tdp

12:48 - October 19, 2018

హైదరాబాద్  : రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన కవాతు పోలీసులు అనుమతి నిరాకరించిన విజయవంతంగా పవన్ జరిపారు. అనంతరం  పవన్ మాట్లాడుతు..టీడీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ టీడీపీ మహిళా నేత..అమెచ్యూర్ రేడియో జాకీ  సాదినేని  యామిని సోషల్ మీడియాలో పెట్టిన వ్యాఖ్యలపై పవన్ వీరాభిమానిగా చెప్పుకునే నటి మాధవీలత తీవ్రంగా మండిపడింది. యామినిపై మాధవీలత తీవ్రంగా ఫైర్ అయ్యారు.వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదా? ఆయన వారసత్వంతో రాలేదు కదా?  అని కవాతు దేనికోసం పవన్ చేశారు అనే విమర్శకు ఏం చేశాడు అని అడుగుతున్నారా? ఏం చేయలేదు?" అంటు యామిని చేసిన పలు ఘాటు విమర్శలకు మాధవీలత  ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 

Image result for pawan kalyan sadhineni yaminiఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడవటమే తప్ప, మీకు విమర్శించటానికి వేరే లేవు కదా అని మాధవీలత  ఎద్దేవా చేసింది. మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడని.. ఇప్పుడేమో  ఎవరివో డబ్బులు ఖర్చుపెట్టాడని చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, "పవన్ కు డబ్బులు మీ అయ్యలు ఇచ్చారా? లేక మీ తాతలు ఇచ్చారా? మరి ఆయన ఎవరి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీకు నొప్పెందుకు? అనీ..డబ్బులు ఇవ్వకుంటే ఇంతమంది జనం ఎందుకు వచ్చారనే ప్రశ్నకు సమాధానంగా ఆమాత్ర కడుపు మంట ఎందుకుండదు? అని అని తన ఫేస్‌ బుక్‌ లో యామినీకి మాధవీ లత యామినీకి  స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది. ఇక మాధవీ లత పోస్టుపై పవన్ అభిమానులు స్పందిస్తూ, బాగా మాట్లాడారంటూ ప్రశంసిస్తున్నారు. ఇక మాధవీ వ్యాఖ్యలపై యామినీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

17:49 - October 18, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుఫానుతో గూడు చెదిరిపోయిన పక్షుల్లా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. తినేందుకు తిండి లేక..తాగేందుకు మంచి నీరు లేక విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని కష్టాలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించారు. తిత్లీ బాధితులను  కొందరు అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసిందని... అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తోలు తీస్తానని హెచ్చరించారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు..తుపాను వల్ల పచ్చటి ఉద్దానం మొత్తం నాశనం అయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేలకూలిన ఇళ్లు, తోటలు చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. మూడు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని... జరిగిన విధ్వంస నష్టాన్ని పార్టీ తరపున నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రంగాల వారీగా నష్ట నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు.
ప్రజలకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించారు. కేరళకు తుపాను వస్తే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని... ఇక్కడి తుపాను బయట ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. తుపాను నష్టాన్ని వీడియోల రూపంలో బయట ప్రపంచానికి తీసుకెళ్తామన్నారు. కూరగాయల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 

18:34 - October 15, 2018

విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమి పెంపు కొనసాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 132 విడుదల చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఓసీలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. 2029 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. రాబోయే డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వయో పరిమితిని పొడిగించింది.

త్వరలోనే డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ క్రమంలో తమ వయోపరిమితి అయిపోయిందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త వినిపించి వారి ఆందోళనను దూరం చేసింది. అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 45 సంవత్సరాలకు పెంచాలని కొంతకాలంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి విజ్ఞప్తి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 34 నుంచి 42 సంవత్సరాలకు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం మేలు చేసినట్టు అయింది. అన్ని రంగాల ఉద్యోగాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

ఏపీపీఎస్సీ ద్వారా 12వేల ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 11వేల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయనుంది. అన్ని ప్రభుత్వ రంగాల్లోని దాదాపు 22వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్న క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిని పెంచటం శుభపరిణామం అని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

