పెద్ద సాహసంతో కూడుకున్న పని. సాధారణంగా బస్టాప్‌లలో గంటల తరబడి వేచి చూస్తే తప్ప ఆర్టీసీ బస్సులు దొరకని పరిస్థితి. అయితే.. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో బస్టాప్‌లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

యాడ్‌ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు
హైదరాబాద్‌లో ఏళ్లు గడుస్తున్నా బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రం పూర్తి కావడంలో లేదు. 2008లో ఆర్టీసీ బస్సు షెల్టర్ల నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది. నగరంలో మొత్తం 1832 బస్టాప్‌లు అవసరమని గుర్తించిన ఆర్టీసీ అధికారులు... ప్రతిపాదనలను బల్దియాకు పంపారు. యాడ్‌ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు గ్రేటర్‌ అధికారులు. అయితే.. బస్సు షెల్టర్ల నిర్మాణానికి ఐదు సార్లు టెండర్లు పిలిచినా కేవలం... 840 బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వివిధ ప్రాంతాల్లో బస్సు షెల్టర్ల నిర్మాణానికి యాడ్‌ ఏజెన్సీలు ముందుకు వచ్చినా.. ఎక్కడ ఎక్కువ ఆదాయం వస్తుందో అక్కడ మాత్రమే బస్సు షెల్టర్లు నిర్మించి మిగతావాటిని వదిలేశారు.

35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు పైగా ఉండడంతో ప్రయాణికులు బస్టాప్‌లలో నిలబడాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ నుండి రక్షణ కోసం చెట్లు, భవనాల నీడలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు బస్టాప్‌లలో క్షణం పాటు బస్సులు నిలపకపోవడంతో.. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 100 రోజుల్లో నగరంలో 50 ప్రాంతాల్లో బస్‌బేలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మెట్రో రైలు పనుల కారణంగా రోడ్డు వైడనింగ్‌లో ఉన్న బస్సు షెల్టర్లను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

16:48 - January 20, 2017

హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్‌.. మద్యంతాగి వాహనం నడపడం వంటి కారణాలో విలువైన ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. మందుబాబులకు ఎన్ని విధాల చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ మరోసారి మందుబాబులకు, మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గోషామహల్‌ ట్రాఫిక్ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాఫిక్స్‌ ఏసీపీ భద్రేశ్వర్‌ తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆయన తెలిపిన విషయాలను వీడియోలో చూద్దాం...   

09:42 - January 7, 2017

హైదరాబాద్: సంక్రాంతి పండుగ పది రోజుల ముందు నుంచే మహత్మాగాంధీ బస్టాండ్‌ ప్రయాణీకులతో రద్దీగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంక్రాంతి పండగ వాతావరణం ఏ మాత్రం కనిపించడం లేదు. ఎటూ చూసినా ప్రయాణీకులు లేక ప్లాట్‌ ఫామ్స్‌ వెలవెలబోతున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.

మహత్మాగాంధీ బస్టాండ్‌లో కనిపించని సంక్రాంతి వాతావరణం
సంక్రాంతి పండగంటే ఆ సందడే వేరు.. దూర ప్రాంతాల్లో ఉన్నవారు పండక్కి తమ సొంతుళ్లకు పయనమవుతారు. ప్రతి ఏడాది సంక్రాంతి పది రోజుల ముందుగానే బస్టాండ్లన్నీ ప్రయాణీకులతో రద్దీగా ఉంటాయి. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఓవైపు పెద్దనోట్ల రద్దు, మరోవైపు ప్రైవేటు బస్సుల పోటీ, ఇవన్నీ చాలవన్నట్లు అవసరానికి మించిన సర్వీసులు... వెరసి ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకులు వెళ్లకుండా చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా చిల్లర సమస్య అందర్నీతీవ్రంగా వేధిస్తోంది. దూర ప్రయాణాలు చేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ ఎఫెక్ట్‌ ఆర్టీసీపై చూపుతోంది.

ప్రైవేటు ట్రావెల్స్‌ పోటీని తట్టుకోలేకపోతున్న ఆర్టీసీ సంస్థ
ప్రైవేటు ట్రావెల్స్ పోటీని కూడా ఆర్టీసీ తట్టుకోలేకపోతుందననేది మరో వాదన. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ఆర్టీసీ కంటే టికెట్‌ రేటు ఎక్కువే ఉన్నా... ప్రయాణీకులు మాత్రం ప్రైవేటు బస్సులకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ప్రైవేటు బస్సు ట్రావెల్స్‌ ఆఫర్ల మీదా ఆఫర్లు ఇచ్చి ప్రయాణీకులను ఆకర్షించడంలో ముందుంటున్నాయి.

గతంతో పోల్చితే ఏడాది తగ్గిన ప్రయాణీకుల రద్దీ
సంక్రాంతి పండగ రోజున సొంత ఊర్లో పిల్లాపాపలతో గడపాలని చాలామంది కోరుకుంటారు. ఎన్ని ఇబ్బందులున్నా పండగను మాత్రం ఊర్లోనే జరుపుకోవడానికే ఇష్టపడుతారు. వారం రోజుల ముందైనా ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణీకులతో కళకళలాడుతాయన్న ఆశాభావంతో ఆర్టీసీ అధికారులున్నారు.

