telugu states

08:13 - July 6, 2018
06:33 - July 6, 2018

హైదరాబాద్ : ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. స్వామినాథన్‌ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదని మండిపడ్డాయి. వరిధ్యానానికి మద్దతు ధర ప్రకటించి రాష్ట్రాల్లోని రైతాంగాని ఆదుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణలో వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తోందని రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి భారమైనా మార్క్‌ఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందన్నారు. వరి ధాన్యానికి మద్దుతు ధర ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రం ప్రకటించిన కనీస మద్ధతు ధరలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ధరల కంటే చాలా తక్కువని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. స్వామినాథన్‌ కమిషన్ సిఫార్సులను కూడా కేంద్రం తుంగలో తొక్కిందని...ధాన్యం గ్రేడ్‌-ఏ కి 3 వేల 472 రూపాయలు ఇవ్వాలని కోరితే 1770 రూపాయలు, కామన్ వెరైటీకి 2 వేల 823 ప్రతిపాదిస్తే 1750 రూపాయలు మాత్రమే ప్రకటించారన్నారు. అన్ని పంటల మద్ధతు విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరించిందని సోమిరెడ్డి అన్నారు. మద్దతు ధర పేరుతో కేంద్రం మోసపూరిత ప్రకటన చేసిందని సీపీఎం ఆరోపించింది. స్వామినాథన్ ‌కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ‌ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం లాభంతో మద్దతు ధర పెంచలేదన్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని సీపీఎం ఎండగడుతూ...రైతులకు వాస్తవాలు వివరిస్తామన్నారు.  

17:27 - June 13, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటు ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచనలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాము అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్పష్టమైన నివేదిక ఇచ్చామని, ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావని చెప్పామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చింది. గతంలోనే ఈ విషయంపై తాము స్పష్టమైన ప్రకటన చేశామని కేంద్ర ప్రమభుత్వం పేర్కొంది. సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని..మెకాన్ సంస్థ కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతున్నామనీ కేంద్రం దాటవేత ధోరణిని అవలంభించింది. 

21:50 - May 8, 2018

విజయవాడ : పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నా... కేంద్రం పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ.. సీపీఎం శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ నాయకులు ర్యాలీలు, బైఠాయింపులతో నిరసనను వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసనను తెలిపారు. 
విజయవాడలో 
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు సీపీఎం, ఐద్వా, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.  అయితే.. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.
కర్నూలులో 
పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ.. కర్నూలు జిల్లాలో సీసీఎం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తోన్న పన్నును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కొత్తబస్టాండ్‌ దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. తగిన బుద్ధి చెబుతామని నాయకులు హెచ్చరించారు. 
అనంతపురంలో
అనంతపురం జిల్లాలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు జరిపారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల వల్ల.. నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయాయని నాయకులు ఆరోపించారు. అనంతపురం టవర్‌క్లాక్‌ దగ్గర అటువేపుగా వచ్చే ద్విచక్ర వాహనాల్లో.. స్వల్ప పరిమాణంలో పెట్రోల్‌ పట్టిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 
తిరుపతిలో
తిరుపతిలోనూ సీపీఎం శ్రేణులు పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్‌ వద్ద.. బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ధరలను తగ్గించక పోతే.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  విశాఖ జిల్లాలోనూ సీపీఎం శ్రేణులు ఆందోళనలు, రాస్తారోకో నిర్వహించాయి. ఏజెన్సీలోని పదకొండు మండలాలతో పాటు.. జిల్లా వ్యాప్తంగా ధర్నాలు సాగాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  
కాకినాడలో 
పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ నగర శాఖ కూడా ఆందోళన నిర్వహించింది. మానవహారంగా తమ నిరసనను వెలిబుచ్చింది. పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంపును నిరసిస్తూ.. రాజమండ్రిలోనూ సీపీఎం శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. సీపీఎం కార్యాలయం నుంచి నందం గనిరాజు జంక్షన్‌ మీదుగా కంబాలు చెర్వు వరకూ ర్యాలీ నిర్వహించారు. మోటార్‌ సైకిళ్లకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు.
నెల్లూరులో
నెల్లూరులోనూ సీపీఎం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నెల్లూరులోని అయ్యప్పగుడి సెంటర్‌ నుంచి వేదాయపాళెం వరకూ ర్యాలీ నిర్వహంచారు. తోపుడు బండిపై మోటార్‌ బైకును ఎక్కించి నిరసన తెలిపారు. మరోవైపు, ఆటో కార్మికులు తాడు సాయంతో ఆటోలు లాగుతూ.. తమ నిరసనను తెలిపారు. క్రూడాయిల్‌ రేట్లు తగ్గినా.. భారత్‌లో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరగడం దారుణమని పార్టీ నాయకులు విమర్శించారు. 
ఒంగోలులో
పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా.. ఒంగోలులో సీపీఎం శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ డిపో నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ సాగింది. ర్యాలీలో మినీ ఆటోను తాడుతో లాగుతూ.. కార్యకర్తలు నిరసన తెలిపారు. మోదీ ప్రభుత్వం ధరలను అదుపు చేయకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సీపీఎం నాయకులు హెచ్చరించారు. 
నల్లగొండలో 
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో.. సీపీఎం సైకిల్‌ యాత్ర ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసింది. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మోదీ, తన నాలుగేళ్ల పాలన కాలంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 35 శాతం మేర పెంచేసి.. ప్రజల నడ్డి విరిచారని ఆయన ఆరోపించారు. సూర్యాపేటలోనూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 
కుత్బుల్లాపూర్‌ లో  
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జీడిమెట్ల హమాలీ అడ్డా నుంచి షాపూర్‌ వరకూ.. సీపీఎం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పేదలపై పన్నుల రూపంలో వేస్తున్న భారాన్ని తగ్గించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన జిల్లాల్లోనూ సీపీఎం నాయకులు పెట్రోల్‌ ధరల తగ్గింపు కోరుతూ ఆందోళనలు నిర్వహించారు. 

