TDP MLAs

08:41 - March 22, 2018

గుంటూరు : నేడు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై చర్చ జరుగనుంది. అల్పాదాయ వర్గాలకు గృహనిర్మాణం, శిల్పారామాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఆడశిశువులకు ఆర్థికసాయం, మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై చర్చ చేపట్టనున్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన, రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాల ఏర్పాటుపై చర్చ చేయనున్నారు. రైతులకు పట్టాల పంపిణీపై అత్యవసర ప్రజాప్రయోజనాల నోటీసు, చర్చ ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త అంగన్ వాడీలపై చర్చ జరుగనుంది. 

22:02 - March 20, 2018

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణలపై ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనాని ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. నిరాధారమైన ఆరోపణలకు స్పదించాల్సిన అవసరంలేదన్న లోకేశ్‌.. తాత ఎన్డీఆర్‌, తండ్రి చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురానన్నారు. తనపై సీబీఐ విచారణ వేస్తారని జరుగుతున్న ప్రచారంపై  లోకేశ్‌ స్పందిస్తూ ... దేనిపై వేస్తారని ప్రశ్నించారు. వేసుకుంటే వేసుకోనివ్వండంటూ.. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ అవినీతికి పాల్పడుతున్నారంటూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి. దీనిపై చంద్రబాబు ఇంతకు ముందు స్పందించారు. ఇప్పుడు మీడియా చిట్‌చాట్‌లో  లోకేశ్‌  కూడా తన వాదాన్ని వినిపించారు. 

పవన్‌ చేసిన ఆరోపణలను ఆధారాలుంటే బయటపెట్టాలని లోకేశ్‌ డిమాండ్‌ చేయడం జనసేనానిని నేరుగా ఢీ కొట్టినట్టు అయిందని  భావిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై టీడీపీ చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా రుజువు చేసిన విషయాన్ని లోకేశ్‌ ప్రస్తావించారు. పోలవరం అవినీతి గురించి కూడా పవన్‌  ఆరోపణలు చేశారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ... ఒక్క టెండర్‌ కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. పోలవరం నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్లిందని, తన అకౌంట్‌లోకి వచ్చాయా.. అంటూ ప్రశ్నించారు. లోకేశ్‌పై సీబీఐ విచారణ వేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా చినబాబు తీవ్రంగా స్పందించారు. దేనిపై  వేస్తారంటూనే... వేసుకుంటే వేసుకోనివ్వండని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేయనప్పుడు భయపడాల్సిన పనిలేదన్న వాదాన్ని వినిపించారు. 

తాను పద్ధతిగా కమ్రశిక్షణతో పెరిగిన విషయాన్ని గుర్తు చేసిన లోకేశ్‌... తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురానంటూ...  పవన్‌ ఆరోపణలు బాధ కలించాయన్నారు. ఏనిమిదేళ్లుగా ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని... ఎక్కువ ఉంటే తీసుకోవాలని సవాల్‌ విసిరారు. పవన్‌ చేసిన ఆరోపణలను ఆధారాలుంటే.. ఒక్క రోజులోనే మాటెలా మార్చాలని లోకేశ్‌ నిలదీశారు.  ప్రణాళికా మండలి సభ్యుడు పెద్దిరామారావుతో ఉన్న ఫోటోను నోట్ల మార్పిడి కేసులో పట్టుపడ్డ శేఖర్‌రెడ్డితో కలిసి ఉన్నట్టు ప్రచారం చేయడాన్ని లోకేశ్‌ తప్పు పట్టారు. బహిరంగ సభలో ఆధారాలులేని ఆరోపణలు చేస్తే విలువ ఉండదన్న లోకేశ్‌... పవన్‌ వద్ద తన ఫోన్‌ నంబర్‌ ఉన్నప్పుడు... నేరుగా నేరుగా విషయాన్నిచెప్పొచ్చు కాదా.. అని ప్రశ్నించారు. పవన్‌ ఆరోపణలపై పరువు నష్టం కేసు వేస్తారా.. అన్న ప్రశ్నకు ఈ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండున్నర మార్కులు ఇస్తానన్న పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. ఈ మార్కులు ఇవ్వడానికి పవన్‌ ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పడుతున్న కష్టం... హైదరాబాద్‌లో ఉండేవారికి ఏం తెలుసని ముక్తాయింపు ఇచ్చారు. 

