Tamil Nadu Politics

18:37 - March 22, 2018

ఢిల్లీ : కావేరీ నదీ యాజమాన్య నీటి పంపకంపై స్పష్టత వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐఏడీఎంకే ఎంపీ తంబి దురై అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఆందోళన పార్లమెంట్‌లో కొనసాగిస్తామని తంబిదురై టెన్ టివితో తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:26 - February 21, 2018

చెన్నై : తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ నటుడు కమల్‌ హసన్‌ మధురై వేదికగా కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించి జెండాను ఆవిష్కరించనున్నారు. మధురైలోని ఐల్యాండ్‌ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ విధి విధానాలను కమల్‌ ప్రకటిస్తారు. ఇప్పటికే మధురైకి చేరుకున్న కమల్‌ హసన్‌- బహిరంగసభ ఏర్పాట్లను సహచరులతో కలిసి పర్యవేక్షించారు. కమల్‌ అక్కడి నుంచి నేరుగా రామేశ్వరం వెళ్లి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమాధిని సందర్శించుకోనున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కమల్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు.

తమిళనాట రాజకీయ సందడి
ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నేతలు రానుండడంతో తమిళనాట రాజకీయ సందడి నెలకొంది. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేరళ సీఎం పినరయి విజయన్, కమ్యూనిస్టు నేతలు సహా పలువురు జాతీయ స్థాయి నేతలను కమల్ ఆహ్వానించారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విజయ్‌కాంత్‌ తదితరులు హాజరు కానున్నారు. డిఎంకె చీఫ్‌ కరుణానిధిని కూడా కమల్‌ కలుసుకున్నారు. అధికారంలో ఉన్న అన్నాడిఎంకెను మాత్రం ఆయన ఆహ్వానించలేదు. అన్నాడిఎంకె విధానాలు నచ్చకనే తాను రాజకీయాల్లోకి వచ్చానని కమల్‌ స్పష్టం చేశారు. అవినీతి, మతతత్వ విధానాలను కమల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.తమిళనాట రాజకీయాలకు సినీరంగానికి విడదీయరాని బంధముంది. తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి సినీరంగానికి చెందినవారే. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్‌హసన్‌ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఫుల్‌ టైం రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్న లోకనాయకుడికి తమిళ ప్రజలు ఎలా ఆదరిస్తారన్నది వేచి చూడాలి.

20:55 - January 2, 2018

నా దారి రహదారి.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా... దేవుడు శాసిస్తాడు.. నేను చేస్తాను..ఇవన్నీ రజనీ దశాబ్దాలుగా చెప్తున్న మాటలు. ఇప్పుడు మాటలనుంచి చేతల సమయం వచ్చింది. పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి తమిళ రాజకీయాల్లో రజనీ ఎలాంటి ప్రభావం చూపిస్తారు.సూపర్ స్టార్ రజనీకాంత్....సినిమాల్లోనే కాదు.. తమిళనాట ఈ పేరు అన్నిరకాలుగా ప్రభంజనమే. కోట్లాది అభిమానులున్న ఈ సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. జయ మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఇప్పుడు రజనీ భర్తీ చేస్తాడా? ఆయన దారి రహదారి. సినిమా డైలాగే కానీ... రజనీ తీరుని చెప్తుందని ఫ్యాన్స్ నమ్మకం. మరి ఇది సినిమాల వరకేనా, లేక పాలిటిక్స్ లో కూడానా? ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ తో పరిస్థితులు ఎలా మారతాయి..? డీఎంకే, అన్నా డీఎంకే లను చావు దెబ్బతీస్తారా? లేక విపరీతమైన హైప్ తో వచ్చి చతికిల పడిన కొందరు నటుల్లా రజనీ మిగిలిపోతారా? ప్రకటించేశాడు..వెబ్ సైట్ ప్రారంభించేశాడు..అభిమానులను సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చాడు..ఏం చేస్తానో చెప్తాను.. చేయలేకపోతే రాజీనామా చేస్తాను అంటున్నాడు.. రెండు దశాబ్దాల ఉత్కంఠకు తెరదింపాడు..