15:56 - October 14, 2018

హైదరాబాద్: ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, సంస్థలపై ఐటీ దాడులు జరగడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఆ మధ్యన నెల్లూరులో టీడీపీకి చెందిన బీదా సోదరుల సంస్థలపై దాడులు చేసిన అధికారులు కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ రంగంలోకి దిగారు. ఈసారి సీఎం చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లు, సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అటు కడప జిల్లాలోని సొంతూరుతో పాటు ఇటు హైదరాబాద్‌లోని సీఎం రమేష్‌కు చెందిన ఇళ్లు, సంస్థలలో అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థలో అధికారులు చాలాసేపు సోదాలు జరిపి పలు ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఐటీ దాడులపై సీఎం రమేష్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. 'అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి దాడులే జరుగుతాయని మీకు తెలియదా?' అని తనిఖీలకు వచ్చిన ఓ అధికారి తమ ఆఫీసు సిబ్బందిని హెచ్చరించినట్టు సీఎం రమేష్ మీడియాతో చెప్పారు. తన వద్ద, తన భార్య వద్ద మాట్లాడే ధైర్యం లేకనే ఆ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న తాను ఉన్నతాధికారికి ఫోన్ చేసి సదరు అధికారి చేసిన వ్యాఖ్యల గురించి చెప్పానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన అధికారి పేరు ‘మదన్’ అని తెలిపారు.

‘మీ బాస్‌లకు చెప్పండి.. అధికార పార్టీకి అనుకూలంగా వెళ్లమనండి. వ్యతిరేకంగా చేస్తే ఇలానే జరుగుతుంది. మీకు ఆ మాత్రం అర్థం కాదా? హైదరాబాద్‌లో ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల పనులు చేస్తున్నారో మీకు తెలియదా? వాళ్లకు ఏమన్నా జరుగుతున్నాయా? మీకే ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇలాంటి దాడులు తప్పవు' అని అధికారి మదన్ తమ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారని సీఎం రమేష్ తెలిపారు.

కాగా, ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదని సీఎం రమేష్ తేల్చి చెప్పారు. ఈ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. పార్లమెంటులో ప్రశ్నించినందుకే తన నివాసాలపై ఐటీ దాడులు జరిగాయని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.  అధికారం ఉందని చెప్పి ఒత్తిడి చేసి తమను లొంగదీసుకోవాలని చూస్తారా? అని కేంద్రంపై రమేష్ విరుచుకుపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్రానికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ఈ ఐటీ దాడుల వ్యవహారంపై జాతీయస్థాయిలో పోరాటం చేస్తానని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.

16:05 - October 13, 2018

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార,ప్రతిపక్షాల నాయకుల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్షాలపై అధికార పక్షం నాయకులు విరుచుకుపడుతున్నారు. మహా కూటమిపైన, కాంగ్రెస్ పైన టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు దమ్ము,ధైర్యం ఉంటే టీఆర్ఎస్ ను డైరెక్టుగా డీకొనాలని నాయిని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదన్నారాయన. అందుకే అంతా కలిసి మహాకూటమిగా ఏర్పాడ్డారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో మెజార్టీ మందికి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని నాయిని జోస్యం చెప్పారు. ఓడిపోతామని కాంగ్రెస్ కు ముందే తెలుసని అందుకే ఒంటరిగా పోరాటం చేయలేక ఇలా మహాకూటమి ఏర్పాటు చేశారని నాయిని ఎద్దేవా చేశారు. 

పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపైనా నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఊడ్చుకుపోయిందన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేందుకు తాము ప్రయత్నం చేస్తుంటే.. తగాదాలు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు దోచుకున్నది చాలదా? అని నిలదీశారు. ఏపీలో ఐటీ దాడులు జరిగితే కేసీఆర్ చేయిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు.. కానీ అది అవాస్తవం అని నాయిని అన్నారు. ఐటీ దాడులు చేయించడానికి సెంట్రల్ గవర్నమెంటు ఏమైనా మా చేతుల్లో ఉందా? మేము చెబితే సెంట్రల్ గవర్నమెంటు మా మాట వింటుందా? అని నాయిని ప్రశ్నించారు.

