Sangareddy News Updates

17:47 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా ముత్తంగి జాతీయ రహదారిపై T.N.S.F ఆధ్వర్యంలో ఆర్.ఆర్.ఎస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు రాస్తారోకో చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి... తరగతులు నిర్వహించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్ధులను అదుపులో తీసుకున్నారు.

 

17:45 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:31 - July 9, 2018

హైదరాబాద్ : జంట నగరాల్లోని కాలుష్యకారక పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, భునగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 ప్రాంతాలకు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత కాలుష్యకారక పరిశ్రమలను తరలిస్తామని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పర్యటనలో మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

పాశమైలారంలో కేటీఆర్ పర్యటన
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలుష్యకారక పరిశ్రమల తరలింపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

మొత్తం 1122 కాలుష్యకారక పరిశ్రమలు గుర్తింపు
జంట నగరాల్లో భారీగా కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించారు. వీటి తరలింపునకు సంబంధించిన అధ్యయనం కూడా పూర్తైంది. కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు గుర్తించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పించిన తర్వాత ఈ కార్యక్రమం చేపడతారు. మొత్తం 1122 కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నట్టు లెక్కతేలింది. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యంతో భూగర్భజలాలతోపాటు పర్యావరాణానికి తీవ్ర ముప్పువాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ఒక్కటే మార్గమని నిర్ణయించింది. వీటిలో ఎక్కువ భాగం ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మొత్తం 283 కాలుష్యకారక ఫార్మా పరిశ్రమలను రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో అభివృద్ధి చేస్తున్న ఫార్మా సిటీకి తరలిస్తారు.

కాలుష్య పరిశమ్రలను తరలించేందుకు 17 ప్రాంతాలకు గుర్తించాం -కేటీఆర్‌
కాలుష్యకారక పరిశ్రమలను అవసరమైనే మూసివేయడానికి కూడా వెనుకాడబోమని కేటీఆర్‌ హెచ్చరించారు. కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు 17 ప్రాంతాలను గుర్తించారు. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ... ఈపీటీఆర్‌ఐ.. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల ఈ ప్రాంతాలను గుర్తించింది. కాలుష్యకోరల నుంచి ప్రజలను రక్షించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నకేటీఆర్‌.. పరిశ్రమల తరలింపునకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. 

07:02 - July 9, 2018

సంగారెడ్డి : పారిశ్రామికంగా తమ ప్రాంతం అభివృద్ధి కావాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరూ.. దానివల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశిస్తారు. కానీ.. అవే పరిశ్రమలు తమకు ప్రాణాంతకంగా మారాయని ఆవేదన చెందుతున్నారంటే.. అంతకంటే విషాదం వేరే ఉండదు. సంగారెడ్డి జిల్లా మండల ప్రజలు ఇప్పుడు అలాంటి దుస్థితిలోనే జీవిస్తున్నారు.. ఇంతకీ వారు పరిశ్రమల వల్ల పడుతున్న బాధలేంటో ఓ సారి చూద్దాం.. మీరు చూస్తోంది కోహీర్‌ మండలం గద్వాల్‌లోని పిరామిల్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమ. ఈ పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో చిలికేపల్లి, కవేలి, చింతల్‌ఘాట్, అనంతసార్, చిలమామిడి గ్రామాల ప్రజల జీవనం దుర్భరంగా మారింది. జల, వాయు కాలుష్యంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయి. ఎక్కడ బోర్లేసినా.. తాగడానికి పనికి రాని నీరే వస్తోంది.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పరిశ్రమనుంచి వచ్చే వ్యర్థ జలాలను భూమిలోకి ఇంకిపోయేలా చేయడం వల్లే ప్రజలకు జీవనం అస్తవ్యస్తంగా మారింది. గత ఇరవై ఏళ్ళుగా కాలుష్య విధ్వంసంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఈ పరిశ్రమ విస్తరణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. విస్తరణకు ప్రభుత్వం అనుమతిస్తే.. మా జీవితాలు మరింత దుర్భరంగా మారతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కలుషిత గాలితో ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఊర్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక తాగడానికి మంచినీరే కరువైంది. ఇలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా జీవించాలంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. విపరీతంగా కాలుష్యం వ్యాపిస్తున్నా.. స్పందించని అధికారులపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