రేపెవరిది... ఇదే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్న. ఈ రోజు ఎవరేంటో అందరికీ తెలుసు..కానీ, రేపటిని గెలుచుకునేదెవరు? ప్రజల గుండెల్లో పాగా వేసేదెవరు? అధికార పీఠాన్ని అధిరోహించేదెవరు? ఇవే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్నలు. ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, స్టాలిన్ మొదలైన రెగ్యులర్ ప్లేయర్స్ తో పాటు, లేటెస్ట్ గా రజనీ, ఈ మధ్యే ఉత్సాహంగా మారిన కమల్ లాంటి స్టార్ హీరోలు.. కనిపిస్తున్న ఫీల్డ్ లో పైచేయి ఎవరు సాధించబోతున్నారు? ఆల్రెడీ ఈ బాటలో ఉన్న నటులు ఏం సాధించారు. అది ఇప్పటి చరిత్ర కాదు.. దశాబ్దాల నుండి పీఠంపై సినీ తారలనే కూర్చోబెడుతున్నారు. అక్కడ ఫిల్మ్ స్టార్స్ కే పట్టంకడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? సినీ నటుల తళుకుబెళుకులే ప్రధానంగా నిలుస్తున్నతమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నవాళ్లంతా ఇమేజ్ వాడిపోయిన తారలే. ఇలాంటి సందర్భంలో రజనీ ఎంట్రీ ఇస్తే అది... చెప్పుకోదగ్గ మార్పులకు కారణం అవుతుందా...రాజకీయ శూన్యం నుండి కొత్త శక్తులు పుట్టుకురావటం కొత్త విషయం కాదు.. వివిధ రాష్ట్రాల రాజకీయాల్లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాట అదే దృశ్యం కనిపిస్తోంది. మరి దీనిని రజనీకాంత్ తనకు అనుకూలంగా మలుచుకుంటాడా, అభిమానుల ఆశలు నెరవేరుస్తాడా అనే అంశం త్వరలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

10:26 - December 21, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ జరగునుంది. ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం 256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నిక బరిలో దినకరన్ సహా 59 మంది అభ్యర్థులు ఎన్నికలో బరిలో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

22:13 - December 20, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ రేపు జరగనుంది. పోలింగ్‌కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ పూర్తి చేసింది. దివంగత సిఎం జయలలిత మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి పెట్టాయి.
ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి 
చెన్నైలోని ఆర్‌కె నగర్‌ ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. గురువారం పోలింగ్‌ జరగనుండడంతో ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్‌ కె నగర్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్నాడిఎంకే అధినేత్రి దివంగత సిఎం జయలలిత మృతితో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన అన్నాడిఎంకె, డిఎంకె ప్రచారం చివరిరోజు వరకూ అన్ని శక్తియుక్తులూ ఒడ్డాయి.
బరిలో 59 మంది అభ్యర్థులు 
ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల బరిలో 59 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా 'త్రిముఖ' పోటీ కనిపిస్తోంది. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదనన్, ఇండిపెండెంట్‌గా శశికళ వర్గం నేత టీటీపీ దినకరన్, ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థి ఎన్.మరుదు గణేష్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 
ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి 
జయలలిత మరణం తర్వాత తమిళనాడులో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సారథ్యంలోని అన్నాడీఎంకేకు ఈ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.  అన్నాడిఎంకే పార్టీ సింబల్‌ రెండాకులు పళని, పన్నీర్‌ వర్గానికే దక్కడంతో  గెలుపుపై ధీమాతో ఉన్నారు. మరోవైపు శశికళ మేనల్లుడు దినకరన్‌ కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,28,234. వీరిలో పురుషులు 1,10,903, స్త్రీలు 1,17,232.  లింగమార్పిడి వ్యక్తులు 99 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 
ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు 
ఆర్కేనగర్ ఉప ఎన్నిక కీలకంగా మారడంతో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 21 మంది పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.  పోలింగ్‌ స్టేషన్ల వద్ద 2,500 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. 200కు పైగా నిఘా కెమెరాలు, 21 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 21 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్‌లు, వీడియో రికార్డింగ్ పరికరాలతో కూడిన 20 మానిటరింగ్ టీమ్‌లు, 45 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 24న జరుగుతుంది. అదేరోజు ఎన్నికల ఫలితాన్ని ప్రకటించనున్నారు. అన్నాడిఎంకేలో అంతర్గతపోరు , ప్రభుత్వ వైఫల్యంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ నెలకొంది.

