supreme court

19:41 - April 21, 2017

చెన్నై: త‌మిళ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు వ‌ల్లియూర్ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. మ‌హాభార‌తంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా కమల్‌హాసన్‌ హిందూ మతాన్ని అవమానించారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వడానికి మే 5న కోర్టు ముందు హాజ‌రు కావాల‌ని కమల్‌ను ఆదేశించింది. ఇంత‌కుముందు తిరునల్వేలీ కోర్టులోనూ హిందు మ‌క్కల్ క‌చ్చి స‌భ్యులు పిల్ దాఖ‌లు చేశారు. మ‌హాభార‌తంలో ద్రౌప‌దిని ఓ పావులాగా వాడుకొని పాండ‌వులు జూద‌మాడార‌ని, అలాంటి పుస్తకాన్ని హిందువులు గౌర‌విస్తున్నార‌ంటూ క‌మ‌ల్‌హాస‌న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ ఛానల్‌లో మహిళలపై దాడుల గురించి మాట్లాడుతూ కమల్‌ మహాభారతాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

16:41 - April 21, 2017

హైదరాబాద్: అక్ర‌మాస్తుల కేసులో సాక్షుల‌ను ప్ర‌భావితం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని పేర్కొంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం వాదనలు విని, ఈ నెల 28కి తీర్పును వాయిదా వేసింది. అయితే, మ‌రోవైపు న్యూజిలాండ్ వెళ్లేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ వేశారు. మే 15 నుంచి జూన్ 15 మ‌ధ్య 15 రోజులు వెళ్లేందుకు ఆయ‌న‌ అనుమ‌తి కోరారు. వేస‌వి సెల‌వుల నిమిత్తం కుటుంబంతో క‌లిసి వెళ్లాల‌ని జ‌గ‌న్ పిటిష‌న్ లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారించిన కోర్టు ప‌లు అభ్యంత‌రాలు తెలుపుతూ త‌మ‌ నిర్ణ‌యం ఈ నెల 28న తెలుపుతామ‌ని చెప్పింది.

15:31 - April 21, 2017

ఇటీవల పలువురు హీరోలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కోర్టు సమన్లు జారీ చేయడంపై చర్చానీయాంశమైంది. మహాభారతం..ద్రౌపదిపై కమల్ పలు వ్యాఖ్యలు చేశారని, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ హిందూ మక్కల్ కట్చి పార్టీ కోర్టుకెక్కింది. దీనితో వల్లియార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. మరి కమల్ కోర్టుకు హాజరౌతారా ? లేదా ? అనేది చూడాలి.

13:50 - April 21, 2017

నోబెల్ బహుమతి మలాల పాక్ పై పలు విమర్శలు..అత్యధిక వృద్ధురాలు కన్నుమూత..మరుగుదొడ్లు లేక మహిళల ఇబ్బందులు..తగిన కారణాలు లేకుండానే తలాక్ చెబితే సామాజిక బహిష్కరించాలని పిలుపు..గునాలో ఓ రైతు చేసిన చర్యపై పెద్దలు దారుణ తీర్పు..నేపాల్ అధ్యక్షురాలు భారత్ లో పర్యటన..ట్రిపుల్ తలాక్ పై అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పందన..రెజ్లర్ గీతా ఫొగట్ కామన్ వెల్త్ క్రీడలపై దృష్టి...పూర్తి వార్తల విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

12:55 - April 20, 2017

అన్ని రకాల ఉత్పత్తుల్లో మహిళలదే కీలక పాత్ర. కానీ వారి శ్రమకు గుర్తింపు మాత్రం రావటం లేదు. కుటుంబ సభ్యుల వ్యవహారం నుండి మొదలుకొని అన్ని పనులు వాళ్లే చూసుకొంటుంటారు. వంట‌, ఇంటిశుభ్రం, పిల్ల‌ల పెంపకం, అతిధి మ‌ర్యాదలు, పెద్ద‌వారికి సేవ‌లు…ఇవ‌న్నీ ప్ర‌పంచంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక నిరంత‌ర ప్ర‌వాహంలా జ‌రిగిపోతున్నాయి. ఉత్ప‌త్తికి అనుకూలంగా ప్ర‌పంచాన్ని నిర్వ‌హిస్తున్న‌ది ఎవరు ? ప్ర‌పంచంలో ఆర్థికం కాని ఏకైక అంశంగా మ‌హిళా శ్ర‌మ ఇప్ప‌టికీ మిగిలి ఉంది. కానీ సమాజంలో మహిళ అంటే ఇంకా చులకన భావం ఉంది. పురుషులతో సమానంగా వేతనాలు ఇంకా అందడం లేదు. ప్రతి రంగంలో మహిళలు చేస్తున్న శ్రమ అసమానం. మరి వారికి ప్రాధాన్యం ఎక్కడ...? మహిళలుకు సరైన గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మానవి 'ఫోకస్'. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

