telangana schemes

17:31 - June 12, 2017

వరంగల్ : పేదలకు ఒక్కపూటైనా శుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రూ.5 భోజన పథకానికి హైదరాబాద్‌లో విశేష స్పందన లభిస్తోంది. ఈ పథకాన్ని మరింత విస్తరించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకాన్ని ముందుగా 8 కేంద్రాల్లో అమలు చేస్తున్నారు.

8 కేంద్రాల వద్ద జనం క్యూ

పధకం ప్రారంభించిన ఎనుమాముల మార్కెట్, ఎంజీఎం, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రితో సహా 8 కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, రోజు వారి కూలీలు, అనాథలు, నిరుపేదలు, రైతులు ఉంటున్నారు. ఐదురూపాయల మీల్స్‌ ప్రతి రోజు ఐదువేల మంది పేదల కడుపు నిండుతోంది. జీడబ్ల్యూఎంసీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పథకానికి ఒక ప్లేట్ మీల్స్‌కు దాదాపు రూ.24 ఖర్చు అవుతున్నట్లు అంచనా.. రూ.19 ప్రభుత్వం భరిస్తుంటే మిగతా ఐదు రూపాయలు లబ్దిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతల్ని హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. ఈ పథకం ప్రారంభానికి ముందే అక్షయపాత్ర ఫౌండేషన్‌కు వరంగల్ బిల్డర్స్ అసోసియేషన్ రూ.35 లక్షలు ఆర్ధిక సాయం అందించడం విశేషం. హైదరాబాద్ జీహెచ్ ఎంసీ తరహాలోనే ఓరుగల్లులోనూ రూ. 5 భోజన పథకం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల డిమాండ్ దృష్ట్యా రాబోయే రోజుల్లో అధికారులు వీటి సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

08:57 - May 18, 2017

హైదరాబాద్ : కరీంనగర్‌ అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, ఇతర అధికారులు హాజరయ్యారు. కరీంనగర్‌ నగరాన్ని సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

కరీంనగర్ నుంచి హరితహారం...
హరితహారం కార్యక్రమం ఈసారి కరీంనగర్ నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.. కరీంనగర్‌లో 4 నుంచి 5 లక్షల మొక్కలు పెంచుతామన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కరీంనగర్ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరీంనగర్‌తోపాటు ఇతర పట్టణాలకు అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.. మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ కమిషనరేట్లు ఉన్న వాటికి పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు బస్‌బేలు, షెల్టర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కరీంనగర్‌లో హైదరాబాద్ తరహా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపడతామన్నారు. 1200 మంది కూర్చునేలా కరీంనగర్‌లో టౌన్‌హాల్ నిర్మాణం చేపడతామని కేసీఆర్‌ అన్నారు..

అంతర్జాతీయ స్థాయిలో కళాభారతి
హెలిపాడ్‌కోసం వినియోగిస్తున్న పదెకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్‌ కళాభారతి నిర్మిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.. నగరంలోని ఐదు ప్రాంతాల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు నిర్మించాలని అధికారుల్ని ఆదేశించారు.. మానేరు రివర్‌ఫ్రంట్ సుందరీకరణకోసం బడ్జెట్‌లో కేటాయించిన 506కోట్లలో 25కోట్లను కేసీఆర్‌ విడుదల చేశారు.. డ్యాంపై టూరిస్ట్ స్పాట్‌, వ్యూపాయింట్, రెస్టారెంట్, బోటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షణకోసం ఐఎఫ్‌ఎస్‌ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.

17:35 - March 8, 2017

హైదరాబాద్: దళితులకు మూడు ఎకరాల భూమి. ఇది టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అంతే. ఆ ఒక్క రోజు సంబరంతోనే సరిపెట్టింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అటకెక్కించింది. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే, ప్రయివేట్ భూమి కొనైనా సరే, ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడేసి ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామంటూ టిఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ, ఆచరణలో అది కనిపించడం లేదు. ప్రభుత్వం నిజంగా మూడు ఎకరాల భూమి ఇస్తుందని ఆశ పడ్డ దళితులు ఇప్పుడు భంగపడ్డారు. సిపిఎం నిర్వహించిన మహాజన పాదయాత్రలో అనేకమంది దళితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే ఇవాళ్టి స్పెషల్ ఫోకస్.

మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు కనిపించవు....

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఎక్కడకెళ్లినా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు కనిపించవు. పాత కరీంనగర్ జిల్లాలో దాదాపు లక్షా 20 వేల మంది దళిత కుటుంబాలకు భూమి లేనట్టు అధికారులు గుర్తించారు. కానీ, వీరిలో 300 కుటుంబాలకు మాత్రమే భూ పంపిణీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎక్కడ లక్షా 20 వేలు ఎక్కడ మూడొందలమంది? ఈ లెక్కన భూమిలేని దళితులందరికీ మూడు ఎకరాల భూమి ఇవ్వాలంటే ఎన్ని దశాబ్ధాలు పడుతుందో ఊహించుకోవచ్చు.

అసలు సెంటు భూమి కూడా లేని దళితులకు...