 

12:20 - December 20, 2017

చెన్నై : అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను జయ ఫుటేజ్ ను టిటివి దినకరన్ వర్గానికి చెందిన వెట్రివేల్ బయపెట్టారు. దీనితో ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సెప్టెంబర్ 25వ తేదీన జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృశ్యాలని దినకరన్ వర్గం చెబుతోంది. గురువారం ఆర్కే నగర్ ఉప ఎన్నిక కావడం..జయ మృతి చెందిన ఏడాది తరువాత విజువల్స్ బహిర్గతం చేయడం.. సెంటిమెంట్ గా వెట్రివేల్ ఈ వీడియోను బయటపెట్టినట్లు సమాచారం. నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నందునే అమ్మ వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని, అమ్మను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో మరణించారని పన్నీర్ సెల్వం తో సహా అందరూ చెప్పారని గుర్తు చేశారు. జయ ఆసుపత్రిలో ఉన్నంతకాలం అదే మాట చెప్పారని, అమ్మ మరణం విసయంలో అందరూ నాటకాలు ఆడారని పేర్కొన్నారు. మరికొన్ని వీడియోలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైనప్పుడు విడుదల చేస్తామన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...

06:40 - December 20, 2017

తమిళనాడు : ఒక ఉప ఎన్నిక యావత్‌ దేశం తనవైపు చూసేలా చేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరి చూపులు అక్కడే. పరాజితులు ఎవరు.. విజయం సాధించేది ఎవరన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అదే ఆర్కే నగర్‌ బై ఎలక్షన్‌. జయలలిత నియోజకవర్గం కావడమే అందుకు కారణం. రెండాకులు మావే.. విజయం మాదే అంటున్న డీఎంకే ఒకవైపు, గుర్తు లేకున్నా కార్యకర్తలు మావైపు ఉన్నారంటున్న దినకరన్‌ మరోవైపు... ప్రభుత్వ వ్యతిరేకతే మాకు విజయాన్ని ఇస్తుందన్న ధీమా డీఎంకే మరోవైపు. త్రిముఖ పోరుతో ఉత్కంఠ రేపుతోన్న ఆర్కేనగర్‌ ఉప ఎన్నికపై 10టీవీ ప్రత్యేక కథనం..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మృతితో ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారంతో ప్రచారం ముగిసింది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్కే నగర్‌లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ సర్వత్రా రేకెత్తిస్తోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీగా ఖర్చ చేస్తున్నారు. ఎన్నికల సంఘం సైతం దీనిపై పెడుతున్న ఖర్చు కొత్త రికార్డు సృష్టిస్తోంది. భారత ఎన్నికల చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన ఎన్నికగా చరిత్రలో నిలిచిపోనుంది. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోందని ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు 2500 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది.

సాధారణంగా ఉపఎన్నిక ఖర్చు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు అవుతుంది. RK నగర్‌ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం చేస్తున్న ఖర్చు 3 కోట్ల రూపాయలు. కెమెరాల కోసమే 50 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు పరిశీలకులుగా 21 మంది IAS అధికారులను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. అంతే కాదు 21 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు పనిచేస్తున్నాయి. డబ్బు పంపిణీని అరికట్టేందుకు రాత్రి పూట కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందులో IAS, IPS ఆఫీసర్లు కూడా ఉన్నారు.

