Telangana TDP

19:13 - November 12, 2018

హైదరాబాద్: టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే అంటూ టీవీ ఛానెళ్లలో వస్తున్న వార్తలపై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీవ్రంగా స్పందించారు. ఆ జాబితా పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు. అసలు టీడీపీ తరపున అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని రమణ స్పష్టం చేశారు. మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని, పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన వివరించారు. కాగా, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో ఆశావహులు, పార్టీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు అలాంటి ప్రకటన ఏదీ రాకపోవడంతో ఎదురుచూపులు తప్పలేదు.

13:42 - October 21, 2018

హైదరాబాద్:  కొన్ని రోజులుగా ఎడతెగని చర్చలు.. విస్తృత మంతనాలు.. రహస్య భేటీలు.. అయినా వ్యవహారం కొలిక్కి రావడం లేదు. పొత్తు కుదరడం లేదు.. సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేదు. ఇదీ మహాకూటమి పరిస్థితి. కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన భాగస్వాములుగా ఏర్పడిన మహాకూటమిలో ఇప్పటివరకూ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ.. మ్యాటర్ మాత్రం తేల్చడం లేదు. దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. తన నివాసంలోనే టీడీపీ కీలక నేతలతో బాబు భేటీ కానున్నారు. మహాకూటమితో పొత్తు, సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎల్.రమణ, పెద్దిరెడ్డి, దేవేందర్‌గౌడ్, గరికపాటిలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి తదితరులతోనూ చంద్రబాబు మాట్లాడతారని, అవసరమైతే రాహుల్‌గాంధీకి ఫోన్ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. 

సాధ్యమైనంత త్వరలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేస్తే, ఆపై ప్రచారం ప్రారంభించాలని టీడీపీ భావిస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో తాను వెనకుండి మద్దతు పలుకుతానే తప్ప, నేరుగా ప్రచారం చేయబోనని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణతో పాటు, కొందరు పేరున్న ఏపీ మంత్రులు కూడా తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం.

ఇప్పటికే 105మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని సైతం ముమ్మరం చేశారు. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇటు మహాకూటమి పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంగానే ఉంది. సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. మాకు ఇన్ని సీట్లు కావాలని టీడీపీ, టీజేఎస్‌లు అడుగుంటే.. కాంగ్రెస్ మాత్రం ససేమిరా అంటోంది. చూడాలి మరి.. చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత అయినా.. పరిస్థితిలో మార్పు వస్తుందేమో..?

16:32 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయింది. అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ టీడీపీ తన సత్తా చాటుకుంది. ఏ పార్టీకి లేని విధంగా తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అదే టీడీపీకి ప్లస్. కాగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం కావడం తెలంగాణలో టీడీపీకి మైనస్ అయింది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. ఆ కారణంగా టీఆర్ఎస్‌కు అత్యధిక స్థానాలు రావడం అధికారం దక్కడం జరిగిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడింది. ఓవైపు ఎన్నికల్లో వరుస ఓటములు.. దీనికి తోడు వలసలు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. Image result for l ramana

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 72స్థానాల్లో పోటీ చేస్తే 15 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం 14.66గా ఉంది. కాగా గులాబీ ఆకర్ష్ కారణంగా తెలుగుదేశం టికెట్ మీద గెల్చిన ఎమ్మెల్యేలంతా సైకిల్ దిగి కారెక్కారు. చివరకు టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. సండ్ర వెంటక వీరయ్య(సత్తుపల్లి), ఆర్ క్రిష్ణయ్య(ఎల్బీనగర్). టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఒంటరిగా కాకుండా మహాకూటమి పేరుతో బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. అయితే మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయన్నది క్లారిటీ లేదు. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీలు చెబుతున్నాయి.

జిల్లాలు గెలిచిన స్థానాలు
రంగారెడ్డి 7
హైదరాబాద్ 3
మహబూబ్‌నగర్ 2
వరంగల్ 2
ఖమ్మం 1

          

2014లో టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు 15
ఎంపీ స్థానాలు 1
ఓటింగ్ శాతం 14.66

 

 

 

 

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం దూకుడు మీదుంది. ఇప్పటికే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రతిపక్షాల కన్నా చాలా ముందు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ సరైన నాయకత్వమే లేదు. ఈ లోపం కారణంగానే టీడీపీ చతికలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఆ లోపాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. 

