tamilnadu

16:13 - December 12, 2017

చెన్నై : తమిళనాడులోని ఉడుమలైపేటలో శంకర్‌ అనే యువకుడి పరువుహత్య కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆరుగురికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శంకర్‌ ప్రియురాలి తండ్రి, సోదరుడితో సహా ఆరుగురికి ఉరిశిక్ష విధించింది. 13 మార్చి 2016లో శంకర్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా కోర్టు తీర్పు వెలువరించింది. 

15:35 - November 30, 2017

చెన్నై : రెండాకుల గుర్తుపై అన్నాడీఎంకేలో వర్గపోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శశికళ వర్గం నేత దినకరన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రెండాకుల గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ పళని-పన్నీర్‌ వర్గం, దినకరన్‌ వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ... పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తును కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

15:34 - November 30, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు అధికార అన్నాడీఎంకే అభ్యర్థిని ఖరారు చేసింది. ఎఐఎడిఎంకె ప్రిసీడియం ఛైర్మన్‌ ఈ.మధుసూదన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. చెన్నైలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం మధుసూదనన్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పార్టీ పార్లమెంటరీ బోర్టు కోఆర్డినేటర్‌గా పన్నీర్‌సెల్వం, కో కోఆర్డినేటర్‌గా పళనిస్వామి వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ మధుసూదన్‌ పోటీ చేశారు. అప్పుడు పన్నీర్‌ సెల్వం వర్గం తరఫున అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పార్టీ నుంచి ఆయన పోటీచేశారు. అయితే కొన్ని పార్టీలు డబ్బులిచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయన్న ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను రద్దు చేశారు. దీంతో మరోసారి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. డిఎంకె అభ్యర్థిగా మరుదు గణేష్, శశికళ వర్గం నుంచి టిటివి దినకరన్‌ పోటీలో ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్‌కె నగర్‌ ఖాళీ అయింది. ఆర్‌కె నగర్‌కు డిసెంబర్‌ 21న ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్‌ 24న ఎన్నికల ఫలితం వెలువడనుంది.

21:32 - November 24, 2017

చెన్నై : తమిళనాడు, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని విడుదల చేసింది. డిసెంబర్‌ 21న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 24న ఎన్నికల ఫలితాలు వస్తాయి. జయలలిత మరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. 

15:43 - November 23, 2017

చెన్నై : అన్నాడిఎంకె పార్టీ గుర్తుపై శశికళ వర్గానికి ఈసీ ఝలక్‌ ఇచ్చింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను డిసెంబర్‌ 31లోగా నిర్వహించాలని మద్రాస్‌ హైకోర్టు ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడిఎంకె పార్టీ గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి దక్కడం గమనార్హం. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక సమయంలో పార్టీ గుర్తు రెండాకుల కోసం శశికళ-దినకరన్, పళని, పన్నీర్‌ వర్గాలు ఈసీని ఆశ్రయించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో పళని, పన్నీర్‌ వర్గాలు ఏకమయ్యాయి.

14:20 - November 21, 2017

చెన్నై : ఆర్కేనగర్‌ ఉప ఎన్నికపై ఈసీకి మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 31లోగా ఉప ఎన్నిక ప్రక్రియ ముగించాలని ఆదేశించింది.  డిసెంబర్‌లో పండుగలు ఉండటంతో ఉప ఎన్నిక వాయిదావేయాలని ఈసీ కోరగా, ఈ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది. 

 

17:30 - November 18, 2017

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌గార్డెన్‌లో ఐటి దాడులు నిర్వహించింది. మద్రాసు హైకోర్టు అనుమతితో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఐటీ అధికారులు పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత పీఏ పూన్‌గుండ్రన్‌, శశికళ గదులు, రికార్డు రూమూల్లో సోదాలు చేశారు. ఓ ల్యాప్‌టాప్‌, పెన్‌ డ్రైవ్‌, డెస్క్‌ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐటి దాడులను నిరసిస్తూ జయ నివాసం వద్ద అన్నాడిఎంకే కార్యకర్తలు హంగామా చేశారు. ఐటి దాడులు మోసపూరిత దాడులని, రాజకీయ కక్ష సాధింపు చర్యలని శశికళ మేనల్లుడు దినకరన్‌ ఆరోపించారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం అమ్మకు నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువులను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి.  సుమారు వెయ్యి కోట్ల ఆస్తులను ఐటి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 

08:39 - November 18, 2017

చెన్నై : శశికళ భర్త నటరాజన్ మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కింది కోర్టు విధించిన జైల్ శిక్షను హైకోర్టు సమర్థించింది.కోర్టు ఓ కారు విషయంలో నటరాజన్ పన్ను ఎగవేత కేసులో ఈ శిక్ష విధించింది.

