TRS Party Plenary Meeting

17:42 - April 28, 2018

హైదరాబాద్ : వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ నేతలా చెప్పేది? అని మంత్రి తలసాని శ్రీనివాస యదవ్ ప్రశ్నించారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఉన్న కాంగ్రెస్ చరిత్రను ఒకసారి చూసుకోమని తలసాని సూచించారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయలేదని తలసాని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల విద్యుత్‌ సరఫరాను అన్ని రాష్ట్రాల నేతలు కొనియాడుతుంటే తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌ నేతలకు లేదని తలసాని అన్నారు. కాంగ్రెస్‌లోనే కుటుంబ పాలన కొనసాగుతుందని చెప్పారు. అటువంటి కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. 

21:18 - May 9, 2017

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గల్ఫ్‌లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. గల్ప్‌ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. టిపిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గల్ఫ్‌ భరోసా సదస్సులో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్‌ కార్మికుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గల్ఫ్‌ నుంచి నిత్యం ఐదు శవాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ్చని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్‌లో పని చేస్తున్న కార్మికుల పేరిట ఉన్న రేషన్‌ కార్డులను ప్రభుత్వం తొలగించడాన్ని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తప్పుపట్టారు.

21:13 - May 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ కోసం ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఆమోదం తుది ఘట్టానికి చేరుకుంది. చట్టం-2013 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ.. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రాష్ట్రపతి భవన్‌కు పంపింది. ఇవాళో, రేపో రాష్ట్రపతి సంతకంతో ఆమోదం తరువాత ఈ బిల్లు చట్టంగా మారనుంది. సత్వర భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2013 కేంద్ర భూసేకరణ చట్టాన్ని అనుసరించి నూతన చట్టాన్ని 2016 డిసెంబర్‌లో తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ ఆరు సవరణలు చేస్తే సరిపోతుందని చెప్పింది. ఈ క్రమంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు రాష్ర్ట శాసనసభ, మండలి ప్రత్యేకంగా సమావేశమై... ఏప్రిల్ 30న భూసేకరణ చట్టం -2013 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
కొత్త చ‌ట్టం ద్వారా... రెండు నెల‌ల పాటు చేయాల్సిన సామాజిక ఆర్థిక మ‌దింపు స‌ర్వే నామ‌మాత్రం కానుంది. అయితే ప‌రిహారం విష‌యంలో కేంద్ర చ‌ట్టానికి లోబ‌డే మెరుగైన ప‌రిహారం ఇవ్వాల‌న్న నిబంద‌న‌కు లోబ‌డే ప‌రిహారం చెల్లించ‌టంతో పాటు, వీలైనంత త్వరగా ప్రాజెక్టుల నిర్మాణానికి స‌హ‌క‌రిస్తుంద‌ని పేర్కొంది. ఇక పున‌రావాసం విష‌యంలోనూ... 123జీవోకు అనుబందంగా తెచ్చిన 37,38జీవోల ఆధారంగానే ఈ చ‌ట్టం ద్వారా ప‌రిహారం, పున‌రావాసం కేటాయించ‌నున్నారు. మొత్తం ఐదు సవరణలు చేసి పంపిన బిల్లును ఆమోదించిన కేంద్ర హోం శాఖ.. రాష్ట్రపతి భవన్ కు పంపింది. బిల్లు ఢిల్లీ వెళ్లిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వ ముఖ్య సలహాదారు మీజీ సీఎస్ రాజీవ్ శర్మ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ వచ్చారు. ఇప్పటికే కేసీఆర్, రాజీవ్ శర్మలు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదంతో ఏ క్షణంలో అయినా బిల్లు చట్టంగా మారే ప్రకటన వెలువడవచ్చు.

