rti

16:38 - October 12, 2017

హైదరాబాద్ : సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం. అవినీతి జలగల పాలిట అదో పాశుపతాస్త్రం. గోప్యత లేని సమాజం కోసం రూపుదిద్దుకున్న ఆ చట్టానికి నేటితో పన్నేండేళ్లు నిండాయి.   ఎన్నెన్నో విజయాలతో   మరెన్నో ఒడిదుడుకలతో... ముందుకెళుతన్న సమాచార హక్కు చట్టంపై 10టీవీ స్పెషల్ స్టోరీ.
అవినీతి, కుంభకోణాలను బయటకు తీసిన ఆర్టీఐ
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం... ఉపాధిహామీ చట్టం, అటవీ హక్కుల చట్టంతోపాటు సమాచారహక్కు చట్టం తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రజలు పోరాడి సాధించికున్నవే.  సమాచార హక్కు చట్టం ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి కారణంగా 2005లో అది చట్టరూపం దాల్చింది. అదే సంవత్సరం అక్టోబర్‌ 12న సమాచార హక్కుచట్టం కార్యరూపం దాల్చింది. ఈ చట్టం వచ్చి నేటికి సరిగ్గా 12ఏళ్లు పూర్తయ్యాయి.  ఈ 12ఏళ్లలో ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చట్టం తనదైన ముద్రవేసింది. అంతేకాదు అనేక అవినీతి చర్యలను, కుంభకోణాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
104 దేశాల్లో అమల్లో ఉన్న సమాచార హక్కుచట్టం
సమాచార హక్కుచట్టం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాల్లో అమల్లో ఉంది. అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, ప్రభుత్వాలు, వాటి అంగాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా, తద్వారా అవినీతి అరికట్టబడాలన్నా ఆయా అంశాలపై ప్రజలకు విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వాలు, ప్రభుత్వాంగాలు ఎలాంటి గోప్యత లేకుండా తాము చేస్తున్న  పనులు, వాటి వివరాలు, ఆయా సంస్థల విధులు, వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ చట్టం లక్ష్యం. 
సమాచార హక్కుచట్టంతో బయటపడ్డ పాలకుల అవినీతి
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి అనేక అవినీతి విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా వివిధ కుంభకోణాలు వెలుగుచూశాయి. అంతేకాదు.. సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అధికారులు పారదర్శకంగా నడుచుకోవడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. సమాచారాన్ని తెలుసుకోవడం, దానిని ప్రజలందరికీ తెలియజేయడం, ప్రభుత్వాలను , అధికారులను ప్రశ్నించే గొంతుకగా సమాచార హక్కుచట్టం నిలుస్తోంది. అప్పటికీ స్పందనరాకుంటే కోర్టులను ఆశ్రయించి , ఫలితాలు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు సమాచార హక్కు కార్యకర్తలు. ఈ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్న చాలామంది పలు కీలక అంశాలను వెలికితీసి ... పాలకులు, అధికారుల తీరును ఎండగడుతున్నారు. అక్కడక్కడ సమాచార హక్కు చట్టాన్ని పాలకులు, అధికారులు తొక్కిపట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారాన్ని అడిగినప్పుడు ఇవ్వకుండా,  లేదా తప్పుడు సమాచారాన్ని లేదా పాక్షిక సమాచారాన్ని ఇస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ నిత్యం ప్రజలకు అందించాల్సిన సమాచారంలో అలసత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఆర్టీఐ వినియోగిస్తున్న జర్నలిస్టులపై దాడులు
సమాచార హక్కుచట్టంలో అతిముఖ్యమైనది 4(1)(బి). ఈ సెక్షన్‌ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, తమకు వస్తున్న నిధులు, వారు చేస్తోన్న ఖర్చులు, పథకాల అమలు , వాటి లబ్దిదారులవంటి వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాలి. మొత్తంగా ఓ 17 అంశాలను ఎవరు అడిగినా, అడగకపోయినా స్వచ్చందంగా వెల్లడించాలి. అలా చేస్తే ప్రభుత్వ  కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. దీంతో దరఖాస్తులు కూడా తగ్గిపోతాయి. ఈ విషయాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చెయ్యడం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడానికి ఉపయోగపడుతుంది. సమాచార హక్కుచట్టం పలు అవినీతి అక్రమాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సమాచార హక్కు కార్యకర్తలపైన, ఈ హక్కును బాగా వినియోగిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు పెరుగుతున్నాయి.  దీనిని నిలువరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆర్టీఐపై అవగాహన కల్పించాలి..
సమాచార హక్కుచట్టం వచ్చి 12ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహనలే లేదు. ప్రభుత్వాలు, సమాచార కమిషన్లు ఈ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోగలుగుతారు. అప్పుడే అధికారుల్లో బాధ్యత, అవినీతిపరుల్లో భయం పెరుగుతుంది.

