social justice

21:29 - April 20, 2017

హైదరాబాద్: అంబేద్కర్‌, జ్యోతిరావుపూలే ఆశయ సాధన కోసం మహాజన సమాజం ఆవిర్భవించిందని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. మహాజన సమాజం గౌరవ అధ్యక్షుడుగా గద్దర్‌ను ఎన్నుకున్నారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యాలతో ఆవిర్భవించిన మహాజన సమాజం భావి సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. సమాజం కోసం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను కలుసుని, మహాజన సమాజం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. 

10:26 - April 14, 2017

154 రోజుల సిపిఎం మహాజన పాదయాత్ర బృందానికి ఉప నేతగా వ్యవహరించిన జాన్ వెస్లీ, ఆయన సతీమణి భారతి టెన్ టివి జనపథంలో పాల్గొన్నారు. పాత మహబూబ్ నగర్ జిల్లా నేటి వనపర్తి జిల్లా అమరచింత లో జన్మించిన జాన్ వెస్లీ విద్యార్థి దశ నుంచే వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. తొలుత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లోనూ, ఆ తర్వాత పిడిఎస్ యులోనూ పనిచేసిన జాన్ వెస్లీ 1996 నుంచి సిపిఎంలో చేరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆవిర్భావంలోనూ, నిర్మాణంలోనూ కీలకంగా పనిచేసిన జాన్ వెస్లీ ప్రస్తుతం ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ పోరాట సమితికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. జాన్ వెస్లీ సతీమణి ఓ ప్రయివేట్ కాలేజీలో లైబ్రరేరియన్ గా విధులు నిర్వహిస్తున్నారు. 4200 కిలోమీటర్ల పాదయాత్రలో ఎదురైన అనుభవాల గురించి జాన్ వెస్లీ వివరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:34 - April 12, 2017

హైదరాబాద్: 154 రోజుల మహాజన పాదయాత్రలో పాల్గొన్న నగేష్, ఆయన సతీమణి సరిత ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథులుగా పాల్గొంటున్నారు. తెలంగాణలో 4200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిన నగేష్ జన్మస్థలం సూర్యాపేట జిల్లా నేరేడ్ చర్ల. హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే వామపక్ష విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. నేరేడ్ చర్ల జూనియర్ కాలేజీ ప్రెసిడెంట్ గా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరపున ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకాం మధ్యలోనే మానేసిన నగేష్ ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాటాల్లో, వ్యవసాయ కార్మికుల పోరాటాల్లోనూ, భూ పోరాటాల్లోనూ పాల్గొన్నారు. 4200 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఎదురైన అనుభవాలు వివరించేందుకు నగేష్ '10టీవీ' జనపథంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:07 - April 10, 2017

లాల్...నీల్ జెండాలు ఏకం కావాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు ప్రొ.తిరుపతి, ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు, సామాజికవేత్త సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కెవిపిఎస్ నేత జాన్ వెస్లీ పాల్గొని, మాట్లాడారు. మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు ఐక్యం కావాలని సూచించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:47 - April 10, 2017