09:33 - May 9, 2017

హైదరాబాద్: టీఆర్ ఎస్ లో నేతలకు పార్టీ పదవులు.. అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. మూడుళ్లుగా పదవులు నేతలను ఊరిస్తున్నా.. నేడు, రేపు అంటూ వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ప్లీనరీలో కూడా మార్పులకు ఆమోదం తెలిపినా.. పదవులు ఎప్పుడు దక్కుతాయో గులాబీ నేతలకు అంతు చిక్కడం లేదు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం దృష్టి

గులాబి పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. సంస్థాగత పదవుల భర్తీ.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నియోజకవర్గాలు, జిల్లా కమిటీలకు మోక్షం కలుగుతుందని భావించినా.. ఇప్పటివరకూ పార్టీ పదవులకు సంబంధించిన ఊసే వినిపించడం లేదు. గత నెల 21న పార్టీ ప్రతి నిధుల సభలో.. కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. అయినా పార్టీ పదవుల భర్తీపై ఇంకా నిర్ణయాలు తీసుకోవడం లేదన్న ఆవేదన నేతల్లో కనిపిస్తోంది.

20 నుంచి 30 మందికి స్థానం

పార్టీని సంస్థాగతంగా మార్పులు చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడంతో.. ప్లీనరీలో ఇందుకు సంబంధించిన తీర్మానానికి పార్టీ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేల నాయకత్వంలోనే నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారు. ఒక్కో నియోజక వర్గ కమిటీలో 20 నుంచి 30 మందికి స్థానం దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా స్థాయిలో గతంలో 12 కమిటీలు ఉన్నా.. ఇప్పుడు జిల్లా కమిటీల స్థానంలో జిల్లా కో ఆర్డినేటర్లు గానీ.. జిల్లా కన్వినర్లను గానీ పార్టీని నియమించే అవకాశం ఉంది. మొత్తం 31 జిల్లాలు రావడంతో జిల్లా కమిటీ స్థానం ఒక్కరిద్దరికి మాత్రమే అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

10 మంది లోపే పొలిట్ బ్యూరోలో నేతలకు అవకాశం...

రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌ బ్యూరోలపై సీఎం కేసీఆర్‌ స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పొలిట్ బ్యూరో సభ్యుల సంఖ్యను బాగా తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 10 మంది లోపే పొలిట్ బ్యూరోలో నేతలకు అవకాశం దక్కుతుందనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. పార్టీ ప్రతినిధుల సభ తరువాత పదవులు భర్తీ ఉంటుందని అంచనా వేసుకున్నా.. సీఎం కేసీఆర్‌ కంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లడం.. ఇంకా ఆపరేషన్‌పై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పార్టీ పదవులు ఇప్పట్లో దక్కుతాయన్న ధీమా నేతల్లో కనిపించడం లేదు. గులాబి పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. పార్టీ పదవులు ఇప్పటికీ దక్కకపోవడంతో రాబోయే రోజుల్లో పదవులు దక్కుతాయో లేవోనన్న అనుమానాలు నేతలను వెంటాడుతున్నాయి.

14:16 - April 23, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త బలవన్మరణానికి పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది. టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని..ఈ విషయంపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించాలని కోరుతున్నట్లు..తన మరణం తరువాతైనా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆ కార్యకర్త సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ ఘటన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఆదివారం మార్నింగ్ వాక్ కు వచ్చిన కొంతమంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందడం ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి మహిపాల్ రెడ్డి అని గుర్తించారు. మృతదేహం వద్ద మూడు పేజీల సూసైడ్ లేఖ..ఓ వాహనం ఉంది. టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని, పార్టీ నియాకాల్లో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. టిడిపి నుండి వచ్చిన వారికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తన ఆత్మహత్య అనంతరం కార్యకర్తలకు న్యాయం కలుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇతను ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకరావాలని పేర్కొనడంతో ఆయన స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