పరిశ్రమల యాజమాన్యాల దృష్టి వార్షిక ఉత్పత్తి పెంచుకోవడం, లాభాలను గడించడంపైనే తప్ప అక్కడి ప్రజల జీవన స్థితిగతుల గురించి పట్టించుకోవడంలేదు. పైగా పరిశ్రమల విస్తరణకు పూనుకుంటున్నారు. ఇలాగైతే మా బతుకులేం కావాలని నిలదీస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడాలి కానీ... వారి జీవితాలే ప్రమాదంలో పడటం చాలా విషాదం. స్వలాభం మాత్రమే ఆశించే యాజమాన్యాలు, ఆగమేఘాలమీద అనుమతులిచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

10:48 - July 8, 2018
19:38 - July 5, 2018

మెదక్ : ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు..పర్భనీ శక్తి అనే కొత్తరకం జొన్నవంగడాన్ని సృష్టించారు. పదిహేనేళ్ల కృషి మూలంగా వచ్చిన ఈ వంగడం దేశంలోని పేద రైతులకు వరమని, అత్యంత పోషక విలువలున్న ఈ జొన్న అందరికీ అందుబాటులో వచ్చే విధంగా కృషి చేస్తామంటున్న ఇక్రిశాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అశోక్ కుమార్ తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:58 - July 3, 2018

సంగారెడ్డి : కేంద్రంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు అనే తేడా లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. వివిధ భవనాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాలతోపాటు అసైన్డ్‌ భూములనూ ఆక్రమిస్తున్నారు. ఆక్రమించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న భూ అక్రమణలపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.

సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న అక్రమార్కులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం జోరుగాసాగుతుంది. దీంతో పట్టణంలోనే కాక చుట్టుప్రక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించి.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భూములు అనే తేడా లేకుండా విచ్చిలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపడుతూ కోట్లు గడిస్తున్నారు. సంగారెడ్డిలో గల సర్వే నెంబర్ 159/AA2తో పాటు మరికొన్ని సర్వేనెంబర్లలో ఉన్న 244 ఎకరాల భూమిని సాగుకోసం ప్రభుత్వం దళితులకు ఇచ్చింది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో.. జాతీయ రహదారికి సమీపంలో ఈ భూమి ఉంది. ఈ భూమిని కొంత మంది అక్రమార్కులు ఆక్రమించి.. నిర్మాణాలు చేపట్టారు.

పోతిరెడ్డిపల్లి భూమిలో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు
పోతిరెడ్డిపల్లిలో గల మరో భూమిలో అక్రమనిర్మాణాలు యథేచ్చగా జరుగుతున్నాయి. బాల్‌రాజు అనే ఓ వ్యక్తి ఈ భూమిలో ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించారు. ఈ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణంలో 24 గుంటల అసైన్డ్ భూమి ఉంది. దీన్ని గుర్తించిన అధికారులు బాల్‌రాజ్‌కు నోటీసులు ఇచ్చారు. అధికారుల నోటీసులతో బాల్‌రాజ్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అయితే కోర్టు తీర్పుకు లోబడి తాను వ్యవహరిస్తానని బాల్‌రాజ్‌ అంటున్నారు.

12 ఎకరాల అసైన్డ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు గుర్తింపు
ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో సుమారు 12 ఎకరాల అసైన్డ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలసినట్లు అధికారులు గుర్తించారు. అసైన్డ్‌ భూములని గుర్తించిన అధికారులు అక్రమార్కులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీంతో పట్టణ ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల్లో చలనం లేకపోవటంపై భిన్నాభిప్రాయాలు
అక్రమాలపై అధికారుల్లో చలనం లేకపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గి అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా అనే అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతపెద్ద నిర్మాణాలకు అనుమతులు ఎవరిచ్చారు అనే ప్రశ్నలు కూడ వెల్లువెత్తున్నాయి. వీటిపై స్పందించిన అధికారులు విషయాన్ని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై ఈ భూ అక్రమాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.

