summer heat

09:29 - April 29, 2018

చిత్తూరు : తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. భానుడి దెబ్బతో నగర వాసులు విలవిల్లాడిపోతున్నారు. గత 10 రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులు సైతం సూర్యప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. గత పది రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇదే పరిస్థితి. ఇక మిట్ట మధ్యాహ్నం భానుడు టాప్ గేర్‌లో కాకపుట్టిస్తున్నాడు. దీంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తిరుమలకు యాత్రికుల తాకిడి భారీగా పెరిగింది. అయితే ఎండల తీవ్రతతో శ్రీవారి భక్తులు బెంబేలెత్తుతున్నారు. కొండపైకి వెళ్ళడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే...ఇక మే నెల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల తప్పనిసరి అయితే తప్ప ఎండలో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. మంచినీటితోపాటు.. తలమీద టవల్‌, నీడకోసం గొడుగు లాంటివి వాడాలంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బతో ఇబ్బందుల పాలవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

18:04 - April 26, 2018
16:59 - April 26, 2018

శ్రీకాకుళం : సిక్కోలు ప్రజలను భానుడు వణికిస్తున్నాడు. ఎండల తీవ్రతతో నదులన్నీ ఎడారిలను తలపిస్తున్నాయి. నీటి వనరులు, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ప్రజలంతా నీటి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. ఎండల దాటికి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మండిపోతున్న ఎండలు..
శ్రీకాకుళం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఆముదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ మున్సిపాలీటిలు, రాజం, పాలకొండ నగరపంచాయతీల్లో నీటి సమస్య తీవ్రమైంది. మూగ జీవాలకు సైతం నీరు దొరకని పరిస్థితి మొదలైంది. ఇచ్ఛాపురం, మందస, భీమిని, పాతపట్నం, బూర్జ, రణస్థలం మండలాల్లో తాగునీటి సమయ్య విపరీతంగా ఉంది. మత్స్యకారులు సైతం చలిమలు తవ్వి గొంతు తుడుపుకుంటున్నారు. పలు కాలనీలకు మాత్రం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి గొంతు తడుపుతున్నారు.

ఎండిన బావులు,కుంటలు,ఎడారులను తలపిస్తున్న నదులు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నీటివనరులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులు ఎడారులను తలపిస్తున్నాయి. హిర మండలంలోని గొట్టా జలశయం, తొటపల్లి, నారాయణపురం లాంటి తాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోడంతో నీటి సమస్య తీవ్రమైంది.

ఎడారులను తలపిస్తున్న వంశధార, నాగావళి, మహేంద్రతనయ
సిక్కోలు జిల్లా మునుపెన్నడూ లేనంతగా వేడెక్కిపోయింది. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయు. ఎండ తీవ్రత వల్ల శ్రీకాకుళం వాసులు అడుగు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు.ఇక వృద్ధులు, చిన్న పిల్లలు పరిస్థితిని చెప్పక్కరలేదు. దీనికితోడు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందో అని శ్రీకాకుళం వాసులు హడలిపోతున్నారు. 

16:05 - April 26, 2018
12:31 - April 26, 2018

కొమరం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వేడి గాలులు వీస్తుండడం..ఉదయం నుండే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండ నుండి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండ దెబ్బతో 20మంది ఆసుపత్రి పాలయ్యారు. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:31 - April 26, 2018

కరీంనగర్‌ : జిల్లాలో భానుడు భగభగ లాడుతూ.. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రధాన జలవనరులైన ఎల్లంపల్లి, లోయర్‌ మానేర్‌లో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో భవిష్యత్‌పై ఆందోళన కలిగిస్తుంది. ఇక సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో కార్మకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బయటి రావడానికే భయపడుతున్నారు. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వచ్చే మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగె అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నీళ్లు లేక చెరువులు ఎండిపోయి మైదానాల్లా మారుతున్నాయి. బోర్లు ,బావుల్లో చుక్క నీరు లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఇక పంట చేతికొచ్చే సమయానికి నీటి సమస్యలు తలెత్తడంతో రైతాంగం నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులకు ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఎండిన పంట పశువులకు మేతగా మారింది.