2014 టీడీపీ ఎమ్మెల్యేలు
సండ్ర వెంకట వీరయ్య -సత్తుపల్లి
ఆర్.కృష్ణయ్య -ఎల్బీనగర్
రేవంత్ రెడ్డి -కొడంగల్
రాజేందర్ రెడ్డి -నారాయణ్ పేట్
వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్
కృష్ణా రావు కూకట్ పల్లి
కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం
క్రిష్ణా రెడ్డి మహేశ్వరం
ప్రకాశ్ గౌడ్, రాజేంద్రనగర్
ఎ.గాంధీ శేరిలింగం పల్లి
ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి
చల్లా ధర్మారెడ్డి పరకాల
శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్
సాయన్న, కంటోన్‌మెంట్
మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్

     


 

 

09:20 - May 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి మహానాడు గురువారం జరగనుంది. నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో జరిగే మహానాడుకు నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ ఘాట్ లో నేతలు నివాళులర్పించి మహానాడుకు హాజరు కానున్నారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ మహానాడుపై అందరి దృష్టి నెలకొంది. తెలంగాణలో పార్టీ బలపడేందుకు ఎలాంటి వ్యూహాలు..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ, జాతీయ పార్టీలకు సంబంధించి ఐదు, మొత్తంగా 13 తీర్మానాలు ఆమోదించనున్నారు. మధ్యాహ్నం తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశంలో పాల్గొనన్నారు. ఇక ఈ సమావేశంలో పొత్తుల గురించి చర్చిస్తారా ? లేదా ? అనేది తెలియరాలేదు. 

08:33 - May 13, 2018

హైదరాబాద్ : ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గాడినపెట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తోంటే.... మరోవైపు ఆయనకు తెలుగు తమ్ముళ్లు రోజుకొకరు షాక్‌ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో జోరు పెంచాల్సిన నేతలు.. ఒక్కొక్కరు సైకిల్‌ దిగిపోతున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమవుతోందన్న ఆందోళన అధినాయకత్వాన్ని వేధిస్తోంది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు ఆందోళన కరంగా మారుతోంది. తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ తెలంగాణ అగ్రనాయకులు ఇతర పార్టీల్లో చేరుతుండడంతో సెకండరీ స్థాయి నేతలు కూడా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇది గమనించిన చంద్రబాబు ఈ మధ్యే ముఖ్యనేతలతో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలంతా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు. ప్రజల్లో పార్టీ బలంగా ఉంటేనే.. ఏదైనా రాజకీయపార్టీ పొత్తు కోసం ఆసక్తి చూపుతుందని స్పష్టం చేశారు. బలహీనపడితే ఏపార్టీలు పట్టించుకునే పరిస్థితి ఉండబోదన్నారు. అందుకే నేతలంతా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా... తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అధినేత హామీలు తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం ధీమా ఇవ్వడం లేదు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. నాటి నుంచి నేటి వరకు వరుస షాక్‌లు తెలుగు తమ్ముళ్లు ఇస్తూనే ఉన్నారు. సీనియర్లుగా గుర్తింపు పొందిన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేవంత్ పార్టీని వీడిన అనంతరం కాంగ్రెస్ లో చేరుతున్న టిటిడిపి నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంత మంది నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా....ముఖ్యమంత్రి కేసిఆర్ పై పోరాటం చేస్తున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి సైతం టిడిపికి గుడ్ బై చెప్పారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది అదే దారిలో నడిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

పార్టీలో నేతలు నిలబడలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ కూడా నేతలకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రమణ వైఖరి ఇదే విధంగా కొనసాగితే పార్టీకి మరింత నష్టం జరుగక తప్పదన్న అభిప్రాయాన్ని సీనియర్లు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.

13:34 - March 11, 2018

నిజామాబాద్ : ఒకప్పుడు నిజామాబాద్‌ జిల్లాలో జోరుగా ఎగరిసిన పసుపుజెండా.. ప్రస్తుతం కనిపించకుండా పోతోంది. సైకిల్‌కు పంక్చర్‌ అయ్యింది. రేవంత్‌రెడ్డి హస్తంపార్టీతో దోస్తీ కట్టడంతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మరి నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏంటి? పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చే నేతలెవరు? తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒకప్పుడు మంచి పట్టు ఉండేది. రాజకీయ పరిణామాలు మారుతుండడంతో... టీడీపీ పలుచబడుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న మెజార్టీ నాయకులు టీడీపీ వారే. నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకత్వంలో మెజార్టీగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. క్యాడర్‌ కూడా వారితోపాటే గులాబీ కండువా కప్పుకుంది.

