telugu cinema

10:31 - April 26, 2017

హైదరాబాద్: కళా తపస్వి, ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాథ్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కలిశారు. సినీరంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌కు వరించడంతో ఆయనకు పవనకళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా కళాతపస్వి కే విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

21:25 - April 24, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా కె.విశ్వనాథ్‌ పాల్కే పురస్కారాన్ని అందుకోనున్నారు. స్వాతికిరణం, సాగర సంగమం, శృతిలయలు, శంకరాభరణం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, ఓ సీతకథ, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల, ఆపద్భాందవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో అద్భుత సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం రావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అన్నారు సినీ రంగ ప్రముఖులు. దాదాసాహెబ్‌ అవార్డు రావడంపై కళాతపస్వి కె.విశ్వనాధ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటి దర్శకుల్లోకూడా చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని చెప్పారు.. అవకాశం ఇస్తే అద్భుతమైన సినిమాలు తీస్తారని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. దాదాసాహెబ్‌ అవార్డుకు ఎంపికైన విశ్వనాథ్‌కు పలువురు కంగ్రాట్స్ చెప్పారు. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు దక్కిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసించారు.

20:52 - April 24, 2017

కళాతపస్వి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం దర్శకశిరోమణికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ప్రజల రివార్డులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవార్డులు ఎన్నింటినో పొందిన కాశీనాథుని విశ్వనాథ్‌.. సినీరంగ పితామహుడిగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే పేరిట నెలకొల్పిన పురస్కారాన్నీ అందుకోనుండడం.. కళామతల్లిని గౌరవించుకోవడమే. సనాతన సంస్కృతి, కళా సంపదల వారసత్వానికి, చలనచిత్ర మాధ్యమం ద్వారా శాశ్వత అస్థిత్వాన్ని కల్పించి ధన్యులయ్యారు కాశీనాథుని విశ్వనాథ్‌.. అదే కె.విశ్వనాథ్‌. 1930లో గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామంలో జన్మించిన విశ్వనాథ్‌... సినిమాలపై ఆసక్తితో చెన్నై చేరుకున్నారు. టెక్నీషియన్‌గా, సహాయదర్శకుడిగా కొన్నాళ్లు పనిచేశాక, ఆత్మగౌరవం సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు. తొలి చిత్రం నుంచే తనలోని కళాపిపాసను.. కమర్షియల్‌ సినిమాతో మిళితం చేసి విమర్శకుల ప్రశంసలను పొందారు. ఆ తర్వాత ఆయన రూపొందించిన ఓసీత కథ, సీతామాలక్ష్మి,శారద, చెల్లెలి కాపురం లాంటి సినిమాలు.. సినీజగత్తును విశ్వనాథుని శకం వైపు మళ్లేలా చేశాయి.

సంగీత, సాహిత్యాలకు పెద్దపీఠ..
కె.విశ్వనాథ్‌ సినిమాల్లో సంగీత, సాహిత్యాలు ఢీ అంటే ఢీ అంటాయి. పండితులనే కాదు.. పామరులనూ ఓలలాడిస్తాయి. అయితే, తనకు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానమే లేదని విశ్వనాథ్‌ చాలాసార్లు చెప్పుకున్నారు. కానీ, ఆయన సినిమాల్లో సాహిత్యంతో పోటీపడే సంగీతాన్ని ఆస్వాదించిన వారు.. విశ్వనాథ్‌కు స్వర పరిజ్ఞానం లేదంటే నమ్మేవారే కాదు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని శంకరాభరణం ద్వారా ప్రవచించిన విశ్వనాథ్‌.. ఆ సినిమా ద్వారానే, పాశ్చాత్య సంగీతపు పెడదారుల్లో సాగుతున్న యువతను మేలుకొలిపి, శాస్త్రీయ సంగీతపు బాట పట్టించేందుకు... ఓ చిరు ప్రయత్నాన్ని, సుతిమెత్తగా, ఓ చురకగా తగిలించారు. సంగీత, సాహిత్యాలకు పెద్దపీఠ వేసే విశ్వనాథ్‌, సంగీత, సాహిత్యాలకు పట్టిన మకిలిని వదిలించేందుకు ఎప్పుడూ కృషి చేసేవారు. సాగర సంగమం చిత్రంలో.. విపరీత పోకడలు పోతోన్న తెలుగు సినిమా సంగీతం గురించి ఓ పాట ద్వారా చక్కగా సెటైర్లు విసిరారు. అంతటితో ఆగకుండా అదే సినిమాలోనే అద్భుతమైన సంగీత, సాహిత్యపు విలువలతో.. సినిమా సంగీతపు ఝరి ఎంత మహోధృతమైనదో వివరించారు విశ్వనాథ్‌. విశ్వనాథుని నాయికా నాయకులు ఎప్పుడూ మహోన్నతులే. స్వాతికిరణంలో మూర్తీభవించిన విద్వాంసుడు, శంకరాభరణంలో ఛాందసంగా అనిపించినా మానవీయ విలువల్ని గుర్తించి ఆచరించిన శాస్త్రి, శుభలేఖలో ఒక అపవాదుకు చలించి కూతుర్ని ఇంటి నుంచి పంపేసిన తండ్రి, శుభసంకల్పం సినిమాలో యజమాని ఆశయాలను తన స్థాయికి మించి నిర్వర్తించిన జాలరివాడు.. ఇలా మానవ స్వభావాన్ని తన హీరో ద్వారా ఎన్ని కోణాల్లో ఆవిష్కరించ వచ్చో అత్యద్భుతంగా ఆచరించి చూపారు విశ్వనాథ్‌.

