thunderbolt

06:39 - May 14, 2018

విజయవాడ : ఉప‌రితల ఆవ‌ర్తనం ప్రభావంతో కురుసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఉరుములు పిడుగుల‌తో కూడిన వ‌ర్షానికి పలుప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు. పిడుగు పాటుకు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మ‌రో రెండు రోజుల పాటు ఉప‌రిత ఆవ‌ర్తన ప్రభావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ అధికారులు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్రాలోని ప‌లు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిక‌లు జారీ చేసింది. ఝార్ఖండ్‌ నుంచి ఒడిశా వరకు ఏర్పడిన ద్రోణి వల్ల ఉత్తరాంధ్రాతో పాటు తెలంగాణలోను వర్షాలు కురుస్తున్నాయి..

శ్రీకాకుళం జిల్లాలో గాలివానతోపాటు పిడుగులు ప‌డ‌టంతో వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సిక్కోలును అతలాకుతలం చేసింది. పిడుగుపాటు వల్ల పాతపట్నం మండలం తిడ్డిమిలో ఇద్దరు, మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం బస్టాండ్‌ వద్ద ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎల్‌.ఎన్‌.పేట మండలం పెద్దకొల్లివలసలో చెరువులో చేపలవేటకు వెళ్లిన యాభై ఐదేళ్ళ అప్పలనర్సయ్య మరణించాడు. జలుమూరు మండలం కరకలస వద్ద యాభై మూడేళ్ళ మత్య్సకారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు హిర మండలం అంబావల్లికి చెందిన బొడ్డేపల్లి రాములుగా గుర్తించారు. పాలకొండ, రేగిడి, వంగర, సంతకవిటి, బూర్జ, పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, జలుమూరు, సంతబొమ్మాళి, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

అటు కాకినాడలోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వ‌ర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. గ‌త వారం రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకం ఒక్కసారిగా వాతావ‌ర‌ణం చ‌ల్లబడంతో సేదతీరారు. అటు విశాఖ నగరంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

మ‌రోవైపు కడప జిల్లాలో ప‌లుచోట్ల భారీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో వీరబల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం, కరప, బిక్కవోలు, విశాఖ రూరల్‌, విశాఖ అర్బన్‌, రోలుగుంట, చోడవరం, దేవరాపల్లి, విజయనగరం జిల్లా జామి, వేపాడ మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ ప్రకటించింది. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉండటంతో ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. 

20:45 - May 2, 2018

ఎండలు మండుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రాణ..ఆస్తి నష్టం సంభవంచింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో వింతవాతావరణం ఎందుకు నెలకొంది ? అనే అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో వాతావరణ నిపుణులు వై.కె.రెడ్డి పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:41 - April 2, 2018

అనంతపురం : జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. నల్లమడ మండలం పేమలకుంటపల్లిలో పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షం పడింది. దీంతో చింతచెట్టుకిందకు వెళ్లారు. పిడుగుపడడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

13:33 - October 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. కరీంనగర్‌ జిల్లాలో లోయర్ మానేరు డ్యామ్‌లో పిడుగు పడడంతో .. చేపల వేటకు వెళ్ళిన లక్ష్మణ్ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. లక్ష్మణ్ చేపలు పట్టడానికి డ్యామ్‌లోకి వెళ్లిన సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చి.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితా జాలర్లు అతి కష్టం మీద మృత దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మరోవైపు కామారెడ్డి జిల్లా, రాజంపేట మండలం, బస్వన్నపల్లి గుట్టపై పిడుగు పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా, నవీపేట్‌ మండల కేంద్రంలో పిడుగు పడటంతో.. విద్యుత్‌ స్థంభంపై మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు బాగు చేసి మళ్లీ విద్యుత్‌ను పునరుద్ధరించారు.  