ఉమ్మడి కరీంనగర్‌కు ప్రధాన జలవనరులుగా ఉన్న ఎల్లంపల్లి, లోయర్‌ మానేర్‌ జలశయాల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కరీంనగర్‌లో నీటి అవసరాలకు లోయర్‌ మానేర్‌ ఒక్కటే దిక్కు. దీంతో జలాశయంలో నీరు అడుగంటుతుండటంతో నగరానికి తీవ్రమైన నీటి కష్టాలు మొదలయ్యాయి. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన లోయర్‌ మానేర్‌ డ్యామ్‌లో ప్రస్తుతం 6.35 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 15 రోజులుగా బూస్టర్లకు నీటి ప్రెషర్‌ రాకపోవడంతో.. డ్యామ్‌లో నీటి మోటర్లు పెట్టి ఎత్తిపోసే పరిస్థితి నెలకొందని అధికారుల చెపుతున్నారు. ఇక హైదరాబాద్‌కు నీటిని తరలించే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో సైతం నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. 20.17 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.52 టీఎంసీల నీరు ఉంది.

సింగరేణి ప్రాంతంలో అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బొగ్గు గనులు అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంలో ప్రతిఏటా 47 నుండి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన మూడు రోజుల నుండి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే అధికంగా వేడి ఉండడంతో కార్మికులకు పని చేయడం కష్టంగా మారింది. దీంతో ఉపశమన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.-

13:42 - April 24, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలోని ఏజెన్సీప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వేసవి ప్రారంభంలోనే... గిరిజనానికి చెలిమల నీరే దిక్కైంది.  గుక్కెడు మంచినీటి కోసం గిరి గ్రామాలు... పుట్టెడు కష్టాలు పడుతున్నాయి.  బిందెడు నీటికోసం మహిళలు మైళ్లదూరం నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రజల నీటికష్టాలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పచ్చని అడవి అందాలకు నెలవు. ఈ జిల్లా కోనసీమను తలపిస్తుంది.  ప్రాణహిత, పెనుగంగా, పెద్దవాగు లాంటి నదులు ఉన్నాయి. ప్రజల తాగునీరు, సాగునీరు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు నియోజకవర్గ ప్రజలకు మాత్రం నీటికష్టాలు తప్పడం లేదు. ఎన్నో నదులున్నా  ప్రజల తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. 

వేసవికాలం ఇప్పుడిప్పుడే మొదలైంది. కానీ ఏజెన్సీ ప్రాంతం మాత్రం తాగునీటితో అల్లాడుతోంది. బెజ్జూరు మండల కేంద్రంతోపాటు జైహింద్‌పూర్‌, తలాయి, కుష్నేపల్లిలో నీటికష్టాలు వర్ణనాతీతం. గుక్కెడు నీటికోసం ప్రజలు వాగులలో సెలిమలు తోడుకుని తెచ్చుకుంటున్నారు. కౌటాల మండలం పాత కన్నెపల్లిలో గ్రామం మొత్తానికి ఒకే వ్యవసాయ బావి దిక్కైంది. గ్రామంతా ఆ బావి నుంచే తాగునీరు తెచ్చుకుంటున్నారు. మూరుమూల మండలమైన దహేగాంలోని మొట్లగూడ, రాంపూర్‌ గ్రామప్రజల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. మంచినీటి కోసం మహిళలు 3 నుంచి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి పెద్దవాగులో చెలిమలు తోడుకుని నీరు తెచ్చుకుంటూ దాహం తీర్చుకుంటున్నారు. 
 
మార్చి మాసం నుంచే ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఈ గ్రామాల్లో బోర్లు వేసినా పనిచేయడం లేదు.  వాగులో చెలిమల ద్వారా తెచ్చుకున్న నీటిని తాగి తరచూ రోగాల బారిన పడుతున్నారు. పలువురు చనిపోయారు కూడా. తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారుల దృష్టికి గ్రామస్తులు పలుమార్లు తీసుకెళ్లారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరెలా ఉంటుందో తలచుకుని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బోథ్‌ నియోజకవర్గంలోనూ తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి గుక్కెడు నీరు లేక అవస్థలు పడుతున్నారు. ప్రతి వేసవికాలంలోనూ ఇక్కడ నీటిఎద్దడి ఉంటోంది.  బోర్లు ఉన్నా.. అందులో నీరులేక పనిచేయవు.  పొచ్చెర్లలో ఎడ్లబండ్ల ద్వారా శివారులోని బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.  జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని ఖండాల, ఖానాపూర్‌ గ్రామాల్లో చుక్కనీరు దొరకని పరిస్థితి నెలకొంది. తాగునీటి కోసం ప్రజలు  గుట్టలు దిగి మరీ తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మాంగ్లి, కేబీ కాలనీ, ధర్మూగూడలో మంచినీటి కటకట ఏర్పడింది.  మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి ఇప్పటికే మొదలైంది.

ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గుక్కెడు నీటికోసం మనుషులే అల్లాడుతోంటే.. ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. వాగులు, కుంటలు ఎండిపోవడంతో మూగజీవాలు నీరులేక అల్లాడుతున్నాయి. కొంతమంది వాటిని అమ్మేస్తున్నారు. గ్రామాల్లో నీటితొట్టెలు నిర్మించినా వాటిలోనీరు లేకపోవడంతో పశువుల దాహార్తి తీరడం లేదు.  

తాగునీటి కష్టాలపై ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించారు. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వేసవికాలం మంచినీటి సరఫరా చేయాలని కోరారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

13:35 - April 24, 2018

ప్రకాశం : జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతుండడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. బావులు, చెలిమేల వద్ద బారులు తీరుతున్నారు. పట్టణాల్లోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. దీంతో మహిళలకు నీటి ట్యాంకర్ల దగ్గర బిందెల యుద్ధం తప్పడం లేదు. 

వేసవి ప్రారంభంలోనే ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వర్షాభావానికి తోడు, ముందు చూపు లేని అధికారుల నిర్వాకంతో  ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.  ఇక గ్రామాల్లోనైతే నీటి కోసం చెలిమెలు, బావుల వద్ద జనం బారులు తీరుతున్నారు. 

పట్టణాల్లోనూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన  ఒంగోలుతోపాటు ఇతర పట్టణాల్లోనూ  మంచినీటి కటకట ఏర్పడింది. చాలా కాలనీలకు మంచినీటి సరఫరానే లేదు. వారానికి ఒకసారి ట్యాంకర్లతో నీటిసరఫరా చేస్తున్నారు. దీంతో ట్యాంకర్‌ రాగానే జనం నీటికోసం ఎగబడుతున్నారు. మహిళలు బిందెలతో యుద్ధమే చేస్తున్నారు. సరిపడ నీరుదొరకక అధికారులపై మహిళలు మండిపడుతున్నారు. పలుచోట్ల ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తున్నారు. 

ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది.  ఉదయం 10 గంటల నుంచి జనం బయటికి రావలంటే భయపడుతున్నారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరెలా ఉంటుందోన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో బలంగా వీస్తున్న వడగాలులకు వృద్ధులు చనిపోతున్నారు. 

వర్షాభావ పరిస్థితులతో ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.  దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన రక్షిత మంచి నీటి పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. అయితే జనం వాటర్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడిపై ఎలాంటి ముందుచూపు లేకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు అంటున్నారు. తమ తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. 

08:32 - April 24, 2018

జగిత్యాల : వారుండేది పూరి గూడిసెల్లో.. నిత్యం ఊర్లూ తిరుగతూ కుంటుంబాన్ని పోషించుకుంటారు. అయినా వారి గుడిసెలు ఏసీ ఉన్నంత చల్లగా ఉంటాయి. గుడిసెల్లో ఏసీలేంటనీ ఆశ్చర్యపోతున్నారా.. మండుతున్న ఎండలకు గుడిసెల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో మనమూ ఓ లుక్కేద్దాం.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సాయిరాం కాలనీలో నిరుపేద కుటుంబాలు నివాసముంటున్నాయి. ఊరూరూ తిరుగుతూ బెలూన్లు అమ్ముకుంటూ ఉపాధి పొందుతుంటారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఎండ తీవత్రను తట్టుకునేందుకు వారు అష్టకష్టాలు పడుతున్నారు.

ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వీరు బీడి కంపెనీలతో పాటు రైతుల వద్ద గన్నీసంచులను సేకరించి వాటిని గుడిసెలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల ఇంట్లో చల్లదనం  ఉండేలా చూసుకుంటున్నారు. వడదెబ్బ నుంచి వారి పిల్లలను కాపాడుకుంటూ హాయిగా ఉంటున్నారు. 

ప్రభుత్వం స్వచ్ఛతను పాటించాలని పదేపదే చెబుతుండటంతో వీరు స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుగా  చేరి.. గుడిసెల ముందు మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించుకొని స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. విన్నూత ఆలోచనతో గన్నీ సంచులతో తయారు చేసిన గుడిసెలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గుడిసెలకు గన్నీ సంచులు ఏర్పాటు చేసుకుని ఎండ నుండి రక్షణను కల్పించకుంటూనే..స్వచ్ఛతకు పాటుపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

15:48 - April 20, 2018

నిజామాబాద్ : భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఎండలు విపరీతంగా పెరగడంతో బయటకు రావాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. ఏప్రిల్‌ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని నిజామాబాద్‌ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎండ తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - summer heat