హస్యం..
కె.విశ్వనాథ్‌ సినిమాలో హాస్యానికి ఎప్పుడూ పెద్దపీటే. సినిమా ఇతివృత్తానికి ఏమాత్రం దూరం జరకుండా, కథలో ఇమిడిపోయేలా, హాస్యరసాన్ని అద్భుతంగా చొప్పించడంలో విశ్వనాథ్‌ దిట్ట. దానికి స్వర్ణకమలం లాంటి సినిమాల్లోని హాస్యరస సన్నివేశాలు చక్కటి తార్కాణమని చెప్పాలి. సనాతన సంస్కృతి, కళా సంపదల వారసత్వానికి, చలనచిత్ర మాధ్యమం ద్వారా శాశ్వత అస్థిత్వాన్ని కల్పించి ధన్యులయ్యారు కాశీనాథుని విశ్వనాథ్‌.. కళాతపస్విగా చిరపరిచితమైన కాశీనాధుని విశ్వనాధ్ ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చారు. చలన చిత్ర చరిత్రలో.. అగ్రనటులందరూ విశ్వనాథ్‌ సినిమాలో నటించడాన్ని ఓ గౌరవంగా.. తాము డాక్టరేట్‌ పట్టా పుచ్చుకున్నట్లుగా భావించేవారంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున తదితరులెందరో విశ్వనాథ్‌ దర్శకత్వంలో నటించారు. ఆ దర్శక దిగ్గజం వద్ద నటనలో మెలకువలెన్నో నేర్చుకున్నారు. అనంతర నటజీవితంలో సమున్నత శిఖరాలకు ఎదిగారు.

40 సినిమాలకు దర్శకత్వం..
విశ్వనాథ్‌ దాదాపుగా 40 సినిమాల వరకూ దర్శకత్వం వహించారు. అటూ ఇటుగా ఓ 20 సినిమాల్లో నటించారు. ఇటీవలి కాలంలో దర్శకత్వానికి పూర్తిగా దూరమైన విశ్వనాథ్‌.. అడపాదడపా నటిస్తూ తనలోని కళాపిపాసిని సంతృప్తి పరచుకుంటున్నారు. ఆయన సినిమాలకు జాతీయ, ప్రాంతీయ పురస్కారాలు ఎన్నో వచ్చాయి. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్నీ విశ్వనాథ్‌ పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ తో గౌరవించింది. ఇప్పుడు తాజాగా, దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో.. విశ్వనాథుని కీర్తికిరీటం మరింత శోభాయమానమైంది. విశ్వనాథుని ప్రతి చిత్రం ఓ అద్భుతం. వాటిల్లోని ప్రతి దృశ్యం మనోహరం. ఆయన సినిమాలన్నింటినీ ప్రస్తావించాలంటే, ఎన్ని గంటలైనా చాలదు. దాదా సాహెబ్‌ పురస్కారం విశ్వనాథ్‌ను వరించి వచ్చిన సందర్భంగా.. విశ్వనాథునికి టెన్ టివి అభినందనలు తెలియ చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:25 - April 24, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా కె.విశ్వనాథ్‌ పాల్కే పురస్కారాన్ని అందుకోనున్నారు. స్వాతికిరణం, సాగర సంగమం, శృతిలయలు, శంకరాభరణం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, ఓ సీతకథ, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల, ఆపద్భాందవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో అద్భుత సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం రావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అన్నారు సినీ రంగ ప్రముఖులు.

09:23 - April 21, 2017

మహానటి..తెలుగు వెండి తెరపై మహానటిగా గుర్తింపు పొందారు. ఆమెనే 'సావిత్రి'. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘సావిత్రిగా' కీర్తి సురేష్..మహిళా పాత్రికేయురాలిగా 'సమంత'లు నటిస్తున్నారు. తాజాగా 'అనుష్క' కూడా ఈ చిత్రంలో నటిస్తోందని తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారని సమాచారం. చిత్రంలో నటించడానికి 'అనుష్క' సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం. 'సావిత్రి' జీవితంలోని పలు కోణాలను, మాయాబజార్, మిస్సమ్మ చిత్రాలకు సంబంధించిన విశేషాల్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. మరి 'అనుష్క' నటిస్తుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

