tirumala

18:32 - November 23, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి సన్నిధి వివాహాలతో సందడిగా మారింది. మఠాల్లోని కళ్యాణ మండపాలకు, కళ్యాణ వేదికలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. శుక్ర, శనివారం మినహాయిస్తే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 18 వరకూ ముహూర్తాలు లేకపోవడంతో వివాహాల సందడి నెలకొంది. తిరుమల టీటీడీ కల్యాణ వేదికలో శనివారం వరకు 240 వివాహాల కోసం భక్తులు తమ పేర్లను ఆన్ లైన్లో నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం... శుక్ర, శని రెండు రోజుల్లో శ్రీవారి సన్నిధిలో వందల జంటలు ఒక్కటి కానున్నాయి. ఇవన్నీ ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వివాహాలు మాత్రమే.. ఇక కరెంటు బుకింగ్‌ ద్వారా కూడా వందలాది పెళ్లిళ్లు జరగనున్నాయి.

అన్ని మఠాల్లోని కళ్యాణమండపాలు ఇప్పటికే రిజర్వ్‌
తిరుమలలోని అన్ని మఠాల్లోని కళ్యాణమండపాలు ఇప్పటికే రిజర్వ్‌ అయ్యాయి. ఇవన్నీ పరశీలిస్తే శనివారం వరకు దాదాపు వెయ్యి వరకు వివాహాలు జరగనున్నాయి. వివాహం చేసుకుంటున్న జంటలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని.. వారికి ఉచితంగా పురోహితుడిని ఏర్పాటు చేసి వివాహం జరిపిస్తున్నట్లు అధికారులు చెప్పారు. తిరుమలలోని కళ్యాణవేదికలో వివాహాలు చేసుకున్న దంపతులు వారి తల్లిదండ్రులకు టీటీడీ ఉచితంగా మూడువందల రూపాయల ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఉచితంగా లడ్డూలు, వసతి సౌకర్యలను కూడా కల్పిస్తున్నారు. మొత్తానికి శ్రీవారి సన్నిధిలో నూతన జంటలు పెద్ద ఎత్తున ఒక్కటవుతున్నారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివాహానికి వచ్చే నూతన దంపతులకు ప్రత్యేక వసతులతో పాటు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. 

18:54 - November 14, 2017

చిత్తూరు : సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఇక నుంచి క్యూలైన్లలో పడిగాపులు లేకుండా... సులభంగా సర్వ దర్శనం కోసం టైం స్లాట్ విధానాన్ని అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు అమలు చేస్తున్నారు. డిసెంబర్ రెండోవారంలో సర్వదర్శనం భక్తులకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇందుకోసం తిరుమలలో 21 ప్రాంతాల్లో 150కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. 

08:36 - November 10, 2017

చిత్తూరు : తిరుమలలోని జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. వర్షాలకు తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యాముల్లోకి భారీగా నీరు చేరింది. పాపవినాశనం డ్యాం పూర్తిగా నిండిపోగా మిగిలిన జలాశయాలు దాదాపు నిండిపోయాయి. దీంతో టీటీడీ అధికారులు డ్యామ్‌ల వద్ద ఘనంగా గంగపూజ నిర్వహించారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు గంగపూజలో పాల్గొన్నారు. జలాశయాల్లోకి నవంబరు 10కే పూర్తి స్థాయిలో నీరు రావడం సంతోషంగా ఉందని ఈవో అన్నారు. అన్ని డ్యాముల్లోని నీరు 761 రోజులకు.. తిరుమల అవసరాలకు సరిపోతుందని ఆలయ ఈవో తెలిపారు. 

09:57 - November 9, 2017

ఇడ్లీ...రూ. 20...ఛాయ్ రూ. 10 ఉంటుంది కానీ ఇంత తక్కువగా ఎక్కడిస్తున్నారు అనేగా మీ ప్రశ్న..ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యాపారులు ఈ ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. తిరుమల కొండపై ఉన్న దుకాణాల్లో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఓ స్వచ్చంద సంస్థ హైకోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. దీనితో హైకోర్టు టిటిడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధరలను తగ్గించాలని సూచించింది.