హైదరాబాద్ : లాల్‌.. నీల్‌..! ఇప్పుడీ నినాదం.. సరికొత్త ఆలోచనలకు.. వినూత్న ప్రయోగాలకు వేదిక కానుంది. మహాజన పాదయాత్ర ద్వారా.. సీపీఎం వినిపించిన ఈ నినాదం.. సరికొత్త సకల సామాజిక శక్తులకు ఉత్సాహాన్నిస్తోంది.. నవ్య రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.. అంతేనా, ప్రశ్నించే శక్తులను తట్టి లేపి, పాలకుల ఏకపక్ష ధోరణులు ఇక చెల్లవని చాటి చెప్పింది. ఇంతకీ లాల్‌ నీల్‌ నినాదం ఎందుకు..? ఏ లక్ష్య సాధనకు..? 
రాజకీయాల్లో కొత్త కదలికకు కారణమైన పాదయాత్ర
తెలంగాణ రాష్ట్ర సంక్షేమం అంటే.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే అంటూ.. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. నాలుగువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగించారు. ఈ మహాజన పాదయాత్ర సరికొత్త చరిత్రను సృష్టించడమే కాదు.. రాజకీయాల్లోనూ ఓ కొత్త కదలికకు కారణమైంది. అణగారిన వర్గాలను ప్రశ్నించే దిశగా.. ప్రశ్నించే శక్తుల్లో చేతనత్వాన్ని నింపే దిశగా ఈ పాదయాత్ర సాగింది. ఆ చైతన్యమే, వివిధ శక్తుల ఏకీకరణకు, సరికొత్త సమీకరణలకు ఊతమిస్తోంది. 
పాదయాత్ర ఆద్యంతాలూ ఓ హిస్టరీ
అసలు సీపీఎం మహాజన పాదయాత్ర ఆద్యంతాలూ ఓ హిస్టరీ. పాదయాత్ర బృందాన్ని గ్రామాల్లోకి రానీయకండి అంటూ సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే ఇచ్చిన పిలుపును ప్రజలు బేఖాతరు చేయడం ఒక ఎత్తయితే.. బహిరంగ సభాస్థలి విషయంలోనూ అడ్డంకులు సృష్టించిన పాలకుల ఎత్తుగడలను తిప్పికొట్టి.. సభ ఆసాంతమూ విజయవంతం చేయడం మరొక ఎత్తు. ఇది కేవలం పాదయాత్ర ఆద్యంతాలు విజయవంతం కావడాన్ని మాత్రమే కాదు.. ప్రజల్లో మొలకెత్తిన ఆలోచనలకూ దర్పణం పట్టింది. ఇంతకీ ప్రజల్లో అంకురించిన ఆ ఆలోచన ఏది..? అదే.. లాల్‌.. నీల్‌..!
ఎంబీసీల్లో చైతన్యంనింపిన పాదయాత్ర బృందం
ఎంబీసీలపై ప్రభుత్వం హామీలవర్షం
సీపీఎం పాదయాత్ర బృందం.. తన పర్యటనల ద్వారా.. ప్రజల్లో ముఖ్యంగా ఎంబీసీల్లో నింపిన చైతన్యం.. పాలకుల్లో కంగారు పుట్టించింది. ప్రశ్నించేందుకు జనం గళాన్ని సవరించుకుంటుండడాన్ని చూసి.. పాలకులు హడలెత్తారు. అందుకే, హడావుడిగా ఎంబీసీలను ప్రతి కులపు నేతలనూ పిలిపించుకుని, వారికి హామీలు కురిపించడం ప్రారంభించారు. పాదయాత్ర ముగింపు నాటికి, కీలక సామాజిక వర్గాల వారిని బుజ్జగిస్తూ సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ను అర్థం చేసుకోవాలి. పాదయాత్ర నినదించిన లాల్‌ నీల్‌ దెబ్బకు హడలెత్తిన సర్కారు., అసలు ఎంబీసీలు అన్న పదానికి అర్థం, నిర్వచనం ఇవ్వకుండానే, ఏకంగా వెయ్యికోట్లు ఎంబీసీలకు అందిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని బట్టే, సర్కారుపై లాల్‌ నీల్‌ నినాదం ఏమేరకు ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 
పాలకుల ఓటు బ్యాంకు రాజకీయమే
