Srikakulam News Updates

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

12:03 - August 6, 2018

శ్రీకాకుళం : రిమ్స్‌ ఆసుపత్రిలో ఇంజక్షన్‌ వికటించడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అస్వస్థతకు గురైన మరో 16మంది చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషాదానికి కారణమైన సెప్ర్టియాక్షన్‌ సూది మందు వినియోగం, బాద్యులైన వైద్యులపైన 8 మంది ఉన్నతాధికారులతో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో శైలు, అనిత, దుర్గమ్మ శనివారం మృతి చెందగా.. మరో నలుగురు విశాఖ కేజీహెచ్‌లోనూ, 12మంది రిమ్స్‌ అత్యవసర విభాగంలోనూ చికిత్స పొందుతున్నట్లు రిమ్స్‌ వర్గాలు తెలిపాయి.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి కళా వెంకటరావు, కలెక్టర్‌ ధనుంజయరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి వైద్యాధికారులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. 20మంది రోగులకు ఒకే రకమైన ఇంజక్షన్‌ ఎందుకువాడారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగా దర్యాప్తు పూర్తయ్యాక కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని రిమ్స్‌ డైరెక్టర్‌ కృష్ణవేణి తెలిపారు.

12:25 - August 1, 2018

శ్రీకాకుళం : టిడిపి నేతలు దీక్షలు చేపడుతున్నారు. ఇటీవలే టిడిపి నేత కన్నబాబు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఇన్ ఛార్జీ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మౌన దీక్ష చేపట్టడం చర్చానీయాంశమైంది. అధికారుల తీరును నిరసిస్తూ ఆయన దీక్ష చేపడుతున్నారు.

ఆఫ్ షోర్ జలాశయం పనుల పూర్తిలో జాప్యంపై పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జులై 31వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన జలాశయం పూర్తి కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ 50 శాతం కూడా పనులు పూర్తి కాకపోవడంపై అధికారుల తీరును నిరసిస్తూ ఆయన మౌన దీక్ష చేపట్టారు. టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టారు. ఆయనకు టిడిపి నేతలు సంఘీభావం ప్రకటించారు. 

19:08 - July 31, 2018

శ్రీకాకుళం : సిక్కోలు జిల్లాలో ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీ నెరవేర్చని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు మౌన దీక్ష చేస్తానన్న ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్‌ శివాజీ ప్రకటించారు. ఆఫ్‌షోర్‌ జలాశయం పనుల్లో జాప్యానికి నిరసనగా ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. జులై 31 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మాట మార్చిందన్నారు. గతంలో హామీ నెరవేర్చలేదంటూ.. గౌతు శ్యాంసుందర్‌ శివాజీ తలనీలాలు గడ్డం కత్తిరించుకోనని భీష్మించారు. అయితే అప్పట్లో శివాజీని ఒప్పించి తిరుపతిలో తలనీలాలు తీయించారు టీడీపీ నేతలు. ఇప్పుడు మౌన దీక్షకు మరోసారి సిద్ధమయ్యారు ఎమ్మెల్యే శివాజీ. ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు 50శాతమైనా పూర్తి కాలేదని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో కలకలం మొదలైంది. 

15:35 - July 7, 2018

శ్రీకాకుళం : అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పలాస జీడి పరిశ్రమపై జీఎస్టీ దెబ్బ పడింది. వివిధ రకాల పన్నుల భారంతో జీడి పరిశ్రమల బంద్‌కు యజమాన్యాలు సిద్ధమయ్యాయి. జీడిపిక్కల సీజన్‌ ప్రారంభమైన నెలరోజులకే యజమాన్యాలు బంద్‌ ప్రకటించడంతో వేలాదిమంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. 
15 రోజులపాటు మూతపడనున్న జీడి పరిశ్రమ  
శ్రీకాకుళం జిల్లాలో జీడిపిక్కల సీజన్‌ ప్రారంభమైన నెలరోజులకే జీడి పరిశ్రమ 15 రోజుల పాటు మూతపడనుంది. ఈ నెల 10 నుంచి 25 వరకు పరిశ్రమలను బంద్‌ చేయనున్నారు. దీంతో జిల్లాలోని పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు, పారిశ్రామికవాడతో పాటు పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో సుమారు 300 కర్మాగారాలు మూతపడనున్నాయి.
దేశంలో జీడి పప్పునకు కీలకంగా కేరళ, ఆందేశ్‌ 
దేశంలో జీడి పప్పునకు కేరళ, ఆందేశ్‌ కీలకంగా ఉన్నాయి. అయితే జీఎస్టీ వచ్చాక నెలకొన్న పరిస్థితుల వల్ల కేరళలోని సుమారు 700లకు పైగా కర్మాగారాలు మూతపడ్డాయి. జీడిపప్పు ఎగుమతులకు సంబంధించిన రాయితీలపై జీఎస్టీ ప్రభావం చూపడంతో యూరప్‌ వంటి దేశాలకు సరఫరా నిలిచిపోయింది. వీటికి తోడు తాజాగా గోవా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొత్తగా కర్మాగారాలు ప్రారంభించారు. దీంతో ఈ నెల నుంచి అమలుచేస్తున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పన్నుల విధానం కొనుగోలుదారులకు  ఇబ్బందికరంగా మారింది. మరో వైపు పిక్కలు కొనుగోలు చేసినచోటే ఆన్‌లైన్‌ విధానం ద్వారా పన్ను చెల్లించాలన్న నిబంధనను అమలవుతున్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన వాటికి ఆన్‌లైన్‌లో పన్నులు ఎలా చెల్లించాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.  
జీఎస్టీ విధానంతో జీడి పరిశ్రమలకు ఇబ్బందులు 
ఎగుమతులు బాగా తగ్గి డిమాండ్ లేకపోవడంతో దిగుమతి చేసుకున్న విదేశీ పిక్కల నిల్వలు విశాఖపట్నం, ట్యూటీకోరిస్‌ పోర్టుల్లో పేరుకుపోయాయి. మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు... జీఎస్టీ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా జీడి పశ్రమపై తాజాగా ఏ.ఎం.సి పన్ను విధానం కలవరపెడుతోంది. 

