telangana politics

08:33 - May 13, 2018

హైదరాబాద్ : ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గాడినపెట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తోంటే.... మరోవైపు ఆయనకు తెలుగు తమ్ముళ్లు రోజుకొకరు షాక్‌ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో జోరు పెంచాల్సిన నేతలు.. ఒక్కొక్కరు సైకిల్‌ దిగిపోతున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమవుతోందన్న ఆందోళన అధినాయకత్వాన్ని వేధిస్తోంది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు ఆందోళన కరంగా మారుతోంది. తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ తెలంగాణ అగ్రనాయకులు ఇతర పార్టీల్లో చేరుతుండడంతో సెకండరీ స్థాయి నేతలు కూడా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇది గమనించిన చంద్రబాబు ఈ మధ్యే ముఖ్యనేతలతో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలంతా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు. ప్రజల్లో పార్టీ బలంగా ఉంటేనే.. ఏదైనా రాజకీయపార్టీ పొత్తు కోసం ఆసక్తి చూపుతుందని స్పష్టం చేశారు. బలహీనపడితే ఏపార్టీలు పట్టించుకునే పరిస్థితి ఉండబోదన్నారు. అందుకే నేతలంతా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా... తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అధినేత హామీలు తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం ధీమా ఇవ్వడం లేదు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. నాటి నుంచి నేటి వరకు వరుస షాక్‌లు తెలుగు తమ్ముళ్లు ఇస్తూనే ఉన్నారు. సీనియర్లుగా గుర్తింపు పొందిన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేవంత్ పార్టీని వీడిన అనంతరం కాంగ్రెస్ లో చేరుతున్న టిటిడిపి నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంత మంది నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా....ముఖ్యమంత్రి కేసిఆర్ పై పోరాటం చేస్తున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి సైతం టిడిపికి గుడ్ బై చెప్పారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది అదే దారిలో నడిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

పార్టీలో నేతలు నిలబడలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ కూడా నేతలకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రమణ వైఖరి ఇదే విధంగా కొనసాగితే పార్టీకి మరింత నష్టం జరుగక తప్పదన్న అభిప్రాయాన్ని సీనియర్లు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.

16:35 - May 5, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాన్ని తొక్కేయాలని చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు సీఎల్పీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్. సీఎల్పీ సమావేశంలో చర్చించిన పలువిషయాలను ఆయన మీడియా ముందు వివరించారు.. హైకోర్టు తీర్పును ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్‌ గౌరవిస్తూ వెంటనే అమలు చేయాలన్నారు ఉత్తమ్‌కుమార్‌. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

16:03 - May 4, 2018

భద్రాద్రి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ పథకం అభాసు పాలవుతుంది... మితిమీరిన రాజకీయ జోక్యం.. నేతల స్వార్థ ప్రయోజనాల ఫలితంగా.. మత్స్యకారులు రెండేసి వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. కోర్టు మెట్లూ ఎక్కడంతో.. చేపల వేట నిలిచిపోయింది. సకాలంలో వేటాడని కారణంగా.. చేపలు నీటిలోనే చనిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ పథకం.. ఎవరికీ కొరకాకుండా పోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపపిల్లల పంపిణీ పథకం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అబాసుపాలవుతోంది. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కారణంగా.. వేట నిలిచి.. చేపలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యసంపద సృష్టించి బెస్తలను ధనికులను చేయాలన్న ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్‌ మండలం సింగభూపాలెం ప్రాజెక్టులో.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. సుమారు 7.2 లక్షల చేపపిల్లలను వదిలారు. పాతవి కొత్తవి కలిపి.. చెరువు మొత్తం చేపలతో కళకళలాడాయి. దీంతో.. ఈసారి చేపల వేట ద్వారా భారీగానే డబ్బు సంపాదించవచ్చన్న ఆనందంలో మత్స్యకారులున్నారు. కానీ.. వారి ఆశలపై.. రాజకీయ నాయకుల స్వార్థం నీరుజల్లింది.