 

21:52 - March 17, 2018

కడప : తెలుగు రాష్ట్రాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాలంగా కురిసిన వర్షాలకు రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు మండలంలో శుక్రవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది.. పెనుగాలులతో కూడిన వర్షానికి అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో అరటి, మామిడి పంటలు సాగు చేస్తుంటారు.. కాగా రాత్రి కురిసిన వర్షంతో పండ్ల తోటల్లో పూత, పిందెలు రాలిపోవడంతో పాటు... చెట్లు నేలకొరిగాయి.... ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పు చేసిన తోటలు సాగుచేశామని... ఎలాగైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

గిట్టుబాటు ధరలేక ఆందోళన
అసలే గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతోన్న రైతులను రాత్రి కురిసిన అకాల వర్షం మరింత నిరాశ పరిచింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో రైతులు గిట్టుబాటు ధరలేక మర్కెట్‌ యార్డు వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. రాత్రి కురిసిన వర్షంతో అది కాస్తా తడిచి పోయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని వదిలేసేందుకు సిద్ధమయ్యారు. తమను ఆదుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భారీ వర్షం
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భారీ వర్షంతో తడిసి ముద్దయ్యింది.. తెల్లవారు జామునుంచి కురుస్తున్న వర్షంతో.... అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో దారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి అస్తవ్యస్తంగా మారాయి. కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏకధాటిగా వర్షం కురవడంతో.. ప్రజలు ఇళ్ళలోనుంచి బయటికి రాలేని పరిస్థితినెలకొంది..

16:52 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారు. దీనికి నిరసనగా గాంధీభవన్ లో సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య పరిక్షణ దీక్ష చేపట్టనున్నారు. అనర్హత వేటును నిరసిస్తూ కోమటిరెడ్డి, సంపత్ లు 48 గంటల దీక్షకు దిగనున్నారు. 

11:54 - March 4, 2018
13:41 - January 3, 2018

హైదరాబాద్ : న్యూ ఇయర్‌ రోజున తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉండటం, డిసెంబర్ 31 వేడుకలు ఆదివారం రావడం వంటి కారణాలతో ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. అక్షరాలా 160 కోట్ల రూపాయల మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.50 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, రెండోస్థానంలో హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో 40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో 70 కోట్ల మద్యం విక్రయమైంది.

సాధారణంగా రోజుకు దాదాపు 8 కోట్లు
హైదరాబాద్‌లో సాధారణంగా రోజుకు దాదాపు 8 కోట్ల రూపాయల మద్యం అమ్ముడువుతుంది. డిసెంబర్ 31న ఐదు రెట్లు ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది గ్రేటర్‌ పరిధిలో 82 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది రూ.90కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇది రాష్ట్ర మద్యం ఆదాయంలో 56 శాతంగా నమోదైంది. కాగా, నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు బేగంపేట, పాతబస్తీ, రంగారెడ్డి పరిధిలోని కొన్ని మద్యం దుకాణాల్లో నోస్టాక్ బోర్డులు కనిపించాయి. కాగా.. వరంగల్‌, కరీంగనర్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది కంటే అదనంగా మద్యం నిల్వలను వైన్‌షాపు యజమానులు కొనుగోలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

అటూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా..
అటూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా మద్యం ప్రియులు న్యూ ఇయర్‌కు మంచి కిక్‌తో స్వాగతాన్ని పలికుతూ.. కోట్లాది రూపాయల మద్యాన్ని తాగేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వడంతో మద్యం ఏరులైపారింది. ఏకంగా రూ.230 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రోజూ సగటున రూ.40 కోట్ల మేర మద్యం అమ్ముతుండగా.. ఒక్క డిసెంబర్ 31న రూ.230 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో రూ.50 కోట్లు, విశాఖలో రూ.30 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. మొత్తానికి డిసెంబర్‌ 31 ఆదివారం కావడంతో విక్రయాలు మరింతగా రెట్టింపయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో మద్యం ప్రియులు పోటాపోటీగా మద్యం సేవించి.. ప్రభుత్వ ఖజానా నింపారు. 

20:54 - December 22, 2017

విశాఖ : జిల్లాలోని పరవాడ మండలం రావాడలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ కొత్తపల్లి పైడయ్యనాయుడు హత్యకు గురయ్యాడు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న నాయుడును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారణ చేపట్టారు. హత్యకు భూవివాదాలు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హతుడి సోదరుడు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

08:30 - December 21, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికమౌతోంది. గురువారం భారీగా పొగమంచు కమ్ముకోవడం..చలితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో మాత్రం పరిస్థితి దమనీయంగా మారిపోయింది. మినుములూరు లో 4 డిగ్రీలు, అమ్మవారి పాదాల వద్ద 5 డిగ్రీలు, మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతంలో నీరు గడ్డకట్టింది. ఆదిలాబాద్ లో 3.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఢిల్లీలో పరిస్థితి అదే విధంగా ఉంది. ఏకంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - telugu states