 

07:35 - October 12, 2017

సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం, గోప్యత లేని సమాజం దాని లక్ష్యం, అవినీతిపరులకు అదంటే భయం, అదే సమాచార హక్కు చట్టం, 2005లో వచ్చినా ఈ చట్టానికి 12 ఏళ్లు..ప్రస్తుతం ఈ చట్టం అమలు ఎలా వుంది? సాధించిన విజయాలు, రావాల్సిన మార్పులు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ రోజు జనపథం...ప్రధానంగా సమాచార చట్టాన్ని సమాచారం సేకరించటంలో చాలా ఇబ్బంది ఉంటుందని, జీహెచ్ఎంసీ ఆఫీస్ కు ఒక అప్లికేషన్ పెట్టామని కానీ ఎన్నో కారణాలు చెబుతూ తిరస్కరిస్తున్నారని, సమాచార హక్కు చట్టంతో 2జీ స్కామ్, కామన్ వెల్త్ స్కామ్ బయపడిందని, సమాచారం చట్టం వెబ్ సైట్ చూస్తే ఒక్క శాఖ కూడా సమాచారన్ని అప్ డేట్ చేయడంలేదని, సమాచారం చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందుతుందని, సమాచార హక్కు కార్యకర్త సాంబరెడ్డి అన్నారు.

13:50 - September 4, 2017

హైదరాబాద్ : కంచె చేనుమేసినట్లుగా..టీఎన్ జీవోస్ హౌసింగ్‌ సొసైటీ భూములను అధ్యక్ష, కార్యదర్శులే కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క సొసైటీ భూములే కాదు.. మరో 30 ఎకరాల భూమిని కూడా స్వాహా చేసేందుకు పెద్ద స్కెచే వేశారట. పెద్దల అండదండలతో ప్లాట్లను విక్రయించేందుకు విఫలయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుని కోర్టులో కేసు వేసినా.. ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు.  

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పలు ఇండస్ట్రీలు హైదరాబాద్‌ శివారులో ఏర్పాటు కావడంతో..కాటేదాన్‌ భూములు కోట్లు పలికాయి. దీంతో టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల భూములపై కబ్జాసురుల కన్నుపడింది. పక్కనే ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి 130 ఎకరాల్లో ప్లాట్లు చేశారు. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రెవెన్యూ అధికారులు టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీపై కేసు వేశారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. వాస్తవానికి కేసు కోర్టులో ఉన్నప్పుడు సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇందులో ప్లాట్ల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 

కాటేదాన్‌ టీఎన్‌జీఓఎస్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. పెంటయ్య నియామకంతోనే అక్రమాలకు తెరలేచినట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్లకోసారి హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నామమాత్రపు ఎన్నికలు నిర్వహించి ఆయనే ప్రధాన కార్యదర్శిగా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతని బంధువుల పేరు మీద 40 ప్లాట్లు ఈ సొసైటీలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగి అయిన పెంటయ్య సొసైటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాక కోట్లకు పడగెత్తాడన్న అరోపణలు ఉన్నాయి.

30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి ప్లాట్లు చేసిన సొసైటీ కమిటీ నిర్వాకాన్ని 2007లో సీపీఎం సభ్యులు నిలదీశారు.  ఈస్థలంలో 15 రోజులపాటు భూ పోరాటం చేశారు. పేదలతో గుడిసెలు వేయించగా.. వాటిని రెవెన్యూ అధికారులు, పోలీసులు తొలగించారు. 37 మంది సీపీఎం నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కబ్జాకోరులనుంచి తమ భూములను కాపాడాలని టీఎన్జీవో సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

 

13:35 - September 4, 2017
12:50 - September 4, 2017

హైదరాబాద్‌ : నగరంలోని ఏవీ కాలేజీ అక్రమాలకు నిలయంగా మారిపోయింది. సొసైటీ పేరుతో నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేయని పనులు చేసినట్లుగా చూపించి కోట్లు దండుకున్న వైనం బయటపడింది. ఫార్మసీ కాలేజీ పేరుతో బిల్డింగ్‌ కట్టకపోయినా కట్టినట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. ఆర్టీఐ చట్టం ద్వారా రూ.5.5 కోట్లు అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లోతుగా దర్యాప్తు చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని పలువురంటున్నారు. అయితే.. సొసైటీలో పేరున్న నేతలు ఉండడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏవీ కాలేజీ అక్రమాలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే... పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:58 - June 17, 2017

