telangana government

16:21 - August 17, 2017

హైదరాబాద్‌ : నగరంలోని... గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మరో మహిళా పోలీస్‌ స్టేషన్‌ను హోంమంత్రి నాయినీ నర్సింహరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

 

06:42 - August 17, 2017

హైదరాబాద్ : ఉద్యోగులు, వారి వేతన సంబంధిత విషయాల్లో ఇప్పటి వరకు కేంద్రంపై ఆధారపడ్డ తెలంగాణ సర్కార్ త్వరలో సొంత అస్థిత్వంతో అడుగులు వేయబోతోంది. రాష్ట్రంలో తొలిసారిగా పీఆర్సీ కమిషన్ నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం. అంతా కలిసి వస్తే వచ్చే ఏడాది జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇక పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్‌ చంద్రను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదో పీఆర్సీ అమలు సమయంలో, తెలంగాణ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ రూపకల్పనలోనూ ప్రదీప్ చంద్ర కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వేతన సంబంధిత వ్యవహారాల్లో ఆయనకి ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1998 జూలై నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నారు. దాని ప్రకారం పదో పీఆర్సీ కాల పరిమితి 2018 జూలై ఒకటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తేదీ కంటే ఏడాది ముందుగానే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అలా ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ ఆరునెలల పాటు కసరత్తు చేస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలను తీసుకుంటుంది. వాటన్నింటినీ అధ్యయనం చేసి సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. వీటిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అన్ని అంశాల్లో తనదైన ముద్రతో ముందుకు పోతున్న ప్రభుత్వం.. పీఆర్సీ విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

19:54 - August 8, 2017

హైదరాబాద్ :తెలంగాణలోని ప్రతి గుంట భూమినీ సర్వే చేయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట మండలంలోని మూడు చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి సేద్యపు పెట్టుబడి పథకాన్ని అమల్లోకి తెస్తామని, దీనికోసం ముందుగా భూముల వివరాలను సేకరిస్తామని సీఎం చెప్పారు. మూడు నెలల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి, భూముల లెక్కలను ప్రక్షాళన చేస్తామన్నారు.సేద్యపు పెట్టుబడి పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి రైతుకూ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. రైతుకు ఎన్ని ఎకరాలున్నాయన్న అంశాన్ని పట్టించుకోబోమన్నారు. పథకం అమలు కోసం.. ప్రతి గ్రామంలోనూ రైతు సంఘాలను, ఆరుగురితో గ్రామ రైతు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రైతుకూ.. ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు పంటలకు ఎనిమిదివేలు అందిస్తామన్నారు.

 ఏడాది రెండు పాడి పశువులు 
హరితహారం కార్యక్రమాన్ని సర్పంచులందరూ సీరియస్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి ఇంటి ముంగిటా ఆరు మొక్కలు నాటాలన్నారు. ఆరు చెట్లను బతికించే వారికి వచ్చే ఏడాది రెండు పాడి పశువులను ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రం నుంచి వలసలు బాగా తగ్గాయని, రైతులు బాగుపడాలంటే నీళ్లు, కరెంటు, పెట్టుబడి అవసరమన్న కేసీఆర్‌... రాష్ట్రంలో కరెంట్ కొరత పీడ శాశ్వతంగా పోయిందన్నారు. సాగునీటి సమస్య కూడా త్వరలోనే పోతుందన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. 