ఈ మధ్యకాలంలో టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి హస్తంతో దోస్తీ కట్టారు. జిల్లాలో టీడీపీ నాయకత్వం ఆయనతోపాటే కాంగ్రెస్‌గూటికి చేరింది. జిల్లాలో పార్టీని తమ బుజాలమీద నడిపించిన జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, ఆర్మూర్‌ ఇంచార్జ్‌ రాజారాంయాదవ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ పరిస్థితి అయోమయంలో పడింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఇద్దరు టీడీపీ సీనియర్‌నేతలు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. వివిధ మంత్రిపదవులు చేపట్టిన మండవ వెంకటేశ్వరరావు..సీనియర్‌ నాయకురాలు అన్నపూర్ణమ్మ టీడీపీ నమ్ముకునే ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటికీ సైకిల్‌తోనే సై అంటున్నారు. కానీ ఈ మధ్యే వీరు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే అలావచ్చి అలా వెళ్లిపోతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన నడస్తోంది. దీంతో జిల్లాలో టీడీపీని నడిపించే నాయకుడు కరువయ్యాడు.

మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఇద్దరూ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అన్నపూర్ణమ్మ అధికార పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొంతకాలం స్తబ్దుగా ఉండి... ఆ తర్వాత సైకిల్‌ను వీడి కారెక్కుతారని అనుచరులు చెప్తున్నారు. ఇక మండవ కూడా గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ నుంచి నిజామాబాద్‌ రూరల్‌లో పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు. టీడీపీని వీడే యోచనలో ఉండడంతోనే.. వీరిద్దరూ పార్టీకి కొంతకాలంగా దూరంపాటిస్తున్నట్టు తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లాలోనూ టీడీపీ దాదాపు ఖాళీ అయ్యింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ పార్టీని నడిపించేవారే కరువయ్యారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యింది. పార్టీలో ఉన్నవారు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఎన్నికలకల్లా ఉన్న నేతలు కూడా ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. దీంతో జిల్లాలో టీడీపీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోతోంది.

21:59 - March 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతలకు సూచించారు. మహానాడులోపు మూడు బహిరంగసభలు నిర్వహించాలన్న నేతల సూచనకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. పొత్తుల అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామన్న ఆయన... ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించాలని చెప్పారు. మరోవైపు కార్యకర్తలు తనకు  ఫిర్యాదు చేసే పరిస్థితులు తెచ్చుకోరాదని ఘాటుగా నేతలను హెచ్చరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం, టీటీడీపీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో దాదాపు గంటన్నర పాటు భేటీ అయిన ఆయన.. తాజా రాజకీయ పరిణామాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని మార్చి 29 వరకు విస్తృతంగా కొనసాగించాలని బాబు పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర నాయకత్వం స్వయంగా ప్రజల్లోకి వెళ్తే కార్యకర్తలో ధైర్యం వస్తుందని... త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగసభకు తాను హాజరవుతానని బాబు చెప్పారు. మహానాడులోపు మూడు బహిరంగసభలు నిర్వహించాలని నేతల సూచనకు బాబు అంగీకారం తెలిపారు. 

పొత్తుల అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామన్న చంద్రబాబు... ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే నేతలంతా దృష్టి సారించాలని చెప్పారు. బీజేపీ పొత్తు వద్దనుకుంటే... స్వతంత్రంగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీలతో పొత్తుపై ఎలక్షన్ సమయంలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 

రెండు రాష్ట్రాల్లో పార్టీకి అండగా ఉంటానన్న చంద్రబాబు... కొందరు నాయకులు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. మే నెలాఖరు నాటికి నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సమావేశంలో టీడీపీ నేతలు ఎల్.రమణ, సండ్ర వెంకట వీరయ్య, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

16:28 - March 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశంను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని టీటీడీపీ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ తెగతెంపులు చేసుకుంటే.. తాము స్వతంత్రంగానే ఉంటామని ఆపార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇవాళ రెండోరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి.. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ పొత్తు వద్దనుకుంటే... స్వతంత్రంగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీలతో పొత్తుపై ఎలక్షన్ సమయంలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు రావుల తెలిపారు.

