telangana news updates

10:29 - July 21, 2018

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోంది. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. 17 గేట్లను తెరిచిన అధికారులు 1 లక్షా 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల కుడి..ఎడమ కాల్వలు..నెట్టెంపాడు..కోయిల్ సాగర్, భీమా సమాంతర కాల్వలకు నీరు విడుదల చేశారు. 

19:40 - July 19, 2018

మహబూబ్ నగర్ : కృష్ణానది ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 113.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల రిజర్వాయర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ఇన్‌ఫ్లో 65 వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 29 వేల 495 క్యూసెక్కులుగా ఉంది. 

 

07:51 - July 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ లీకేజ్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే వంద మందిని విచారించిన సీఐడీ.. కార్పొరేట్ కళాశాలకు చెందిన డీన్‌తోపాటు.. ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని కీలక విషయాలను రాబట్టారు. ఇందులో అసలు సూత్రదారులను కనిపెట్టేందుకు సీఐడీ ఆరా తీస్తోంది.
ఎంసెట్-2 లీకేజ్ స్కామ్‌ దర్యాప్తులో వేగం 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2016 తెలంగాణ ఎంసెట్-2 లీకేజ్ స్కామ్‌ దర్యాప్తులో సీఐడీ మళ్ళీ వేగం పెంచింది... మొదట్లో వేగంగా అరెస్టులు చేసినా.. తర్వాత కేసు దర్యాప్తులో స్పీడ్‌ తగ్గించింది. కానీ తాజాగా ఓ కార్పొరేట్ కాలేజ్ డీన్ వాసుబాబు, ఏజెంట్ వెంకటశివనారాయణ అరెస్ట్‌తో సీఐడీ మళ్ళీ దూకుడు పెంచింది. ఈ కేసులోఇప్పటికే  అధికారులు వంద మందిని పైగా విచారించారు.
కార్పొరేట్ కాలేజీల గుట్టు విప్పే దిశగా సీఐడీ అడుగులు
కార్పొరేట్ కాలేజీల గుట్టు విప్పే దిశగా సీఐడీ అడుగులేస్తోంది. డీన్ వాసుబాబును, మధ్యవర్తి శివనారాయణరావును కష్టడీకి తీసుకున్న అధికారులు మొదటి దఫా విచారించారు. ఆరు క్యాంపుల్లో శిక్షణ పొందిన దాదాపు 136 మంది విద్యార్థుల వాంగ్ములాలను రికార్డ్ చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి 35 లక్షలు వసూలు చేసినట్లు వాసుబాబు, శివనారాయణ వెల్లడించారు. కానీ మొత్తం డబ్బులు తాము తీసుకోలేదని వారు అధికారులకు వివరించారు.
మెడికో గణేష్ ప్రసాద్ స్టేట్ మెంట్ తో బట్టబయలైన భాగోతం
మెడికో గణేష్ ప్రసాద్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో వాసుబాబు, వెంకటశివనారాయణ భాగోతం బట్టబయలైంది. ఆరుగురు మెడికోలు.. తాము మాఫియాతో చేతులు కలిపామని విచారణలో వెల్లడించారు. బెంగుళూర్, భువనేశ్వర్, చెన్నై , డిల్లీలో క్యాంపులు ఏర్పాటు చేసి లీకైన ప్రశ్న పత్రాన్ని ప్రిపేర్‌ చేయించినట్లు వెల్లడైంది. ప్రతి ఏటా ఎంసెట్ సమయంలో వాసు బాబు, శివ నారాయణ, గణేష్‌లు  ఇదే కేసులో నిందితులైన ఇద్దరు డాక్టర్లతో కలిసి తతంగం నడిపినట్లు తేలింది. మరి కొందరు విద్యార్థులతో 30 నుంచి 45 లక్షల వరకు డబ్బులు తీసుకుని క్యాంపు లు నిర్వహించినట్లు సీఐడీ భావిస్తుంది ..ఈ కేసును పూర్తిగా చేధించేందుకు మరో ఐదు రోజులు పాటు ఇద్దరు నిందితులను విచారించనున్నారు అధికారులు.  ఇందులో అసలు సూత్రదారి ఎవరు అన్న కోణంలో విచారిస్తున్నారు. 

 

16:23 - July 12, 2018

ఢిల్లీ : కాంగ్రెస్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ కాస్తా 'హిందూ - పాక్' గా మారిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ లా భారత్ ను మార్చేందుకు బీజేపీ కొత్త రాజ్యాంగం తయారు చేస్తోందని..దీనితో మైనార్టీల హక్కులు అణిచివేయబడుతాయన్నారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆజాద్ వంటి స్వాతంత్ర సమరయోధుల ఆంక్షలకు అది విరుద్ధమన్నారు. థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ క్షమాపణలు చెప్పాలని, హిందూవులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. 