 

09:48 - July 30, 2017

విశాఖ : హెచ్‌పీసీఎల్‌పై పిడుగుపాటుతో విశాఖనగరం ఉలిక్కిపడింది. క్రూడ్‌ఆయ్‌ట్యాంకుపై పిడుగు పడ్డంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.  అధికారులు, ఫైర్‌సిబ్బంది తక్షణ స్పందించడంతో  భారీగా ఆస్తినష్టం లేకుండా నివారించగలిగారు. ప్రస్తుతం ఆస్తనష్టం ఎంతమేరకు ఉందో అధికారులు అంచనా వేస్తున్నారు. 
హెచ్‌పీసీఎల్ పై పడిన పిడుగు 
వివాఖలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పడిగుపాటుతో మంటలు చెలరేడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. భారీగా క్రూడాయిల్ నిల్వ ఉన్న జీరో 1-డీ ట్యాంకుపై పిడుగుపడింది. దీంతో ఆయిల్‌కు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన హెచ్‌పీసీఎల్‌ అధికారులు మంటలు ఇరత మిషనరీకి విస్తరించకుండా చర్యలు చేపట్టారు. రిఫైనరీ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను పూర్తిగా ఆపేశారు. అటు సమాచారం తెలుసుకున్న  అగ్నిమాపక సిబ్బంది  తక్షణం స్పందించారు. హుటాహుటిన  ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి  ఆస్తినష్టం భారీగా లేకుండా నివారించామని అధికారులు అంటున్నారు. మంటలను పూర్తిగా ఆర్పేసిన అధికారులు ఆస్తినష్టం ఏమేరకు ఉందో అంచానా వేస్తున్నారు. 

09:17 - July 29, 2017

ప్రకాశం : జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెలకాపరులు మృతి చెందారు. టంగుటూరు మండలం నిడమానూరులోని పొలాల్లో వినుకొండ, అంద్దంకి, పామూరు గ్రామాలకు చెందిన ముగ్గురు గొర్రెలకాపరులు టెంట్లు వేసుకుని రాత్రి నిద్రిస్తున్నారు. వారిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లిన నిడమానూరు గ్రామస్తులు గమనించి....మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. మరన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:00 - June 19, 2017

హైదరాబాద్ : ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల భారీవర్షాలతో వరదనీరు ఉరకలెత్తుతోంది. హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుప్రాంతాల్లో భారీ వర్షం కుమ్మరిస్తోంది. సిటీలోని ఓయూ క్యాంపస్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్‌, మల్లాపూర్‌, కాచిగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు కాప్రా, రామాంతపూర్‌, నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఏపీలో భారీవర్షాలు
ఏపీలో భారీవర్షాలకు జనం నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాంధ్రజిల్లాల్లో ఆదివారం పిడుగులతో భారీవర్షం పడింది. పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తునిర్వహణశాఖ హెచ్చరికలతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. విశాఖ జిల్లాలోని పద్మనాభం, భీమునిపట్నం, దేవరాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అటు విజయనగరం జిల్లాలోని డెంకాడ, జామి, భోగాపురంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణవ్యాప్తంగా జోరుగా వానలు
తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారంలో పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం అవల్‌గావ్‌లో పిడుగుపాటుకు హనుమంత్‌ అనే రైతు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జడ్చర్లలో భారీ వర్షానికి గోడకూలి ఓ మహిళ దుర్మరణం పాలైంది. భారీ వర్షాలతోపాటు పిడుగులు కూడా విరుచుకుపడుతుండటంతో.. అప్రమత్తంగా ఉండాలని విపత్తునిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. 

20:34 - May 18, 2017

హైదరాబాద్ : పిడుగు పడుద్ది..కానీ అంతకు ముందే మొబైల్ మోగుద్ది. అవును మరి పిడుగు ఆకాశాన్ని చీల్చుకుని రాకముందే అలర్ట్ బీ కేర్ ఫుల్ అంటోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తుంది. ఇప్పటి వరకు ప్రమాద వశాత్తూ ఎన్నో ప్రాణాలు పిడుగుల పాలిట పడ్డాయి. కానీ ఇక ముందు ఆ పరిస్థితి రాదు. ఏపీలో ప్రవేశ పెట్టిన టెక్నాలజీతో ఇపుడు సీన్ మారనుంది. మేఘాలు పిడుగుకు సై అనకముందే ఇక్కడ సేఫ్ ప్లేస్ లో సర్దుకునే అవకాశం వస్తోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:50 - May 18, 2017