అసలు సెంటు భూమి కూడా లేని దళితులకు మూడు ఎకరాల చొప్పున , ఎకరం వున్న వారికి రెండెకరాల చొప్పున, రెండెకరాలున్నవారికి ఎకరం చొప్పున ఇస్తామంటూ ఎన్నెన్నో వాగ్ధానాలు చేశారు కెసిఆర్. తామిచ్చిన భూములను సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఏడాదిపాటు వ్యవసాయ ఖర్చుల కూడా భరిస్తామంటూ మరెన్నో మాటలు చెప్పారు. కెసిఆర్ మాటలు నమ్మి చాలామంది ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు. ఇక తమ జీవితాలు మారిపోతాయంటూ మురిసిపోయారు. కానీ చివరకు నిరాశే మిగిలింది. కెసిఆర్ ప్రభుత్వం దళితులకు భూమి పంచిందీ లేదు. దుక్కి దున్నిందీ లేదు.

20 వేల దళిత కుటుంబాలకు భూమి లేదన్నది అధికారుల సర్వేల సారాంశం...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షా 20 వేల దళిత కుటుంబాలకు భూమి లేదన్నది అధికారుల సర్వేల సారాంశం. వీరందరికీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే 3 లక్షల 60 వేల ఎకరాల భూమిని పంచాల్సి వుంటుంది. కానీ, ఇప్పటి వరకు మూడు వందల కుటుంబాలకు పంపిణీ చేసింది కేవలం 755 ఎకరాల 9 గుంటలు. పంపిణీ చేసిన భూమిలో ప్రభుత్వ భూమి 103 ఎకరాల 20 గుంటలు కాగా, ప్రయివేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది 651 ఎకరాల 29 గుంటలు. మిగిలిన దళిత కుటుంబాలకు భూమి పంచేదెప్పుడు? రెండేళ్లలో కేవలం 755 ఎకరాల భూమి పంచిన ప్రభుత్వం మరో వందేళ్లకైనా ఆ పని పూర్తి చేయగలదా? ఇదే ప్రశ్న సంధిస్తున్నాయి దళిత సంఘాలు. కరీంనగర్ జిల్లా విడిపోక పూర్వం అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ప్రయివేట్ భూములు కొనుగోలు చేసేందుకు సర్వే చేపట్టిన్నప్పటికీ అడుగు ముందుకు కదలలేదు. ఇప్పట్లో దళితులకు మూడు ఎకరాల కల సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకం అమలు కోసం పోరాడేందుకు సిపిఎం సమాయత్తమవుతోంది.

 

మహబూబ్ నగర్ జిల్లాలో....

పాలమూరు జిల్లాలో దళితుల ఆశలు అడియాలవుతున్నాయి. మూడు ఎకరాల భూమి పథకం తూతూ మంత్రంగా సాగడంతో దళితులు తీవ్రంగా నిరాశచెందుతున్నారు. భూములు దొరకడం లేదన్న వంకతో ఈ పథకాన్ని అటకెక్కిస్తున్నారు. భూములు అందుబాటులో వున్నా , వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ప్రారంభమైన...

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ప్రారంభమైన దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం ఆరంభ అట్టహాసంగానే మిగిలిపోతోంది. పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి దాకా పంపిణీ చేసింది కేవలం 889 ఎకరాలు మాత్రమే. 303 కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

సిపిఎం మహాజన పాదయాత్రలో ...

సిపిఎం మహాజన పాదయాత్రలో మహబూబ్ నగర్ జిల్లాలో అనేకమంది దళితులు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మూడు ఎకరాల భూమి సమస్యపై వినతిపత్రాలు సమర్పించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వందల మంది నిత్యం వలసపోతుంటారు. దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి, వలసలను అరికడతామంటూ టిఆర్ఎస్ నాయకులు ఎన్నెన్నో మాటలు చెప్పారు. కానీ అవేవీ వాస్తవ రూపం దాల్చడం లేదు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలంటే ఎంత భూమి కావాలి? అన్న విషయంలో అధికారుల దగ్గర స్పష్టమైన సమాధానం దొరకని పరిస్థితి కనిపిస్తోంది. భూములను గుర్తించే విషయంలో అంతులేని అలసత్వం కనిపిస్తోంది.

పంచిన కొద్ది పాటి భూమి విషయంలోనూ కొన్ని వివాదాలు...

పంచిన కొద్ది పాటి భూమి విషయంలోనూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ధన్వాడ మండలంలో అధికారుల నిర్వాకం వివాదస్పదమైంది. ఒకరి భూమిని మరొకరికి పంచడం పంచాయితీకి కారణమైంది. పాత మహబూబ్ నగర్ జిల్లాలో బంజరు, సీలింగ్, దేవాలయం, ఇనాం భూములు కలిపితే, ఏడు లక్షల ఎకరాలకు పైగా భూమి వుంది. దీన్నిబట్టి భూమి కొరతలేదన్న విషయం స్పష్టమవుతోంది.

ఆగస్టు 15న నాడు పట్టాలిచ్చిన దళితుల్లో కొందరికి ...