12:37 - October 12, 2018

న్యూఢిల్లీ: తెలుగుదేశం నాయకులు తప్పు చేయకపోతే ఐటీ దాడులకు ఎందుకు భయపడుతున్నారని  బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం నాయకులను  ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన ఇళ్లపై ఈ ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రమేశ్ తనపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆరోపించారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ .... ఒకరిపై కక్షతో సోదాలు జరగటంలేదని,దేశంలో అవినీతిని నిర్మూలించాలని, నల్లధనాన్నిఅరికట్టాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తెలుగుదేశం నాయకులు తప్పులు చేశారు కనుకే భయపడుతున్నారని జీవీఎల్ అన్నారు. దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు ఐటీ,ఈడీ వంటి ప్రభుత్వ సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం స్వేఛ్చనిచ్చిందని, ఆయా సంస్ధలు వాటికందిన సమాచారం మేరకు సోదాలు జరుపుతాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక, రాజకీయ ముసుగులో అక్రమార్జనను కాపాడుకోవచ్చని అనుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. 2017లో 3 లక్షల డొల్ల కంపెనీలను కేంద్రం మూసి వేయించిందని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కూడా నల్లధనం విషయంలో నోటీసులు ఇచ్చామని, వారు కోర్టుకు వెళితే వారికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని నరసింహారావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను నామినేషన్ పద్దతి ద్వారా ప్రభుత్వం సీఎం రమేష్ కంపెనీలకు ఇచ్చిందనే సమాచారం మేరకే సోదాలు నిర్వహిస్తున్నారని,ఆదాయపన్నుశాఖ వారు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చి సీఎం రమేష్ తన నిజాయితీని నిరూపించుకోవచ్చని జీవీఎల్ అన్నారు. 

16:32 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయింది. అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ టీడీపీ తన సత్తా చాటుకుంది. ఏ పార్టీకి లేని విధంగా తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అదే టీడీపీకి ప్లస్. కాగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం కావడం తెలంగాణలో టీడీపీకి మైనస్ అయింది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. ఆ కారణంగా టీఆర్ఎస్‌కు అత్యధిక స్థానాలు రావడం అధికారం దక్కడం జరిగిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడింది. ఓవైపు ఎన్నికల్లో వరుస ఓటములు.. దీనికి తోడు వలసలు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. Image result for l ramana

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 72స్థానాల్లో పోటీ చేస్తే 15 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం 14.66గా ఉంది. కాగా గులాబీ ఆకర్ష్ కారణంగా తెలుగుదేశం టికెట్ మీద గెల్చిన ఎమ్మెల్యేలంతా సైకిల్ దిగి కారెక్కారు. చివరకు టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. సండ్ర వెంటక వీరయ్య(సత్తుపల్లి), ఆర్ క్రిష్ణయ్య(ఎల్బీనగర్). టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఒంటరిగా కాకుండా మహాకూటమి పేరుతో బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. అయితే మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయన్నది క్లారిటీ లేదు. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీలు చెబుతున్నాయి.

జిల్లాలు గెలిచిన స్థానాలు
రంగారెడ్డి 7
హైదరాబాద్ 3
మహబూబ్‌నగర్ 2
వరంగల్ 2
ఖమ్మం 1

          

2014లో టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు 15
ఎంపీ స్థానాలు 1
ఓటింగ్ శాతం 14.66

 

 

 

 

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం దూకుడు మీదుంది. ఇప్పటికే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రతిపక్షాల కన్నా చాలా ముందు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ సరైన నాయకత్వమే లేదు. ఈ లోపం కారణంగానే టీడీపీ చతికలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఆ లోపాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. 

2014 టీడీపీ ఎమ్మెల్యేలు
సండ్ర వెంకట వీరయ్య -సత్తుపల్లి
ఆర్.కృష్ణయ్య -ఎల్బీనగర్
రేవంత్ రెడ్డి -కొడంగల్
రాజేందర్ రెడ్డి -నారాయణ్ పేట్
వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్
కృష్ణా రావు కూకట్ పల్లి
కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం
క్రిష్ణా రెడ్డి మహేశ్వరం
ప్రకాశ్ గౌడ్, రాజేంద్రనగర్
ఎ.గాంధీ శేరిలింగం పల్లి
ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి
చల్లా ధర్మారెడ్డి పరకాల
శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్
సాయన్న, కంటోన్‌మెంట్
మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్

     


 

 

10:55 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ఖరారైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు విపక్షాల పరిస్థితి మాత్రం అయోమయంగానే ఉంది. మహాకూటమి పేరుతో ఒక్కటైన విపక్షాలు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీల మధ్య సమన్వయం కుదరలేదు. సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. 

