students

16:05 - June 26, 2017

హైదరాబాద్ : బాలిక కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. టపాచబుత్ర పిఎస్‌ పరిధిలో ఈనెల 17న అదృశ్యమైన బాలికకు విముక్తి కల్పించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్‌ ను విశ్లేషించిన పోలీసులు బెంగళూరులో ఉన్న నిందితులను పట్టుకున్నారు. నిందితులు బాలిక కుటుంబానికి పరిచయం ఉన్నవారేనని పోలీసులు తెలిపారు. 10నెలల బాబును చూసుకునేందుకే బాలికను నిందితులు తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. 

 

16:26 - June 23, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదాకు ముగ్గురు బలయ్యారు. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. జిల్లాలోని కోణరావుపేట మండలం పల్లిమక్తాకు చెందిన మణి (14), రాజు (13), సంజీవ్ (16)లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఈరోజు పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ముగ్గురు విద్యార్థులు స్థానికంగా ఉన్న కుమ్మరికుంట చెరువులోకి ఈతకు వెళ్లారు. ఈత రాకపోడవంతో చెరువులో మునిగి మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:45 - June 20, 2017

ఆదిలాబాద్ : అపరిశుభ్ర వాతావరణం.. తరగతి గదుల్లో వర్షం.. కూర్చునేందుకు బల్లలు ఉండవు.. తాగేందుకు మంచినీరు దొరకదు.. టాయిలెట్ సౌకర్యం అసలే ఉండదు.. ఇది మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. కొత్త విద్యాసంవత్సరంలో కోటి ఆశలతో తరగతి గదిలోకి అడుగుపెట్టిన విద్యార్ధులకు సమస్యలు స్వాగతం పలికాయి. జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాకాలం మొదలవడంతో విద్యార్ధులకు కష్టాలు మొదలయ్యాయి. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. దీంతో తాగునీటిని ఇంటి నుంచి తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు విద్యార్ధులు. కంప్యూటర్ విద్య అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఇప్పటికీ 94 పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం లేదన్నది వాస్తవం. ఇక జిల్లాలోని స్కూళ్లలో టాయిలెట్స్ సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో బాలురకు సంబంధించి 65, బాలికలకు సంబంధించి 36 పాఠశాలల విద్యార్ధులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో బాలికలు అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని విద్యార్ధులు కోరుతున్నారు.

వంటశాలల కొరత
ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి సమస్య వెంటాడుతూనే ఉంది. జిల్లాలోని 283 పాఠశాలల్లో అనువుగా వంటశాలలు నిర్మాణం చేయకపోవడంతో ఆరుబయటే వంట చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాఠశాల్లోని అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తుండటంతో విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్ధులకు పాత గదుల స్ధానాల్లో నూతన గదుల కోసం సర్వశిక్ష అభియాన్ కింద గత నాలుగేళ్లుగా నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణాలు ఈ ఏడాది కూడా పూర్తి కావడం అనుమానమే. ప్రభుత్వం నిర్మాణాల బిల్లుల మంజూరులో జాప్యం చేస్తుండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఆంగ్ల భాష బోధన పై స్పష్టత కరువు
ఇక ప్రాథమిక పాఠశాల్లో ఆంగ్ల భాష బోధనపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు ముందడుగు వేయడం లేదు. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడానికి ఇష్టపడుతున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్ధులకు బెంచీలు లేకపోగా నేలపై కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. సర్కారీ బడిలో ఇన్ని సమస్యలుండటంతో ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో విద్యార్ధుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతో 172 పాఠశాలలు మూతపడనున్నాయి. 20 కంటే తక్కువగా ఉన్న 142 పాఠశాలలు దగ్గరలోని పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు. లక్షెట్టిపేట మండలంలోని మోదెల గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి ఉండటంతో పిల్లలు పాఠశాలకు రావడం లేదు.ఊత్కూరు గ్రామ పంచాయితీ పరిధిలోని ఆంధ్రకాలనీలో అదే పరిస్థితి. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని UPS పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు సెలవులో ఉంటే మరొకరు 10వ తరగతి పరీక్ష విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో అటెండర్లు లేక విద్యార్ధులచే పాఠశాలలు శుభ్రం చేయిస్తున్నారు. దీంతో విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