09:24 - April 20, 2017

ఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అద్వాని, మురళీమనోహర్‌ జోషి, ఉమాభారతితో సహా 12 మంది బిజెపి నేతలపై కేసు పునరుద్ధరణకు సిబిఐకి కోర్టు అనుమతించింది. ఈ కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి రెండు కేసుల విచారణ వేర్వేరు కోర్టుల్లో కొనసాగుతోంది. కరసేవలకుపై నమోదైన కేసు లక్నో కోర్టులో.. బిజెపి నేతలకు ప్రమేయమున్న కేసు రాయ్‌బరేలి కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసును ఒకే కోర్టులో ఎందుకు విచారణ జరపకూడదని అంతకు ముందు జరిపిన విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణను నాలుగు వారాల్లో రాయ్‌బరేలీ నుంచి లక్నో కోర్టుకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లక్నో కోర్టులో విచారణ సందర్భంగా వాయిదాలకు అనుమతి ఇవ్వొద్దని, ఈ కేసు విచారణ జరిపే న్యాయమూర్తిని బదిలీ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కల్యాణ్‌సింగ్‌కు మినహయింపు...
రాజస్థాన్‌ గవర్నర్‌గా ఉన్న యూపీ మాజీ సిఎం కల్యాణ్‌సింగ్‌కు మాత్రం ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నందున తర్వాత విచారణ చేపట్టాలని సూచించింది. వినయ్‌ కటియార్, సాధ్వి రితంబర తదితరులు ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంది. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్‌సింగ్‌ వంటి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే లక్షలాది మంది కరసేవకులు మసీదును కూల్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దీంతో సీబీఐ ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అద్వానీ సహా ఇతర నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించింది.

13:15 - April 19, 2017
13:12 - April 19, 2017
11:23 - April 19, 2017

ఢిల్లీ : బీజేపీ అగ్రనేతలకు షాక్ తగిలింది. బాబ్రీ కేసులో బీజేపీ పార్టీలో అగ్రనేతలుగా చలామణి అవుతున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో సహా బీజేపీ నేతలపై కేసుల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 16 మందిపై కేసుల పునరుద్ధరణకు, ఈ కేసును లక్నోలోని ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం పక్కకు పెట్టడం విశేషం. రోజు వారీ విచారణ చేపట్టి రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే బాబ్రీ కేసు నుండి కల్యాణ్ సింగ్ కు మినహాయింపునిచ్చింది. రాజస్థాన్ గవర్నర్ గా ఉన్నంత వరకు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. గతంలో విచారణ నుండి అద్వానీని అలహాబాద్ కోర్టు మినహాయించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీలో కలకలం రేగినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి రేసులో..ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్న అద్వానీపై ఈ కేసు ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 • 1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి.
 • మసీదు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్‌పీ, ఆరెస్సెస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ.. అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది.
 • ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి.
 • 400 ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు. అక్కడ అంతకుముందు ఉన్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు.
 • 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది. అందులో పలువురు బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి.
 • అద్వానీ, ఉమాభారతి, జోషి, కల్యాణ్ సింగ్ తో సహా మొత్తం 22 మంది నేతలు గుర్తు తెలియని కరసేవకులను ప్రోత్సాహించారని కేసు నమోదైంది.
 • రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టు 2001, మే 4న విచారణ నుంచి తప్పించింది. వారిపై తగిన సాక్ష్యాధారాలు లేవంటూ కేసు కొట్టి వేసింది.
 • ఆ తీర్పును అలహా బాద్‌ హైకోర్టు 2010, మే 20న సమర్థించింది. దీన్ని సీబీఐ 2011 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.
 • 2002లో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేశారు. దానిని తగుల బెట్టారు.
 • ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోను వందలాది మంది ముస్లింలు చనిపోయారు.
 • హైకోర్టు 2002 నుంచి వాదనలు వినడం ప్రారంభించింది.
 • తాజాగా సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లడంతో కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది.
19:56 - April 18, 2017

హైదరాబాద్: బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యా లండన్‌లో అరెస్ట్‌ అయ్యారు. అరెస్ట్‌ అయిన 3 గంటలకే ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన అరెస్ట్‌పై భారత్‌ మీడియా అత్యుత్సాహం చూపిందని ట్విట్టర్‌లో మాల్యా అన్నారు.

ఫలించిన భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు...

భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాను లండన్‌ టైం ప్రకారం ఉదయం తొమ్మదిన్నరకు స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంటనే మాల్యాను వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రవేశ పెట్టారు. మూడు గంటల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

17 బ్యాంకుల్లో 9 వేల కోట్ల రుణాలకు మాల్యా ఎగనామం...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా 17 బ్యాంకుల్లో 9 వేల కోట్ల రుణాలకు మాల్యా ఎగనామం పెట్టారు. బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా మార్చి2, 2016లో దేశం విడిచి పారిపోయారు. విజయ్‌ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం మాల్యా వీసాను కూడా రద్దు చేసింది. మాల్యాను తమకు అప్పగించాలని ఫిబ్రవరిలో భారత విదేశాంగ శాఖ యూకే ప్రభుత్వాన్ని కోరింది.

మనీలాండరింగ్‌ కేసులో మాల్యాకు ఈడీ పలుమార్లు సమన్లు...

మనీలాండరింగ్‌ కేసులో విచారించేందుకు మాల్యాకు ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసినా హాజరు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను భారత్‌కు రాలేనని... రుణాల చెల్లింపు విషయంలో బ్యాంకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్టు మాల్యాపై ఆరు సార్లు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌ 9 న వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు మాల్యాను ఆదేశించినా స్పందించలేదు. ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ కూడా విచారణ జరుపుతోంది.

మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును...

మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాల్యా తన పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలని పిటిషన్‌ వేసింది. అయితే దీనిపై కూడా మాల్యా స్పందించలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆయనపై ఓపెన్‌ ఎండెడ్‌ నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తన అరెస్ట్‌పై భారత్‌ మీడియా అతిగా ప్రవర్తించిందని విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశారు. భారత్‌కు అప్పగింతపై కోర్టులో వాదనలు మొదలయ్యాయని మాల్యా పేర్కొన్నారు. మొత్తానికి మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించడానికి మార్గం సుగమమైంది. త్వరలో సిబిఐ వర్గాలు లండన్‌కు వెళ్లనున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - supreme court