అమరావతి: పిడుగు ప్రమాదాల్ని అరికట్టే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఈ టెక్నాలజీని తొలిసారి చిత్తూరు జిల్లాలో ప్రయోగించి సక్సెస్ అయ్యింది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ ఈ పరిజ్ఞానాన్ని అందిస్తోంది. సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో.. దేశంలోనే తొలిసారిగా పిడుగుపాటును గుర్తించి, ప్రాణాపాయాన్ని నివారించే వీలు కలిగింది. పిడుగుపాటుకు సంబంధించిన హెచ్చరికల్ని ఫోన్‌ మెసేజ్‌లు సహా... పలు మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఎర్త్ నెట్ వర్క్ తో పాటు సహకారం అందించిన ఇస్రో

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల్లో పిడుగుపాటు అతి సహజం. అయితే పిడుగు ఎప్పుడు.. ఎక్కడ పడుతుందన్నది గుర్తించే సాంకేతితక ఇంతకాలం ఉండేది కాదు. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ వర్క్ తో పాటు.. ఇస్రో సహకారంతో పిడుగులు పసిగట్టే పరిజ్ఞానాన్ని ఏపీ సొంతం చేసుకుంది. ఆకాశంలో ఉష్ణోగ్రతల మార్పుల సమయంలో మేఘాల మధ్య ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రికల్ కరెంట్ మరీ ఎక్కువగా ఉంటే అది పిడుగుగా మారి భూమిపై పడుతుంది. ఈ ఎలక్ట్రికల్ కరెంట్ ఏ స్ధాయిలో ఉందనే దానిని లెక్కించి పిడుగుపాటు, దాని తీవ్రతను అంచనా వేస్తారు. మేఘాల మధ్య ఎలక్ట్రికల్ ఛార్జ్ ఎంత ఉంది? అది పిడుగుగా మారి భూమిపై వచ్చే అవకాశం ఉందా? అనేది పసిగట్టే పరిజ్ఞానం ఎర్త్ నెట్ వర్క్ వద్ద ఉంది. ఈ పరిజ్ఞానాన్ని తొలిసారి చిత్తూరుజిల్లాలో ప్రయోగించిన అధికారులు కుప్పం, పలమనేరు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై దండోరా వేయించి, ప్రజలను అప్రమత్తం చేసి, ప్రాణాపాయాన్ని నివారించారు.

ఎర్త్ నెట్ వర్క్ ద్వారా రాష్ట్రంలో 14 సెన్సర్ల ఏర్పాటు

ఇక ఎర్త్ నెట్ వర్క్ ద్వారా రాష్ట్రంలో 14 సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెన్సర్ 1,040 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుంది. ఆ పరిధిలో పిడుగుపాటుకు అవకాశం ఉంటే అరగంట ముందే చెప్పేస్తుంది. మరోవైపు కుప్పం ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్ధులు పిడుగుపాటును ముందుగా తెలిపే యాప్ ను సిద్ధం చేశారు. దీనికి వజ్రపథ్ అని పేరు పెట్టారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వరదరాజు, ఇస్రో శాస్త్ర వేత్త శ్రీకాంత్ నేతృత్వంలో ఈ వజ్రపథ్ యాప్ ను విద్యార్ధులు రూపొందించారు. దీనిని ఉపయోగించడం ద్వారా కుప్పం, బైరెడ్డిపల్లె మండలాల్లో పిడుగుపాటు సమాచారాన్ని ప్రజలకు అందించి ప్రాణ, ఆస్తి నష్టం నుంచి కాపాడగలిగారు. ఏపీలో అమలులోకి వచ్చిన ఈ పరిజ్ఞానంపై అనేక రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఈ టెక్నాలజీ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిజ్ఞానం అన్ని చోట్ల అమలులోకి వస్తే పిడుగు ప్రమాదాల నుంచి జనం ప్రాణాలు కాపాడవచ్చు. 

21:26 - May 14, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - thunderbolt