 

21:59 - February 28, 2018

హైదరాబాద్ : జూనియర్‌ ఎన్టీఆర్‌ను లేదంటే బ్రాహ్మణిని.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ పార్టీ పగ్గాలు ఇచ్చి టీటీడీపీని బతికించాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబు ముందు గోడువెల్లబోసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఎన్ని చేస్తున్నా.. నాయకత్వం సరిగ్గా గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీని మరో పార్టీలో విలీనం చేస్తారంటూ వస్తోన్న వార్తలపైనా తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పార్టీని విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

13:46 - January 24, 2018

హైదరాబాద్ : అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని వ్యాఖ్యానించిన మోత్కుపల్లికి షోకాజ్‌ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే చర్యలు తీసుకోవాలని పార్టీ యోచిస్తోంది. అయితే... పార్టీకి మోత్కుపల్లి సంజాయిషీ ఇస్తారా ? లేక పార్టీకి గుడ్‌బై చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. 
జరిగిన పరిణామాలపై చంద్రబాబుకు నివేదిక
తెలంగాణా తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను ఆత్మర‌క్షణ‌లో పడేసిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై తెలుగుదేశం పార్టీ పెద్దలు సీరియ‌స్‌గా ఉన్నట్లు స‌మాచారం. పార్టీ క్రమ‌శిక్షణ ఉల్లంఘించార‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన టీ-టీడీపీ నేత‌లు జ‌రిగిన ప‌రిణామాల‌పై పూర్తి  సమాచారాన్ని అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదిక ద్వారా అందించారు. రాజ‌కీయంగా దూమారం రేపిన విలీనం వ్యాఖ్యల‌పై పార్టీ నేత‌లు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పార్టీ మారిన చాలా మంది నేతలు
ఇప్పటికే  భారీ ఎత్తున నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స వెళ్లడంతో... ఉన్న కొద్ది మంది నేత‌ల మ‌నో స్థైర్యం దెబ్బతీసేలా ఆయ‌న వ్యాఖ్యలు ఉన్నాయ‌న్న అభిప్రాయం నేత‌ల్లో వ్యక్తమయ్యింది. ఈ ప‌రిణామాల‌పై పార్టీ నేత‌లు సుదీర్ఘంగా చ‌ర్చించడంతో పాటు అమ‌రావ‌తి నుంచి వ‌చ్చే ఆదేశాల‌ను పాటించాల‌న్న నిర్ణయానికి వ‌చ్చారు.
పోలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరుకాని మోత్కుపల్లి
పార్టీ పోలిట్‌ బ్యూరో స‌మావేశంలోనే మోత్కుప‌ల్లిని  వివ‌రణ కోరాల‌ని నిర్ణయం తీసుకున్నా.. వ్యక్తిగ‌త కార‌ణాల‌తో మోత్కుప‌ల్లి స‌మావేశానికి హాజ‌రు కాలేదు. దీంతో ఆయ‌న వ్యవ‌హారం పార్టీలో మ‌రింత చ‌ర్చనీయంశంగా మారింది. క్రమ‌శిక్షణ‌కు మారు పేరుగా ఉండే పార్టీలో క్రమ‌శిక్షణను ఉల్లంఘిస్తే స‌హించేది లేద‌ని టీ-టీడీపీ అధ్యక్షులు ర‌మ‌ణ హెచ్చరిస్తున్నారు. పార్టీ నేతలు అభద్రతకు లోను కాకుడదని.. పార్టీకి చంద్రబాబు అండదండలు ఉన్నాయని అన్నారు. విలీనం వ్యాఖ్యల‌ను మెత్కుప‌ల్లి ఉప‌సంహ‌రించుకోక పోతే చ‌ర్యలు తప్పవ‌న్న సంకేతాల‌ను టీ- టీడీపీ నేత‌లు ఇస్తున్నారు.  పార్టీ ఇచ్చే షోకాజ్‌ నోటీసుకు మోత్కుప‌ల్లి స్పందిస్తారా లేదంటే.. పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తారా అని ఉత్కంఠ  రేగుతోంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - Telangana TDP