ten tv live

21:31 - March 23, 2017

ఢిల్లీ: బ్రిటీష్ పార్లమెంట్‌పై దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దాడికి సంబంధించిన వివరాలను ఉగ్ర సంస్థకు చెందిన అధికారిక ప్రెస్ సర్వీసు ద్వారా ఐసిస్ వెల్లడించింది. అంతకు ముందు బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఉగ్రదాడి గురించి ప్రధాని థెరిసా మే మాట్లాడారు. పార్లమెంటుపై దాడికి పాల్పడి పోలీసు కాల్పుల్లో హతమైన దుండగుడు బ్రిటన్‌లో జన్మించిన వ్యక్తేనని తెలిపారు...అతడు అంతర్జాతీయ ఐసిస్‌ ఉగ్రవాదంతో ప్రేరేపితుడై ఒక్కడే దాడికి దిగినట్లు విశ్వసిస్తున్నామని ప్రధాని చెప్పారు. ఈ విషయం ఇంటిలిజెన్స్‌ వర్గాలకు ముందే తెలుసన్నారు. బ్రిటన్‌ పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 8 మందిని అరెస్ట్‌ చేశారు. బ్రిటన్‌ పార్లమెంట్‌పై బుధవారం జరిగిన ఉగ్ర దాడిలో దుండగుడితో సహా ఐదుగురు మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.

21:30 - March 23, 2017

ఢిల్లీ : బిజెపి నేతలు ఎదుర్కొంటున్న బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 6కు వాయిదా వేసింది. బిజెపి సీనియర్‌ నేతలు అద్వాని, కళ్యాణ్‌సింగ్‌, మురళీమనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కటియార్‌ సహా 13 మంది నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ, అద్వానితో సహా అన్ని పక్షాలు లిఖితపూర్వక నివేదికలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాంకేతిక కారణాలతో 13 మంది బిజెపి నేతలపై ఉన్న కేసులను తొలగించేందుకు అంగీకరించబోమని, అవసరమైతే కుట్ర ఆరోపణలపై వారు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

21:26 - March 23, 2017

ఢిల్లీ: విమానంలో సీటు కోసం శివసేన ఎంపీ రవీంద్ర గాయక్‌వాడ్‌ దాదాగిరి చేశాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా సిబ్బందితో గొడవపడుతూ వీరంగం సృష్టించాడు. ఆగ్రహంతో ఎయిర్‌ ఇండియా అధికారిని ఒకటి కాదు రెండు కాదు 25 సార్లు చెప్పుతో కొట్టాడు. పైగా తాను చేసిన పనిని ఎంపీ సమర్థించుకున్నాడు. తనపట్ల అతడు దురుసుగా వ్యవహరించడం వల్లే చెప్పుతో కొట్టానని రవీంద్రగాయక్‌వాడ్‌ తెలిపాడు. తాను బిజినెస్‌ టికెట్‌ తీసుకోగా...ఎకానమీ క్లాస్‌ సీటు ఇచ్చారని, ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించాడు. ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా విచారణకు ఆదేశించింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ నుంచి గైక్వాడ్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

21:18 - March 23, 2017

హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల అనుమతులకు అవినీతిలేని వ్యవస్థను రూపొందించామన్నారు మంత్రి కేటీఆర్‌. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 15రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తున్నామని చెప్పారు. టీ-ప్రైడ్‌, టీ-ఐడియాతో పాటు టీ-ప్రైమ్‌ను కూడా త్వరలోనే ప్రవేశపెడుతామని చెప్పారు. మరోవైపు విద్య, వైద్య రంగాలపై కూడా అసెంబ్లీలో చర్చ కొనసాగింది.

టీఎస్‌ ఐపాస్‌ ప్రపంచంలోనే అద్భుతమైన పాలసీ..

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయన్న ఆయన టీఎస్‌ ఐపాస్‌ ప్రపంచంలోనే అద్భుతమైన పాలసీ అన్నారు. టీ-ప్రైడ్‌, టీ-ఐడియాతో పాటు టీ-ప్రైమ్‌ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు కృషి ...

