telangana

12:13 - February 26, 2017

వరంగల్ : మంగంపేట (మం) కమలాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. డబుల్ మర్డర్ కలకలం సృష్టించింది. గత నాలుగు రోజుల క్రితం మంగపేట మండలం కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై కర్రా శ్రీను, కళ్యాణ్ లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై బాధితురాలు మంగంపేటలో పీఎస్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీను, కళ్యాణ్ లు లొంగిపోవడంతో సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన శ్రీను..కళ్యాణ్ లు శనివారం రాత్రి ఇంటికి వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు వారిని మట్టుపెట్టాలని నిర్ణయించారు. ఒక ప్రాంతంలో వద్దకు రాగానే శ్రీను..కళ్యాణ్ లపై కారం పొడి చల్లి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో 8మంది దాక పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనితో శ్రీను..కళ్యాణ్ లు అక్కడికక్కడనే మృతి చెందారు. ఆదివారం ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. దారుణంగా హత్య చేసిన వారిని ఎలాగైనా హత్య చేస్తామని ప్రత్యర్థి వర్గం పేర్కొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహించారు. మృతదేహాలను తరలించేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఒకనొక దశలో స్వల్ప లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.
పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి భద్రతను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ రంగంలోకి దిగి పోలీసు బలగాలను కంట్రోల్ చేస్తూ బాధితులతో మాట్లాడారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఏఎస్పీ హామీనిచ్చారు. దీనితో పరిస్థితి సద్దుమణిగింది.

09:45 - February 26, 2017

హైదరాబాద్ : స్థానిక సమస్యలపై గళం విప్పుతూ...జనానికి దగ్గరవుతున్న పవన్‌, పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. క్యాడర్‌తో పాటు పార్టీ కార్యకలాపాలనూ పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో, పనిచేసే సమర్థమైన కార్యకర్తల కోసం చూస్తున్నారు. జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ విధివిధానాలను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహంలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడంతో పాటు.. పార్టీ నిర్మాణానికి సంబంధించిన స్పష్టత ఇచ్చారు. మార్చి14వ తేదీకి జనసేన ఆవిర్భవించి మూడు సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో అదేరోజు పార్టీ విధివిధానాలను ప్రకటించడానికి పవన్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే 2019 ఎన్నికల నాటికి మ్యానిఫెస్టో ఎలా ఉండాలో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు అదేరోజు వెబ్‌సైట్‌ని ప్రారంభించనున్నారు.

జిల్లాల వారీగా సమీక్షలు..
జనసేనను స్థాపించాక ఇప్పటివరకూ దాదాపుగా పార్టీ నిర్మాణంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించలేదు. 2019 ఎన్నికల బరిలో పార్టీ నిలుస్తుందని ఇటీవల మంగళగిరిలో ప్రకటించాక.. పార్టీ నిర్మాణం ఆవశ్యకతను ఆయన గుర్తించారు. అందుకే.. ఇకపై పార్టీ పటిష్ఠతకు ఎక్కువ సమయం కేటాయించాలని పవన్‌ భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీలో యువతకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై అవగాహన, పోరాట పటిమ ఉన్న యువ నాయకత్వం వైపే ఆయన ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పవన్‌ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళనలో ఉన్న అభిమానులకు.. పార్టీ కార్యకర్తలకు మంగళగిరిలో పవన్‌ ప్రసంగం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ నిర్మాణంపై పవన్‌ ఇచ్చిన క్లారిటీతో ఫుల్‌జోష్‌లోకి వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

09:22 - February 26, 2017

జయశంకర్ భూపాపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మహిళ బంధువులు ఇద్దరు రౌడీషీటర్లను దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన మంగంపేట (మం) కమలాపూర్ లో చోటు చేసుకుంది. గత నాలుగు రోజుల క్రితం మంగపేట మండలం కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై కర్రా శ్రీను, కళ్యాణ్ లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేసు నేపథ్యంలో కర్రా శ్రీను కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి రాత్రి మద్యం సేవించి వీరిద్దరూ ఇంటికి వెళుతున్నారు. అకస్మాత్తుగా మహిళ బంధువులు కారం చల్లి మారణాయుధాలతో దాడి చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వివాహేతర సంబంధం బూచిగా చూపెట్టి హత్య చేశారని, ప్రతికారం తీర్చుకుంటామని హత్యకు గురైన కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ఇరువర్గాలు దాడులకు పాల్పడడడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

07:50 - February 26, 2017

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడపవద్దూ..నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం..అంటూ నగర పోలీసులు పలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ మద్యం తాగుతూ పలువురు పట్టుబడడం కామన్ అయిపోయింది. ఇందులో పలువురు మహిళలు పట్టుబడుతుండడం గమనార్హం. తాజాగా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు ఓ మహిళ నిరాకరించింది. మహిళతో పాటు మద్యం సేవించిన పలువురిపై కేసు నమోదు చేశారు. 12 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