12:48 - July 1, 2018

సంగారెడ్డి : కొత్త కొత్త రుచుల కోసం ప్రజలు రెస్టారెంట్లు, దాబాలపై వైపు వెళ్లడం ఇప్పుడు సహజంగా మారింది. వీకెండ్ వచ్చిదంటే చాలు...  కుటుంబం అంతా బయటి ఫుడ్ ను అస్వాదించడానికే ఆసక్తి చూపుతున్నారు. కాని సంగారెడ్డిలోని పలు హోటల్స్‌, రెస్టారెంట్స్, దాబాలు, తోపుడు బండ్లు.... ఎక్కడ చూసిన ఆహార పదార్ధాలను కల్తీ చేస్తున్నారు. ప్రజలు డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు.  ఆహార పదార్థాలు కల్తీమయం అవుతుంటే .. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏమైనట్లు?  ప్రజారోగ్యం పాడవుతోంటే ఆహార తనిఖీశాఖ ఏం చేస్తోంది? 
జంతు కళేబరాల నుండి తీస్తున్న నూనెలను వాడుతున్న హోటల్స్‌ 
బీజీ లైఫ్ తో ప్రజలు కొత్త రుచుల కోసం రెస్టారెంట్స్ ,దాబాలకు వెళ్తున్నారు.  వీకెండ్ వచ్చిదంటే చాలు కుటుంబ సభ్యులు అంతా కలిసి హోటల్ ఫుడ్స్‌ను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. భిన్నమైన వంటకాల రూచి చూసేందుకు  ఇంట్రెస్ట్‌ కనబర్చుతున్నారు. అయితే జనాల అవసరాన్ని ఆసరా చేసుకుని సంగారెడ్డి జిల్లాలో పలు హోటల్స్‌, రెస్టారెంట్స్‌, దాబాలు ఆహార పదార్థాల కల్తీలకు పాల్పడుతున్నాయి. నూనె, ఉప్పు,పప్పు, కారం ఇలా ప్రతీదాన్ని కల్తీమయం చేసేస్తున్నాయి.
వందల సంఖ్యలో దాబాలు  
సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని జాతీయ రహదారి వెంట దాబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అందులో ఆహార పదార్ధాలు ఎలా తయారువుతున్నాయి, ఏ ఏ మిశ్రమాలతో మన మందుకు వస్తున్నాయి, అన్న అలోచన ఎవరూ చేయడం లేదు.  కొన్ని రోజుల కిత్రం అనేక హోటల్స్‌  జంతు కళేబరాల నుండి తీస్తున్న నూనెలను వాడుతూ దొరికిన సందర్భాలు ఉన్నాయి.  హోటల్ యాజమాన్యాలు  కల్తీ నూనెలు, ఉప్పు, పప్పు, కారం ఉపయోగిస్తూ లాభాలను అర్జిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.  ఆహార పదార్థాల కల్తీతోపాటు హోటల్‌ సిబ్బంది ఆహార పదార్థాల తయారీ విషయంలో శుభ్రతను అసలు పట్టించుకోవడం లేదు.  హోటల్‌ ముందు అలంకరుణ అద్భుతంగా ఉంటుననా... లోన కిచెన్‌మాత్రం పరమ చెత్తగా దర్శనమిస్తున్నాయి.  ఒకవైపు ఆహార కల్తీ... మరోవైపు అపరిశుభ్రతతో... హోటల్‌కు వచ్చే జనం గుప్పెడు రోగాలను వెంటబెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయితే హోటల్‌ నిర్వహణ ఇలా ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ఆహార తనిఖీ శాఖ ఏం చేస్తున్నట్టు? 
హోటల్స్‌, రెస్టారెంట్లలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... ఆహార తనిఖీ శాఖ ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి  మెదక్ జిల్లాకు ఒకే ఒక ఫుడ్ ఇన్స్ పెక్టర్ ఉన్నారు.  అసలు రాష్ట్రం మొత్తం కలిపి కేవలం ఆ శాఖకు వివిధ హోదాలతో 13 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. అయితే ఇంత పెద్ద రాష్ట్రంలో ఆహార తనిఖీ శాఖ దుస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రమైన కర్నాటక లో 550 మంది ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్‌ నిత్యం ఆహార తనిఖీలు చేస్తూ కల్తీ ఆహారాన్ని అరికట్టే పనిలో ఉంటున్నారు.  పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆహార తనిఖీశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కనీసం ఐదు మండలాలకు ఒక ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ను  నియమించి విస్తృత తనిఖీలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని బహిరంగంగా దెబ్బతిస్తున్న హోటల్స్‌, దాబాలు, రెస్టారెంట్లపై  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