15:24 - April 14, 2017

ఈ మధ్య 'చిరంజీవి'పై 'నాని' చేసిన పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ‘చిరంజీవి' ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఆయన కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో వరుస విజయాలతో 'నాని' దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. అసలు 'నాని'కి 'చిరు' ఏ మాట ఇచ్చాడనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా 'నాని' మరో ట్వీట్ చేశాడు. ‘చిరు' మాట నిలబెట్టుకున్నారని ట్వీట్ చేశారు. చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు 'నాని' ఇటీవలే వెళ్లాడు. ‘మాస్టర్’ సినిమాకు తాను సైకిల్ పై వెళ్లడం జరిగిందని, కానీ టికెట్ దొరికిన ఆనందంలో తన సైకిల్ ను మరిచిపోయాయని ‘నాని’ ఆ షోలో పేర్కొన్నాడు. షో లో గెలుచుకున్న డబ్బుతో ఓ కొత్త సైకిల్ కొనుక్కుంటానని 'నాని' పేర్కొన్నాడు. తాను నటించిన సినిమా చూసేందుకు వెళితే సైకిల్ పోయింది కనుక, మరో కొత్త సైకిల్ ను తానే కొనిస్తానని నాటి షో లో 'చిరంజీవి' మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో 'నాని'కి కొత్త సైకిల్ ను 'చిరంజీవి' పంపించారు. సైకిల్ పక్కనే నిలబడిన ఉన్న ఫొటో 'నాని' పోస్టు చేశారు.

14:19 - April 14, 2017

రాంగోపాల్ వర్మ..ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి. పలువురు సెలబ్రెటీలు..ఘటనలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్విట్టర్ ద్వారా ఆయన పలు ట్వీట్స్ చేస్తుంటారు. ఇటీవల మెగాస్టార్ కుటుంబంపై ఆయన పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చెలరేగాయి కూడా. గతంలో 'ఖైదీ నెంబర్ 150’ సినిమా కార్యక్రమంలో 'నాగబాబు' పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వర్మ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. ఒక్కసారిగా 'రాంగోపాల్ వర్మ' శుక్రవారం ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. ‘చిరంజీవి లాంటి అన్యయ్య నాకుంటే నేను మాట్లాడే మాటలకి ఆయన నన్ను కొట్టేవారు. నాగబాబు గారు మాటలతో వదిలేశారు..ఆయనకి సారీ చెబుతున్నా' అంటూ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. కానీ ఉన్నట్టుండి వర్మ ఎందుకు క్షమాపణలు చెప్పారు అని పలువురు బుర్రగొక్కుంటున్నారు.

17:23 - April 12, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్' అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్ర లుక్స్ విడుదల కాకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. మురుగదాస్ చిత్రంలో ‘మహేష్’, ‘రకూల్ ప్రీత్ సింగ్’ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ప్రతి సినిమాలో సామాజిక కోణం చూపించే ‘మురుగదాస్’ ఇందులో కూడా ఓ అంశాన్ని చూపించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. చిత్ర షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా చిత్ర టైటిల్ ను కానీ ప్రకటించలేదు. అంతేగాకుండా 'మహేష్' లుక్స్ కూడా విడుదల కాకపోవడంపై అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5గంటలకు తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చేతిలో పిస్టల్ తో ఓ సైడ్ కి మహేష్ నిలబడిన పోస్టర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. మరి న్యూ లుక్ పై అభిమానుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

10:25 - March 8, 2017

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన 'ఘరానా మొగుడు'..'కొదమసింహం'..చిత్రాల్లో నటించిన 'వాణీ విశ్వనాథ్' గుర్తుండే ఉంటుంది కదా...తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించిన ఈ గ్లామర్ తార కొన్నాళ్లుగా చిత్రాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఈమె కెమెరా ముందుకొస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ 'వాణీ'ని సంప్రదించారని తెలుస్తోంది. ఒకే చెప్పడంతో బ్యాంకాక్ లో జరిగిన ఓ షెడ్యూల్ లో ఆమె నటించారు. ఇందులో వాణీ విశ్వనాథ్, జగపతి బాబు, శరత్ కుమార్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. ‘రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

08:50 - March 8, 2017

ఈ ఫొటో చూడండి..నల్ల చీర కట్టుకుని..ఓర చూపులు చూస్తోంది..ఎవరో కాదు..సమంత..టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని సినిమాలకు 'సమంత' సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో 'రాజు గారి గది 2’ ఒకటి. డైరెక్టర్ గా మారిన 'ఓం కార్' ‘రాజు గారి గది'కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో 'నాగార్జున' ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘సమంత' కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఆమెతో షూటింగ్ కూడా మొదలు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను 'సమంత' ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. 'రాజు గారి గది 2 లోని ఫొటో ఇదీ' అని పేర్కొంది. ఈ ఫొటోపై 'వావ్’, 'పిక్చర్ పర్ఫెక్ట్’, 'ఆసమ్’, 'లవ్ యు ఎస్ఆర్పీ’... అంటూ పేర్కొంది. మరి ఈ చిత్రంలో 'సమంత' పాత్ర ఎలాంటిదో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు చూడాల్సిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - telugu cinema