ట్రైబల్‌ ఏరియా పేరిట 190 మంది కొత్త వారికి సొసైటీలో చోటు
సింగభూపాలెం చెరువులో 54 సంవత్సరాలుగా సుమారు రెండు వందల మంది మత్స్యకారులు ఒక సొసైటీగా ఏర్పడి చేపలను పెంచేవారు. చేపలు పెంచడానికి అయ్యే ఖర్చునూ సొసైటీయే భరించేది. చేపలు పట్టి అమ్మగా వచ్చిన డబ్బును సొసైటీ సభ్యులందరూ సమంగా పంచుకునేవారు. అయితే ఈ సంవత్సరం.. స్థానిక సర్పంచ్‌, ఎమ్మెల్యే సమకారంతో చేసిన ఓ పని వల్ల.. అసలుకే మోసం వచ్చింది. ట్రైబల్‌ ఏరియా పేరిట 190 మంది సభ్యులను ఈ సొసైటీలోకి చేర్చి.. వారికీ ఈ సంవత్సరం నుంచే చేపల వేటకు అనుమతించారు. దీన్ని పాతసభ్యులు అభ్యంతర పెట్టారు.

ఎండలకు నీరు వేడెక్కి, ఆక్సిజన్‌ కొరతతో వందల సంఖ్యలో చేపలు మృతి
ప్రతి సంవత్సరం మార్చ్‌ నుంచి మే నెల కాలంలో చేపలు పట్టడం ఆనవాయితీ. పాత,కొత్త సభ్యుల మధ్య పోరుతో.. చేపలవేట నిలిచిపోయింది. దీంతో చెరువులో నీరుతగ్గి, ఎండలకు నీరు వేడెక్కి , చేపలకు ఆక్సిజన్‌ అందక ప్రతి రోజు వందల సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి. ఎవరికీ ఉపయోగపడకుండా చనిపోతున్న చేపలను చూసి మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. చేపలు వృథాగా చనిపోతుండడాన్ని భరించలేక, తమకు చేపలు పట్టే అనుమతి ఇవ్వాలని, సొసైటీ పాతసభ్యులు అధికారులను కోరారు. అయితే.. వ్యవహారం కోర్టులో ఉండడంతో.. అధికారులు చేపలవేటకు అనుమతించలేదు. మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ప్రభుత్వ ప్రతిష్టాత్మక చేప పిల్లల పంపిణీ పథకం.. ఇలా నీరుగారిపోతోంది. స్వార్థ రాజకీయ నాయకుల కారణంగా.. పథకం ఆశయం దెబ్బతింటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. ఇందులో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని నివారించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

 

15:42 - May 2, 2018

హైదరాబాద్ : రానున్న రోజుల్లో బిఎల్ఎఫ్ విస్తృతంగా సమావేశాలు..కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళుతుందని కన్వీనర్ తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిఎల్ఎఫ్ జనరల్ బాడీ సమావేశంలో సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించడం జరిగిందని, బిఎల్ఎప్ లో 28 పార్టీలున్నాయని, భావజాలం ఉన్న పార్టీలు కూడా చేరాలని కోరారు. సీపీఐ పార్టీ ఇంకా చేరలేదని వారితో మాట్లాడుతున్నామని, అందులో భాగంగా మంగళవారం సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుందని కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన కోదండరాం పేర్కొంటున్నారని తెలిపారు. దీనితో బీఎల్ఎఫ్ కు దూరంగా ఉండాల్సినవసరం లేదని..వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత కృష్ణయ్య...ఇతర పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు.

సమాజ్ వాది పార్టీ నేతలతో చర్చలు జరుపుతామని, ఆ పార్టీకి సంబంధించిన జాతీయ నేత అఖిలేష్ యాదవ్ నగరానికి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయదలిచిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ మద్దతు పలికితే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పనిచేసిన వారవుతారని తెలిపారు.

ఇక బిఎల్ఎఫ్ రాబోయే మూడు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రజలతో సమావేశాలు..బహిరంగసభలు..ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు..మండలానికి..గ్రామానికి...బూత్ లకు కమిటీలు వేస్తామన్నారు. 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కమిటీలు ప్రకటించడం జరిగిందని, రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలు నిర్వహించి ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తామని...వారికి రక్షణ ఇచ్చేది కేవలం బిఎల్ఎఫ్ మాత్రమేనని తెలిపారు.