12:48 - June 4, 2017

చిన్నారుల్లో సహజంగా సృజనాత్మకత ఉంటుంది. దాన్ని తరగతి గది మరింత వికసించేలా చేస్తుందా లేక ముడుకుచుపోయేలా చేస్తుందా అనేది అసలు ప్రశ్న. సమాజం సంక్లిష్టభరితంగా మారుతున్న తరుణంలో భవిష్యత్ యంత్రాలుగా మారే విద్యార్ధులపై అలవికాని బరువు పెరుగుతున్న సందర్భం ఇది. ఈ సమయంలో విద్యార్థుల్లోని సృజనాత్మకతను బతికించాలంటే అది ఉపాధ్యాయులకే సాధ్యం. కష్టసాధ్యమైనా ఆ బాటలో సాగుతా అంటున్నాడా ఉపాధ్యాయుడు. ఆ క్రమంలో మొదటి ఫలితాన్ని కూడా సాధించాడు. తన విద్యార్థులతో కవిత్వం రాయించి నిరూపించాడు. స్వప్న సాధకులుగా పాఠకుల ముందుకొచ్చిన ఆ ఎనిమిదిమంది విద్యార్ధుల విశేషాలు చూద్దాం.

21:27 - May 31, 2017

గుంటూరు : పాలనలో అవినీతిని సహించేదిలేదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. లంచాలు తీసుకుంటే వాళ్లని రోడ్డుపై నిలబెడతానని హెచ్చరించారు. టీని అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారని... అలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడలో విదేశీ విద్య దీవెన పథకంలో ఎంపికైన విద్యార్థులతో చంద్రబాబు చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

19:29 - May 31, 2017
12:37 - May 14, 2017

హైదరాబాద్: వేసవి సెలవులు సందర్భంగా...బల్దియా ఈ ఏడాది కూడా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు ఏర్పాటు చేసింది. 51 క్రీడాంశాల్లో ఇస్తున్న శిక్షణకు లక్షకుపైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. వేసవి శిబిరానికి మంచి రెస్పాన్స్‌ వస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం సమ్మర్‌ క్యాంపుల్లో 2 వేల 65 మంది ...

ప్రస్తుతం సమ్మర్‌ క్యాంపుల్లో 2 వేల 65 మంది పాటు పలువురు సీనియర్‌ కోచ్‌లు కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆరు సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఈ శిక్షణ పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఇస్తున్న కోచింగ్‌ చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. అతి తక్కువ ఫీజుతో పిల్లలకు మంచి కోచింగ్‌ లభిస్తుందని అంటున్నారు. ఈ సెలవుల్లో బల్దియా ఇస్తున్న ఈ కోచింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నామని విద్యార్థులు అంటున్నారు. మంచి శిక్షణ లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

32 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో శిక్షణ..

ఇప్పటి వరకూ బల్దియా నిర్వహించిన ఈ శిబిరాల ద్వారా 32 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందారు. వీరిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నవారు ఎందరో ఉన్నారు. అజారుద్దీన్‌, పీవీ సింధు కూడా ఇక్కడే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

 

13:35 - May 12, 2017

హైదరాబాద్ : నీట్‌... విద్యార్థుల ఆశలపై నీళ్లు జల్లింది... భవిష్యత్తును నిర్మిస్తుందనుకుంటే... ఆందోళనను మిగిల్చింది. ఒక్కో భాషలో...ఒక్కో ప్రశ్న పత్రం రావడంతో... అందరూ గందరగోళానికి గురవుతున్నారు. ప్రాంతీయ భాషల్లో రాసిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల ఏడో తేదీన నీట్‌ ఎగ్జామ్‌ను నిర్వహించారు. పరీక్షకు 11లక్షల 38వేల 890 మంది హాజరయ్యారు. రాష్ట్రం నుంచి 56వేల 804 మంది ఈ పరీక్ష రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒకటి కన్న ఎక్కువ భాషల్లో పరీక్ష నిర్వహిస్తే అవే ప్రశ్నలను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయాల్సి వుంటుంది. కానీ సీబీఎసీఈ ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఒకలాగా, ఇతర భాషల్లో మరోలా వేర్వేరు ప్రశ్నాపత్రాలు తయారు చేసింది. కాగా ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు చాలా ఈజీగా, ప్రాంతీయం వారికి కఠినంగా ప్రశ్నాపత్రాలను రూపొందించారని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

కార్పొరేట్ ప్రమేయం..
తెలుగుకు ,ఇంగ్లీషుకు పొంతన లేకుండా రావడంతో విద్యార్థుల్లో కలవరం మొదలైంది. ఈ సమస్య ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. దీనిపై గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు నిరనసలు కూడా చేపట్టారు. కాగా నీట్ వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలో ఇటువంటి తప్పులు జరగటం సరైంది కాదని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. అదే నిజమైతే మాతృభాషలో పరీక్ష రాసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డాక్టర్‌ చదువును దూరం చేసినట్టేనని వారు అంటున్నారు. విద్యార్థులు...వారి తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో దీనిపై సీబీఎస్‌ఈ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది. కాగా ఈ ప్రశ్నాపత్రాల తయారీలో కార్పొరేట్‌ , ప్రైవేట్‌ విద్యా సంస్థల ప్రమేయం ఉందని విద్యావేత్తలు సందేహిస్తున్నారు..

