trs

21:06 - October 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై సెటైర్లు విసిరారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వస్తే తాను భయపడతానా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు తెచ్చిందే తాను అని..గట్స్  లేనివాడ్నయితే ఎన్నికలు తీసుకొస్తానా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అని అన్నీ సర్వేలు తేల్చాయని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఈ క్రమంలో 100 సీట్లు కంటే ఎక్కువగా గెలవటమే తమ యత్నమన్నారు. అంతేకాదు నాలుగైదు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ లీడింగ్ పార్టీ అని పేర్కొన్నారు. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచామని కేసీఆర్ గుర్తు చేశారు. 

19:46 - October 16, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా వున్న టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోని ఈరోజు కేసీఆర్ విడుదల చేశారు. రైతులకు వరాలు కురిపించిన కేసీఆర్ నిరుద్యోగ భృతి విషయంలో కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ క్రమంలో ఉద్యోగుల విషయంలో కేసీఆర్ మాట్లాడుతు..ఏ ప్రభుత్వం పెంచని విధంగా ఉద్యోగులకు జీతాలు పెంచామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ల జీతాలను భారీగా పెంచామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకుండా కొందరు కేసులు వేశారని ధ్వజమెత్తారు. చిన్న ఉద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు గాబరా పడొద్దని సూచించారు. తప్పకుండా ఐఆర్ ఇస్తామని, సముచితమైన రీతిలో పెంచుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు చెప్పినవీ చేయలేదని, తాము మాత్రం చెప్పనవి కూడా చేశామని వివరించారు. వందశాతం అమలు చేసే హామీలే ఇస్తున్నామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ వాళ్లు వచ్చేది లేదు చేసేది లేదని, అందుకే అడ్డగోలు హామీలు ఇస్తున్నారంటూ విమర్శించారు.
 

 

19:13 - October 16, 2018

హైదరాబాద్ : రైతన్నలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే రూ.8వేలు అందిస్తున్న విషయంతెలిసిందే..ఈ ఎన్నికల నేపథ్యంలో రూ.10వేలకు పెంచారు. అంతేకాదు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వస్తే.. మళ్లీ అధికారం ఇస్తే..రైతన్నలకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ప్రస్తుతం రైతుబంధు పథకం ద్వారా ఇస్తున్న ఎకరానికి రూ.4వేల నగదును రూ.5వేలకు పెంచుతామని ప్రకటించారు. రుణమాఫీ విషయంలో గతంలో మాదిరిగా సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా, రైతులకు ఇబ్బంది లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 

19:00 - October 16, 2018

హైదరాబాద్:  టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తులపై కమిటీ సమావేశమయ్యింది. ఈ నేపథ్యంలో కమిటీ సమావేశం అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతు..వివిధ వర్గాల నుంచి 300 పైచిలుకు విజ్ఞప్తులు వచ్చినయని, వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి చర్చించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రజలు కోరిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలు కోరిన అంశాలను గమనంలోకి తీసుకున్నామనీ..ఎన్నికలంటే ఇతర పార్టీలకు గేమ్‌లాంటిదని..టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం టాస్క్‌వంటిదని కేసీఆర్ అన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెడతామన్నారు. విభజన సమయంలో సమస్యలు చాలా వున్నా ఏడాది తర్వాత కల్యాణలక్ష్మీ పథకంపై ఓ అవగాహనకు రాలేదనీ ఇపుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. నాలుగేళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సున్నా అని కేసీఆర్ వెల్లడించారు.
 

17:48 - October 16, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలకు అవినీతి తప్ప మరేమీ కనిపించదని హరీష్‌రావు అన్నారు. ఏళ్లుగా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు చేయలేని పనులు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చేసిందని హరీష్‌రావు చెప్పారు. తాగు, సాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన చెప్పారు. నీరు అందించడం చేతకాదని కాంగ్రెస్ వాళ్లు చేతులు ఎత్తేస్తే.. తాము ఛాలెంజ్‌గా తీసుకుని నీరు అందించామని హరీష్‌రావు చెప్పారు. కేంద్రమంత్రిగా పని చేసినా, దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్నా.. జైపాల్ రెడ్డి కనీసం సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లాకు, కల్వకుర్తి నియోజకవర్గానికి నీటి సదుపాయం కల్పించలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. మీ జిల్లాకు, నియోజకవర్గానికి నీళ్లు అందించిన ఘనత టీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని హరీష్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 15వేల గ్రామాలకు కృష్ణా, గోదావరి, మంజీరాల నుంచి శుద్ది చేసిన తాగునీరుని అందిస్తే అబినందిచాల్సింది పోయి విమర్శించడం దుర్మార్గమైన చర్య అని హరీష్‌రావు ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి పుట్టి పెరిగిన కల్వకుర్తి నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నీళ్లు వచ్చాయని హరీష్ గుర్తు చేశారు.

08:36 - October 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ అధికార పార్టీలో నేతల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయంతో అసమ్మతి నేతలపై వేటు వేస్తోంది. పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో అసమ్మతి నేతలు దారికి వస్తారని గులాబి పార్టీ భావిస్తోంది.

క్రమశిక్షణపై రాజీపడేది లేదన్న సంకేతాలను తెలంగాణ రాష్ట్ర సమితి ఇస్తోంది. పదవుల్లో ఉన్నా నియమావళిని ఉల్లంఘిస్తే సహించేది లేదని హెచ్చరిస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్లు దక్కించుకునేందుకు పోటీపడిన నేతలు.. పార్టీ అసమ్మతి కార్యకలాపాలకు తెరలేపడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ అన్ని వ్యూహాలు అమలుచేస్తోంది. ఓ వైపు బుజ్జగిస్తూనే.. మరోవైపు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. కొంతమంది నేతలు దారికి వస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. దీంతో దారిలోకి రాని నేతల వ్యవహారంపై గులాబీ బాస్‌ సీరియస్‌గా ఉన్నారు. 

ఇప్పటికే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో సీనియర్‌ నేత వేనెపల్లి వెంకటేశ్వరరావుపై బహిష్కరణ వేటుపడింది. తాజాగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను కూడా పార్టీ నుండి సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాములునాయక్‌.. విపక్ష పార్టీ కీలకనేతలతో భేటీ అయ్యారన్న సమాచారంతో పాటు.. పార్టీని వీడేందుకు సిద్దమయ్యారన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సస్పెన్షన్‌ నిర్ణయాన్ని రాములునాయక్‌ తప్పుపట్టారు. గిరిజన నేతను అయినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 

ఇంకా ఎన్నికలకు 45 రోజుల గడువు ఉండడంతో.. కేసీఆర్‌ ప్రచారం ముమ్మరం చేయకముందే.. అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. మాట వినని నేతలపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమనే సంకేతాలను ఇస్తోంది. మరి ఇప్పటికైనా అసమ్మతి నేతలు వెనక్కి తగ్గుతారా.. లేకపోతే పార్టీని ఢీకొట్టేందుకు సాహసం చేస్తారా ! అనేది చూడాలి. 

08:08 - October 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహానికి మరింత పదును పెట్టబోతుంది. ఈసారి ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలపై చర్చించేందుకు ఇవాళ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై కూడా నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి గులాబీ బాస్‌ కేసీఆర్‌ కూడా హాజరుకానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పెండింగ్‌ ఉన్న అభ్యర్థులను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికార పగ్గాలు చేపట్టేందుకు టీఆర్‌ఎస్‌ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు అనేక ప్రణాళికలు రచించిన అధికార పార్టీ.. గెలుపు లక్ష్యంగా అనేక కసరత్తులు చేస్తోంది. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే ప్రచార పర్వానికి తెరదీసిన టీఆర్‌ఎస్‌.. ఇప్పటికే దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్‌ తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయగా.. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలకు మరో 50 రోజుల సమయం ఉండడంతో దసరా పండుగ తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు గులాబీ దళం రెడీ అవుతోంది. 

ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మన్ననలు పొంది.. పట్టును నిరూపించుకునేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఇవ్వాల్సిన హామీలపై పార్టీ కసరత్తు చేస్తోంది. నెల రోజుల క్రితం నుంచే అన్ని వర్గాల ప్రజల నుంచి పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కేకే అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. మంత్రులు కూడా శాఖలవారీగా.. తమ శాఖలకు సంబంధించిన వివరాలను కమిటీకి తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలపై పార్టీపరంగా నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ఓ మెట్టు దిగేందుకు కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. సొంత ఇంటిస్థలం ఉంటే లబ్ధిదారులకు 5 లేదా ఆరు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం నేరుగా ఆర్థికసహాయం చేయాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ ఈ సమావేశానికి హాజరుకానుండడంతో మరిన్ని ప్రజాకర్షక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే.. ఈ సమావేశం పాక్షికంగా మాత్రమే మేనిఫెస్టోను ప్రకటించనుంది. దసరా తర్వాత పూర్తి హామీలను పార్టీ ప్రకటించనుంది. ఇక ప్రకటించని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కేసీఆర్‌ ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

16:48 - October 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లి..ముందే అభ్యర్థులను ప్రకటించేసిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. కానీ ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తులు వ్యక్తమౌతున్నాయి. టికెట్ రాని కొంతమంది ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా సోమవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్లీ రాములు నాయక్ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. 
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారితో రాములు నాయక్ రహస్యంగా భేటీ అయ్యారని పేర్కొటూ ఆ పార్టీ అధిష్టానం అతడిపై సస్పెండ్ వేటు వేశారు. దీనిపై రాములు నాయక్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల హక్కుల గురించి మాట్లాడితే సస్పెండ్ చేశారని, 20 ఏళ్ల నుండి కేసీఆర్‌ను నమ్ముకున్నానని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెండ్ చేశారని..టీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది నాయకులు బయటకు వస్తారని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని రాములు నాయక్ పేర్కొనడం గమనార్హం. 

09:40 - October 15, 2018

హైదరాబాద్ : ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ అధినేత, అపద్ధర్మ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ఓటర్లందరి పేరిట లేఖలు రాయనున్నారు. శాసనసభ ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని, సమతులాభివృద్ధిని కొనసాగించేందుకు మళ్లీ గెలిపించాలని కోరుతూ కేసీఆర్‌ రాష్ట్రంలోని ఓటర్లందరి పేరిట లేఖలు రాయనున్నారు. ఈ నెలాఖరులో వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సందర్బంగా ప్రతి ఇంటికి టీఆర్‌ఎస్‌ సందేశం చేరాలని భావిస్తున్న కేసీఆర్‌.. ఇప్పటికే పార్టీ శ్రేణుల ద్వారా ప్రచారానికి ఆదేశించారు. 

కొత్త ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో రెండు కోట్ల 73 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లకు లేఖలు రాయడం ద్వారా వారికి చేరువ కావచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్పటికే దీనిపై దృష్టి సారించిన నేతలు.. లేఖలో ఏయే అంశాలు ఉండాలనే దానిపై చర్చించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు.. రాష్ట్ర వృద్ధిరేటు, ఇతర అంశాలను పొందుపర్చాలని నిర్ణయించారు. లేఖలు తెలుగుతో పాటు ఉర్దూ భాషల్లో ముద్రించనున్నారు. 

 

18:23 - October 14, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, విపక్షాల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసిందని, భారీగా నిధులు ఇచ్చిందని.. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమీ ఇవ్వలేదని అబద్దాలు చెబుతున్నారని అమిత్ షా ఆరోపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆరోపణలకు టీఆర్ఎస్ నేత కవిత ఘాటుగా బదులిచ్చారు.  

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కవిత మండిపడ్డారు. కేంద్రం ఈ నాలుగేళ్లలో తెలంగాణకు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చారని అమిత్ చెప్పారని, కానీ ఇచ్చింది కేవలం రూ.900 కోట్లని కవిత స్పష్టం చేశారు. అమిత్ షా మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ఇలానే అబద్ధాలు చెబితే.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఐదు స్థానాలు ఉన్నాయని, త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ ఐదు స్థానాలను కూడా కోల్పోవడం ఖాయమని కవిత హెచ్చరించారు. అమిత్ షా లెక్కలు చెబితే.. లెక్కల మాస్టర్లు సూసైడ్ చేసుకుంటారని కవిత ఎద్దేవా చేశారు. అమిత్ షాకు ఎన్నిసార్లు చెబుతాం, ఆయన్ని ఏమన్నా అంటే, ఇక్కడి బీజేపీ వాళ్లు గింజుకుంటారని కవిత వ్యాఖ్యానించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - trs