 

21:51 - March 20, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ప్రకారం రావలసిన నిధులు, ఎక్సైజ్ సుంకం రానప్పుడు స్పెషల్ స్టేటస్‌తో ఉపయోగమేంటని మాత్రమే తాను అన్నానని చెప్పారు. నిధులు, హోదా రెండూ కావాలన్నదే జనసేన డిమాండ్ అని ట్వీట్ చేశారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీకి తక్షణ సహాయం కావాలని, అది హోదానా? ప్యాకేజీనా? అన్నది పెద్ద విషయం కాదని పవన్ వ్యాఖ్యానించినట్టుగా ఓ మీడియా సంస్థ పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగడంతో... నిన్ననే జనసేన పార్టీ స్పందించింది. తాజాగా ఇవాళ పవన్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. 

 

21:47 - March 20, 2018

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేయాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ  సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశంపై  సీరియస్‌గా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, లోక్‌సభలో టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా జరుగుతున్న తీరుపై సమీక్షించారు. ఏపీకి అన్యాయం చేయడానికి సిద్ధమైన బీజేపీ.. తనపై కూడా దాడి చేస్తోందని  చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి అంటే రాష్ట్రానికి బలహీనపరచడమేనన్న విషయాన్ని సమన్వయ కమిటీ దృష్టికి తెచ్చారు. వైసీపీ, జనసేన నాయకులు  బీజేపీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని విమర్శించిన చంద్రబాబు.... వారి దురుద్దేశం ప్రజలకు అర్థమైందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణలను చంద్రబాబు ప్రస్తావించారు. జనసేనాని నిరాధారమైన ఆరోపణలు, పొంతనలేని ప్రకటనలు, నిలకడలేని నిర్ణయాలను అందరూ గ్రహిస్తున్నారని సమన్వయ కమిటీ దృష్టికి తెచ్చారు.  
 

21:42 - March 20, 2018

గుంటూరు : కేంద్రంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఇక్కట్లలోకి నెట్టవద్దని అభ్యర్థించారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకూ ఏపీకి సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఇంకా కష్టాల్లోకి నెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. రాష్ట్రానికి సహకరిస్తారనుకుంటే నిరాదరణకు గురిచేశారని ఆయన శాసనసభలో అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని పార్లమెంట్‌లో అన్ని పార్టీలు అడుగుతుంటే విభజన హామీల అమలు అంశం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు వెనుకంజ వేస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. 

పోలవరం ప్రాజెక్టు తాను తీసుకోలేదని, తాను అధికారంలోకి రాకముందే పోలవరం కాంట్రాక్టులు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు పోలవరం విషయంలో కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం 5 కోట్లమంది ప్రజల ఆకాంక్ష అన్న చంద్రబాబు... సున్నితమైన విషయాలపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. 

విశాఖలో మూడేళ్లుగా భాగస్వామ్య సదస్సులు నిర్వహించామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. టెక్స్‌టైల్‌ పాలసీలో సవరణలు తీసుకొస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాను పారిశ్రామిక, ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో సుస్థిరతపై దృష్టిసారించామన్న చంద్రబాబు..  కాంగ్రెస్‌ అవినీతి వల్లే రాష్ట్రానికి వచ్చిన వోక్స్‌వ్యాగన్‌ పూణేకి వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హోదాపై చంద్రబాబు ప్రసంగం అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రకటించారు.

21:02 - March 20, 2018

అవిశ్వాసంపై హాట్ డిబేట్ జరిగింది. వక్తలు భిన్నవాదనలు వినిపించారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామకృష్ణ, బీజేపీ ఏపీ నేత విల్సన్, వైసీపీ అధికార ప్రతినిధి కొణిజేటి రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:50 - March 20, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో ఇవాళ కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. విపక్షాల ఆందోళనతో ఉభయసభలు దద్దరిల్లాయి. టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చజరగకుండానే వాయిదా పడ్డాయి. అవిశ్వాస తీర్మానానికి కేంద్రం భయపడుతుందని టీడీపీ ఆరోపించింది. మోదీ సర్కార్‌ తీరుపై బీజేపీ ఎంపీలు సైతం వ్యతిరేకతతో ఉన్నారని మండిపడింది. అటు వైసీపీ సైతం హోదా పోరును కొనసాగించింది. టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. అందుకే హోదా రాలేదని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతివ్వబోమని టీఆర్‌ఎస్‌  తేల్చి చెప్పింది.
అవిశ్వాస తీర్మానాలపై జరగని చర్చ
అదే రభస.. అదే తీరు.. మళ్లీ అదే నిర్ణయం. పార్లమెంట్‌ ఉభయసభలూ విపక్షాల ఆందోళనలతో వాయిదాపడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే కావేరీ జలాలపై- అన్నాడీఎంకే, రిజర్వేషన్లపై- టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్‌ సభలో చదివి వినిపించారు. అవిశ్వాస తీర్మానాలకు మద్దతుగా సభ్యులు లేచి నిలబడేందుకు అవకాశం ఇవ్వాలని.. ఆందోళన చేస్తున్న ఎంపీలను స్పీకర్‌ కోరారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. ఎంత చెప్పినా వారు వినిపించుకోకపోవడంతో.. సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.
రాజ్యసభలోనూ.. ఇదే పరిస్థితి 
అటు రాజ్యసభలోనూ.. ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు.
గులాంనబీ ఆజాద్‌ తీవ్ర అసంతృప్తి 
పార్లమెంట్ ఉభయ సభలు చర్చలు జరగకుండా వాయిదా పడటంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ఆర్డర్‌లో లేకపోవడానికి కేంద్రమే కారణమని ఆజాద్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ వాయిదా పడటం వల్ల  కోట్లాది రూపాయల బ్యాంకు కుంభకోణాలు, ఏపి ప్రత్యేక హోదా, కావేరి జలాలు వంటి ప్రధాన అంశాలు చర్చకు రావడం లేదన్నారు. 
స్కూల్‌ పిల్లాడి వేశంలో ఎంపీ శివప్రసాద్‌  
మరోవైపు పార్లమెంట్‌ భవనం ముందు టీడీపీ, వైసీపీ ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకుని వేరువేరుగా ఆందోళనలు కొనసాగించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ స్కూల్‌ పిల్లాడి వేశంలో వినూత్న నిరసన తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు కేంద్రం భయపడుతోందని టీడీపీ ఆరోపించింది. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనే బీజేపీ అడ్డుకుంటోందని టీడీపీ ఎంపీలు అన్నారు. మోదీ ఒంటెద్దు పోకడలతో బీజేపీ ఎంపీలు సైతం విసిగిపోయారని.. ఈ పరిస్థితుల్లో అవిశ్వాసంపై రహస్యఓటింగ్‌ పెడితే సొంతపార్టీ నేతలే వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. పార్లమెంటులో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను రాష్ట్రపతికి నివేదిస్తామని టీడీపీ ఎంపీలు తెలిపారు.
నోటీసులు ఇస్తామన్న వైసీపీ
అవిశ్వాసంపై చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తామని వైసీపీ స్పష్టం చేసింది. సభ వాయిదా అనంతరం వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ జనరల్‌ సెకట్రరీకి నాలుగో సారి నోటిసులు ఇచ్చారు. హోదాపై చర్చ జరిగే వరకు వదిలేది లేదన్నారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్థి సాధ్యమని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 
అవిశ్వాసంపై టీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం 
మరోవైపు అవిశ్వాసంపై టీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా పోరాటాన్ని సమర్థించిన టీఆర్‌ఎస్‌.. అవిశ్వాసానికి మాత్రం మద్దతు ఇవ్వమని తెలిపింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలంటూ తాము ఆందోళన చేస్తున్నామని.. అవిశ్వాస నోటీసులు ఇచ్చిన టీడీపీ, వైసీపీ తమను సంప్రదించలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు అంటున్నారు. ఒకరి  రాజకీయ అజెండా కోసం తాము పనిచేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మొత్తానికి అవిశ్వాసం నోటీసు చర్చకు రాకుండానే పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదాపడ్డాయి. గురువారం మరోసారి అవిశ్వాసనోటీసులు చర్చకు వస్తాయో.. లేక విపక్షాల ఆందోళనతో వాయిదా పడుతాయో చూడాలి.

 

18:53 - March 17, 2018

గుంటూరు: ఎన్డీయే నుండి టీడీపీ బయటకు రావటంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారని మంత్రులు పుల్లారావు, నక్కా ఆనంద బాబు అన్నారు. ఏపీని ఆదుకుంటామని బీజేపీ నేతల మాటలు నమ్మి వారితో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయితే బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి సాయం రాష్ట్రానికి చేయలేదన్నారు. వైసీపీ అవిశ్వాసంపై దేశంలో ఇతర పార్టీలకు నమ్మకం లేదన్నారు. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ఇతర పార్టీలు తమకు మద్దతు తెలిపాయన్నారు. మోదీ ప్రభుత్వం మిత్ర పక్షాల విశ్వాసం కోల్పోయిందన్నారు. మోడీ డైరెక్షన్‌లో జగన్‌, పవన్‌ ఆడుతున్నారని ఆరోపించారు. 

15:47 - March 9, 2018
22:02 - March 8, 2018

అమరావతి : లక్షా 91 వేల 63 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 50 వేల 270 కోట్లు కాగా.. మూలధన వ్యయం 28 వేల 678 కోట్లు. ఆర్థిక లోటును 24 వేల 205 కోట్లుగా అంచనా వేశారు. గతంలో పోలిస్తే 21.70శాతం బడ్జెట్‌ పెరిగింది.