09:07 - June 30, 2018

శ్రీకాకుళం : అదొక అంతర్జాతీయ స్థాయి సమస్య. స్థానికులు జీవన్మరణ పోరాటంతో సతమతమవుతుంటే, పార్టీల నేతలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడంలేదు. దీంతో పొలిటికల్‌ పరామర్శలపై ఉద్దానం మూత్రపిండాల బాధితులు ఫైర్‌ అవుతున్నారు. టెన్‌ టీవీ చొరవతో సమస్య మూలాలు పరిశోధించేందుకు ఒమిక్స్ ఇంటర్నేషల్‌ సంస్థ ముందుకొచ్చింది. 
రెడున్నర దశాబ్దాలుగా పీడిస్తున్న మూత్రపిండాల వ్యాధి
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం గడిచిన రెండున్నర దశాబ్దాలుగా మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ సమస్య మాత్రం దూరం కావడం లేదు. సర్వేలు, రక్తపరీక్షలు, రాజకీయ పక్షాల పరామర్శలతో ఇబ్బందులు పడుతున్నామని ఇచ్చాపురం నియోజకవర్గ వాసులు అంటున్నారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, వజ్రపుకొత్తూరు, మందస ప్రాంతాలలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. మరో వైపు ఉద్దాన ప్రాంతంలోని ప్రజలును రకరకాల వదంతులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్దాన ప్రాంతంలో నేతల ఓటు బ్యాంక్‌ రాజకీయం
ప్రజాప్రతినిధులు మారుతున్నారు తప్ప తమ ఆవేదన అర్థం చేసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. పార్టీ నేతలు ఓటు బ్యాంక్‌ రాజకీయం కోసం హడావిడి చేస్తున్నారు తప్ప మూత్రపిండాల వ్యాధులపై అధ్యయనం చెయ్యడం లేదంటూ ఉద్దాన ప్రాంతీయులు మండిపడుతున్నారు. పర్యటన పేరుతో రాజకీయ నేతలు చేస్తున్న ఖర్చు డయాలసిస్‌, యూనిట్లు నెలకొల్పడం, నెఫ్రాలజిస్ట్‌లను రప్పించడానికి వినియోగించాలని కోరుతున్నారు.
గుర్తించని కిడ్నీ వ్యాధుల మూలాలు 
ఇదిలా ఉంటే ఉద్దానం మూత్రపిడాల వ్యాధుల అధ్యయనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్న కిడ్నీ వ్యాధుల తీవ్రతకు మూలలు గుర్తించకపోవడం దురదృష్టకరమని బాధితులు అంటున్నారు. ఈ దశలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థను టెన్‌ టీవీ సంప్రదించింది. ప్రభుత్వాలు సహకరిస్తే స్థానికంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని ఒమిక్స్‌ సంస్థ సి.ఈ.ఓ. శ్రీనుబాబు గేదెల స్పష్టం చేశారు. 6 నుంచి 18 నెలల వ్యవధిలో నిపుణుల సహకారం అందిస్తే, ప్రభుత్వం ప్రోత్సాహంతో పరిశోధన జరిపేందుకు తమ సంస్థ సిద్ధమని శ్రీనుబాబు గేదెల టెన్‌ టీవీతో అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన కిడ్నీ వ్యాధి సమస్య 
నేతల పర్యటనలు, పార్టీ నేతల ప్రచారంతో ఉద్దానం మూత్రపిండాల వ్యాధుల సమస్య అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. కానీ బాధితులకు పూర్తి భరోసా, మూలలు కనుగోనడంలో సమన్వయం లేకపోవడంతో ఉద్దాన ప్రాంతాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉద్దాన ప్రాంతంలో నేతలు పర్యటనలు ఆపి సమస్య పరిష్కారానికి కృషి చెయ్యాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

18:32 - June 28, 2018

శ్రీకాకుళం : విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి నాలుగేళ్లు సహకరిస్తే చివరికి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో లాలూచీపడ్డ వైసీపీ అధినేత జగన్‌... రాజకీయాలు పక్కనపెట్టి... కేంద్రంతో టీడీపీ చేస్తున్న పోరాటానికి కలిసిరావాలని శ్రీకాకుళం జిల్లా ఏరువాక ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆమదాలవలస మండలం రావికంపేటలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా వ్యవసాయ పనులు ప్రారంభించడం ఏపీలో ఆనవాయితీ. రావికంపేట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పంచకట్టి, తలపాగా చుట్టి..భూమికి పూజ చేశారు. ట్రాక్టర్‌తో పొలందున్నారు. మహిళా రైతులతో కలిసి విత్తనాలు చల్లారు. కల్టివేటర్‌తో వరినాట్లు వేశారు.

