summer

14:36 - March 29, 2017

ఫిబ్రవరి చివరి వారం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడం మొదలు పెట్టారు. మార్చి నెలాఖరు రోజుల్లో ఎండలు మరింత ముదురుతున్నాయి. దీనితో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండలో వెళ్లడం ద్వారా పలు చర్మ..ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వచ్చు.

 • ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల వరకు, బయటకు వెళితే మరో లీటరు వరకు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా జ్యూస్ లు తీసుకోవాలి.
 • ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోకండి. గొడుగు, సన్ స్ర్కీన్ లోషన్స్, క్యాప్..వదులైన దుస్తులు ధరించాలి.
 • తేలికైన వదులుగా ఉన్న లేత రంగుల వస్త్రాలు ధరించాలి.
 • ఆల్కాహాల్, కాఫీ, టీల వంటివి డీహైడ్రేషన్ కు కారణమవుతాయి. వీలైనంత వరకు వేసవిలో వాటికి దూరంగా ఉండాలి.
 • ఆరు బయట, ఎండలో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉంటే మంచిది.
 • రోజులో అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 • వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. వడదెబ్బ తగిలిన వెంటనే వైద్యుడిని సంప్రదించడి.
12:22 - March 28, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. బెజవాడలో భానుడు విరుచుకుపడుతున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యుడి ప్రకోపానికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. చల్లధనం కోసం పరుగులు తీస్తూ శీతల పానియాలతో సేద తీరుతున్నారు. పనిలో పనిగా..పళ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ వ్యాపారులు దండుకుంటున్నారు. 
ఏపీలో ఎండలు 
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. జనాన్ని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా విరుచుకుపడుతున్నాయి. ఉక్కపోతకు తోడు వేడిగాలులు దడపుట్టిస్తున్నాయి. విజయవాడలో  ఎండలు తీవ్రస్థాయికి చేరుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రకోపానికి విజయవాడ వాసులు బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఠారేత్తిస్తుండటంతో.. ఇళ్లనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వడదెబ్బ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంకోపక్క భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో..మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్కపోత, వడగాలులు సైతం పెరగడంతో వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. 
అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు..
ఈ వేసవిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ అని  పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఉష్ణోగ్రతలు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఏపీ, తెలంగాణలో ఈ ప్రభావం మరింతగా ఉంటుందని..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఏటికేడు వడగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.  వీటిధాటికి 2015లో 1,369 మంది మృత్యువాతపడితే, 2016లో 723 మంది చనిపోయారు. ఏప్రిల్ రెండోవారం నుంచి మే నెలాఖరు వచ్చే సరికి రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి మాసంలోనే..తిరుపతి, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఏలూరులో ఎండలు తీవ్రమమయ్యాయి. 
మధ్యాహ్న సమయంలో బయటతిరగరాదు...
అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటతిరగకూడదని.. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు పూర్తి చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా పళ్లరసాలు, కొబ్బరిబోండాలు, మజ్జిగ సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఎండలు అన్యూహంగా పెరుగుతున్నాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 
సంగారెడ్డి జిల్లాలో 
సంగారెడ్డి జిల్లాలో భానుడు తన ప్రచండరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సూర్యుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మార్చిలోనే విపరీతమైన ఎండలు మండిపోతుండడంతో జనం ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండవేడికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 
భానుడు ఉగ్రరూపం
సంగారెడ్డి జిల్లాలో ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండల తీవ్రతకు జిల్లా ఉడికిపోతోంది. జిల్లావ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే ... నిప్పుల కొలిమిని తలపించే సెగలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. ఉదయం 8 గంటలకే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఇళ్లకే  పరిమితం అవుతున్నారు. భానుడి ప్రతాపానికి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఆయాస పడుతున్నారు. ఇప్పుడే ఇంత విపరీతంగా ఎండలు ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయమేస్తోందని ప్రజలంటున్నారు. 
బయటకాలు పెట్టాలంటే జంకుతున్న ఉద్యోగులు  
ఇక ఉద్యోగులు బయటకు కాలు పెట్టాలంటే జంకుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. చిన్నచిన్న శామియానాలు, గొడుగుల సహకారంతో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. రోడ్లు, బస్టాండ్లు, వివిధ కార్యాలయాలు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పెరిగిన ఎండలకు ఉపాధి కూలీలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారికి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. 
చిరువ్యాపారులకు వడదెబ్బ 
తోపుడు బళ్లు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే తొందరగా వడదెబ్బకు గురికావడం ఖాయమని డాక్టర్లు హెచ్చ రిస్తున్నారు. ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు శీతల పానియాల వైపు అడుగులు వేస్తున్నారు. పట్టణ కేంద్రాల్లో ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్రూట్‌ జూస్‌, కొబ్బరి బొండాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. ప్రజలకు అందు బాటులో వ్యాపారులు ఉంటూ తమ వ్యాపారాలు చేసు కొని సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొబ్బరి బోండాలు, నిమ్మరసం పానియాలకు డిమాండ్‌ పెరిగింది. 