ఆగస్టు 15న నాడు పట్టాలిచ్చిన దళితుల్లో కొందరికి ఇప్పటికీ భూములు చూపించలేదు. కొన్ని సర్వే నెంబర్లలో రాళ్లు, తుప్పలున్నాయి. అవి సాగుకి అనుకూలంగా లేవు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని అమలు చేయాలంటూ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు మమబూబ్ నగర్ జిల్లా సిపిఎం నేతలు.

21:56 - February 15, 2017
21:43 - February 15, 2017

సిద్దిపేట : జిల్లాలోని గజ్వేల్‌ వేదికగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార టీఆర్ ఎస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించిన  ప్రజా పోరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్పు,  బలవంతపు భూసేకరణ, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, డబులె బెడ్‌ రూము ఇళ్ల నిర్మాణం వంటి అంశాల్లో ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను తెలుగుదేశం నేతలు ఎండగట్టారు. 
 

22:29 - January 22, 2017

సిద్ధిపేట : గజ్వేల్ పట్టణ వాసులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న సొంత ఇంటికల నెరబోతున్నదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి హరీష్‌రావు భూమి పూజ చేశారు. వంద కోట్ల రూపాయలతో 1200 ఇండ్ల నిర్మాణం చేయనున్నట్లు హరీష్‌రావు తెలిపారు. అత్యాధునికి సౌకర్యాలతో ఈ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇంటి కొరకు ఎవరూ పైరవీలు చేయరాదని, అర్హులైన పేదలకే ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. 

 

09:48 - January 11, 2017

ప్రయివేట్ స్కూళ్లల్లో ఫీజుల మోత మోగుతుందని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా నాగేశ్వరరావు, కోట రమేష్ అన్నారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు.  'మరో మూడు నెలల్లో ఈ విద్యా సంవత్సరం ముగుస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటించారు. సిబిఎస్ఈ బోర్డు కూడా పరీక్షల తేదీలు ఖరారు చేసింది. మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ కాలేజీల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రయివేట్ కాలేజీలలో విద్యార్థుల ఒత్తిడి పెరుగుతోంది. ప్రయివేట్ స్కూళ్లు ఎడాపెడా ఫీజులు పెంచేస్తున్నాయి. ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ లాంటి సమస్యలు వెన్నాడుతూనే వున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యా సంవత్సరం ఆరంభంలో వున్న  సమస్యలు తగ్గకపోగా, మరింత పెరిగాయి.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై చర్చించారు. విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం మార్చి 3న చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో ఏయే అంశాలు చర్చించారు? మార్చి 3న చలో పార్లమెంట్ పిలుపునివ్వడానికి కారణం ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:27 - January 11, 2017

ఢిల్లీ : కేంద్రప్రభుత్వ తీసుకొచ్చిన ఉదయ్‌ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ సంస్థల నష్టాలను జనంపై రుద్దే ప్రయత్నం జరుగుతుందని విద్యుత్‌ రంగ నిపుణులంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో భవిష్యత్‌లో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది. 
ఉదయ్‌ పథకంపై విద్యుత్ రంగనిపుణులు పెదవి విరుపు 
ఉదయ్‌ పథకంలో చేరడంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలను నష్టాల నుంచి గట్టేక్కిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీనికోసం కేంద్రప్రభుత్వంతో గతవారమే రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం కేంద్రం నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా డిస్కమ్‌లు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయ్‌ పథకంపై విద్యుత్ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఒప్పందంతో విద్యుత్‌ సంస్థల నష్టాలు తగ్గవని స్పష్టం చేస్తున్నారు. 
డిస్కమ్‌లపై రూ.11,897 కోట్లు రుణభారం
అయితే ఉదయ్‌ పథకంలో చేరడంవల్ల ప్రస్తుతం డిస్కమ్‌లకు ఉన్న 11,897 కోట్లరూపాయల అప్పుల్లో 75శాతం అంటే 8923 కోట్లు వ‌ర‌కూ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.  దీంతో డిస్కమ్‌లపై ప్రతియేడాది 387 కోట్ల రూపాయల వడ్డీభారం తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. అయితే .. కేంద్రం చెప్పినట్టు ప్రస్తుతం ఉన్న రుణభారం రాష్ట్ర సర్కారు భరించినా.. భవిష్యత్తులో సంస్థలకు నష్టాలు రావని పాలకులు చెప్పగలరా అని విద్యుత్‌రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 
కేంద్ర రాష్ట్రప్రభుత్వాల ప్రచారంపై విమర్శలు
ఉదయ్‌ పథకంతో ఇక రాష్ట్రంలో డిస్కమ్‌లకు వెలుగులే వెలుగులు అని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న ప్రచారంపై విమర్శలు వస్తున్నాయి. పాలకులు మాటలు ఎలా ఉన్నా.. విద్యుత్‌ పంపిణీసంస్థల నష్టాలను పూడ్చడానికి ఎప్పటికపుడు చార్జీలు పెంచుకోవచ్చన్న నిబంధనతో మాత్రం వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు.
 

 

Don't Miss

Subscribe to RSS - telangana schemes