07:13 - August 8, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో భూ రికార్డులన్నింటీని ప్రక్షాళలన చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఏ భూమి ఎవరి పేరుమీద ఉన్నదన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు సర్వే చేపట్టాలని  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సర్వే, సెటిల్‌మెంట్‌ అధికారులను కోరారు. స్పెషల్‌ డ్రైవ్‌ పూర్తైన తర్వాత భూ రికార్డులన్నింటీ బహిర్గతం చేయాలని నిర్ణయించారు. 
భూ రికార్డుల వ్యవస్థల ప్రక్షాళన 
భూ రికార్డుల వ్యవస్థలను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఏ భూమి ఎవరి పేరుమీద ఉందన్న విషయాన్ని తేల్చేందుకు సర్వే నిర్వహించాలని భూరిపాలన శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. 
1936లో నిజాం పాలనలో భూ జమాబంది
భూ రికార్డులు ప్రక్షాళనకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏడు గంటలపాటు సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. 1936లో నిజాం పాలనాకాలంలో జమాబంది నిర్వహించి, తయారు చేసిన భూ రికార్డులను ఆ తర్వాత ప్రక్షాళన చేయలేదు. దీంతో సరైన రికార్డులు లేకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. భూ వివాదాలు కొన్ని సార్లు శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తున్నాయి. సమగ్ర భూ సర్వే ద్వారా ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం సర్వే ఆఫ్‌ ఇండియాతోపాటు దేశంలోని వివిధ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ప్రతిపాదించారు. 
పట్టాదారు పాసు పుస్తకాలు, పహాణీ పత్రాలు సరళతరం 
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తైతే అమ్మకాలు, కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతాయని భావిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, పహాణీ పత్రాలు సరళంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. భూములకు సంబంధించి గందరగోళానికి దారితీసే అంశాలకు రికార్డుల్లో తావులేకుండా చేస్తారు. బ్యాంకు లావాదేవీలు ఎంత పారదర్శకంగా ఉంటాయో, భూ రికార్డుల నిర్వహణ కూడా అదే విధంగా ఉండే విధంగా చూస్తారు. గ్రామాన్నియూనిట్‌గా తీసుకుని సర్వే చేయాలని నిర్ణయించారు. 
పెట్టబడి సబ్సిడీ కోసం సర్వే 
వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతులకు రెండు దఫాలుగా 4 వేల రూపాయల వంతున పెట్టబడి రాయితీ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ గ్రామాల్లో సర్వే నిర్వహించింది. కానీ రెవెన్యూ రికార్డుల్లోని వివరాలకు, వ్యవసాయ శాఖ సేకరిచిన సమాచారంతో సరిపోవడంలేదు. వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం ఓ గ్రామలంలో 300 మంది రైతులు ఉంటే, రెవెన్యూ రికార్డుల్లో 1100 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి రాయితీ ఎవరికి ఇవ్వాలన్న సమస్య తలెత్తుతోంది. ఈ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉండటంతో భూముల సర్వేకి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న 2.70 కోట్ల ఎకరాల భూమి యజమానులను ఈ సర్వే ద్వారా గుర్తిస్తారు. రాష్ట్రంలోని 10,850 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపడతారు. తెలంగాణలో ఉన్న 3,500 మంది రెవెన్యూ అధికారుల్లో ఒక్కొక్కర్ని మూడు గ్రామాలక ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తారు. గ్రాస్థులు, ప్రభుత్వం ఏర్పాటు చేసే రైతు సంఘాల ఆధ్వర్యంలో  ఒక్కో గ్రామాల్లో 15 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు వేరే పనులు అప్పగించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి భూమికి ప్రత్యేక సర్వే నంబర్‌ కేటాయిస్తారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తైన తర్వాత అన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