 

12:17 - March 28, 2017

హైదరాబాద్ : ఓ వైపు ఎండలు మండుతున్నాయి.  మరోవైపు పండ్లను ముట్టుకుంటే అంటుకుంటున్నాయి. వేసవిలో ఆరోగ్యాన్ని పంచే పండ్లను తిందామంటే సామాన్యులకు తలకు మించిన భారంగా మారింది. అయితే వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా భావించి పండ్ల ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచి దోచుకుంటున్నారు. 
అమాంతంగా పెరిగిన పండ్ల ధరలు
మండు వేసవిలో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా ఇతర కాలాల కంటే ప్రస్తుతం పండ్లకు గిరాకీ అధికంగా ఉండడంతో.. పండ్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. పండ్ల ధరలు మూడింతలు పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్న సామాన్యులకు ధరలు చూసి మైండ్‌ దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడే ధరలు ఇలావుంటే రానురాను ఇంకేంత పెరుగుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
రెచ్చిపోతున్న వ్యాపారులు  
ఇదిలావుంటే ఇదే ఆసరాగా చేసుకుని హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సరుకును వేలం వేయకుండా రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో ఇష్టం వచ్చినట్లు రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. 
పెరిగిన విదేశీ పండ్ల ధరలు 
గతంలో 80 పలికిన గ్రేప్స్‌.. 100కు పెరిగింది. పుచ్చకాయలు 45 రూపాయలు, సంత్రా ఒక్కటి 10 రూపాయలకు చేరింది. ఇక మామిడికాయలైతే.. 120 రూపాయలు పలుకుతున్నాయి. మరోవైపు విదేశీ పండ్ల ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగిపోయాయి. 
ఇష్టానుసారంగా పండ్ల ధరల నిర్ణయం 
ఇదిలావుంటే.. హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలో పండ్ల ధరలను ఇష్టమొచ్చినట్లు నిర్ణయించి విక్రయిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలంటున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచే పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే.. గతేడాది కంటే ఈసారి పండ్ల ధరలు పెరిగాయని వ్యాపారులంటున్నారు. ఏది ఏమైనా వేసవిలో పండ్లు తింటే అనారోగ్యానికి గురికాకుండా ఉంటామనే నమ్మకంతో ప్రజలు ధర ఎంతైనా కొనుగోలు చేస్తున్నారు. 

 

13:28 - March 26, 2017

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని లవణాలు చెమటరూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు. దీనికి చికిత్స చేస్తే సరిపోతుంది. శరీష ఉష్ణోగ్రత తగ్గే విధంగా చూడాలి. మెడ..ఇతర భాగాల్లో ఐస్ ప్యాక్ లు పెట్టారు. వడ దెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకరావాలి. బట్టలను వదులు చేయాలి. నీటితో శరీరాన్ని తడపాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలు లేని వంటలు తినడం ఉత్తమం. బయటకు వెళ్లిన సందర్భంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.

