Swami Paripoornananda

12:46 - November 25, 2018

హైదరాబాద్‌: ఎన్నికల్లో గెలవటానికి వివిధ రాజకీయ పార్టీలు ప్రజాకర్షణ ఉన్న నాయకులను, సినిమా నటులను, సెలబ్రిటీలను ఎన్నికల్లో ప్రచారంలో వినియోగిస్తూ ఉంటారు.  కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా కొంతమందిని సెలక్ట్ చేసి వారితో ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేయిస్తోంది. హిందుత్వవాదంతో దూసుకు వెళ్లే భారతీయ జనతాపార్టీ  తరుఫున తెలంగాణలో ఇప్పటికే శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందతో ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలో మరో స్వామిని కూడా భారతీయ జనతాపార్టీ రంగంలోకి దింపుతోంది. ఎవరా స్వామి అంటారా.... ఇంకెవరు...ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు డిసెంబరు 2న రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రోజు ఆయన భూపాలపల్లి, ముధోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డిలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.  అనంతరం డిసెంబరు 5న మళ్లీ వచ్చి కరీంనగర్, వరంగల్, గోషామహల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో యోగి ఆదిత్యనాధ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

18:59 - October 24, 2018

హైదరాబాద్: తెలంగాణాలో బీజేపీని అధికారం లోకితీసుకు రావటానికి నేటి నుంచిపార్టీ కోసం కష్ట పడతానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. ఇన్నాళ్ళు రాష్ట్రంలో  దారుసలాం కనుసన్నల్లో  రాష్ట్రంలో పార్టీలు పనిచేశాయని, త్వరలో లాల్ దర్వాజా కనుసన్నల్లో  రాజకీయాలు నడుస్తాయని ఆయన అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో సమావేశం అయిన తర్వాత, బుధవారం హైదరాబాద్ చేరుకున్న స్వామీజీ మొదట చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి  ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్సి మురళీధరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

"రాజకీయాల్లోకి రావాలంటే ఫాదర్ అన్నా ఉండాలి గాడ్ ఫాదర్ అన్నా ఉండాలి, నాకు దేవుడు తప్పు ఎవరూ దిక్కులేరని" స్వామిజీచెప్పారు. గత 25 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై పోరాడాను అని, మారుమూల ప్రాంతాల్లో పర్యటించానని అక్కడి ప్రజల జీవన స్ధితిగతులు పరిశీలించానని, వారి జీవితాలు బాగుచేయాలంటే రాజకీయాల్లోకి రావటం ఒక్కటే మార్గమని ఆలోచించి బీజేపీలో చేరానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు.

ఇన్నాళ్లు ధర్మంకోసం పోరాడావు ఇప్పుడు దేశం కోసం పాటు పడమని తన తల్లి,గురువు చెప్పటంతో నాఆలోచనలకు తగ్గ పార్టీ బీజేపీ అనిభావించి బీజేపీలో చేరినట్లు పరిపూర్ణానంద తెలిపారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచనలు మేరకు తాను పనిచేస్తానని, అందరినీ కలుపుకుపోయి బీజేపీని ఆధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తానని పరిపూర్ణానంద  చెప్పారు. పార్టీకోసం అన్ని రాష్ట్రాలలో పనిచేస్తానని, ఇక కురుక్షేత్రం మొదలైందని, రాష్ట్రంలో కుటుంబపాలనను అంతంచేస్తామని,తెలంగాణ ఇంక కాషాయ తెలంగాణా కాబోతోందని  ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

17:55 - October 24, 2018

హైదరాబాద్: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న స్వామి పరిపూర్ణానంద ఢిల్లీలో  బీజేపీ అధిష్టానంతో సమావేశం అయ్యి బుధవారం రాష్ట్రానికి తిరిగివచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు,స్వామివారి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిజి చార్మినార్ వద్దకు చేరుకుని  భాగ్యలక్ష్మిఅమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు.అనంతరం స్వామిపరిపూర్ణానంద బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. 

10:47 - October 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్, టీఆర్ఎస్‌ను ఓడించాలని టిడిపి, కాంగ్రెస్ ఇతర పార్టీలు జత కడుతుండగా, బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలో పాగా వేయాలని కాషాయ దళం భావిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు శ్రీ పీఠం పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను ఉపయోగించాలని భావిస్తోంది. 
శుక్రవారం పరిపూర్ణానంద ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. బీజేపీలో చేరాలని..పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని మోడీ..షాలు సూచించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే అమిత్ షాతో స్వామి భేటీ అయిన సంగతి తెలిసిందే. దసరా అనంతరం తన కార్యచరణను ప్రకటిస్తానని పరిపూర్ణానంద తెలియచేసినట్లు సమాచారం. విజయదశమి పండుగ పూర్తి కావడంతో ఆయన హస్తినకు బయలుదేరారు. మరి ఆయన ఎలాంటి కార్యచరణను ప్రకటిస్తారో వేచి చూడాలి.
గతంలో రాముడి విషయంలో సినీ విశ్లేషకులు కత్తి మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కత్తి వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద ఖండించారు. తాను శాంతి యాత్ర చేపడుతానని ప్రకటించడం..కత్తి విమర్శలు చేయడంతో ఇరువురిపై పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అయితే, ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలో అడుగుపెట్టారు. బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. 

