TRS leaders

13:46 - June 19, 2018

పెద్దపల్లి : రామగుండం సింగరేణిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టులో విషవాయులు, మంటలు వెలువడుతున్నాయి. గతంలో మూసివేసిన 8.8ఏ బొగ్గు గని నుంచి విషవాయులు వెలువడుతున్నాయి. సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు యాజమాన్యం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

 

12:02 - June 19, 2018

కరీంనగర్ : కలెక్టర్ ఎదుట దళితుల పేరిట వెలసిన ఓ ప్లెక్సి చర్చనీయంశంగా మారింది.  రామడుగు గ్రామ దళితుల పేరిట  ప్లెక్సీని సోమవారం రాత్రి  ఏర్పాటు చేశారు. 62 ఏళ్లుగా గ్రామసర్పంచ్ రిజర్వేషన్ దళితులకు కేటాయించకుండా బీసీలకు కేటాయిస్తుండడంతో తమకు అన్యాయం జరుగుతుందని ఇందులో పేర్కొన్నారు. దళితుల సంఖ్య అధికంగా ఉన్న గ్రామంలో దళితులకు రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదని  ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. అయితే ప్లెక్సి ని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీని వెనుక ఉన్న రాజకీయ కోణం పై పోలీస్ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

 

11:07 - June 19, 2018

హైదరాబాద్ : జలమండలి...  హైద‌రాబాద్ అంతటికీ  తాగునీటిని అందించే సంస్థ ఇది. అందులో పనిచేసే సిబ్బంది తాగేందుకు మాత్రం మినరల్‌ వాటర్‌ కొనాల్సిందే. తాము స‌ర‌ఫ‌రా చేసే తాగునీరు చాలా సురక్షితం అని చెప్పే జ‌ల‌మండ‌లి తమ సిబ్బందికోసం కోట్లాది రూపాయలతో మినరల్‌ వాటర్‌ ఎందుకు కొంటోంది.

నగరంలో కోటి మందికి తాగు నీరందిస్తున్న సంస్థ జలమండలి. తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం, ప్రతి ఇంటికీ ర‌క్షిత మంచినీరు అందించ‌డ‌మే త‌మ లక్ష్యం అంటూ గుప్పించే ప్రక‌టనలకూ కొదవేం ఉండదు. కానీ వారి ఆచరణ చూస్తేనే అనుమానాస్పదంగా ఉంటుంది. తామందించే స్వచ్ఛమైన నీటిని నిర్భయంగా తాగొచ్చని చెప్పే జలమండలి అధికారులు మాత్రం.. వాటిని ఎందుకు తాగరన్నది అంతు చిక్కని ప్రశ్న. 

ప్రతి రోజూ ల‌క్షలాది లీట‌ర్ల నీటిని ప్రజలకు స‌ర‌ఫ‌రా చేస్తున్న జ‌ల‌మండ‌లి... త‌మ కార్యాల‌యంలో మాత్రం  ఇలా మిన‌ర‌ల్ వాట‌ర్‌నే వాడుతుంది. ప్రతి రోజూ వంద‌ల‌ కొద్దీ టిన్నుల నీరు బోర్డు కార్యాల‌యాల్లోకి వ‌స్తుంటాయి. అన్ని విభాగాల్లోనూ అధికారులంతా ఈ వాట‌ర్ టిన్నులనే ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన కార్యాల‌యంలో ఎక్కడ చూసినా ఇవే ద‌ర్శన‌మిస్తాయి.