07:09 - May 12, 2017

హైదరాబాద్: తెలంగాణాలో శుక్రవారం నిర్వహించే ఎంసెట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల 20 వేల 248 మంది హాజరు కాబోతున్నారు. మొత్తం నాలుగు వందల ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 246 సెంటర్లు... అగ్రికల్చర్‌ మెడికల్ స్ట్రీమ్‌లో 154 సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఏపీలో మూడు, తెలంగాణలో 24 రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్‌ అటెండెన్స్‌...

ఇంజనీరింగ్‌ విభాగానికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు... అగ్రికల్చరల్‌ అండ్‌ మెడిసిన్‌ విభాగాలకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు... ఎంసెట్‌ జరగనుంది. బయోమెట్రిక్ అటెండెన్స్‌ ఉంటున్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కాస్త త్వరగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...

పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

18:16 - May 9, 2017

హైదరాబాద్ : అది దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలున్న యూనివర్శిటీ. ఎన్నో శక్తులు ఆ యూనివర్శిటీ పేరును దిగజార్చేందుకు ప్రయత్నించాయి. అయినా ఆ విశ్వవిద్యాలయం వన్నె కొంచెం కూడా తగ్గలేదు. ఎప్పుడూ లేని విధంగా ఈ విద్యాసంవత్సర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత రెండేళ్లుగా ఆందోళనలతో హాట్ టాపిక్‌గా నిలిచిన హెచ్‌సీయూ.. విద్యార్థులు రారు అని జరిగిన ప్రచారాలను పటా పంచలు చేసింది. అడ్మిషన్ల వెల్లువతో యూనివర్శిటీ కళకళలాడుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ వారి వ్యూహాలేవీ ఇక్కడ పని చేయలేదు. యూనివర్శిటీ ఇప్పటికీ అదే చరిష్మాతో ముందుకు సాగుతోంది. రోహిత్ వేముల ఆత్మహత్య ముందు తరువాత జరిగిన అనేక ఘటనలు విశ్వ విద్యాలయ ప్రతిష్టను దెబ్బ తీశాయని.. ఇక ఈ యూనివర్శిటీకి విద్యార్థుల రాక తగ్గుతుందని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీకి ప్రవేశాల కోసం దరఖాస్తుల వెల్లువ వస్తోంది.

30 శాతం పెరిగిన దరఖాస్తులు..
గత రెండేళ్లుగా హెచ్‌సీయూ.. విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. అనేక పోరాటాలకు కేంద్రబిందువైంది. ఈ క్రమంలో ఆందోళనలతో యూనివర్శిటీ పరువు పోతుందనీ కొందరంటే.. ప్రతిష్ట దిగజారుతుందనీ మరికొందరు మాట్లాడారు. అయితే భారీగా వచ్చిన దరఖాస్తులు వారందరి నోళ్లకు తాళం పడేలా చేశాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మొత్తం 124 కోర్సుల్లో దాదాపు 2 వేల సీట్లున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3 నుంచి మే 5 వరకు యూనివర్శిటీ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల నుంచి 58 వేల 34 దరఖాస్తులు ఈ విద్యా సంవత్సరానికి వచ్చాయి. గతేడాది 44 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే దాదాపు 30 శాతానికి పైగా దరఖాస్తులు పెరిగాయి. వీటిలో 37 శాతం మహిళా అభ్యర్థుల నుంచి రావడం విశేషమనే చెప్పాలి.

విద్యార్థి సంఘాల హర్షం..
ఈ దరఖాస్తుల్లో ఓబీసీ అభ్యర్థులవి 35.9 శాతం, ఎస్సీ అభ్యర్థులవి 15.83 శాతం, ఎస్టీ అభ్యర్థులవి 9.60 శాతం ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 19 వేల 9 దరఖాస్తులు రాగా, తర్వాతి స్థానాల్లో కేరళ 6 వేల 515 దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5 వేల 918 దరఖాస్తులు ఉన్నాయి. హెచ్‌సీయూ ప్రవేశపరీక్షలు దేశవ్యాప్తంగా 37 కేంద్రాల్లో జూన్ 1 నుంచి 5 వరకు జరగనున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూనిర్శిటీ అధికారులు చెబుతున్నారు. యూనివర్శిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కో సీటుకు 29 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. దీని పట్ల యూనివర్సిటీ అధికారులతో పాటు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - students