tirupati

18:35 - February 21, 2018

చిత్తూరు : టిటిడిలో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తులకు ఊరట లభించింది. అన్యమత ఉద్యోగస్తులను తొలగించకూడదంటూ ఉభయ రాష్ట్రాల హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్యమతస్తులుగా ఉన్న 42 మందిని తొలగిస్తూ టిటిడి ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఉద్యోగస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా టిటిడి కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం కోర్టు విచారించింది. ఏన్నో ఏళ్లుగా పనిచేస్తున్న హైందవేతరులను ఎలా తొలగిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 

07:33 - February 12, 2018

చిత్తూరు : తిరుపతికి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీకృష్ణదేవరాయకాలంలో నిర్మించబడింది. ప్రాచీన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయం నిదర్శనంగా నిలిచింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది.

పెద్ద సంఖ్యలో భక్తులు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు వారంపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శివరాత్రి ఉత్సవ సమయంలో ఆలయం లోపలే కాకుండా బయట ప్రధాన వీధులైన నెహ్రూ వీధి కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనతో కిటకిటలాడుతుంటాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి శివుడు ఊరేగుతుంటే ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక.

తెప్పలపై స్వామి వారిని
అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోలేని పేదలు .. స్వామి అమ్మవారి కళ్యాణంతో పాటు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి ఆలయం అందంగా ముస్తాబైంది. విద్యుద్దీప కాంతులలో శ్రీకాళహస్తీశ్వరుని మూలవిరాట్టు కనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు 8 వ తేదీనుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 

20:18 - February 5, 2018

దుబాయ్ : ఎడారి దేశంలో.. శ్రీనివాసుడి కల్యాణం..! అత్యంతం కమనీయం... కడు రమ్యం..! వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య... అన్నమయ్య గీతాలాపనల నడుమ.. అంగరంగ వైభవంగా సాగే మహోత్సవం... శ్రీనివాసుని వివాహం..! ఎడారి దేశంలో కూడా  ఆ ఏడుకొండలవాడి పెళ్లి.. కన్నులవిందుగా సాగింది.     

ప్రవాస భారతీయులు ముచ్చటగా జరుపుకునే మహోన్నత వేడుక శ్రీవారి కల్యాణం. దేశమేదైనా... ఆ ఏడుకొండలవాడి వివాహ మహోత్సవం వైభవంగా సాగాల్సిందే.. దీనికి ఏడారి దేశం కూడా  మినహాయింపు కాదు. దుబాయ్‌లో శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం ఓ పండుగగా జరిగింది. తిరుమల క్షేత్రంలో  జరిగే శ్రీవారి కల్యాణోత్సవానికి ఏ మాత్రం తీసిపోకుండా.. సంప్రదాయబద్ధంగా ఇక్కడ కూడా ఈ వేడుకను నిర్వహించారు. 

దుబాయ్‌ నగరానికి సమీపంలో అజ్మన్‌ అనే ప్రాంతంలో వెంకటేశ్వరస్వామి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.  భక్తుల గోవింద నామస్మరణతో దుబాయ్‌ నగరం మారుమోగింది.  పండితుల మంత్రోచ్ఛరణలు, వేల సంఖ్యలో  భక్తులు, చిన్నారుల అన్నమయ్య గీతాలాపనల మధ్య.. శ్రీవారి పెళ్లి కడు రమ్యంగా సాగింది.  తిరుపతి వేద పండితుల మంత్రాల నడుమ శ్రీవారు తమ ఉభయ దేవేరులకు మంగళసూత్రధారణ చేశారు. 