07:45 - February 26, 2017

నల్గొండ : జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లకు గుండెపోటు రావడం కామన్ అయిపోయింది. ఆర్టీసీ బస్సు నడుపుతూ పలువురు డ్రైవర్లు గుండెపోటుకు గురయి మృత్యువాత పడుతున్నారు. గత రెండు మూడు నెలల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఏపీ 29 జెడ్ 2113 నెంబర్ గల బస్సు ఖమ్మం నుండి హైదరాబాద్ కు వెళుతోంది. ఈ బస్సును డ్రైవర్ సైదులు నడుపుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున నకిరేకల్ వద్దకు రాగానే సైదులుకు గుండెపోటు వచ్చింది. వెంటనే బస్సును ఓ వైపుకు తిప్పాడు. డివైడర్ ను ఢీకొన్ని బస్సు ఆగిపోయింది. అప్పటికే నిద్రలో ఉన్న వారందరూ ఏమైందని విచారించలోగా సైదులు కన్నుమూశాడు. ఈ విషాద విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు తరలించారు. మృతి చెందిన సైదులు కుటుంబానికి సమాచారం అందచేశారు. దీనితో వారు కన్నీరుమున్నీరయ్యారు. సైదులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.

 

07:36 - February 26, 2017
07:26 - February 26, 2017

హైదరాబాద్ : వామ‌ప‌క్షవాదులు, ప్రతిప‌క్షాలు ఎన్ని పోరాటాలు చేసినా.. బీసీల‌కు ప్రత్యేక నిధులు కేటాయించ‌డంలో తెలంగాణ స‌ర్కార్ నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. వెనుక బ‌డిన వ‌ర్గాల అభివృద్ధికి ప్రత్యేక స‌బ్‌ప్లాన్ వేసేందుకు స‌ర్కార్ అల‌స‌త్వాన్ని ప్రద‌ర్శిస్తూనే ఉంది. కుల వృత్తుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయిస్తాం అంటూ.. స‌బ్‌ప్లాన్ అమ‌లును అట‌కెక్కిస్తొంది ప్రభుత్వం. స్వరాష్ట్రం సిద్దించినా రాష్ట్రంలోని వెన‌క‌బ‌డిన వ‌ర్గాల స్థితిగ‌తుల్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. బీసీల జీవ‌న ప్రమాణాలు ఏమాత్రం పెర‌గ‌డం లేదు. త‌ర‌త‌రాలుగా వారంతా అభివృద్ధికి అమ‌డ‌దూరంలోనే ఉంటున్నారు. తెలంగాణలో అధిక శాతంగా ఉన్న బీసీ వ‌ర్గాల అభివృద్ధి కోసం బ‌డ్జెట్‌లో ప్రత్యేక ఉప ప్రణాళిక ఉండాల‌ని మేధావులు కోరుతున్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ ప్రకటించాలని వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. అయితే... ప్రభుత్వం మాత్రం తక్షణం బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించేందుకు ఆసక్తి చూపడం లేదు. కుల వృత్తులకు ప్రత్యేక నిధుల పేరిట సబ్‌ప్లాన్ నినాదాన్ని అట‌కెక్కించే ప‌నిచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కుల వృత్తులు, వాటి ప్రాధాన్యతను బట్టి నిధుల కేటాయింపు..
ప్రభుత్వం వాదన మరోలా ఉంది. కుల వృత్తులకు పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు 2017-18 బడ్జెట్‌లో 3వేల 637 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించారు ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఈ నిధులను కుల వృత్తుల వారీగా, వాటి ప్రాధాన్యతను, ప్రస్తుత పరిస్థితిని, దానిపై ఆధారపడిన జనాభాను బట్టి కేటాయిస్తారు. తర్వాత దశల వారీగా కులవృత్తుల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. ప్రతి కులానికి ప్రత్యేకంగా ప్రణాళికలను కూడా తయారు చేస్తున్నారు. రజకులు, నాయి బ్రహ్మణులు, చేనేత, కుమ్మరి వృత్తుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించేట్లు చేస్తారు. ప్రతి కుల వృత్తికి అందుబాటులో ఉన్న సాంకేతికతను జత చేస్తారు. ఇక కుల వృత్తులపై ఆధారపడిన వారు తయారుచేసే వస్తువుల మార్కెటింగ్‌కు సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఇదంతా బాగా ఉన్నా.. బీసీ స‌బ్‌ప్లాన్‌ను అట‌కెక్కించేందుకే స‌ర్కార్.. కుల‌ వృత్తుల‌కు ప్రత్యేక నిధుల కార్యక్రమాన్ని తెరమీదకు తెస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. వెన‌కబ‌డిన వ‌ర్గాల అభ్యున్నతికి ఉప‌ ప్రణాలిక ప్రక‌టించ‌డ‌మే స‌రైన మార్గమ‌ని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.