రావికంపేటలో జరిగిన సభలో చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుకుపడ్డారు. విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌, రెవెన్యూలోటు భర్తీ, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల సాధన కోసం కేంద్రంతో పోరాడేందుకు విపక్షాలు టీడీపీతో కలిసిరావాలని చంద్రబాబు కోరారు. ఉత్తరాంధ్ర నుంచి విప్లవం వస్తుందంటూ ఒక పార్టీ ప్రచారం చేస్తోందని పరోక్షంగా జనసేనపై సీఎం మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి సొంత మైకులా, బీజేపీకి అద్దెమైకులా పనిచేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో వ్యసాయరంగం కుదేలైందని, రైతుకు ధీమా ఇవ్వని పంటల బీమా పథకంతో అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రెండువేల కోట్లతో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ఎడమ కాల్వను వంశధార ప్రాజెక్టుతో అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఎడ్లు, నాగలితోపాటు వ్యవసాయ ఉపకరణాలన్నింటికీ పూజలు చేసి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 

14:57 - June 28, 2018

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పొలం దున్నారు. ఆముదాల వలస మండలం రావికంపేటలో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఏరువాక ప్రారంభించారు. కల్టివేటర్ తో వరినాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడారు...ఎన్ని విత్తనాలు కావాలో అన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూగర్భజలాలు పెంచడం, నదుల అనుసంధానం చేయడం జరుగుతోందని, శ్రీకాకుళం జిల్లాలో తమ హాయాంలోనే ప్రాజెక్టుల పూర్తి చేయడం జరిగిందన్నారు. 84వేల ఎకరాలు నీళ్లిచ్చే అవకాశం ఉందని, 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో 2వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. 8లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. నీళ్లు సరిపోకపోతే ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని ఇక్కడకు తీసుకరావడం జరుగుతుందన్నారు. గోదావరి - కృష్ణా రెండు నదుల అనుసంధానం చేయడం జరిగిందని, గోదావరి నుండి పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నామని, జిల్లాకు నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తనదన్నారు.

ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది ? అనేది రైతులు తెలుసుకోవాలన్నారు. పాడి పరిశ్రమలో రూ. 77వేల కోట్ల ఆదాయం..వ్యవసాయం మొత్తం కలుపుకుంటే రూ. 40వేల కోట్ల ఆదాయం...హర్టికల్ రంగంలో రూ. 76వేల కోట్ల ఆదాయం..చేపల్లో రూ. 50-55 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారిన సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించడం జరుగుతుందన్నారు. 

13:49 - June 28, 2018

శ్రీకాకుళం : ఆముదాలవలస నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపారు. 

07:40 - June 28, 2018

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.  రావికంటిపేటలో నిర్వహించే ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం
సాగును సామూహిక సంబరంగా చేసుకునేందుకు ఏపీ రైతాంగం సమాయాత్తమవుతోంది. వానాకాలం ప్రారంభం కావడంతో... ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది.  ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకృతిని ఆరాధించే భారతీయ సంస్కృతిలో ఏరువాక ఒక కీలకఘట్టంగా..ఒక పండుగలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా రావికంటిపేట గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయడానికి జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం కమిటీలు వేసింది.  జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా.. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇతర కీలకమైన జిల్లా స్థాయి ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించింది. ఆ కమిటీల పర్యవేక్షణలోనే జిల్లా, గ్రామస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 
రావికంటిపాడులో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించనున్న సీఎం
శ్రీకాకుళం జిల్లాలో జరిగే ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 9.45కు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి పదిన్నరకు హెలికాప్టర్‌లో ఆముదాలవలస మండలంలోని పార్వతీశంపేటలో ఉన్న సెయింట్స్‌ ఆన్స్‌ పాఠశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.45కు రావికంటిపాడులోని  వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తారు.  అక్కడే ఏరువాక కార్యక్రమంలో పాల్గొని ప్రారంభిస్తారు.  అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పదకొండున్నరకు జగ్గుశాస్త్రులపేటలోని ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఎడ్లబండ్ల ప్రదర్శనతోపాటు వివిధ ప్రదర్శనశాలలను పరిశీలిస్తారు. అనంతరం చంద్రన్న రైతుబీమా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30కు బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభ అనంతరం తిరిగి విజయవాడకు  తిరుగుపయనమవుతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం విత్తనాలు విత్తేందుకు, దుక్కులు దున్నేందుకు పొలాన్ని సిద్ధం చేశారు. సీఎం భద్రత కోసం పోలీసులను భారీగా మోహరించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - Srikakulam News Updates