కాగజ్ నగర్ : అతనొక మామూలు స్కూల్‌ టీచర్. సమాజ సేవ చేయాలనే పట్టుదలతో.. అక్రమార్కులకు దడ పుట్టించాడు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్‌తో ప్రభుత్వ సొమ్మును.. ఏకంగా 20 కోట్లు రికవరీ చేయించాడు. తప్పుడు మెడికల్ బిల్లులతో ప్రభుత్వానికి టోపీ వేసిన అధికారుల గుట్టు రట్టు చేశాడు. తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ప్రభుత్వ టీచర్‌ పై 10 టీవీ ప్రత్యేక కథనం.

సమాజానికి మంచి చేయాలంటే

సమాజానికి మంచి చేయాలంటే నాయకులే కానక్కర్లేదు. అవినీతిని అణగదొక్కాలంటే అసాధ్యుడే కానక్కర్లేదు. మనస్సులో దేశం పట్ల ప్రేమ.. సమాజం పట్ల బాధ్యత ఉంటే చాలని నిరూపించాడు ఒక స్కూల్‌ టీచర్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన మహ్మద్‌ అష్రఫ్‌.. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు అనుభవించి.. ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ..ప్రభుత్వ పథకాలపై దృష్టి పెట్టాడు. ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డాడు. ఇప్పటివరకు అష్రఫ్‌ ప్రభుత్వ శాఖలలో జరిగిన అక్రమాలను.. ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా బయటకు తీసి దాదాపు 20 కోట్లను ప్రభుత్వానికి రికవరీ చేయించాడు. బెస్ట్‌ ఆర్టీఐ యాక్విస్ట్‌గా అవార్డు కూడా తీసుకున్నాడు.

ఇంగ్లిష్ స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌ అష్రఫ్‌

మహ్మద్‌ అష్రఫ్‌ సిర్పూర్‌ మండల కేంద్రంలోని.. జిల్లా పరిషత్ స్కూల్లో ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పేదలు, గిరిజనుల సాధక బాధకాలు తెలిసిన ఈ టీచర్‌.. 2004లో జాగృతి యువమంచ్‌ సేవ సంస్థను స్థాపించారు. ఎన్నో ఉపయోగకరమైన సేవలు మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆర్టీఐ యాక్ట్‌ రావడంతో అతనికి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసే గొప్ప అవకాశం దొరికింది. 2006 నుంచి ఇప్పటివరకు కొన్ని వందల ఆర్టీఐ సమాచార లెటర్స్‌ వేశాడు. ఎన్నో అక్రమాలను బయటకు తీశాడు. ఫేక్‌ మెడికల్ బిల్లుల విషయం ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటకు తీయటం అప్పట్లో సంచలనం రేపింది. ఒకేసారి 2 కోట్లు రికవరీ చేశాడు. ఆ కేసులో కాగజ్‌నగర్‌ మండలం దరిగాం లాంటి మారుమూల గిరిజన గ్రామానికి మెటల్‌ రోడ్డు సౌకర్యం వచ్చేలా చేశాడు.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌

ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌లలోని మున్సిపల్‌ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వచ్చేలా పోరాటం చేశాడు. ఇలా ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా ప్రతీ ప్రభుత్వ శాఖలలో అక్రమాలు బయటకు తీసి.. 20 కోట్ల రూపాయలు రికవరీ చేయించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు, పదికి పైగా అవార్డులు, ఉత్తమ ప్రభుత్వ టీచర్‌ అవార్డులను అందుకున్నాడు.

అష్రఫ్‌ తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో

అష్రఫ్‌ తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కాగజ్‌నగర్‌ పెట్రోల్‌ పంప్‌ ఏరియాలోని మండల పరిషత్ స్కూల్లో వీరి పిల్లలు చదవడంతో.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా చేర్పించేందుకు కృషి చేస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఎన్నో ఇబ్బందులు, తరచూ బెదిరింపులు

ఇంతటి సుదీర్ఘమైన పోరాటంలో మహ్మద్‌ అష్రఫ్‌ ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకున్నాడు. కొందరు అక్రమార్కులతో ఎన్నో ఇబ్బందులు, తరచూ బెదిరింపులు, పోలీసు కేసులు, దాడులను సైతం జయించి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఎవరైనా సలాం చెప్పాల్సిందే.