12:46 - January 2, 2017

50 రోజులు దాటినా కరెన్సీ సమస్య కుదురుకోలేదు. నోట్ల రద్దు తర్వాత దెబ్బతిన్న బిజినెస్ లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అసలే నష్టాలతో కుంటుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారినట్టే కనిపిస్తోంది. ఈ యాభై రోజుల్లో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు మరింత పడిపోయింది. నోట్ల రద్దు కారణంగా ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలన్న సూచనలొస్తున్నాయి. ఇదే డిమాండ్ పై ఎస్ డ బ్ల్యు ఎఫ్ (SWF) జనవరి3న అంటే రేపు నల్లబ్యాడ్జీలతో నిరసనకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఎస్ డబ్ల్యు ఎఫ్ నేత విఎస్ రావు విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

06:36 - November 25, 2016

హైదరాబాద్ : పెద్దనొట్ల రద్దు అంశం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తోన్న సంస్ధలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉహించని రీతిలో ఆర్టీసీలు నష్టాలు చవిచూస్తున్నాయి. 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా అన్నీ రంగాలు ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధలైన ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. అసలే..ఆర్థిక కష్టాలలో..నష్టాల నావను నెట్టుకొస్తున్నరెండు కార్పొరేషన్లు ప్రయాణికుల లేమితో మరింతగా నష్టాలను చవిచూస్తున్నాయి. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ ప్రకటన చేసిన నాటినుంచి నేటి వరకూ తీవ్రస్ధాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి.

ప్రతిరోజు రూ.60 లక్షలు నష్టం..
నవంబర్ 8 పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం తొలిరోజు టిఎస్ ఆర్టీసీ కోటిరూపాయలు నష్టాన్ని చవిచూడగా.. నాటి నుండి నేటి వరకూ ప్రతిరోజూ 60 లక్షల రూపాయల నష్టాన్ని నమోదుచేస్తూ వస్తోంది. ప్రయాణికులు చిల్లరదొరక్క తమతమ టూర్లను వాయిదా వేసుకుంటుండగా సుమారు ఈ 16 రోజుల్లోనే 1300 కోట్ల రూపాయలకు పైగా...నష్టాల్ని చవిచూసింది. మరికొంతకాలం ఇదే ఆర్థిక అస్థిరత ఉంటున్న నేపధ్యంలో పెద్దనోట్ల రద్దు వ్యవహారం టిఎస్ ఆర్టీసీకి కోలుకోలేని నష్టం తప్పదని అధికారులు వాపోతున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీకి ఇదే పరిస్ధితి..
మరోవైపు ఏపీలోకూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. జర్నీకి కావాల్సిన చిల్లర దొరక్క జనం తప్పసరి అయితేనే ప్రయాణీస్తున్నారు. దీంతో ఏపీలో కూడా అక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఏపీఎస్ఆర్టీసీ సైతం నష్టాలను చవిచూస్తొంది... ప్రయాణీకుల చిల్లర సమస్యలను తొలగించి అక్యుపెన్సీని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. నగదుతో నిమిత్తం లేకుండా ప్రయాణాలు జరిపేందుకు ఈ పాస్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ప్రయాణీకులు తమ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సహాయంతో టిక్కెట్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బస్టాండ్లు, లాంగ్ రూట్ బస్సులలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తున్నా భవిష్యత్తులో అన్నీ బస్సుల్లో...నగదు రహిత టిక్కెట్ పొందే విధానాన్ని అమలు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తొంది. సాధారణంగా నవంబర్ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో... ఆర్టీసీలో రద్దీ అధికంగా ఉంటుంది. కాకపొతే.. పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ సంస్ధలు భారీగా నష్టపోతున్నాయి. మరో నెలరోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుండటంతో... ఈ తరహా నష్టాలు భారీగా పెరిగే అవకాశం ఉందనీ అధికారులు అంచానా వేస్తున్నారు.

16:55 - November 19, 2016

హైదరాబాద్ : బస్టాండ్‌లు..కాంప్లెక్స్‌లు వెలవెలబోతున్నాయి.. బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి..చిల్లర సమస్య ఆర్టీసీకి భారంగా మారింది. అంతంత మాత్రం రెవెన్యూతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ... పెద్దనోట్ల రద్దుతో దిక్కుతోచన స్థితిలో పడింది.

చిల్లర సమస్యతో వెలవెలబోతున్న బస్టాండ్లు..కాంప్లెక్స్‌లు
రోజూ ప్రయాణికులతో కిటకిటలాడే మహాత్మాగాంధీ బస్టాండ్‌...ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. ప్రయాణికుల కోసం..బస్సులు ఎదురుచూస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిల్లరలేక ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు సంశయిస్తున్నారు. పాత నోట్లు ఆర్టీసీ బస్సుల్లో చెల్లుతాయని చెబుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని.. రోజువారి ఆదాయంలో 10 నుంచి 15 శాతం మేర నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

బస్సుల్లో చిల్లర ఇవ్వలేక ఇబ్బందిపడుతున్నామంటున్న కండక్టర్లు
బస్సుల్లో ప్రయాణికులు తెచ్చే 500 వందలు, వెయ్యి నోట్లకు చిల్లర ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నామని కండక్టర్లు.. చెబుతున్నారు. వీలైనంత వరకు సర్దుబాటు చేస్తున్నప్పటికీ... చిల్లర కష్టాలు మాత్రం పెద్ద తలనొప్పిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిల్లర లేక బస్సులు మధ్యలోనే దింపేస్తున్నారు : ప్రయాణీకులు
చిల్లర లేక అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు చేయడం లేదని.. కొన్ని బస్సుల్లో చిల్లర ఇవ్వడం లేదని.. చిల్లర లేక బస్సులు మధ్యలోనే దింపేస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు.పాతనోట్ల రద్దుతో కనీస అవసరాలు తీరడం లేదని.. అవసరమైన ప్రయాణాలు చేయడం లేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో ఆర్టీసీ కూడా సంక్షోభంలో పడింది.     

Pages

Don't Miss

Subscribe to RSS - rtc