పాలకులది ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలకు రాయితీలు ప్రకటిస్తారు.  శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు... ఆఖరికి కార్పొరేషన్లకు చైర్మెన్ల ఎంపికలోనూ అగ్రవర్ణాల ప్రతినిధులకే అగ్రతాంబూలం ఇస్తారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్ పదవుల్లో ఒక్క ఎంబీసీకి అవకాశం రాలేదు. బీసీల్లో ఎక్కువ జనాలున్న కులాల్ని చేరదీయటంపై దృష్టిపెట్టిన పాలకులు.. కులాన్ని కాపాడుతూ బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.. 
లాల్‌ నీల్‌ నినాదం అర్థం ఏంటి..? 
ప్రభుత్వాన్ని ఇంతగా బెంబేలెత్తించిన ఈ లాల్‌ నీల్‌ నినాదం అర్థం ఏంటి..? విప్లవ పంథాలో సాగే ఎర్రజెండా, అంబేడ్కరిజానికి ప్రతీక అయిన నీలపు జెండా.. కలగలిసి సాగాలన్నదే ఈ లాల్‌ నీల్‌ కలయిక ఆంతర్యం. బడుగులు అందరూ ఈ లాల్‌ నీల్‌  ఉమ్మడి జెండాల నీడలోకి వస్తే.. పాలకులను ప్రశ్నించే తెగువ, హక్కులను సాధించుకునే హక్కు సిద్ధిస్తాయనడంలో సందేహం లేదు. పాలకులది ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలకు రాయితీలు ప్రకటిస్తారు.  శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు... ఆఖరికి కార్పొరేషన్లకు చైర్మెన్ల ఎంపికలోనూ అగ్రవర్ణాల ప్రతినిధులకే అగ్రతాంబూలం ఇస్తారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్ పదవుల్లో ఒక్క ఎంబీసీకి అవకాశం రాలేదు. బీసీల్లో ఎక్కువ జనాలున్న కులాల్ని చేరదీయటంపై దృష్టిపెట్టిన పాలకులు.. కులాన్ని కాపాడుతూ బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.. 
చక్కని వేదికగా నిలుస్తున్న లాల్‌-నీల్‌
 పాలకులకు కులవివక్షగానీ, అణగారిన తరగతులనుంచి వచ్చిన మేధావులు, మధ్య తరగతి ఉద్యోగుల ఆత్మగౌరవంగానీ  అవసరం లేదు. కులవివక్ష నుండి ఉద్భవించిందే ఈ ఆత్మగౌరవ సమస్య. బడుగు బలహీన వర్గాల ప్రజానీకాన్ని పౌరులుగా వీరు అంగీకరించరు.. వీరిని ఓటర్లుగా మాత్రమే చూస్తూ... ఓటు బ్యాంకును సిద్ధపరచుకునేందుకు ఎత్తుగడలువేస్తారు.. ఇందుకోసం కొందరికి ఎరవేసి అందరినీ మభ్యపెడతారు. పార్టీ ఏదైనా తెలంగాణలో అట్టడుగు వర్గాల పరిస్థితిని పట్టించుకున్నవారేలేరు.. టీఆర్‌ఎస్‌ కన్నా ముందునుంచిఉన్న పార్టీలుకూడా దీనికి బాధ్యులే.. అందుకే ఎన్నికల లక్ష్యాలు దాటి వీరు ఒక్క మాటైనా మాట్లాడలేకపోయారు. తమను ఓటర్లుగా మాత్రమే పరిగణించే నాయకుల తీరుపై.. ప్రజల్లో ఎన్నాళ్ల నుంచో అసంతృప్తి, అసహనం గూడుకట్టుకుని ఉన్నాయి. తమ ఆగ్రహాన్న ప్రదర్శించేందుకు, హక్కుల గురించి ప్రశ్నించేందుకు సరైన వేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో, ఉద్భవించిన లాల్‌-నీల్‌ ఆలోచన, ఇలాంటి వారికి చక్కటి వేదికగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే, వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యతా నినాదం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.. రాజకీయ పునరేకీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి, చర్చకు పెట్టింది. 