16:27 - February 11, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ భార్య జశోదా బెన్‌ మరోసారి ఆర్టీఐ కార్యాలయం మెట్లెక్కారు. జశోదా బెన్‌ పాస్‌పార్ట్‌ కోసం గత సంవత్సరం దరఖాస్తు చేసుకోగా.. అందులో మోడీతో పెళ్లైనట్లుగా డాక్యుమెంట్లు లేవంటూ సంబంధిత అధికారులు పాస్‌పోర్టును గత నవంబర్‌లో తిరస్కరించారు. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ తన పాస్‌పోర్ట్‌లో భార్యకు సంబంధించి ఎలాంటి వివరాలు పొందుపరిచారో తెలపాలంటూ జశోదా బెన్‌ ఆర్టీఐ అధికారులను కోరారు.  

16:36 - November 13, 2015

విశాఖ : ఆంధ్రయూనివర్సిటీ మరోసారి వివాదాలకు కేంద్రమైంది. యూనివర్సిటీ పెద్దలు చేసిన తప్పుడు పనులు మరోసారి మచ్చతెచ్చాయి. ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తూ యూనివర్సిటీ పరువు తీస్తోంది యాజమాన్యం.
ఏయూలో అవకతవకలు
చరిత్ర కలిగిన ఆంధ్రయూనివర్సిటీలో అవకతవకలకు కొదవ లేదు. ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రమోషన్‌ విషయంలో తలెత్తిన వివాదం వర్సిటీ పరువును బజారుకీడ్చింది. చివరకు సమాచార హక్కు కమిషన్‌ ఎదుట దోషిగా నిలబడ్డారు రిజిస్ర్టార్‌ ఉమామహేశ్వరరావు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న జాన్ అనే వ్యక్తిని అనర్హునిగా భావిస్తూ 2002లో ఉద్యోగం నుంచి తొలగించారు. అదే వ్యక్తికి 2006లో తిరిగి ఉద్యోగం ఇచ్చారు అప్పటి విసి. పైగా ఫ్రొఫెసర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఈ విషయమై ఆర్టీఐలో ఉత్తరాంధ్ర సమాచారహక్కు సంఘం కన్వీనర్‌ రమణ ఫిర్యాదు చేశారు. అనర్హునిగా ఉద్యోగమివ్వడమే కాకుండా ప్రమోషన్‌ కూడా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
రిజిస్ట్రార్‌పై ఆర్టీఐ మండిపాటు
ఫిర్యాదుదారుడు రెండుసార్లు అప్పీలుకు వెళ్లినా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయమై ఏయూ రిజిస్ట్రార్‌పై ఆర్టీఐ మండిపడింది. సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న రిజిస్ట్రార్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీఐ సిద్ధమైంది. మరోవైపు జరిగిందంతా నిజమే అయినా ప్రొఫెసర్‌ జాన్‌ నియామకంలో తప్పేమిటని రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. సర్వీస్‌ రిజిస్టర్‌, మరికొన్ని పత్రాలను ఆర్టీఐ అడిగినా ఇవ్వలేమంటున్నారు. ఇదిలా ఉంటే తన నియామకంలో ఏమైనా అవకతవకలు జరిగుంటే రాజీనామా చేస్తానని ప్రొఫెసర్‌ జాన్‌ అన్నారు. నిబంధనల ప్రకారం తన నియామకం, ప్రమోషన్‌ జరిగిందని చెప్తున్నారు.
వర్సిటీ యాజమాన్యంపై అనుమానాలు
ఈ మొత్తం వ్యవహారంలో వర్సిటీ యాజమాన్యంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సమాచార హక్కు కమిషన్‌ ఆదేశాలను పక్కన పెట్టి, తగిన సమాచారం ఇవ్వకుండా ఎందుకు దాటవేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్‌ను తిరిగి నియమించడంలో జరిగిన తప్పిదంపై విచారణ జరిపించడానికి ఏయు విసి ఎందుకు దృష్టి సారించడంలేదనేది మరో ప్రశ్న తలెత్తుతోంది.