10:41 - June 30, 2018

సంగారెడ్డి : జిల్లాలోని జోగిపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో 100 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన ధృవ పత్రాలు లేని 15 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త వ్యక్తులు జోగిపేటకు వచ్చారనే సమాచారంతో ఈ కార్డన్ సర్చ్‌ నిర్వహించామన్నారు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని.. పాత నేరస్థులు ఎవరైనా ఉన్నారా అనే సమాచారం సేకరించామని ఎస్పీ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో నిరంతరం ఈ కార్డన్ సర్చ్‌ నిర్వహిస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 

07:23 - June 20, 2018

మెదక్ : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గంజాయి దందా యధేచ్చగా సాగుతోంది. యువతను, విద్యార్థులే లక్ష్యంగా స్మగ్లర్లు గంజాయిని విక్రయిస్తున్నారు. గంజాయి దందాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతోన్న గంజాయి దందాపై స్పెషల్‌ స్టోరీ..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. అక్రమంగా గంజాయి విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. నారాయణఖేడ్‌ ప్రాంతం ఒకప్పుడు గంజాయి సాగుకు, రవాణాకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే అదే ప్రాంతంలో గంజాయి సాగు ఇప్పుడు దాదాపుగా కనుమరుగై పోయింది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక నుంచి దొడ్డిదారిన స్మగ్లర్లు మెదక్‌ జిల్లాకు చేర్చుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ మహానగరానికి కూడా ఇదే ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. గడిచిన వారంలో రోజుల్లో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈనెల 12న జహీరాబాద్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల దగ్గర గంజాయి అమ్ముతూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. విచారణలో వాళ్లు వెల్లడించిన విషయాలు విస్మయాన్ని కలిగించాయి.

జహీరాబాద్‌లోని నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠా సభ్యులు విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని జహీరాబాద్‌ టౌన్‌ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. గంజాయి అమ్మకందారులు ఒక్క నారాయణఖేడ్‌కే పరిమితం కాలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాలపైనా కన్నేశారు. పటాన్‌చెరు, పాశమైలారం, జిన్నారం, ఇస్నాపూర్‌ పారిశ్రామిక వాడల్లో కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కార్మికులకు గంజాయిని చేరవేస్తున్నారు. సంగారెడ్డిలోని శాంతినగర్‌లో ఓ పాఠశాల దగ్గర కూడా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లా అంతటా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు వరుస ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో వందమంది గంజాయి స్మగ్లర్లను, విక్రయదారులను ఎక్సైజ్‌శాఖ అరెస్ట్‌ చేసింది. అయినా పారిశ్రామిక ప్రాంతాలను, విద్యా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఇంతగా విస్తరించినా ఈదందాను అరికట్టేందుకు ఎక్సైజ్‌శాఖ నిఘాను కఠినతరం చేయాల్సిన అవసరమైతే ఉంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తుందా .. లేదా అంటే ఏమీ చెప్పలేం.

సరిహద్దు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. దీంతో స్మగ్లర్ల పని సులువు అవుతోంది. సరిహద్దు దాటిన గంజాయిని నిర్మానుష్య ప్రాంతంలో ఉంచి అక్కడి విక్రయిస్తున్నారు. 50 గ్రాముల నుంచి కిలో వరకు ప్యాకెట్లుగా చేసి వివిధప్రాతాలకు తరలిస్తున్నారు. యాబై గ్రాముల ప్యాకెట్‌ ధర వంద రూపాయాలుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి దందాను పూర్తిగా అరిక్టకపోతే ముఖ్యంగా యువకులు, విద్యార్థులు పూర్తిగా చెడు వ్యసనాలకు అలవాటుపడే అవకాశం ఉంది.

Don't Miss

Subscribe to RSS - Sangareddy News Updates