trs government

21:31 - April 25, 2018

బీజేపీ చెవ్వుల నాగం సారు పువ్వు, మోసం ప్రాజెక్టు గట్టుడు వాళ్లతోనేడైతది..?, ఈనెల ఇర్వై తొమ్మిదినాడు కోదండ సభ, కద్లకుంట బ్రేక్ డ్యాన్సు జేశిన నాయిని సార్.. అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

19:38 - April 25, 2018

సూర్యాపేట : జిల్లా మునగాల మండలం కలుకోవ సర్పంచ్‌ చిర్రా శ్రీనివాస్‌ అవినీతికి వ్యతిరేకంగా గ్రామస్థులు తిరుగుబాటు చేశారు. లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డ సర్పంచ్‌ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో  కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సర్పంచ్‌పై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కలుకోవలో పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా పథకానికి నీటి సరఫరా నిలిపివేసిన సర్పంచ్‌ శ్రీనివాస్‌ చర్యను ప్రజలు తప్పు పట్టారు. ఈ విషయాలను ప్రశ్నించిన సీపీఎం నాయకులపై సర్పంచ్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్మును సర్పంచ్‌ నుంచి రికవరీ చేసి, పుచ్చలపల్లి సుందరయ్య వాటర్‌ ప్లాంట్‌కు వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 

 

19:34 - April 25, 2018

రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంతో మంత్రి కేటీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ విమర్శించారు. ఇసుక మాఫియా, పోలీసులు ఆగడాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న నేరెళ్ల బాధితులను వీహెచ్‌ పరామర్శించారు. మంత్రి కేటీఆర్‌.. బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 

 

19:31 - April 25, 2018

పెద్దపల్లి : టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండగా ఉంటోందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. సర్కార్ అండతో... తెలంగాణలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్నారు. అతివేగంతో నడిచే ఇసుక లారీలు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టనట్లు ఉందని ఆయన ఆరోపించారు. ఇసుకమాఫియాను అడ్డుకునేందుకు ప్రజలతో కలిసి.. పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. 

 

19:20 - April 25, 2018

నిజామాబాద్‌ : ఎంపీ కవిత ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు వారి చరిత్రను మరచిపోయి విమర్శలకు దిగుతున్నారని ఎంపీ దుయ్యబట్టారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కవిత... జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్‌ హయాంలో నిజామాబాద్‌ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని కవిత చెప్పారు. 

 

18:40 - April 25, 2018

కరీంనగర్‌ : జిల్లాలో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో కౌలురైతు మల్లారెడ్డి.. 20ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశారు. అయితే మొక్కజొన్న పంటలో పూర్తిగా నష్టపోవడంతో అప్పులపాలైన మల్లారెడ్డి.. పురుగల మందుతాగి ప్రాణం తీసుకున్నాడు. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ అలుగునూరు చౌరస్తాలో మృతదేహంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్‌...వరంగల్‌ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీగా వాహనాలు నిలిచపోయాయి.  

17:01 - April 25, 2018

కరీంనగర్‌ : జిల్లా పరిషత్‌ సమావేశంలో సభ్యుల ఆందోళన గందరగోళానికి దారితీసింది. తమ మండలాలకు నిధులు ఇవ్వడం లేదని మహిళా జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. పోడియం ముందు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. తమ మండలాలకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాయకల్‌, మల్యాల, సారంగపూర్‌ మండలాల జడ్పీటీసీల నిరసనతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

17:57 - April 23, 2018

నిజామాబాద్ : రైతులను సాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.. భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడంతో సుమారు అరవై వేల బోరు బావులు అడుగంటాయి.. చేతికొచ్చిన పైరు ఎండి పోవడంతో రైతన్న భవితవ్యం ప్రశ్నార్దకంగా మారింది.కొందరు పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే... మరికొందరు ఎండిన పంటను పశువులకు మేతగా వేస్తున్నారు.. ఇంకొందరు పంటకు నిప్పు పెట్టి.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీటి కష్టాలు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు సాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం తొంభై వేల హెక్టార్లు కాగా.. 87 వేల హెక్టార్లలో వరి, 22 వేల హెక్టార్లలో మొక్క జొన్న సాగు చేశారు. బోరు బావులపై ఆధారపడ్డ రైతులకు సాగునీటి కష్టాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది.. అరవై వేలకు పైగా బోరుబావులు అడుగంటాయి.. ఇరవై వేల హెక్టార్లలో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ప్రధానంగా భీంగల్, ఇందల్ వాయి, కమ్మర్ పల్లి, మెర్తాడ్, ధర్పల్లి, వర్ని, జక్రాన్ పల్లి, డిచ్ పల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లో పరిస్ధితి మరీ దయనీయంగా మారింది.

పసిపాపలా కాపాడిన పైరు కళ్లముందే ఎండుతోంది..
పసిపాపలా కాపాడుకున్న పైరు కళ్ల ముందే ఎండుతుంటే రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు కొందరు బోర్లమీద బోర్లు వేస్తూ.. భగీరథ ప్రయత్నం చేస్తుంటే.. మరికొందరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పారిస్తున్నారు. ఇంకొందరు పంటకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పంటను చూసి.. ఇందల్ వాయి మండలం లోలం గ్రామానికి చెందిన రైతు గుండె తల్లడిల్లి చేను వద్దే కుప్పకూలి పోయాడు... ఇందలవాయి మండలం గన్నారం మెగ్యానాయక్ తాండాకు చెందిన లక్ష్యణ్, దర్పల్లి మండలం గొవింద్ పల్లి గ్రామానికి చెందిన రాకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నీటి జాడలేని బోర్లు..
కొండంత ఆశతో సాగుచేసిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. పొట్ట దశకు చేరిన వరి పంటలు నీరందక పూర్తిగా ఎండిపోతుంటే అన్నదాతలు అంతులేని ఆవేదనలో మునిగిపోతున్నారు. నెలలోపు వెయ్యికి పైగా బోర్లు తవ్వితే.. సుమారు తొంభై శాతం బోర్లలో చుక్కనీరు పడలేదు. ఒక్క ఇందల్వాయి మండలం బీబీనగర్ తండాలో వంద బోర్లు వేస్తే.. అన్నీ ఎండిపోయాయి.. పంటతోపాటు.. బోర్లకోసం చేసిన అప్పులతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకే కరువొచ్చిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు..ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

15:47 - April 20, 2018

పెద్దపల్లి : నియోజకవర్గంలోని రైతాంగానికి తాగు, సాగు నీరు అందించకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విజయరమణ. పెద్దపల్లిలో రైతులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేసి నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. పాదయాత్రలో పాల్గొనకుండా విజయరమణను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వమే స్పందించి పెద్దపల్లికి సాగు, తాగు నీరందించాలని డిమాండ్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయరమణతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:44 - April 20, 2018

ఢిల్లీ : కుట్రపూరితంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి. ఈ మేరకు ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ నేతలు కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ కోర్టు తీర్పును ఎన్నికల సంఘానికి వివరించినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీకి లేఖ రాయాలని కోరగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం చెప్పినట్లు కాంగ్రెన్ నేతలు తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - trs government