Telangana Assembly elections2018

19:57 - November 8, 2018

ఢిల్లీ: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం ముగిసింది. తీవ్ర వడపోతల మధ్య 74 సీట్లలో పోటీచేసే అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఇచ్చే స్ధానాలను కేటాయించారు. యూపీఏ ఛైర్ పర్సన్  సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం అనంతరం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో మిత్ర పక్షాలకు 25 సీట్లు కేటాయించామని చెప్పారు. టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐకి 3  కేటాయించామని, ఈనెల 10న తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

20:29 - October 21, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో సీపీఐకి ఓటర్లు ఉన్నారని, ఈఎన్నికల్లో మహాకూటమితో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. కొన్ని పార్టీలు కావాలనే తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, సీపీఐ అభ్యర్ధుల కోసం కూటమిలో 12 సీట్లు కావాలని అడుగుతున్నామని, కనీసం 9 సీట్లు అయినా తమకు ఇవ్వాలని ఆయన మహాకూటమి నేతలను కోరారు. 

19:28 - October 21, 2018

హైదరాబాద్: ఈ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం తెలంగాణభవన్లో దాదాపు 3గంటలపాటు సమావేశం అయ్యి వచ్చే45 రోజుల్లో పార్టీ ప్రచార వ్యూహాలపై అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్ధులు ప్రచారంలో నిర్లక్ష్యం వహించవద్దని, పోలింగ్ రోజు వరకు సమయాన్నిఏరకంగా సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి ఓటరును ఎలా కలవాలి, ఓటింగ్ శాతం ఎలా పెంచుకోవాలి  వంటి అనేక విషయాలను ఆయన వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పధకాలను వినియోగించుకుంటున్న వారు ప్రతి నియోజక వర్గంలోనూ సుమారు 60వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించి, నియోజక వర్గాల వారీగా వారి వివరాలను అభ్యర్ధులకు అందచేశారు. పాక్షిక మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూడా అభ్యర్థులకు ఆయన వివరించారు. సమావేశం వివరాలను కడియం శ్రీహరి  విలేకరులకు వివరిస్తూ..శాసనసభ రద్దుచేసిన నాటినుంచి నేటివరకు చేసిన సర్వేలలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని, అభ్యర్ధులు మరింత కష్టపడి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. ఈనెలాఖరులోగా ఖమ్మం,వరంగల్,కరీంనగర్ లలో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తారని వాటికి సంబంధించిన తేదీలను 2రోజుల్లో ప్రకటిస్తామని కడియం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఎన్నికల్లో 100 నియోజక వర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారని, దానిలో భాగంగా నవంబర్ 12వతేదీన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా 30 ప్రచార సభలు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు కడియం తెలిపారు. 

18:01 - October 21, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున బలం తక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చెయ్యాలని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ నిర్ణయించింది. ప్రచారకమిటీ చైర్మన్ భట్టివిక్రమార్క అధ్యక్షతన ఆదివారం గోల్కోండ హోటల్లో సమావేశమైన కమిటీ ప్రచారంలో స్పీడ్ పెంచాలని నిర్ణయించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుకు  దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో ప్రచారం చేయించాలని నిర్ణయించింది.  పార్టీలో ప్రజాకర్షణ ఉన్ననాయకులు ఇతర నియోజకవర్గాలలో ప్రచారానికి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో రెండో విడత ప్రచారంపై ఒక నిర్ణయానికి రానప్పటికీ, రేపు మరోసారి సమావేశమై  ప్రచారం ఏవిధంగా ఉండాలి అనే  అంశంపై తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి మిత్రపక్షాల నియోజకవర్గాల్లో ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్న కమిటీ, సీట్ల విషయం తేలాక ఆనియోజక వర్గాలలో ప్రచారంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. నిన్నటి రాహుల్ గాంధీ పర్యటనతో ఉత్సాహంలో ఉన్నకాంగ్రెస్ శ్రేణులు రెండో విడత రాహుల్ ని  ప్రచారానికి తీసుకువారావాలని నిర్ణయించాయి. టీఆర్ఎస్ కు బలం ఉన్న కరీంనగర్, వరంగల్ లలో ఈనెల 27 లేదా 28 తేదీల్లో రాహుల్ గాంధీ సభలు నిర్వహించాలని అనుకుంటున్నారు. రాహుల్ ఆఫీసు నుంచి అనుమతులు రాగానే వాటిని ప్రకటిస్తారు. 