21:08 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును యాథాతథంగా అమలు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అగస్టు ఒకటితో పంచాయితీల కాలపరిమితి ముగుస్తుండటంతో స్పెషల్ అఫీసర్లను వేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గఉప సంఘం అభిప్రాయపడింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్‌ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది.

ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈలోపు ఎన్నిక‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై కూడా సబ్‌కమిటీ చ‌ర్చించింది. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని...ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఈటల తెలిపారు.

జూలై 31 తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంద‌ని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యత‌లు అప్పగించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్నది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్లనేవి విద్యా, ఉద్యోగాలపై మాత్రమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. ఇక తమిళనాడు 69 శాతం ఉన్నపుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఎందుకు ఉండాలనే వాదనను సుప్రీం కోర్టులో వినిపిస్తామని చేప్తోంది.

17:43 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని టీపీసీసీ విమర్శించింది. ఎన్నికల నిలుపుదలకు హైకోర్టులో కేసు వేసిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ మండిపడ్డారు. నాగర్‌కర్నూల నియోజకవర్గం ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి కేసు వేసిన విషయం టీఆర్‌ఎస్‌ నాయకులకు తెలియదా.. అని శ్రవణ్‌ ప్రశ్నించారు. 

16:44 - July 11, 2018

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని దేవతల గుట్టలో వందల ఎకరాలు కబ్జా అవుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు. యదేచ్ఛగా భూములు కబ్జా అవుతుంటే సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కొంతమందికి టీఆర్‌ఎస్‌ నేతలు అండగా ఉండే భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. భూములను పరిశీలించేందుకు కూడా ఎవరినీ అనుమతించకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఇదంతా జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కబ్జాకు గురైన భూములను రేపు ఉదయం పరిశీలిస్తామని.. అక్రమంగా భూములు కబ్జా చేస్తుంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదన్నారు వీహెచ్‌. 

15:31 - July 11, 2018
13:45 - July 11, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. నాలుగు రోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జంటనగరాల్లో మరోరెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగరంలో మూడు, నాలుగు రోజులుగా చిరుజల్లులతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 7కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
    
ఐదు రోజులుగా మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పెనుగంగాలో వరద ప్రవాహం పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొమురంభీం, చెన్నూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు రాకపోకలు స్థంభించాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పెనుగంగా, గోదావరి నదులు కలిసే కాళేశ్వరం వద్ద వరద ఉధృతి 7.5 మీటర్లకు చేరుకుంది. వర్షం ప్రభావంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం బ్యారేజీ పనులు నిలిచిపోగా... కన్నెంపల్లి పంప్‌ హౌజ్‌ పనుల్లో వేగం తగ్గింది. అన్నారం బ్యారేజి వద్ద వరద నీటిని ఆపేందుకు నిర్మించిన తాత్కాలిక కట్ట తెగిపోవడంతో ఈరోజు 12,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది.

భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగి గోదావరి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 16 అడుగులు ఉన్న గోదావరి నీరు 26 అడుగులకు చేరింది. గోదావరికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో నిర్మాణంలో ఉన్న రెండవ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వరద నీరు క్రమంగా స్నానాల ఘట్టాల వరకు చేరుకోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. 

భద్రాద్రి జిల్లా జూలూరుపాడ్‌ మండలం పాపకొల్లు పంచాయితీ వెనకతండా గ్రామంలో రహదారులు చిత్తడిగా మారాయి. జూలూరుపాడు మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్లు దాటి వెళ్లాల్సి ఉంటుంది. అత్యవసర పనులకోసం మండలానికి వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. అధ్వాన్నంగా ఉన్న రహదారికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని రహదారికి అడ్డంగా కంచెవేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవరకు కంచె తీసేదిలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, రంపచోడవరం డివిజన్లలో వర్షం జోరుగా కురుస్తోంది. వర్షాలతో కోనసీమలో పొలాలు ముంపు బారిన పడ్డాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాజమహేంద్రవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు  ఓడిశామీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

12:49 - July 10, 2018

హైదరాబాద్‌ : జంటనగరాల్లో మరోరెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా నగరంలో చిరుజల్లులతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 7కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికితోడు తూర్పు, పశ్చిమ జోన్‌లో సుమారుగా 19.0 డిగ్రీల వెంబడి 4.5 కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్య కొనసాగుతోందని, దీని ప్రభావంతో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నగరంలో సోమవారం ఉదయం, రాత్రి సమయాల్లో ముసురుతో కూడిన చిరు జల్లులు కురిశాయి. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26.3 డిగ్రీలు, కనిష్ఠంగా 22.3 డిగ్రీలుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - telangana news updates