ఈ క్రమంలో మహాకూటమి నేతలు నేడు మరోసారి భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల ఉమ్మడి ప్రణాళికలపై తుది కసరత్తు చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పార్టీల మధ్య సీట్ల సర్దుబాబు త్వరితగతిన పూర్తి చేయాలని కూటమిలోని పార్టీలు బావిస్తున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల ప్రచారంపైనే చర్చించనున్నారు. టీడీపీ, సీపీఐ, జనసమితి కోరుతున్న సీట్ల సంఖ్యపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినప్పటికీ ఈ రోజు దానిపై ఎలాంటి వివరాలు ప్రకటించరని సమాచారం. అలాగే మహాకూటమి పేరు మార్పుపైనా చర్చలు జరగొచ్చని తెలుస్తోంది. మహాకూటమి పేరుని తెలంగాణ పరరక్షణ వేదికగా మార్చాలని, దీనికి ఛైర్మన్‌గా కోదండరామ్ ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

మరోవైపు 48 గంటల్లో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాకపోతే అన్ని చోట్లా పోటీ చేస్తామని జనసమితి వ్యాఖ్యానిస్తోంది. అటు సీపీఐ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు చేసుకోకపోతే ఎన్నికల ప్రచారం చేయడానికి తగినంత సమయం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

22:13 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణలో  త్వరలో  ఒక ప్రజాస్వామిక, ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని  టీపీసీీసీ అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు.  ఆపద్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు  ఆయన ఒక లేఖ రాశారు. అనంతరం  విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం రాజకీయ పార్టీలకు సహజమని, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడాన్ని విమర్శిస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. 2009లో తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చినందుకే  టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నామని ఆనాడు కేసీఆర్ చెప్పారని,   చంద్రబాబు లో ఏం మార్పు వచ్చిందని  చండీయాగానికి పిలిచి సన్మానించారని ఉత్తమ్  ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలు, ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్లి మీరు  టీడీపీ నాయకులతో రహస్య మంతనాలు జరపలేదా ,ఈ రోజు మేము  ఎన్నికల పొత్తులు పెట్టుకుంటే మీకు అభ్యంతరం వచ్చిందా అని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రశ్నించారు. గతంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకయిన సీపీఎంతో  కూడా టీఆర్ఎస్ ఎన్నికల  పొత్తులు పెట్టుకుందని   ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

13:38 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. మరి ఎంఐఎం సంగతేంటి? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మళ్లీ ఎంఐఎం పాగా వేస్తుందా? తిరుగులేని శక్తిగా అవతరించిన మజ్లిస్‌కు పోటీ ఇచ్చే వారే లేరా? అధికార టీఆర్ఎస్‌తో ఈసారి దోస్తీ కొనసాగిస్తారా? అసలు ఎంఐఎం ప్లాన్ ఏ విధంగా ఉంది?

పాతబస్తీ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే పాతబస్తీ అనే విధంగా మజ్లిస్ గట్టి పట్టు సాధించింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) దశాబ్దాలుగా హైదారబాద్‌లో పాతుకుపోయింది. 1958 మార్చి 2న అబ్దుల్ వాహిద్ ఒవైసీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఏఐఎంఐఎం పార్టీని స్థాపించారు. ముస్లిం హక్కులు, విద్యాభివృధ్ధి కోసం ఏర్పడ్డ ఎంఐఎం క్రమక్రమంగా బలమైన రాజకీయ పునాదులు వేసుకుంది. అబ్దుల్ వాహిద్ ఒవైసీ తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్లాలు చేపట్టి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. 

సలావుద్దీన్ ఒవైసీ 1967, 1972, 1978 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తర్వాత హైదరాబాద్ పార్లమెంటుకు 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సలావుద్దీన్ ఒవైసీ విజయాన్ని అడ్డుకోవడానికి బీజేపీ 1996 ఎన్నికల్లో వెంకయ్య నాయుడిని హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుండి బరిలో దింపినా ఫలితం లేకపోయింది. సలావుద్దీన్ ఒవైసీ 73వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది 1986లో 38 డివిజన్లు గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంది 2002లో 36 డివిజన్లు గెలుచుకుంది. 2009లో 43 డివిజన్లు గెలుచుకుని కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని మేయర్ పీఠాన్ని పంచుకుంది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 44 డివిజన్లు గెలుచుకుని తన సత్తా చాటుకుంది.