11:41 - August 1, 2017

తెలంగాణ వస్తే సమస్యలు తీరుతయి..ఎంతో ఆనందంగా ఉండొచ్చు..ఎలాంటి కష్టాలు పడుతున్నమో తెలుసుకున్న పాలకులు ఆ కష్టాలను తొలగిస్తారు..అంటూ కోరుకున్నారు. ఆ కోరుకున్న వారిలో 'రైతులు' కూడా ఉన్నరు. తెలంగాణ వచ్చేసింది..మూడేళ్లు దాటిపోతోంది..కానీ వారి సమస్యలు తీరాయా ? వారు ఆనందంగా ఉంటున్నరా ? సమైక్య పాలనలో ఇబ్బందులు పడిన రైతులు అలాంటి పరిస్థితి రానివ్వబోమని చెప్పిన పాలకులు ఆ దిశగా పాలిస్తున్నారా ? అంటే లేదు అనే సమాధానం వస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బ్యాంకుల ఎదుట పడిగాపులు..
ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతుకు ప్రస్తుతం అడుగడుగునా అవస్థలే ఎదురవుతున్నయి. వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నయి. కానీ ఆ రైతన్నకు రుణాలు మాత్రం లభించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని పలు బ్యాంకుల ఎదుట రైతులు పడిగాపులు పడుతున్నరు. రుణం పొందాలని ఇల్లు వదిలి..భార్య పిల్లలను వదిలి బ్యాంకుల ఎదుట నిరీక్షిస్తున్నారు. పనులన్నీ వదిలేసి పడిగాపులు పడుతున్నరు. బ్యాంకులు తెరవక ముందే భారీ క్యూలు...రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

అరకొర నగదు..
ధాన్యం డబ్బులు బ్యాంకుల్లో జమైన రైతులు వాటిని తీసుకోలేక పోతున్నారు. రైతులకు సాధారణంగా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పలు బ్యాంకుల్లో నగదు నిండుకోవడం..దీనితో ఒక్కో చోట కేవలం రూ. 4 వేలు.. పది వేలు చేతిలో పెడుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పనులు మానుకొని బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది..మళ్లీ వ్యవసాయానికి పెట్టుబడబి కావాలె..చేతిలో పైసల్లేక ఇబ్బంది అవుతంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీతో సహా పూర్తి రుణం కడితేనే కొత్త అప్పు ఇస్తామంటూ బ్యాంకులు కొర్రీ పెడుతున్నట్లు సమాచారం. అంతిమంగా బ్యాంకుల్లో రుణం అందక.. పెట్టుబడుల కోసం చేతిల చిల్లిగవ్వ లేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నరు. ఇటీవలే దీనిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నగదు కొరత తీవ్రంగా ఉన్నదని, తక్షణమే రూ.5వేల కోట్ల నగదును పంపాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని అప్పట్లో కోరారు. రైతులు తాము వేసుకున్న నగదు కోసం తామే బ్యాంకుల చుట్టూ బిచ్చగాళ్లలా తిరుగాల్సిన పరిస్థితి కొనసాగడమేమిటని కేంద్రంపై మండిపడ్డారు.
మరి రైతులు పడుతున్న రుణ ఆగచాట్లపై ప్రభుత్వం..బ్యాంకులు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

11:32 - July 31, 2017

జాబు రావాలంటే బాబు రావాలి...వచ్చారు..మని జాబులు వచ్చాయా ? జాబు రాకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తాం..అన్నారు..వచ్చిందా ? భృతి ఏమైంది అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు..భృతి మాట అటుంచితే జాబులు ఏమయ్యాయి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

'జాబు రావాలంటే బాబు రావాలంటూ' అధికారంలోకి రాకముందు టిడిపి పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఐదు వాగ్ధానాలను నిలబెట్టుకుంటున్నట్లు సంతకాలు కూడా చేశారు. అందులో ఒకటి 'నిరుద్యోగ భృతి'. నిరుద్యోగ భృతి కల్పిస్తారని లక్షలాది మంది నిరుద్యోగులు నమ్మారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పీఠమెక్కి మూడున్నరేళ్లు అవుతున్నా జాబు రాలేదు కాదు కదా..ఉన్న ఉద్యోగాలే ఊడి వేలాది మంది వీధిన పడుతున్నారు. మళ్లీ నిరుద్యోగ భృతి కల్పిస్తామంటూ పాలకులు మరోసారి హామీలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మళ్లీ మాటల జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

నెలకు రెండు వేల రూపాయలు..
ఎన్నికల ప్రచారం సందర్భంగా నిరుద్యోగులందరికీ ఒక్కొక్కరికి నెలకు రెండు వేల‌ రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని అప్పటి ప్రచారంలో ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అంటూ హడావుడి చేసిన చంద్రబాబు సర్కారు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తుందని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతిని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి అందచేస్తామని మరోసారి హామీలు గుప్పిస్తున్నారు. కేవలం ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి హామీలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.