హైకోర్టు దెబ్బతో తిరుమలలో వ్యాపారులు దిగి వచ్చారు. ఇప్పటి వరకు వందల రూపాయలు దండుకున్న హోటల్ యజమానులు..మనస్సు మార్చుకున్నారు. హైకోర్టు సూచనలు..టిటిడి అధికారుల సూచనల మేరకు పలు హోటళ్ల ఎదుట ధరల పట్టీకలను ఉంచారు. రెండు ఇడ్లీల ధర మొన్నటి వరకు రూ. 25 ఉండగా..ప్రస్తుతం రూ. 7.50గా నిర్ణయించారు. ఏకంగా రూ. 15 అమ్మిన టీ ధర రూ. 5 దొరుకుతోంది. వెజిటబుల్ బిర్యానీ ధర రూ. 50 నుంచి రూ. 19... ఉప్మా ధర రూ. 20 నుంచి రూ. 9..ప్లేట్ మీల్స్ ధర రూ. 60 నుంచి రూ. 22.50కు తగ్గాయి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ధరలూ సగానికి పైగా తగ్గాయి. పట్టికలో చూపిన ధరలకన్నా ఎక్కువకు అమ్మితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే ఫోన్ నంబర్లను సైతం హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు.

మరోవైపు నెలవారి చెల్లిస్తున్న అద్దెలు భారీగా ఉంటున్నాయని హోటళ్ల యజమానులు పేర్కొంటున్నారు. చెల్లిస్తున్న అద్దెలు భారీ స్థాయిలో ఉండడంతో తాము అధిక ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని టిటిడి అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం ఉన్న ధరలు కొన్ని రోజుల వరకు ఉంటాయా ? లేదా ? అనేది చూడాలి. 

13:50 - November 5, 2017

చిత్తూరు : ఇవాళ తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రోజా, జబర్దస్‌ టీమ్‌ మెంబర్స్‌ శ్రీనివాసుడిని దర్శించకున్నారు. అలాగే ఒకనాటి హీరోయిన్‌ రాధిక.. ఆమె భర్త శరత్‌కుమార్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు రోజా, రాధికతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. 

 

07:37 - November 4, 2017

చిత్తూరు : తిరుమల హోటళ్లలో అధిక ధరలపై  హైకోర్టు ఆగ్రహంతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది. వ్యాపారుల నిలువు దోపిడీలో ఆలయ అధికారుల భాగస్వామ్యం ఉందంటూ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తిరుమలలోని హోటళ్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేస్తున్నారు.
తిరుమల హోటళ్లలో అధిక ధరలపై హైకోర్టు సీరియస్‌
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలకు ఆహారం విక్రయించడంపై హైకోర్టు సీరియస్‌ అయింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తిరుమలలో 11 వరకు పెద్ద రెస్టారెంట్లు, మరో ఆరు వరకు చిన్న జనతా క్యాంటీన్లు, లెక్కకు మించి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఒక రెస్టారెంటునకు నిర్వహకులు అత్యధికంగా నెలకు 46 లక్షల అద్దెను చెల్లిస్తుండగా, మరో రెస్టారెంట్‌ 32 లక్షలు అద్దె చెల్లిస్తున్నాయి. మిగిలిన రెస్టారెంట్లు కాస్త తక్కువ అద్దెను చెల్లిస్తున్నాయి. ఇక ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్లు లెక్కకు మించి ఉన్నాయి. 
తిరుమల హోటళ్లలో నిత్యం లక్షల్లో వ్యాపారం
తిరుమలకు వచ్చే భక్తులు ఈ హోటళ్లనే ఆశ్రయించడంతో నిత్యం లక్షల వ్యాపారం జరుగుతుంది. దీంతో తిరుమలలోని హోటళ్లను సొంతం చేసుకునేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ హోటళ్ల కేటాయింపునకు టీటీడీ షీల్డ్‌ టెండర్లను నిర్వహించి అధికంగా కోట్‌ చేసినవారికి 3 సంవత్సరాల కాలపరిమితితో హోటల్‌ లైసెన్సును జారీ చేస్తుంది. అయితే హోటల్‌ కేటాయింపు సమయంలోనే టీటీడీ నిబంధనల మేరకే విక్రయించాలని చెబుతుంది. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో హోటళ్ల యజమానులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి భక్తులను భారీగా దోచుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవాసమితి గత సంవత్సరం హైకోర్టులో పిల్‌ వేసింది. ఈ విషయమై అప్పట్లోనే కోర్టు వివరణ కోరగా టీటీడీ స్పందించలేదు. టీటీడీ తీరును సీరియస్‌గా తీసుకున్న కోర్టు గత 10 రోజుల క్రితం టీటీడీ ఈవో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 
న్యాయస్థానం ముందు హాజరైన టీటీడీ అధికారులు
కోర్టు ఆదేశాల మేరకు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు గత నెల 31న న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అయితే టీటీడీ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని కోర్టు హోటళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ఆదేశించింది. దీంతో టీటీడీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రెస్టారెంట్ల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను టీటీడీ నిర్ణయించిన ధరకే అమ్మకాలు జరపాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. 
రెస్టారెంట్లపై నిఘా ఉండేలా ప్రత్యేక టీంలు
అలాగే రెస్టారెంట్లపై నిరంతరం నిఘా ఉండేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నష్టాల కారణంగా అద్దె చెల్లించలేని పరిస్థితిలో హోటళ్లు మూసివేస్తున్నామంటూ కొందరు యజమానులు టీటీడీకి రాతపూర్వకంగా తెలిపారు. కొందరు వ్యాపారుల.. అద్దె బకాయిలు భారీగా పేరుకుపోయి, చెల్లించిన డిపాజిట్‌కు సమానమయ్యాయి. ఇంకొందరు బకాయిలు ఎగ్గొట్టి హోటళ్లు మూసేని పరారీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టీటీడీ కారణంగానే పోటీలు పడి భారీ అద్దెతో హోటళ్లు, జనతా క్యాంటీన్లు చేజిక్కించుకున్నామని, మొదటే నిబంధనలు పాటించాలని షరతులు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని యాజమానులు అంటున్నారు. తిరుమలలో ఏర్పడిన ఈ తాజా పరిణామాలతో తమకు భారీ నష్టాలు తప్పవని వాపోతున్నారు. 