వాట‌ర్ బోర్డు కార్యాల‌యంలో నిర్వహించే అధికారిక, వీవీఐపీల సమావేశాలకు బ్రాండెడ్‌ ప్యాక్డ్ వాట‌ర్ బాటిల్సునే స‌మ‌కూర్చుతారు. అర‌లీట‌ర్‌ నీటికి 16 నుంచి 20 రూపాయ‌లు వరకూ చెల్లించిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి. ఒక్కో స‌మావేశానికి 50 నుంచి 100 బాటిళ్లు వాడుతుంటారు. ఇలా వాటర్‌ టిన్నులు, బాటిళ్ళకోసం నెల నెలా ల‌క్షలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది జ‌ల‌మండ‌లి. ఈ ఖర్చు ఏడాదికి ఆరు కోట్లు రూపాయలకు పైగానే ఉంటుంది. అంటే స‌రాస‌రి రోజుకు 2ల‌క్షల రూపాయ‌ల‌తో  తాగునీటిని కొంటోంది జ‌ల‌మండ‌లి. నగర ప్రజానీకానికి తాగు నీరందించే జలమండలి..  తమ  సిబ్బందికి మాత్రం మినరల్‌ వాటర్‌ కొనడం వెనుక మర్మం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. 

08:24 - June 19, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపించారు. రెండు మూడు రోజుల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వారి వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలోని ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, బాధితులతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి తనదైన శైలిలో పరిష్కారం చూపించారు. ఇకనైనా  సమస్యకు పరిష్కారం లభిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
నగరంలో భూ సమస్యలు
రోజురోజుకు విస్తరిస్తోన్న హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ జాగా ఉంటే... అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా  భూముల్లో అనేక సమస్యలు ఉండడంతో వాటి పరిష్కారం కోసం ఆయా కాలనీలు, బస్తీల ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.  అయితే భూముల వివాదాలతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పర్మిషన్లకు నోచుకోక.. మళ్లీ అమ్మాలంటే  రిజిస్ట్రేషన్లకు నోచుకోక ప్రజలు నానా యాతన పడ్డారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఎన్నోఏళ్లుగా సర్కార్‌కు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినా వారిమొర ఆలకించిన వారే లేరు.  ఇటీవల ఈ సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
మన నగరం కార్యక్రమం
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నియోజకవర్గాల వారీగా మంత్రి కేటీఆర్‌ మన నగరం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతవారం నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో దశాబ్దాలుగా ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలోని బీఎన్‌ రెడ్డి నగర్‌, సాహెబ్‌నగర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సంబంధ సమస్యలు మంత్రి కేటీఆర్‌ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్లురాక.. కట్టుకున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు అనధికార నిర్మాణం పేరుతో రెండు మూడు రెట్లు ట్యాక్స్‌ వసూళ్లు చేస్తున్నారని వివరించారు. తమ దీర్ఘకాలిక సమస్యను కొలిక్కి తేవాలని మంత్రిని కోరారు. దీంతో ఆయన ఎల్‌బీ నగర్‌ జోనల్‌ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.సమస్యల వారీగా ఆరా తీసి.. కొన్నింటికి క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపగా... మిగతా భూముల అంశాలకు కేబినెట్‌ స్థాయిలో పరిష్కరించనున్నారు. అయితే న్యాయ పరమైన ఇబ్బందులు ఉన్న భూములకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని కేటీఆర్‌ హామీఇచ్చినట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.
మేయర్‌ తీరుపట్ల ప్రజలు అసంతృప్తి 
తమ సమస్యలు చెప్పుకోవడానికి చాలా మంది ప్రజలు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయానికి వచ్చారు. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. కొద్దిమందిని మాత్రమే లోపలికి అనుమతించి... మిగిలినవారిని పంపలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు మేయర్ ప్రయత్నించారు. అయితే మేయర్‌ వ్యవహరించిన తీరుపట్ల అక్కడికి వచ్చిన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి మన నగరం పేరుతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సమావేశాలు కొంతమంది లబ్ది కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికితోడు ఆయా సమావేశాలకు సామాన్యులెవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

11:15 - June 18, 2018

నిర్మల్ : సోన్ మండలంలో జరిగిన బాలికపై హత్యాచారం ఘటనపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపి తలపై బండరాయితో మోది దారుణంగా చంపేశాడు. దీనిపై కుటుంబసభ్యులు...గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందతుడిని అప్పగించాలంటూ తామే శిక్షిస్తామని జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళన జరిపారు. పోలీసులు నచ్చచెప్పడంతో వారు శాంతించారు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘలు స్కూల్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో పలు స్కూల్స్ బంద్ అయ్యాయి. 