కండీషన్ అప్లై..
ఇదిలా ఉంటే రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులుంటే కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే నిరుద్యోగులున్నారని ఏపీ సర్కార్ ప్రకటించడం పట్ల నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. 18 నురచి 35 సంవత్సరాల వయసు లోపు వారికే కావడం గమనార్హం. ఏదో భృతి ఇచ్చామని చెప్పుకోవడానికి..నిరుద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని కొద్దిగా తగ్గించుకొనేందుకు ప్రభుత్వం కొత్త వ్యూహానికి తెరలేపుతోందని తెలుస్తోంది. ఇంటర్మీడియేట్‌ కన్నా తక్కువ చదివిన వారికి నెలకు రూ.900, గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.1500, పోస్టు గ్రాడ్యుయేషన్‌ తదితర విద్యాభ్యాసం చేసిన వారికి నెలకు రూ.3వేల చొప్పున భృతిగా చెల్లించాలని ఏపీ సర్కార్ యోచిస్తుందనో టాక్. ఇదొక్కటే కాకుండా ఇంకా మరికొన్ని కండీషన్స్ పెడుతోందని తెలుస్తోంది. ప్రతి ఏటా డిఎస్సీ విడుదల చేస్తామన్న పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్‌నే కొనసాగించారే కానీ ఈ మూడేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ మూడేళ్లు దాటిపోతోంది..నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

21:24 - July 28, 2017

హైదరాబాద్ : మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. బంజారాహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. కోచ్‌ మూర్తికి 25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ఆయన ప్రకటించారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న మిథాలీ... ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా... మిథాలి, కోచ్‌ మూర్తిని కేసీఆర్‌ శాలువాకప్పి సన్మానించారు. ప్రపంచకప్‌లో మిథాలీరాజ్‌ అత్యద్భుతంగా ఆడిందని.. వ్యక్తిగత రికార్డును సాధించడం మరో అద్భుతమని కేసీఆర్‌ ప్రశంసించారు.

13:47 - July 27, 2017
17:33 - July 26, 2017

హైదరాబాద్ : పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త చరిత్రకు తెర లేపిందని మంత్రి కేటీఆర్ వెల్లడదించారు. జియాగూడలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. నగరంలో నిర్మిస్తున్న 840 డబుల్ బెడ్ రూం ఇళ్లకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అప్పటి ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ఆడపిల్లలకు పెద్ద పీట వేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 

15:40 - July 26, 2017

హైదరాబాద్ : 'ఇది పెద్దోళ్ల ప్రభుత్వమా ? పేదల ప్రభుత్వమా' ? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జియాగూడలో డబుల్ బెడ్ రూం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. డిప్యూటి సీఎం, మంత్రి కేటీఆర్, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు..సంక్షేమ కార్యక్రమాలు ఏకరువు పెట్టారు.

సంక్షేమ కార్యక్రమాలు..
పెన్షన్ లతో ఒక భరోసా..ఆసరా ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. రేషన్ బియ్యం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కుటుంబానికి సరిపడా బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. కళ్యాణ లక్ష్మీ అనే పథకం..షాదీ ముబారక్ పేరిట పేదలను ఆదుకుంటున్నామని, గర్భిణీల కూడా కేసీఆర్ కిట్ పేరిట ఆరు నెలల మాసాల పాటు రూ. 12 వేలు నేరుగా ఆమె అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుందని, బిడ్డ జన్మించిన అనంతరం కిట్ లో 13 రకాల వస్తువులు అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి మూడేళ్లే అయ్యిందని..ఇంకా సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - telangana government