 

16:57 - October 21, 2018

హైదరాబాద్ : శాసనసభను రద్దుచేసిన రోజే 105మంది అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్ధులను ప్రకటించి ముందస్తు ఎన్నికల్లో అన్ని పార్టీలకంటే ప్రచారంలోను, పాక్షిక మేనిఫెస్టో విడుదల్లోనూ  ముందున్న గులాబీబాస్ కేసీఆర్ తెలంగాణభవన్ లో  అసెంబ్లీకి పోటీ చేస్తున్న 105మంది అభ్యర్ధులతో సమావేశం అయ్యారు. ఈసమావేశానికిపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా హజరయ్యారు. ఇప్పటికే తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నఅభ్యర్ధుల ప్రచార సరళిపై నివేదిక తెప్పించుకున్న ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రచారంలోనూ,ప్రజలకు చేరువ కావటంలోను వెనుకబడిన అభ్యర్ధులకు దిశా, నిర్దేశం చేయనున్నారు. ఇంకా పోలింగ్ కు 45 రోజుల సమయమే ఉన్నందున ఈ 45రోజుల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు అభ్యర్ధులకు వివరించనున్నారు. 
భారతీయ జనతాపార్టీ ఇప్పటికే 38మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. త్వరలో మహాకూటమి కూడా తన అభ్యర్ధులను ప్రకటించనుంది. ఈనేపధ్యంలో టీఆర్ఎస్ తన దూకుడును మరింత పెంచనుంది. పోలింగ్ తేదీ లోపు కేసీఆర్ మొత్తం 100 బహిరంగ సభల్లో ప్రసంగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు తుదిరూపు వచ్చే అవకాశం ఉంది.

21:01 - October 20, 2018

హైదరాబాద్: 50 ఏళ్లు  దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అసమర్ధ విధానాల వల్లే గతంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పిందని టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.  కాంగ్రెస్పార్టీ మైనార్టీలపై హఠాత్తుగా ప్రేమ కురిపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ వ్యక్తి అయిన పీవీ నరసింహారావును  కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని, ఆయన స్మారకార్దం ఘాట్ నిర్మించే  విషయంలోనూ, అంత్యక్రియల విషయంలోనూ వివక్ష చూపించారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం  పీవీ నరసింహారావు, జయశంకర్, కుమ్రంభీం పేర్లను జిల్లాలకు, యూనివర్సిటీలకు   పెట్టి వారిని గౌరవించుకుందని కేటీఆర్ చెప్పారు. గత 4 ఏళ్లలో 25 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని, కాంగ్రెస్ హాయాంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరు పచ్చని జిల్లాగా మారుతోందని ఆయన చెప్పారు. తెలంగాణలో అమలు చేసిన రైతు రుణ మాఫీ విధానాన్నే కర్ణాటక రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారని,  రాహుల్ తన ప్రసంగంలో తప్పులు దొర్లకుండా చూసుకుంటే మంచిదని కేటీఆర్ హితవు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 27 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టుపై రాహుల్‌ గాంధీ పచ్చి అబద్దాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. "కాంగ్రెస్‌ హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని.. రూ.17వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెంచారని, 2013 భూసేకరణ చట్టం తర్వాత పరిహారం పెరిగింది. కొత్త ప్రాజెక్టుల కారణంగా ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగిందని కేటీఆర్ అన్నారు. 

Don't Miss

Subscribe to RSS - Telangana Assembly elections2018