 

13:42 - October 16, 2015

ఢిల్లీ : అన్ని రంగాల్లోనూ పారదర్శకత ఆవశ్యకమని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. కేంద్ర సమాచార కమిషన్‌ దశాబ్ద కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సులో మోడీ ప్రసంగించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకి భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానించలేదు. దీంతో ఆర్టీఐ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్టీఐ యాక్టివిస్టు అరుణా రాయ్‌ సైతం ఈ సదస్సుకి హాజరుకాలేదు. పారదర్శక చట్టంపై నిర్వహించిన ఈ సదస్సును లోకేష్ బత్రా, వెంకటేష్‌ నాయక్‌, అంజలి భరద్వాజ్‌, నిఖిల్‌ డే బాయకాట్‌ చేశారు.

 

21:04 - October 15, 2015

ఒక్క చట్టం..ఒకే ఒక చట్టం..స్వతంత్ర భారతావనిలో చీకటి కోణాలను బయటకు లాగిన చట్టం..అవినీతి పాలకులు..అధికారుల నుండి..ధన దాహంతో ఉన్న స్వార్థపరులేకాక అందరి భరతం పట్టే చట్టం. సమాచార హక్కు చట్టం. అదే ఆర్టీఐ. అమల్లోకి వచ్చి పదేళ్లు అయ్యింది. ఈ చట్టం ఏం చేసింది ? ఏం సాధించింది ? ఎవరికి బలాన్ని ఇచ్చింది. ? ఎవరి బలాన్ని దెబ్బతీసింది ? దీనిపై ప్రత్యేక కతనం. ఎంతో రక్తం ప్రవహించింది. ఈ పదేళ్ల కాలంలో ఎందరో కార్యకర్తలు బలైపోయారు. నిజం తెలుసుకోవాలన్న ఆకాంక్ష కోసం నిజాలను వెలికి తీయాలన్న ఆశయం కోసం స్వార్థపరుల గుట్టు రట్టు చేయాలన్న ఆరాటం కోసం ఎందరో తమ ప్రాణాలను కోల్పోయారు. అయినా సమాచార చట్టం మరెందరికో ఆయుధంగా మారింది.

ఏం జరుగుతుందో తెలుసుకోండి..
ఏం జరగుతుందో తెలుసుకోండని సామాన్యుల నుండి అసామాన్యుల కార్యకర్తల దాక అందరినీ ప్రోత్సాహించింది. ఆర్టీఐ ఆయుధంతో మెడికల్ స్కాంను గుట్టు విప్పండి. పాలకుల కప్పి పుచ్చిన కుంభకోణాలను వెలికి తీశాడు. ఎందరో ఆర్టీఐ కార్యాకర్తలు ప్రాణాలకు తెగించి సమాచార చట్టంతో ఎన్నో సంచనాలను సృష్టించారు. ఇప్పటి వరకు ఆర్టీఐ చట్టం ద్వారా ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో అవినీతి రాక్షసుల భరతం పట్టడానికి ఎవరు కంకణం కట్టుకుంటారో వారే నిజమైన దేశభక్తులు. అలాంటి వారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. ప్రాణాలకు తెగించి అవినీతిని కడిగేశారు. సమాచార హక్కు చట్టం ఆయుధాన్ని తీసుకుని రాజకీయ రాబంధులను గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఈప్రయత్నంలో కొందరు అవినీతి పరుల చేతిలో బలయ్యారు.

అవినీతి పరుల పాలిట పాశుపతాస్త్రం..
అక్రమాలకు వెలుగెత్తినందుకు ఇంత మంది బలయ్యారు. సమాచార హక్కు చట్టం ఆధారంగా రుజువులు సంపాదించినందుకు కార్యకర్తలు దాడులను ఎదుర్కొన్నారు. అసలు ఈ సమాచార హక్కు చట్టం ఎలా ఉంటుంది ? దాని సాయంతో ఎలాంటి సమాచారం పొందవచ్చు ? సమాచారం అడిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ? వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు ? సమాచార హక్కు చట్టం అవినీతి పరుల పాలిట పాశుపతాస్త్రం. ఇందులో మరో ప్రశ్నకు తావు లేదు. కానీ చట్టం మాత్రం ప్రజల చుట్టమే కావాలి. కానీ చట్టం వచ్చి పదేళ్లు అవుతున్నా ప్రజల్లో ఇంకా అలసత్వం పోలేదు. అధికారులను ప్రశ్నించడానికి చట్టానికి వాడుకోవడంలో విఫలమవుతున్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు..స్వచ్ఛం సంస్థలు..కృషి చేయాలి. ఆర్టీఐ కార్యాకర్తల చంపేసిన అవినీతి రాబందుల బోనెక్కించాలి. ఆర్టీఐ ఉద్యమకారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - rti