 

08:33 - March 24, 2017

సామాజిక తెలంగాణ కావాలని ఎంబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పడితేనే పేదల బతుకులు బాగుపడుతాయని తెలిపారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆయన సతీమణి విజయ పాల్గొన్నారు. '154 రోజులు, 4200 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన సిపిఎం బృందంలోని సభ్యుడు ఆశయ్యగారు ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. వారి సతీమణి విజయగారు కూడా 10టీవీ స్టూడియోకి వచ్చారు. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం నీర్ నెమల గ్రామంలో, రజక వృత్తిదారుల కుటుంబంలో జన్మించారు ఆశయ్య. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న ఆశయ్య జూనియర్ కాలేజీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.  విద్యార్థి దశలోనే వామపక్షభావజాలం వైపు ఆకర్షితులైన ఆశయ్య ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేసి, యువజన సంఘాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. స్వగ్రామంలో 1996లో జరిగిన పెత్తందారి వ్యతిరేక పోరాటంలోనూ, విద్యుత్ ఉద్యమంలోనూ యాక్టివ్ గా పాల్గొని, జైలుకు సైతం వెళ్లారు. ఎంబిసి ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధత్యలు నిర్వహిస్తున్నారు. 154రోజుల పాదయాత్ర అనుభవాలన వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:21 - March 20, 2017

సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర చరిత్రాత్మక పాదయాత్ర అని, 150 రోజులకు పైబడి సాగిన ఈ యాత్ర చరిత్ర సృష్టించిందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు ఆదివారం వచ్చారు. ఈసందర్భంగా టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ ఆయనతో ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర నినాదాలపై ఆసక్తిని కనబరిచి వారు మద్దతిచ్చారని తెలిపారు. కిలోమీటర్ల కొద్ది పాదయాత్రతో కలిసి సాగారని, ఏది ఏమైనా ఇది ఘనవిజమన్నారు. కేరళ రాష్ట్రంలో పేదలు లబ్దిపొందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు చాలా సమస్యల్లో ఉన్నారని, సామాజిక న్యాయం అన్నది తమ దృష్టిలో ప్రధానాంశమన్నారు. అభివృద్ధి సామాజిక న్యాయంపైనే ఆధారపడిందని, ఈ దిశగా తాము నాలుగు మిషన్లను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా తాము నవ కేరళలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం పినరయి స్పష్టం చేస్తున్నారు.

07:55 - March 20, 2017

సామాజిక న్యాయం..సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర నిన్నటితో ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలపై వక్తలు విమర్శలు గుప్పించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్షాలు ఆయనపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో చెరుపల్లి సీతారాములు (సీపీఎం), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్), శ్రీధర్ (బీజేపీ), బెల్లం నాయక్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:48 - March 20, 2017

హైదరాబాద్ : సబ్బండ వర్గాల సమరసైన్యం హైదరాబాద్‌లో సమరశంఖం పూరించింది. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసింది. ఎర్రదళం భాగ్యనగరి వీధుల్లో కవాతు తొక్కింది. ఎక్కడ చూసినా లాల్‌, నీల్‌ జెండాల రెపరెపలే దర్శనమిచ్చాయి. మెడలో కండువాలు, చేతిలో జెండాలు, లాల్‌,నీల్‌ దుస్తులు ధరించి సాగిన ర్యాలీ... హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారులన్నీ సరూర్‌నగర్‌కే అన్నట్టుగా ఎటుచూసినా జనసంద్రమే తలపించింది. పదం పాడుతూ... కదం కదుపుతూ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఎక్కడ చూసినా ఎర్రజెండాలు, నీల్‌ జెండాలే రెపరెపలాడాయి. దీంతో హైదరాబాద్‌ లాల్‌నీల్‌ వర్ణశోభితమైంది. కులవివక్షత, సామాజిక అసమానతలపై అవి దండోరా మోగించాయి. సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి.