07:23 - February 26, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటోల నిర్వహణ వ్యవస్థ పడకేసింది. విధుల్లో ఉండాల్సిన ఆటోలు... ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాల్సిన ఆటోవాలాలు... విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రతిరోజూ విధుల్లో ఉండాల్సిన 2 వేల ఆటోల్లో... కేవలం 15 వందల ఆటోలు మాత్రమే విధుల్లో కనిపిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బల్దియా స్వచ్ఛ ఆటో సిద్దిపేటలో దర్శనమివ్వడంతో మంత్రి కేటీఆర్‌ అధికారులపై ఫైర్‌ అయ్యారు.

విధులకు సక్రమంగా హాజరుకాని స్వచ్ఛ ఆటోడ్రైవర్లు..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం... తడి, పొడి చెత్తను వేరుచేయాలంటూ ప్రకటించింది జీహెచ్‌ఎంసీ. ఇంటింటికి రెండు చెత్త బుట్టలను కూడా పంపిణి చేసింది. తడి, పొడి చెత్తను వేరుగా తరలించడానికి 2 వేల ఆటోలను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లాల్సిన ఆటోలు... పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. వివిధ కారణాలతో వీరి హాజరు శాతం తక్కువగా ఉంటోంది. ప్రతి రోజూ 2 వేల ఆటోలు విధుల్లో ఉండాలి. కానీ, ప్రతిరోజూ 1500 ఆటోలు కూడా విధుల్లోకి రావడం లేదు. కొంతమంది ఇష్టం వచ్చినట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు.

ఆటోను సిజ్ చేసి..సర్కిల్ కార్యాలయానికి తరలింపు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 2000 ఆటోలకు ప్రతి నెలా 2 కోట్లకుపైగా ఈఎంఐ చెల్లిస్తోంది బల్దియా. అయితే... విధులకు సక్రమంగా హాజరు కాని ఆటోవాలాలు... సిటి బయట ఆటోలతో దర్శనమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సిద్ధిపేటలో ఒక స్వచ్ఛ ఆటోను గమనించిన మంత్రి కేటీఆర్‌ దానిపై ఆరా తీశారు. స్వయంగా ఆటో నెంబర్ సేకరించి బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు కాప్రా సర్కిల్‌కు చెందిన కోటా వెంకటేష్‌ ఆటోగా గుర్తించారు. కిసరగుట్ట వద్ద డ్యూటి వేస్తే... హాజరుకాని వెంకటేష్‌... సిద్ధిపేటకు వెళ్లడంతో ఆటోను సిజ్ చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించారు అధికారులు. శానిటేషన్ రక్షణకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్న బల్దియా.... వాటి సద్వినియోగంపై ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

07:15 - February 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ హస్తం నేతలు రూట్‌ మారుస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటుంది కాంగ్రెస్‌ ముఠానే అని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోకపోతే.. తాము కూడా అదే రేంజ్‌లో విరుచుకుపడతామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు అంతంతమాత్రంగానే ఆరోపణలు చేసుకోగా.. తాజాగా అవి శృతి మించుతున్నాయి. ప్రాజెక్టులను అడ్డుకుంటుంది కాంగ్రెస్‌ ముఠానే అని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. సీఎంనే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. ఇకపై తమను ఒక్క మాటంటే.. తాము రెండు మాటలు అంటామంటున్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటుందంటున్న కేసీఆర్‌.. ఆయనే దోపిడీకి పాల్పడుతూ ఆంధ్రావాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టారన్నారు ఉత్తమ్‌. ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా.. కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ శాసనమండలి సభా పక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు.మరోవైపు ఎమ్మెల్యే డీకే అరుణ కూడా కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణను ఇవ్వకుంటే.. కేసీఆర్‌ సీఎం అయ్యేవారు కాదన్నారు. మొత్తానికి కేసీఆర్‌ మాటలకు బ్రేక్‌ వేయాలంటే అదే తీరుగా ముందుకు సాగుతామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. మరి ఈ మాటల యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి !

07:12 - February 26, 2017

హైదరాబాద్‌ : మాదన్నపేట మండిలో అగ్ని ప్రమాదం జరిగింది. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించి తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో ప్రమాదం జరగడంతో మంటల్లో షెడ్లు కాలిపోయాయి. నిల్వ ఉంచిన కూరగాయలు కాలి బూడిదయ్యాయి. ఫైర్‌ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మండీ స్థాపించిన నాటి నుండి ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం జరగడం ఇదే తొలి సారి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరగడంతో తాము నష్టపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - telangana