వేల సంఖ్యలో భక్తులు సతీసమేతంగా..ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యునైటెడ్‌ ఎమిరేట్స్ ప్రాంతాలైన దుబాయ్‌, అబుదాబి, అజ్మన్‌, పుజైరా, రస్‌ ఆల్‌ఖైమా, షార్జా, ఉమల్‌ క్వైన్‌ల నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు ఈ వేడుకను వీక్షించారు.  శ్రీవారి పెళ్లితో.. అజ్మన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. శ్రీనివాసుడి వివాహ వేడుకను వీక్షించిన భక్తులు..ఆనందోత్సహంలో మునిగిపోయారు. ఎంతో సంతోషంగా ఉందని.. తిరుపతిలో ఉన్నట్టే ఉందని.. సంతోషం వ్యక్తం చేశారు. అజ్మన్‌లో శ్రీవారి కల్యాణంతో పాటు.. పుష్ఫయాగాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. 

08:35 - January 30, 2018

చిత్తూరు : తిరుమ శ్రీవారి మెట్ల అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు భారీగా బయటపడ్డాయి. అందులో రెసిస్టర్లు, కెపాసిటర్లు, సర్య్కూట్ బోర్డులు ఉన్నాయి. వాటితో పాటు పోలీసులు సెల్ ఫోన్, వాకీటాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:25 - January 20, 2018

చిత్తూరు : తిరుపతిలో నకిలీ డాక్టర్‌ హల్‌ చల్‌ చేశాడు. డాక్టర్‌ పేరు చెప్పి గోపి మాధవి ఆస్పత్రిలో ప్రవేశించాడు. ఆస్పత్రిలోని ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరించి ఉడాయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:06 - January 13, 2018

చిత్తూరు : పారిశ్రామిక, ఐటీ రంగాలకు తిరుపతి అనుకూలమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రేణిగుంటలో జోహో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని చంద్రబాబు ప్రారంభించారు. విశాఖ, అమరావతి, అనంతపురం, తిరుపతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. జోహో కంపెనీకి తిరుపతి అతి పెద్ద సెంటర్ కావాలని ఆకాంక్షించారు. తిరుపతికి సోమశిల- స్వర్ణముఖి నదుల నుంచి నీటిని తరలిస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురంలలో సైబర్ టవర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. 2019 నాటికి ఐటీలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు.

12:07 - January 10, 2018

చిత్తూరు : తిరుమతి  ఎస్వీ యూనివర్సిటీ ఏఈ రుద్రకుమార్‌ ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 6చోట్ల ఏకకాంలో తనిఖీలు  నిర్వహించిన అధికారులు... పెద్దమొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఏఈ రుద్రకుమార్‌  భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:59 - January 4, 2018

చిత్తూరు : బీసీ సర్టిఫికేట్ అందుకున్న రోజే మాకు నిజమైన పండుగ అని కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు ఉద్యమాన్ని ఆపలేదని.. మార్చి 31 వరకూ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. కాపు నేతలతో తిరుపతిలో జరిగిన సమావేశంలో ముద్రగడ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదన్నారు ముద్రగడ. పవన్‌ను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని.. కేవలం సినిమాల్లో మాత్రమే చూశానని ముద్రగడ చెప్పారు.

 

18:43 - January 3, 2018

చిత్తూరు : తిరుపతిలో ఫార్మా డి విద్యార్థులు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆరేళ్ళ కోర్సు పూర్తి చేసినా...ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యాడని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

10:08 - January 2, 2018

చిత్తూరు : మళ్లీ ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోయారు. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. శ్రీవారి మెట్టు సమీపంలోని వాటర్ సంప్ సమీపంలోని అడవిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి కూంబింగ్ నిర్వహించారు. పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. లొంగిపోవాలని పోలీసులు సూచించారు. కానీ స్మగర్లు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కత్తులు..బరిసెలను పోలీసులపైకి విసిరారు. ఈ ఘటనలో హరికృష్ణ అనే పోలీసు చేతికి తీవ్రగాయమైంది. ఆత్మరక్షణార్థం పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే స్మగ్లర్లు తలో దిక్కుకు పారిపోయారు. ఘటనా స్థలంలో 29 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 మంది స్మగ్లర్లు ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్మగ్లర్ల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - tirupati