1 లక్షా 91 వేల 63 కోట్ల బడ్జెట్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను.. 1 లక్షా 91 వేల 63 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం చేశారు. రెవెన్యూ వ్యయం 1 లక్షా 50 వేల 270కోట్లు కాగా.. మూలధన వ్యయం.. 28 వేల 678కోట్లు. ఆర్థిక లోటును 24 వేల 205 కోట్లుగా అంచనా వేశారు. గతంలో పోలిస్తే 21.70శాతం బడ్జెట్‌ పెరిగినట్లు యనమల తెలిపారు.

రెండంకెల వృద్ధి
రాష్ట్ర పునర్నిర్మాణానికి సాయం అందడం లేదని.. విభజనలో ఆదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందని యనమల అన్నారు. అసంబద్దంగా జరిగిన విభజన వల్లే రాష్ట్రానికి సమస్యలు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక పోవడం సమస్యను రెట్టింపు చేసిందన్నారు. మూడేళ్లలో జాతీయ సగటు వృద్ధి 7.30 శాతంతో పోలిస్తే.. రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందని చెప్పారు.

వ్యవసాయ రంగానికి 12 వేల 352కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 12 వేల 352కోట్లు కేటాయించారు. ఇది గతంలో పోలిస్తే 35.91 శాతం అదనం. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని యనమల అన్నారు. ఇందుకు కర్నూలు జిల్లాలోని మెగా సీడ్‌ పార్క్‌కు 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతు రుణమాఫీకి 4 వేల 100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

సాగునీటి రంగానికి 16 వేల 978 కోట్లు
సాగునీటి రంగానికి 16 వేల 978 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 20 వేల 815కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. అలాగే.. ఇంధన రంగానికి 5 వేల 52కోట్లు, పరిశ్రమల శాఖకు 3 వేల 74కోట్లు, రవాణా శాఖకు 4 వేల 653కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణ శాఖకు 3 వేల 679కోట్లు కేటాయించిన యనమల.. 2020 నాటికి పట్టణ ప్రాంతాల్లో ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేదే లక్ష్యమన్నారు. ఇళ్ల స్థలాల సేకరణకు 575 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సాధారణ సేవల కోసం 56 వేల 113 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టుకు 9 వేల కోట్లను బడ్జెట్‌లో చేర్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు యనమల.

విద్యా రంగానికి 24 వేల 185కోట్లు
విద్యా రంగానికి 24 వేల 185కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు 100కోట్లు, బీసీలకు 100కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల తెలిపారు. సామాజిక భద్రత కోసం 3 వేల 29కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు బోధన ఫీజు కోసం 700కోట్లు, కాపు సామాజిక విద్యార్థులకు 400కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 4 వేల 477కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి 12 వేల 200కోట్లు, కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్లు , వైశ్యుల సంక్షేమం కోసం 30కోట్లు, మేదరుల సంక్షేమానికి 30కోట్లు, నాయీ బ్రాహ్మణుల కోసం 30కోట్లు, కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం 70కోట్లు కేటాయించారు. చేతివృత్తులకు ఆదరణ పథకానికి గాను 750 కోట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద 250కోట్లు కేటాయించారు.

హోంశాఖకు 6 వేల 226కోట్లు
హోంశాఖకు 6 వేల 226కోట్లు, పర్యాటక శాఖకు 290కోట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం కోసం 2 వేల 623కోట్లు కేటాయించారు. ఫైబర్‌ గ్రిడ్‌ కోసం 600కోట్లు, అన్నా క్యాంటీన్ల కోసం 200కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. పౌష్టకాహార లోపం నియంత్రణకు 360కోట్లు కేటాయించారు. హిజ్రాల సంక్షేమానికి 20కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. తమ ప్రభుత్వం వైద్య-ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్న యనమల.. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవకు 1000కోట్లు కేటాయించారు. మొత్తంగా వైద్య ఆరోగ్యానికి 8 వేల 463 కోట్లు కేటాయించారు.న్యాయశాఖకు 886కోట్లు, నిరుద్యోగ భృతికి వెయ్యి కోట్లు, ఎన్టీఆర్‌ ఫించన్లకు 5 వేల కోట్లు కేటాయించారు. ప్రజల రాజధాని అయిన అమరావతి అభివృద్ధికి గత ఏడాది కంటే 49 శాతం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో 7,741 కోట్లు కేటాయించారు. మొత్తంగా ప్రధాన ప్రతిపక్షం లేకుండానే.. లక్షా 91 వేల 63 కోట్లతో రాష్ట్ర బడ్డెట్‌ ప్రతిపాదనలను అసెంబ్లీలో యనమల ప్రవేశపెట్టారు.   

Pages

Don't Miss

Subscribe to RSS - TDP MLAs