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 7మంది సభ్యులు ఎంఐఎంకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్ పాలనాపరమైన నిర్ణయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

సలావుద్దిన్ మరణం తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ 2008 నుండి ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు 1994, 1999 ఎన్నికల్లో చార్మినార్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నుండి 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. అసదుద్దీన్ సారధ్యంలోనే ఎంఐఎం పార్టీ పాతబస్తీ దాటి బయట ప్రాంతాలకు విస్తరించింది.

1996లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి గెలుపొంది ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్నారు ప్రస్తుతం తెలంగాణలో ఎంఐఎంకు ఏడుగురు శాసనసభ్యులున్నారు. మహారాష్ట్రలో ఎంఐఎంకు ఇద్దరు శాసన సభ్యులున్నారు బిహార్, ఢిల్లీ, యూపీ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేసింది. మహారాష్ట్రలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లను ఎంఐఎం గెలుచుకుంది.

ఈసారి జరిగే ఎన్నికల్లో పాతబస్తీపై గట్టిపట్టున్న మజ్లిస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు చేజారకుండా వ్యూహలు రచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు కేటాయించిన ఎంఐఎం.. చార్మినార్ ఎమ్మెల్యేగా ఉన్న అహ్మద్ పాషా ఖాద్రీని యాకుత్ పురాకు.. యాకుత్ పురా ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను చార్మినార్‌కు పరస్పరం మార్పులు చేశారు.  చాంద్రాయణ గుట్ట నుండి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్ పేట నుండి మహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా, బహదూర్‌పురా నుండి మహ్మద్ మౌజం ఖాన్, నాంపల్లి నుండి జాఫర్ హుసేన్ మెరాజ్, కార్వాన్ నుండి కౌసర్ మోహియుద్దీన్ పోటీ చేయనున్నారు. ఒకవైపు మిత్రపక్ష పార్టీ టీఆర్ఎస్‌తో స్నేహపూర్వక పోటీ మరోవైపు కాంగ్రెస్ కూటమి, బీజేపీ అభ్యర్దులను ఎదుర్కోవాల్సి ఉన్నందున తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు ఎంఐఎం వ్యూహలకు పదును పెడుతూ తన అభ్యర్దులను ప్రకటించింది.

ఎంఐఎం పార్టీ మొదటి నుండి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు తెలుపుతుంటుంది. మొదట్లో 
కాంగ్రెస్‌కు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రమైన విబేధాలు రావడంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో అక్బరుద్దీన్‌ జైలుకు వెళ్లడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంఐఎం సమైక్యాంధ్రకే జై కొట్టింది. చివరలో రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చింది  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి ఎంఐఎం దగ్గరైంది. ఎంఐఎం పార్టీకి చెందిన ఒవైసీ హాస్పిటల్స్, విద్యాలయాలకు ప్రభుత్వం ద్వారా భూములు లబ్ది పొందారనే ఆరోపణలున్నాయి

అయితే ఈ సారి యాకుత్ పురా, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎంఐఎంకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే విశ్లేషణ వినిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా యాకుత్ పురా అభ్యర్దిని మార్చడంతో పాటు మిత్రపక్ష టీఆర్ఎస్‌ను అనుసరించి ముందుగానే అభ్యర్దులను ప్రకటించింది ఎంఐఎం. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న ముస్లింల ఓటు బ్యాంకును ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎంకు స్నేహహస్తం అందిస్తుంటుంది. ఎంఐఎం కూడా అదే పంధాలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి మద్దతు తెలుపుతుంటుంది

పాత బస్తీలో పట్టు సడలకుండా ఉండేందుకు ముందుగానే అభ్యర్దులను ప్రకటించిన ఎంఐఎం ఎన్నికల వ్యూహంలో భాగంగా నోటిఫికేషన్ కంటే ముందే తొలి జాబితా ప్రకటించి ప్రత్యర్ది పార్టీల కంటే ముందే ప్రచార పర్వానికి తెరలేపింది.

-కుమార్

Pages

Don't Miss

Subscribe to RSS - tdp