20:08 - April 21, 2017

హైదరాబాద్: యమునోళ్లనే ఉరికొచ్చి చంపిన లారీ...చిత్తూరు జిల్లాలో 20 ప్రాణాల హరి, పడమర దిక్కు పసందైన పార్టీ ప్లీనరీ...మళ్లా అధ్యక్షుడైన కల్వకుంట్ల పెద్దసారూ, సోషల్ మీడియా పీక కోసే పనిలో చంద్రం...యజ్ఞాలజీ నేతకే టెక్నాలజీ తిప్పలు,కూరగాయలు అమ్మిన కొండా సురేఖ...హోటళ్ల కూలీలైన పాలమూరు నేతలు, ఉద్యమ తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తాం... కొత్తపార్టీ వస్తుందన్న గద్దరన్న, భూమి తీసుకునేదాకా భూలక్ష్మి...భూమి లాక్కున్నక బోడలచ్చిమి. ఇలాంటి అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:36 - April 21, 2017

హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయం మూడు పువ్వులు ఆరుకాయల్లా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు... కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నకిలీ విత్తనాల నిరోధానికి, ఈనెల 27 తర్వాత మరోసారి అసెంబ్లీని సమావేశపరిచి, కఠినమైన చట్టాన్ని తీసుకు వస్తామన్నారు. కొంపల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.... ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ఘనంగా టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశం....

హైదరాబాద్‌ శివారులోని కొంపల్లిలో టీఆర్ఎస్‌ ప్లీనరీ ఘనంగా జరిగింది. ప్లీనరీ ప్రారంభసూచికగా గులాబీ దళపతి కేసీఆర్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం, ప్రారంభోపన్యాసం చేసిన కేసీఆర్‌.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలకు 40వేల కోట్లు కేటాయించామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. రైతే రాజన్న దాన్ని నిజం చేస్తామని, ఆదిశగా రైతులకు రెండు పంటలకూ ఎకరాకు 4వేల చొప్పున పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వచ్చే ఏడాది మేలో 4వేలు, అక్టోబర్‌లో మరో 4వేలు అందించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్ధికసాయంలో ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండబోదని, రైతులు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

ప్రతిపల్లెకూ కృష్ణా, గోదావరి నీటిని సరఫరా...

ఆరునూరైనా ఈ ఏడాది చివరినాటికి తెలంగాణలోని ప్రతిపల్లెకూ కృష్ణా, గోదావరి నీటిని సరఫరాచేసి ప్రజల దాహార్తిని తీర్చుతామని కేసీఆర్‌ హమీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విద్యుత్‌ కష్టాలను అధిగమించామన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారు.

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం ...

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్‌ హెచ్చరించారు. నకిలీ విత్తనతయారీ దారులపై ఇకనుంచి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయిన మొత్తాన్ని ఆయా కంపెనీల నుంచే వసూలు చేస్తామన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలు...

టీఆర్ఎస్‌ ప్లీనరీ నిర్వహించిన హైదరాబాద్‌ శివారులోని కొంపల్లి.. గులాబీ వర్ణశోభితమైంది. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా ఎక్కడ చూసినా గులాబీ బ్యానర్లు, ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. నేతల ఉపన్యాసాలు, కళాకారుల ఆటపాటలతో ప్లీనరీ సమావేశాలు ఉత్సాహంగా సాగాయి. .... స్పాట్‌...

కార్యక్రమానికి ముందు.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ 8వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు.. మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. తనను మళ్లీ ఎన్నుకున్న పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్లీనరీలో వివిధ అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించారు. మరోవైపు, ప్లీనరీకి వచ్చిన నేతలు, కార్యకర్తలకు నిర్వాహకులు పసందైన వంటకాలను వడ్డించారు. దాదాపు 29 రకాల వంటలను రుచి చూపించారు. మటన్‌ బిర్యానీ, హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, చేపల పులుసు, కోడిగుడ్డు పులుసుతోపాటు వెజ్‌ వంటకాలను అతిథులు ఆరగించారు. ప్లీనరీ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