154 రోజులు..
తెలంగాణ వ్యాప్తంగా మహాజన పాదయాత్ర 154 రోజులు కొనసాగింది. 4200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆదివారం పాదయాత్ర ముగింపు సందర్భంగా సమర సమ్మేళనం సభ జరిగింది. ఈ సభకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి తమ్మినేని నేతృత్వంలో పాదయాత్ర బృందం సభ్యులు, పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి పాదయాత్రగా చేరుకున్నారు. ఈ పాదయాత్రకు హైదరాబాద్‌ జనం అడుగడుగునా జేజేలు పలికారు. తమ అభిమానాన్నంతా పూలవర్షంలా కురిపించారు. పాదయాత్ర వస్తున్న ప్రధాన కూడళ్లలో కార్యకర్తలు బాణాసంచాలలు కాల్చి ఘన స్వాగతం పలికారు. జై భీం, లాల్‌సలాం నినాదాలతో హోరెత్తించారు. దీంతో పాదయాత్ర సాగిన దారులన్నీ కోలాహలంగా జన జాతరను తలపించింది.

నగరంలో జోరు హోరు..
పాదయాత్ర పొడవునా తమ్మినేని బృందానికి జనం తండోపతండాలుగా తోడయ్యారు. ప్రతి కూడలి దగ్గర పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలుకుతూ..అక్కడి నుంచి వారితో కలిసి నడిచారు. టీవీ టవర్‌ చౌరస్తాకు రాగానే జనం వేలాదిగా జమఅయ్యారు. ఇక కొత్తపేట చేరుకోగానే జనం రెట్టింపయ్యారు. దీంతో దారులన్నీ సీపీఎం, సామాజిక సంఘాల కార్యకర్తలతో నిండిపోయాయి. మరోవైపు వనస్థలిపురంలోని స్పెన్సర్స్‌ నుంచి మరో ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్ధులు భారీగా సభకు తరలివచ్చారు. లాల్‌,నీల్‌ జెండాలు చేతబట్టి వాహనాల్లో చేరుకున్నారు. దూరప్రాంతాల వారు కొంతమంది శనివారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నానికే సభ ప్రాంగణం నిండిపోయింది. ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా జనం సభలో కూర్చొన్నారు. సభికుల సౌకర్యార్ధం సభా ప్రాంగణంలో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో తొక్కిసలా జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా జనమూ సహకరించారు. సభా ప్రాంగణానికి దూరంగా వాహనాలను నిలిపివేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మొత్తం హైదరాబాద్‌ జన హోరు తలపించింది.

06:46 - March 20, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు సభికులను కట్టిపడేశాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పోడకలపై గాయకుల పాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ప్రజాగాయకులు గద్దర్‌, గోరటి వెంకన్న, విమలక్క పాటలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. గాయకుల పాటలకు సభికులు ఈలలువేస్తూ, నృత్యాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభకు వచ్చిన జనాన్ని అలరించాయి. ప్రజా గాయకుడు గద్దర్‌ సభలో పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. అమర వీరులపై పాడిన పాట ఉర్రూతలూగించింది. ఇక పొడుస్తున్న పొద్దుమీద పాటకు సభికులు నృత్యాలు చేశారు. రచయిత, ప్రజా కవి గోరటి వెంకన్న స్టేజ్‌ను షేక్‌ చేశారు. పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ఇక విమలక్క ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న దాడిపై పాడిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆడుదాం డప్పుల్లా దరువేయరా అంటూ విమలక్క పాడితే సభికులు కదం కలుపుతూ స్టెప్పులేశారు. గాయకుడు ఏపూరి సోమన్న తన పాటలతో అందరిలో ఉత్తేజం నింపారు. కేసీఆర్‌ హామీలపై ఆయన పాడినపాటలు అందరినీ ఆలోచింపజేశాయి. రోజులు మారాలి, మా రోజులు రావాలంటూ సాగిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజానాట్య మండలి కళాకారులు నర్సింహ్మా పాడిన పాటలు సభలో ఉత్సాహాన్ని నింపాయి. తమ్మినేని పాదయాత్రపై ఆయన పాడిన పాటకు సభకు వచ్చిన వారు ఈలలువేస్తూ... నృత్యాలు చేస్తూ మద్దతు తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలు, భద్రాచలానికి చెందిన గోండు నృత్యాలు సమర సమ్మేళనం సభకే హైలెట్‌గా నిలిచాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - social justice