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. స్కూళ్లలో 95 శాతం ఆధార్ లింక్డ్ ఎన్‌రోల్‌మెంట్ చేశామన్నారు. 10 వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. త్వరలో 7600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయి....

తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. తప్పుడు ప్రచారాలతో పేదలను భయపెట్టొద్దన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిచామన్నారు. ఆస్పత్రుల్లో లంచాలు తీసుకునే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. హైదరాబాద్‌లో నిమ్స్‌ తరహాలో మరో రెండు ఆస్పత్రుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యూలరైజ్‌ చేయాలి...

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యూలరైజ్‌ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా.. ఇంతవరకూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు వేయలేని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ. కే అరుణ. ఇటు రాష్ర్టంలో మాన్యూఫ్యాక్చరింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న నిమ్జ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని, టీఎస్‌ఐఐసీకి పెద్దగా కేటాయింపులేవని వివరించారు. బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. గురుకుల పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం సబ్జెట్‌ను పొందుపర్చాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు.

మొత్తంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సంబంధింత మంత్రులు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు.

20:34 - March 23, 2017

హైదరాబాద్ : భగత్ సింగ్... బ్రిటీష్ సామ్రాజ్యవాదం పై ఎగిసి పడ్డ ఒక విప్లవ కెరటం. మరి ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకున్న విప్లవం ఏమిటి? ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వారు ఎవరు? ఆయన ఆశయ సాధన కోసం నడుం బిగించి పని చేస్తున్న వారు ఎవరు? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ కథనం. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:38 - March 23, 2017

కడప: మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కడప జిల్లా డ్వామా పీడీ రమేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగరంలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో అఖిలపక్ష నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సిద్దవటంలో విధులు నిర్వహిస్తున్న శైలజ అనే మహిళ ఉద్యోగిని ఏ కారణం లేకుండా సస్పెండ్‌ చేశాడని.. మహిళలను బెదిరిస్తూ.. వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న రమేష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని మానవహక్కుల వేదిక కన్వీనర్‌ జయశ్రీ తెలిపారు.

18:34 - March 23, 2017

హైదరాబాద్: యూరోప్ దేశాల్లో మాస్టర్‌ డిగ్రీ,ఎంటెక్, ఎంబీసీ, బ్యాచులర్ డిగ్రీ లను సంవత్సరానికి కేవలం లక్ష రూపాయల ఖర్చులో చదువుకునే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ స్కాలర్‌షిప్‌, హాస్టల్‌, అడ్మిషన్‌, వీసా అంశాలపై మరింత సమాచారం అందించడానికి గ్లోబల్‌ సిక్స్‌ సిగ్మా కన్సల్టెన్సీ డైరెక్టర్‌ ప్రణయ్‌ ప్రేమ్‌కుమార్‌ అనేక వివరాలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:49 - March 23, 2017

సంగారెడ్డి: నారాయణఖేడ్‌లో దారుణం చోటు చేసుకుంది. సేమ్యా తయారీ యంత్రంలో చున్ని చిక్కుకుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నాగల్‌ గిద్ద మండలం థౌర్యా నాయక్‌ తండాకు చెందిన మోతీబాయి, థౌర్యానాయక్‌ దంపతులు సేమ్యాలు తయారుచేసుకుందుకు నారాయణఖేడ్‌ పట్టణంలోని ఓ మిల్లుకు వెళ్లారు. అయితే మిల్లులో సేమ్యాలు పడుతున్న సమయంలో మోతీబాయి చున్నీ యంత్రంలో చిక్కుకుని... మెడకు ఉరితాడులా మారి.. తలా..మొండెం వేరై దుర్మరణం పాలైంది. మిల్లులో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వలే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

17:43 - March 23, 2017

హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి 39శాతం పోలైతే... మిగిలిన ఓట్లన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినవేనని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ ఓట్లు నిదర్శనమని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కృషి చేయాలని వారు సూచించారు.

17:38 - March 23, 2017

హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా.. ఇంతవరకూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు వేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ. కే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ten tv live