06:32 - June 18, 2018

హైదరాబాద్ : బయ్యారం ప్లాంటు ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ ఏర్పాటుకు సహకరించినా... లేకున్నా తమ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరోమంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన బయ్యారం ప్లాంటు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని... ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరం అయిన అధ్యయనాన్ని చేసేందుకు మైన్స్‌, టీఎస్‌యండీసీ, సింగరేణి ,ఇంధన , పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈ కమిటీ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతోపాటు అవసరమైన భూమి, నీరు, బొగ్గు, విద్యుత్తులాంటి కీలకమైన అంశాలపైన సవివరమైన నివేదికను ఇస్తుందన్నారు. కమిటీ నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేస్తుందని, కమిటీ నివేదికనుబట్టే బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై ముందుకు వెళ్తామన్నారు.

పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రపైన ఉన్నదన్నారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం తరపున అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతోపాటు నేరుగా పలుమార్లు కలిసి విన్నవించామని గుర్తు చేశారు. అయితే బయ్యారంలో అందుబాటులో ఉన్న ఇనుము నాణ్యత పేరుతో మెలిక పెడుతున్నారన్నారు. అయినా తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే ఈ ప్లాంటు ఏర్పాటుపై ప్రభుత్వం నిబద్దతతో ముందుకు పోతుందన్నారు. ఎలా చూసినా బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయని... కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయమేనని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా.. రాకున్నా తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుందని ఆయన స్పష్టంచేశారు. 

08:30 - June 13, 2018

నిర్మల్ : ఆ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనారిటీ ఓటర్లే అధికం. కానీ పాలకులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడు ఆ నాయకులు గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ముథోల్‌ నియోజకవర్గంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికం
నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికంగా ఉన్నారు. కానీ ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో దళిత, బహుజన, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో బహుజనులకు అధికారాన్ని కట్టబెట్టాలనే యోచనలో నియోజకవర్గ  ప్రజలు ఉన్నారు. 
ముథోల్‌.. 117 గ్రామాలు, 49 తాండాలు 
ముథోల్‌ నియోజకవర్గంలో ముథోల్‌తో పాటు కుంటాల, కుబీర్, లోకేశ్వరం, తానూర్, భైంసా మండలాలున్నాయి. ఈ మండలాల్లో 117 గ్రామాలు, 49 తాండాలు ఉన్నాయి. గత ఎన్నికల ప్రకారం మొత్తం 2,06,230 మంది ఓటర్లు ఉన్నారు. వీరీలో ఎస్సీ ఓటర్లు 20 శాతం, ఎస్టీ ఓట్లరు 9 శాతం, బీసీలు 31 శాతం, మైనారిటీలు  14 శాతం ఉండగా..  ఇతర ఓటర్లు 24 శాతం ఉన్నారు. 
రెడ్డి, రావు సామాజికవర్గం ఆధిపత్యం 
ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలు ఉన్నా ముథోల్‌ నియోజకవర్గంలో రెడ్డి, రావు సామాజిక వర్గాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయి. 1957 ఎన్నికల్లో గోపిడి గంగిరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1962లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1967లో గడ్డన్నరెడ్డి ముథోల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన వరుసగా 1972, 1978,1983 ఎన్నికల్లో గెలిచారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గడ్డన్నపై టీడీపీ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి విజయం సాధించారు. తిరిగి 1989 ఎన్నికల్లో గడ్డన్న తన పదవిని చేజిక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో గడ్డన్న మరోసారి ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్‌ ఆయనపై విజయం సాధించారు. మళ్లీ 1999లో గడ్డన్న గెలవగా.. 2004 ఎన్నికల్లో నారాయణరావు పటేల్‌ని ప్రజలు గెలిపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేణుగోపాలచారి అనూహ్య విజయం సాధించారు. ఇక 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి రమాదేవీపై 14,837 ఓట్లతో విజయం సాధించారు. 
బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తారా ? 
ఇప్పటి వరకు ఏ పార్టీ చూసినా రెడ్డి, రావు సామాజిక వర్గానికి తప్ప ఇతర సామాజిక వర్గానికి టికెట్‌ ఇచ్చిన దాఖలు లేవు. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవ్వటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత, బహుజనుల కేంద్రం అయినప్పటికీ....  రెడ్డి, రావు సామాజిక వర్గాలకు చెందినవారు ఎమ్మెల్యేలుగా ఉండటంతో అభివృద్ధిలో ముథోల్‌ నియోజకవర్గం వెనుకపడిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో ముథోల్‌ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. గోదావరి నది పక్కనే ప్రవహిస్తున్నా... వ్యవసాయానికి చుక్కనీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఉపాధి కరువై దుబాయ్‌, ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే.. వచ్చే ఎన్నికల్లో బహుజనులనే ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీలు ఈ సారి కూడా ఆ సామాజిక వర్గాలకే టికెట్‌ ఇస్తాయో... ప్రజలు కోరుతున్నట్టు బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.