 

18:34 - November 3, 2017

చిత్తూరు : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 15న ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 14, 21వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. 19వ తేదీన గజవాహనం, 20న స్వర్ణరథం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. 

15:36 - October 28, 2017

చిత్తూరు : శ్రీ వెంకటేశ్వరస్వామివారి వార్షిక పుష్పయాగాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతీ యేటా శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది మొత్తం తెలిసో తెలియకో శ్రీవారి ఆలయంలో జరిగే పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం చేస్తారు. తమిళనాడు, కర్నాటక, రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాతలు విరాళంగా ఇచ్చిన మొత్తం 9 టన్నుల పూలతో ఈ పుష్పయాగం అత్యంత వేడుకగా జరిగింది. తిరుమలలోని ఉద్యానవన విభాగం వద్ద నుండి ఈ పుష్పాలను అధికారులు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ఉద్యానవన విభాగం అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

10:34 - October 25, 2017

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించడంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ టిటిడి ఈవోను కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు గతంలోనే భక్తులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై టిటిడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి పిటిషన్ దాఖలు చేసింది. 2016లో ఈ పిటతిషన్ దాఖలు చేసింది. అప్పటి నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది. అప్పటిలోనే హైకోర్టు టిటిడిని వివరణ కోరింది. కానీ టిటిడి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంపై బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు ధరలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టిటిడి ఈవోపై కోర్టు సీరియస్ అయ్యింది. అధిక ధరలకు ఆహార పదార్థాలు విక్రయిస్తూ భక్తులను అధిక ధరలకు దోచుకుంటుంటే కళ్లు మూసుకున్నారా ? అని కోర్టు ప్రశ్నించింది. 2016 నవంబర్ లో ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటి వరకు వివరాలు సమర్పించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఈవోకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా టిటిడి స్పందిస్తుందా ? అధిక ధరలకు చెక్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

18:24 - October 22, 2017

చిత్తూరు : తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద క్షురకుల ధర్నా కొనసాగుతుంది. తమను విధుల నుంచి టీటీడీ అకారణంగా తొలగించిందంటూ గత కొన్ని రోజులుగా క్షురకులు ఆందోళన బాట పట్టారు. నిరసనలో భాగంగా టీటీడీ తీరును ఎండగడుతూ.. ఇవాళ వారు గుండు గీయించుకున్నారు. టీటీడీ అధికారులు తమపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుట్ర పూరితంగానే తమను రోడ్డున పడేశారని వాపోయారు.

Pages

Don't Miss

Subscribe to RSS - tirumala