11:48 - March 26, 2017

ఎండాకాలం..ఈసారి సూర్యుడు భగభగలాడనున్నాడు. ఫిబ్రవరి నుండే ఎండలు మండిపోతున్నాయి. ఈ భానుడి ప్రతాపం మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాయలసీమ, కోస్తా జిల్లాలో విపరీతమైన ఎండలు ఉండనున్నాయని, సాధారణం కన్నా మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కొనసాగే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. కర్నూలులో రూ.41.1, అనంతపురంలో 40.7, జంగమేశ్వరపురంలో 41, తిరుపతిలో 40.5, నందిగామలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతల 40 డిగ్రీల సెల్సియస్ ను తాకింది. ఆదిలాబాద్ లో 41 డిగ్రీలు, నిజామాబాద్ లో 40.2, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాచలంలో 40 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదైంది. ఎండలు తీవ్రతరం అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులకు వ్యాపారాలు మానేసి ఇంటికే పరిమితమౌతున్నారు. ఉపాధి హామీ కూలీలపై ఎండల ప్రభావం అధికంగా ఉంటోంది. మరోవైపు ఎండవేడిమితో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈనెల 6వ తేదీన 9,003 మెగావాట్ల వినియోగం ఇప్పటి వరకు అత్యధికంగా ఉంది. మార్చి 24వ తేదీన గతంలో ఎప్పుడూ లేనంతగా 9,051 మెగావాట్ల వినియోగం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

12:36 - March 23, 2017
13:30 - March 21, 2017

వేసవి కాలం వచ్చేసింది..ఇక ఉక్కపోత..చెమట..వడదెబ్బ..ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండల ప్రభావం వల్ల శారీరకంగా..మానసికంగా..కృంగి పోతుంటారు. మరి ఈ సమస్య నుండి బయటపడడం ఎలా ? కొన్ని చిట్కాలు..

 • వేసవిలో నీడలోనే గడిపితేనే మంచిది. ఉద్యోగులు..బయటకు వెళ్లే వారు సన్ స్ర్కీన్, టోపి, సన్ గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి.
 • వేసవికాలంలో తగినంత నిద్ర ఉండి తీరాల్సిందే. సమయానికి నిద్ర పోవడం వల్ల మానసిక ప్రశాంతత చేరుకుంటుందనడంలో సందేహం లేదు.
 • వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఇలా చేయడం వల్ల నీరసం రాదు. అంతేగాకుండా శరీరంలోని నరాలు..ఎముకలు బలంగా ఉంటాయి.
 • రోజు ఉదయం..సాయంత్రం వ్యాయామం చేయండి. కనీసం 20 నిమిషాలైనా నడవాలి.
 • తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
19:28 - March 15, 2017

ఎండాకాలం వచ్చేసింది. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. ఎండల వల్ల డీ హైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో ఎండకాలం నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది తాజా పండ్ల రసాలను తీసుకోవడం. క్యారెట్..బీట్ రూట్..దానిమ్మ..సంత్రా..ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వచ్చే కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ద్రాక్ష జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

12:21 - March 14, 2017

ఎండకాలం వచ్చేసింది. చాలా మంది ఈ కాలంలో డీ హైడ్రేషన్ బాధ పడుతుంటారు. దీని నుండి తప్పించుకోవాలంటే 'కీర' తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇది దాహం తీరుస్తుంది. కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరిగి వేడి తగ్గుతుంది. కీరదోస రసంలో పోటాషియా, మెగ్నీషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి. కీరను తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలని ధృడంగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపే శక్తి ఉంది. ఖనిజ లవణాలు ఉదర సంబంధిత వ్యాధులతో కీర పోరాడుతుంది. అజీర్తి లేకుండా చేయడం..శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం అల్పాహారంతో పాటు కొన్ని కీరదోస ముక్కల్ని తీసుకుంటే తక్కువ కెలొరీలు ఎక్కువ శక్తి అందుతాయి. 

12:12 - March 10, 2017

పండ్లు..కూరగాయలు..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో బొప్పాయి పండు ఒకటి. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి పండులో బీటా కెరోటిన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉంటాయి.
పోటాషియం, పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితంగా హృద్యోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ.
బొప్పాయిలో కోలిన్ అనే పదార్థం ఉండడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
మదుమేహం వ్యాధి ఉన్న వారికి బొప్పాయి పండు చక్కగా ఉపయోగపడుతుంది. చక్కెర శాతం పెరగకుండా కాపాడుతుంది.
కొవ్వును కరిగిస్తుంది. అలాగే నిద్రలేమికి చెక్ పెడుతుంది.
బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియకీ దోహదపడుతుంది.
బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్‌ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాలమీద పెట్టడంవల్ల అవి త్వరగా తగ్గుతాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - summer