19:45 - June 12, 2018

వరంగల్ : ప్రజల నమ్మకాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓ వ్యక్తి పథకం పన్నాడు. శివసత్తులకు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తుందని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని తొర్రూర్‌ బస్టాండ్‌ సెంటర్‌లో ఓ ఫొటో స్టూడియో ఓనర్‌ ప్రచారం చేశాడు. బోనం ఎత్తుకుని ఫొటో దిగి పంపిస్తే.. ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తుందని నమ్మబలికాడు. దీంతో అనేకమంది మహిళలు బోనం ఎత్తుకుని ఫొటో స్టూడియో ఎదుట క్యూ కట్టారు. ఒక్కొక్కరి వద్ద 150 రూపాయలు వసూలు చేశాడు. అయితే.. కొంతమందికి అనుమానం వచ్చి ఫొటో స్టూడియో ఓనర్‌ను నిలదీశారు. దీంతో భయాందోళనలకు గురైన ఫొటోషాపు ఓనర్‌ షాపు మూసేసి పరారయ్యేందుకు యత్నించడంతో.. ఆయనను నిర్బంధించారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగ ప్రవేశం చేసి... బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించాడు. పుకార్లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. 

19:39 - June 12, 2018

ఆదిలాబాద్ : ఇప్పటివరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కబ్జాదారులు మాత్రమే భూములను ఆక్రమించుకోవడం చూశాం. కాని ఓ పేదోడి స్థలాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి కబ్జా చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. బాధితుడికే భూమి చెందాలన్న కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దర్జాగా భూమిని కబ్జా చేసేశారు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితుడు కోరుతున్నాడు. దళితుడి భూమి కబ్జా విషయంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

21:04 - June 11, 2018

హైదరాబాద్ : వరల్డ్ ఎల్డర్స్‌ ఎబ్యూస్‌ అవెర్నస్‌ డే సందర్భంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో పెద్దల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఎలర్డ్ క్లబ్ ఇంటర్నెషనల్ పౌండేషన్ చైర్మన్ సి.ఎన్‌ గోపినాథ్‌ రెడ్డి తెలిపారు. 50 నుండి 100ఏళ్ల వయస్సు వారందరికీ ఎల్డర్స్‌ మేళా కార్యక్రమానికి ఆహ్వానించారు. 40 ఏళ్ల వయస్సు పైబడిన వారు వారి పిల్లల నుంచి సరైన ఆదరణలేక ఇబ్బందులు పడుతున్నారని.. వీరిని ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఎల్డర్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు తరలిరావాలని గోపినాధ్‌ కోరారు. ఈ నెల 15న నక్లెస్‌ రోడ్డులో వృద్ధుల మౌన ప్రదర్శన ఉంటుందని.. ప్రదర్శనలో పాల్గొనే వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - TRS leaders