ఇక గెలుపుపై ఎవరి ధీమా వారిది. అమ్మ పాలన, అధికారం తమనే గెలిపిస్తుందని అన్నాడిఎంకె అటుంటే వారు నమ్మకద్రోహులు తామే నిజమైన వారసుడిని అంటూ శశికళ మేనల్లుడు దినకరన్ మరోవైపు బింకాలు పోరున్నాడు. వీరి నడుమ ప్రతిపక్ష డిఎంకె అసలు ప్రభుత్వమే లేదని అన్నింట విఫలమంటూ తమదే గెలుపనే ప్రచారం హోరెత్తించింది. మొత్తానికి గత పదిహేను రోజులుగా మారుమోగిన అభ్యర్థుల ప్రచారం ఎట్టకేలకు ముగిసింది. గతంలో ఎన్నిక వాయిదా పడిన అనుభవాల దృష్ట్యా ఎన్నికల సంఘం డబ్బు ప్రవాహంపై ప్రత్యేక నిఘా పెట్టింది.

ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 59 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఓ మహిళా అభ్యర్థి కూడా ఉన్నారు. రెండాకుల గుర్తు అధికార అన్నాడీఎంకేకు దక్కడంతో దినకరన్‌ ప్రెషర్ కుక్కర్‌ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,28,234. వీరిలో పురుషులు 1,10,903, స్త్రీలు 1,171,232. లింగమార్పిడి వ్యక్తులు 99 మంది ఉన్నారు. పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరి ఓటర్లు ఎవరికి పట్టంకట్టనున్నారో.

11:31 - December 4, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న ఉప ఎన్నిక జరుగనుంది. తమిళ నటుడు విశాల్‌ ఈ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇవాళ నామినేషన్‌ వేసేందుకు తన అనుచరులతో కలిసి బయలుదేశారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్తూ మార్గమధ్యంలో కామ్‌రాజ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే డీఎంకే, అన్నా డీఎంకేతోపాటు శశికళ మేనల్లుడు దినకరన్‌ నామినేన్లు వేశారు. 
 

11:07 - December 3, 2017

తమిళనాడు : చెన్నైలోని ఆర్కే నగర్‌  అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో తమిళ నటుడు విశాల్‌ బరిలో దిగనున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా  రేపు నామినేషన్‌  వేయనున్నట్టు విశాల్‌ ప్రకటించారు.  అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న విశాల్‌కు తమిళనాడులో అభిమానులు ఎక్కుగా ఉన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే విశాల్‌.. 2015 డిసెంబర్‌లో చెన్నైలో సంభవించిన వరదల్లో పలు సహాయ కార్యక్రమాలు అమలుచేసి ప్రజల మన్ననలు పొందారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన  ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న ఉపఎన్నిక జరుగనుంది. 23న ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులతోపాటు శశికళ మేనల్లుడు దినకరన్‌ శుక్రవారం నామినేషన్లు సమర్పించారు. 

16:03 - September 22, 2017

చెన్నై : తాను రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని...ఒకవేళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వస్తే అందుకు సిద్ధమేనని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెప్పారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నిజాయతీ కలిగిన వ్యక్తి అత్యుత్తమ స్థానంలో ఉండాలని ప్రజలు కోరుకుంటే అందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ముందు ఓటర్లు నిజాయతీగా ఉండాలని కమల్ అభిప్రాయపడ్డారు. తాను పార్టీ ఎప్పుడు ప్రారంభించబోతున్నది మాత్రం ఆయన చెప్పలేదు. మా పార్టీ ఎలా ఉంటుందో చెప్పలేను. కానీ కచ్చితంగా పార్టీని లాంచ్ చేస్తానని పేర్కొన్నారు. ముందు తాను ప్రజలను కలుసుకుని...ఆ తర్వాత రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తానని కమల్ తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Tamil Nadu Politics