అన్ని యూనివర్సిటీలతో..కాలేజీలకు చెందిన వారు ప్రతి మండలానికి ప్రతి ఐదుగురు చొప్పున 400 మండలాల్లో బిఎల్ఎఫ్ విధానాలు ప్రచారం చేస్తారని తెలిపారు. తెలంగాణ రచ్చ బండ పేరిట సభలు నిర్వహిస్తామని...జులై ఆఖరి తరువాత అసెంబ్లీ స్థాయిలో పదివేల మందికి తగ్గకుండా బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు తెలియచేయాలంటే మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి చేరువయ్యే విధంగా చేయాలని కోరారు.

పార్టీ నేత జలగం వెంకట్రావు మాట్లాడుతూ...అధికారం ఒక్కటే అడగొద్దు అంటున్నారని..కానీ బిఎల్ఎఫ్ మాత్రం అధికారం కోసం పోరాడుదామని పేర్కొంటోందన్నారు. ఓట్లు మావి..సీట్లు మావే..అని, బహుజన ఓట్లన్నీ పడుతాయనే భావిస్తున్నట్లు, ఓసీల్లో కూడా పేదవారు ఉన్నారని..సామాజిక న్యాయం కావాలని కోరుకొనే వారున్నారని వారందరినీ సమదృష్టితో చూడడం జరుగుతుందన్నారు. 

12:43 - April 19, 2018

మేడ్చల్ : కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... మేడ్చల్‌ జిల్లా శమిర్‌పేట్‌ మండలం బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ ధర్నా నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు సీఐటీయూ నేతలు తరలి వచ్చారు. దీంతో పోలీసులు సీఐటీయూ నేతలను అరెస్ట్‌ చేశారు. 

18:38 - April 18, 2018

మహబూబ్ నగర్ : సుదీర్ఘపోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకుల పనితీరు సరిగా లేదని జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ అన్నారు. మహబూబ్‌ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన జనసమితి పార్టీ కార్యలయాన్ని ప్రారంభించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కారించే విషయంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుటుంన్నారని అన్నారు. ఈ నెల 29 న జనసమితి పార్టీ అవిర్భావ సభకు పాలమూరు నుంచి పెద్ద ఎత్తున జనం తరలి రావాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు.

20:46 - April 16, 2018

హైదరాబాద్ : మక్కామసీదు కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. 

 

16:03 - April 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే తమ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సభలకు అనుమతివ్వకుండా ప్రభుత్వం నిరంకుశ పోకడలు పోతోందని విమర్శించారు.  పొల్యూషన్‌ సాకు చూపుతూ సభను అనుమతి నిరాకరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎల్‌బీ స్టేడియంలో ఓ సినిమా వేడుక నిర్వహించినప్పుడు పొల్యూషన్‌ ఏర్పడలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు ఇష్టంలేనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. సభలు, మీటింగ్‌లు పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని... ఆ హక్కునే కేసీఆర్‌ కాళరాస్తున్నారని మండిపడ్డారు. 

 

18:28 - April 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు... సీఎస్‌ ను కలిశారు. ఉద్యోగుల బదిలీలు, పీఆర్సీ ఇతర అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఈనెల 30న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. 

06:39 - April 5, 2018

హైదరాబాద్ : కోదండరామ్‌ అధ్యక్షతన కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి పార్టీ .. తన పతాకాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ ప్రజల ఆంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన టీజేఎస్‌... ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ నిరంకుశపాలనకు అంతం పలకడమే ధ్యేయంగా పనిచేయాలని తెలంగాణ జనసమితి నాయకులు ప్రతినపూనారు. ఆకుపచ్చ రంగుపై పాలపిట్ట రంగుతో టీజేఎస్‌ జెండా రూపొందించారు. పాలపిట్ట విజయానికి సంకేతమైతే, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నంగా భావిస్తారు. జెండా మధ్యలో నీలిరంగు తెలంగాణ చిత్రపటంలో అమరవీరుల స్థూపంతో జెండా రూపొందించారు. టీజేఎస్‌కు తాడు బొంగరం లేదంటూ వ్యాఖ్యానిస్తున్న వారికి ముకుతాడు వేసే విధంగా శరవేగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 29న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో టీజేఎస్‌ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నిరంకుశపాలనకు అంతం పలకడమే ధ్యేయంగా ఎన్నికలకు సిద్ధంగా కావాలని టీజేఎస్‌ నిర్ణయించింది. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించిన టీజేఎస్‌... సొంతంగానే ముందుకు సాగాలని నిర్ణయించింది. అయితే కలిసివచ్చే వారిని కాదనకూడదన్న ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - telangana politics