12:18 - November 11, 2017

చెన్నై : పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. కానీ తమిళ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నాడు ఆ తమిళ హీరో. తను తీసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తక్కువ కాలంలోనే సినీ రంగ ప్రవేశం చేసి ప్రజల హృదయాలను దోచుకుంటున్న ఆ యువ హీరోపై 10టీవీ కథనం. తమిళ నాట పట్టుమని పది సినిమాల్లో కూడా నటించలేదు.. కానీ ప్రజల గుండెల్లో సహజ నటుడిగా, ప్రజల నటుడిగా నిలిచి పోతున్నాడు. తాను సంపాదిస్తున్నదంతా ప్రజల ద్వారా వచ్చిందేనని అంటున్నాడు.. అందుకే ఆ డబ్బుతో విద్యార్ధులకు, వికలాంగులకు, రైతులకు అవసరమయ్యే నిత్యవసరాల్ని అందిస్తానని ప్రకటించాడు. 

తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన నటుడినేనని.. తాను పేదల కష్టాలను అర్ధం చేసుకోగలనని విజయ్‌ సేతుపతి తెలిపారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాడు. ఇటీవల అనిల్‌ సేమియా కంపెనీ యాడ్‌లో నటించి 50లక్షల రూపాయల చెక్కుని పారితోషికంగా అందుకున్నాడు. ఆ చెక్కును కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌కి అందచేసి విద్యలో వెనుకబడిన జిల్లాలో నీట్‌కు బలైన అనిత పేరున అంగన్‌ వాడీ కేంద్రాలకు, పేద వికలాంగ విద్యార్ధులకు వినియోగించాలని విజయ్‌ సేతుపతి కలెక్టర్‌ని కోరారు. ఇదంతా నా పబ్లిసిటీ కోసం చేసుకోవటం లేదని.. ఇది చూసి కొందరైనా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తారనే ఆకాంక్షను విజయ్‌ సేతుపతి వ్యక్తంచేశారు. తాను కష్టపడి సంపాదించే డబ్బును దాన ధర్మాలకు వినియోగిస్తూనే.. ఇలా పెద్దమొత్తంలో డబ్బును పేదలకు అందచేస్తున్న విజయ్‌ సేతుపతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

13:17 - November 5, 2017

తమిళనాడు : భారీవర్షాలు చెన్నైని అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నై శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
చెన్నైలో స్తంభించింన జనజీవనం 
ఈశాన్య రుతుపవనాల కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నైలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
జలదిగ్బంధంలో చెన్నై శివారు ప్రాంతాలు 
చెన్నై శివారు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని పలు కాలనీల్లో వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కాంచిపురం జిల్లాలోని  పళ్లికరణై, నామంగళం, ఊరపాక్కం, కొండగియూర్, మణిమంగళం, మేడవాక్కం, తిరువళ్లూరు జిల్లాలోని ఆవడి, పూందమల్లిలోని పలు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా చెన్నయ్‌లో స్కూళ్లు, కళాశాలలు, ఐటి సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.
ప్రభుత్వం అప్రమత్తం 
2015లో వరద తుఫాను నుండి గుణపాఠం నేర్చుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రహదారుల్లో... గృహాల్లోకి చేరుకున్న వర్షపునీటిని కార్పోరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించటంతో పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇతర మంత్రులు వరద ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. 
పునరావాస కేంద్రాలకు తరలింపు 
అధికారులు 10 వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం 122 ప్రత్యేక శిబిరాలు చేసింది. వారికి ఆహారం, మంచినీరు, దుప్పట్లు, అందజేస్తోంది. పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సిఎం వరదబాధితులకు ఆహారాన్ని అందించారు. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించటంతో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 2015లో చెన్నైలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Pages

Don't Miss

Subscribe to RSS - tamilnadu