18:51 - October 8, 2018

ఢిల్లీ: బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. అమిత్‌షా ఆదేశాల మేరకు తన ప్రణాళిక ఉంటుందని,నవరాత్రి ఉత్సవాలు అయ్యాక మరోసారి కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. 
శ్రీ పీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు చేస్తున్న స్వామి పరిపూర్ణానంద ఇటీవలి కాలంలో హిందూ మత పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలతో వార్తల్లో నిలిచారు. యూపీలో యోగి ఆదిత్యనాధ్ తరహాలోనే  తెలంగాణాలోను స్వామి పరిపూర్ణానందను రంగంలోకి  దింపి హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉంది. అంతకు ముందు స్వామి పరిపూర్ణానంద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తోనూ సమావేశం అయ్యారు. 

19:51 - October 7, 2018

హైదరాబాద్... స్వామి పరిపూర్ణానంద బీజీపీ సీఎం అభ్యర్ధి గా పోటీ చేస్తున్నారా..,కొన్నాళ్లగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు  ఇప్పుడు మరింత బలం చేకూరు తోంది, స్వామి పరిపూర్ణానందను  బీజీపీ అధిష్టానం  ఢిల్లీ కి పిలిపించింది,  కాకపోతే ఆయన తెలంగాణ నుంచి  పోటీ చేస్తారా ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు,  రెండు తెలుగు రాష్ట్రాల్లో  జనాకర్షణ  ఉన్న నాయకుడి  కోసం ల వెదుకుతున్న  బీజీపీకి   పరిపూర్ణానంద ఇటీవలి కాలంలో హిందుత్వ అంశాలపై చేసిన పోరాటం బీజేపీ అధినాయకత్వం  గుర్తించింది, దాంతో ఆయనతో సంప్రదింపులుజరిపేందుకు ఢిల్లీ   పిలిపించారు, 

 

11:39 - August 14, 2018

హైదరాబాద్ : యువతలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై నగర బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదోపవాదాలు విన్న తరువాత, ఆయన ఎక్కడైనా తిరగవచ్చని చెబుతూ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది. కాగా నెల రోజుల క్రితం పరిపూర్ణానంతపై నగర బహిష్కరణ విధిస్తు..హైదరాబాద్, రాజకొండ, సైబరాబాద్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

21:44 - July 9, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించారు పోలీసులు. హిందూ ధర్మంపై కత్తి మహేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనలకు దిగాయి. అంతేకాకుండా భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. నగరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.

వివాదాస్పద వ్యాఖ్యల కత్తి మహేశ్ పై చర్యలు
గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యల చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌లోకి అడుగు పెట్టవద్దని ఆదేశించారు. అంతేకాకుండా కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించారు.

కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు
కత్తి మహేష్‌, హిందూ ధార్మిక సంఘాల ఆందోళనల నేపథ్యంలో... డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమాజంలో అలజడి సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్‌ను ఆరు నెలలపాటు హైదరాబాద్‌ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. నగరానికి రావాలంటే తమ అనుమతి తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

పరిపూర్ణానంద యాదాద్రి పాదయాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ
గత కొన్ని రోజుల క్రితం కత్తి మహేష్‌ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని.. గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కత్తి మహేష్‌ను పీఎస్‌కు పిలిపించి స్టేట్‌మెంట్‌ తీసుకుని పంపించి వేశారు. అయితే.. కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ... శ్రీపీఠం అధిపతి పరిపూర్ణనంద స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. దీంతో సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిపూర్ణనంద ఇంటికి చేరుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిపూర్ణానందకు మద్దతుగా హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

పోలీసుల తీరుపై పరిపూర్ణానంద అసంతృప్తి
ఇక తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై పరిపూర్ణానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులతో కలిసి వెళ్లడానికి పోలీసులు అనుమతివ్వకపోతే... ధర్మాగ్రహా యాత్రను నిర్వహించేందుకు తానొక్కడికి అనుమతివ్వాలని లేనిపక్షంలో అన్నపానీయాలు మానేస్తానని హెచ్చరించారు. తనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారని.. వారిని బేషరతుగా విడుదల చేయాలని పరిపూర్ణానంద డిమాండ్‌ చేశారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం : డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌కు ఎవరైనా రావొచ్చు.. జీవించవచ్చని.. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు ప్రతిస్పందించారు. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

 

15:42 - July 9, 2018

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని స్వామి పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిపూర్ణనంద స్వామిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయితే ధర్మాగ్రహ యాత్రకు వచ్చిన బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆప్రాంతంలోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

13:11 - July 9, 2018

హైదరాబాద్ : శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భందం చేయడం..కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడం వంటి పరిణామాలు జరిగాయి. కత్తి మహేష్ ను ఏపీ పోలీసులు చిత్తూరు జిల్లాకు తరలించారు.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను గృహ నిర్భందం చేయడంతో వీహెచ్ పీ..భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - Swami Paripoornananda