17:48 - April 21, 2017

హైదరాబాద్: ఆరునూరైనా ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతిపల్లెకు కృష్ణా, గోదావరి నీటిని సరఫరా చేసి తెలంగాణ దాహర్తిని తీరుస్తామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకట్లోకి మగ్గిపోతుందని ఆనాడు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అసత్య ప్రచారం చేశారని..కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్‌ కష్టాలను తీర్చి కరెంటు కోతల్లేకుండా చేశామన్నారు. మిషన్‌భగీరత, మిషన్‌కాకతీయ పథకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతామన్నారు కేసీఆర్. ప్లీనరీ ముగింపు ప్రసంగంలో కీలక ఉపన్యాసం చేసిన కేసీఆర్... నకిలీ విత్తనాలు విక్రయించే ఊరుకునేది లేదన్నారు. వరంగల్ సభ తరువాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.

 

 

13:04 - April 21, 2017

మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతు రాజు కావాలని టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ పేర్కొన్నారు. 16వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కొంపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రారంభోపన్యాసం చేశారు. 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ కేవలం కొంత మందితో ప్రారంభమై నేడు 75 లక్షల సభ్యత్వాలకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు.

హేళన..అవమానాలు..
టీఆర్ఎస్ పార్టీని ఎంతో మంది అవమానించారని, అవహేళన చేశారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ముందుకెళ్లి స్వరాష్ట్రం సాధించుకున్నట్లు తెలిపారు. జూన్ 2, 2014 తెలంగాణ అవిర్భావం అప్పుడు వ్యవసాయం బాగాలేదని, కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు, ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ పథకం ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారని, కానీ నేడు విద్యుత్ లో దూసుకుపోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే విధంగా మిషన్ భగీరథ పథకం చేపడుతున్నట్లు, సమైక్య రాష్ట్రంలో నిరాధారణకు గురైన చెరువుల పునరుద్దరణ కోసం మిషన్ కాకాతీయ పథకం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.

పలు పథకాలు..
గడిచిన 60 ఏళ్ల కాలంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనలో కులవృత్తులు దెబ్బతిన్నాయని అన్నారు. నాయి బ్రాహ్మణులకు లక్ష సబ్సీడీతో సెలున్ లను నిర్మిస్తామని, ముదిరాజుల కోసం చేప పిల్లలను ఉచితంగా అందించామని..గీత కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కల్లు దుకాణాలను తెరిపించామన్నారు. గీత కార్మికులు ప్రమాదంలో చనిపోతే నష్టపరిహారం రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. దేశంలో ధనవంతులు అయ్యే విధంగా గొళ్ల కుర్మలకు ఉచితంగా గొర్రె పిల్లలు అదిస్తామని అన్నారు. త్వరలో టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేస్తానని తెలిపారు.

రెండు పంటలకు రూ. 4వేలు..
టీఆర్ఎస్ రైతుల కోసం ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టిందని, రైతులకు ప్రతి ఏడాది రెండు పంటలకు రూ.4వేలు బ్యాంకులో వేస్తామన్నారు. మొదటి విడత మేలో...రెండో విడత సెప్టెంబర్ జమ చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు చేస్తామని, అలాగే మండల, రాష్ట్ర స్థాయిలో రైతు సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర రైతు సంఘానికి రూ.500కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే 2112మంది వ్యవసాయ అధికారులను నియామించామని, త్వరలో 500 పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు.

నరేగాకు వ్యవసాయం అనుసంధానం చేయాలి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతామని వెల్లడించారు. వ్యవసాయం చేసే సీజన్‌లో రైతులకు కూలీలు దొరకడం కష్టంగా ఉందని ఈ క్రమంలోనే నరేగా (ఉపాధి హామీ పథకం)ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీర్మానం చేస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రతిపాదనకు ప్లీనరీ ఆమోదించింది. ఈనెల 23వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో తీర్మానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందచేయడం జరుగుతుందన్నారు.

10:33 - April 21, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - TRS Party Plenary Meeting