TRT Notification

22:08 - December 12, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్‌కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ చేసింది. పాత 10 జిల్లాలకు అనుగుణంగా మార్పులు చేసింది. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన వారు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. గతంలో 8,792 పోస్టుల భర్తీ కోసం.. 31 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్‌ ఇవ్వడంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం జీవోను సవరించి విడుదల చేసింది. ఈనెల 15తో ముగియనున్న గడువును... 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. అయితే.. జిల్లాలను అభ్యర్థులు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. 

19:56 - December 4, 2017

హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలకు లోబడి 10 జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కొంత మంది కావాలని ప్రతీ దానికి కోర్టుకు వెళ్తున్నారని విద్య శాఖ మంత్రి కడియం అన్నారు. కొలువులకై కొట్లాట ఎవరు చేస్తున్నారో, ఆ నాయకులు ఎవరో మాకు తెలుసు అని ఆయన అన్నారు. సిద్దాంత విభేదలున్నా వాళ్లంతా కలిసి పని చేస్తున్నారని అన్నారు. 

11:41 - November 25, 2017

హైదరాబాద్ : టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు) నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేయలేదని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కడియం మీడియాతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు న్యాయం చేసేందుకు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పరిగణలోకి తీసుకుంటామని, కోర్టు ఆదేశాలపై 2, 3 రోజుల్లో చర్చించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే టీఆర్టీ నిర్వహించి.. టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, దీనిపై సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 

17:30 - November 24, 2017

హైదరాబాద్ : టీచర్ల నియామక నోటిఫికేషన్‌పై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్‌టీకి సంబంధించి జీవో నంబర్ 25 ను సవరించి తీరాల్సిందేనని న్యాయస్ధానం స్పష్టం చేసింది. 10 జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ నోటిఫికేషన్ ఉండాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 10న జీవో నంబర్ 25, అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్ , మరో ముగ్గురు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారించిన హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్న పిటిషనర్ వాదనను ఏకీభవిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవరించాలని స్పష్టం చేసింది. 

13:35 - November 24, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల హైకోర్టు మొట్టికాయలు వేసింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ హైకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై దశల వారీగా విచారణ జరిగింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్పీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రక్రియ గడువు డిసెంబర్ 15 వరకు పొడిగించాలని సూచించింది.

  • టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
  • స్కూల్‌ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416 పోస్టులు,
  • స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011,
  • ఎస్‌జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు.
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
  • స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్‌ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు.
  • తాజా తీర్పుతో టీఎస్పీఎస్సీ, ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 
17:05 - November 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనితో హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల మాదిరిగా కాకుండా పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను వారం రోజులకు వాయిదా వేసింది. 

20:41 - October 26, 2017

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల వారిగా కాకుండా పాత జిల్లాల వారిగా నోటిఫికేషన్ వేయాలని పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని అభిప్రాయం చేస్తామన్న తెలిపింది. మరో 4 రోజుల్లో టీఆర్ టీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:59 - October 22, 2017

ఆసిఫాబాద్ : జిల్లాలో సందీప్ అనే నిరుద్యోగి ఉద్యోగం రాదనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ ఎంఎస్సీ, బీఈడీ చేశాడు. డీఎస్సీ నోటిఫికేషన్ లో తన సబ్జెక్టులో తక్కువ పోస్టులు ఉన్నాయని ఆవేదన చేందిన సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

21:13 - October 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 8వేల 792 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి రెండవవారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్‌ ప్రకటించింది.

మొత్తం పోస్టులలో స్కూల్ అసిస్టెంట్లు 1,941 ఉండగా.. SGTలు 5వేల 415 పోస్టులున్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 416 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. లాంగ్వేజ్‌ పండిట్స్‌ 1,011 పోస్టులండగా.. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 9 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీల వారీగా ఐదు నోటిపికేషన్లు జారీచేశారు. పాత డీఎస్సీ తరహాలో పరీక్ష నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి.

ఇక అభ్యర్థి స్ధానికతను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిర్ణయించారు. అంటే అభ్యర్ధి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువును పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లా స్ధానికత వర్తిస్తుంది. జిల్లాల పునర్విభజన మేరకు ఆ ప్రాంతం ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో.. ఆ జిల్లాను అభ్యర్ధి స్ధానిక జిల్లాగా పరిగణిస్తారు. 8,9,10 తరగతులు ఎక్కడ చదివితే ఆ జిల్లాన్ని స్ధానిక జిల్లాగా తీసుకుంటామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

కొత్త జిల్లాల ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుండి నవంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు నిర్ణయించారు. 2018 , ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు TSPSC వెల్లడించింది. 

17:15 - October 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేండ్ల దాటిన అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. తొలిసారి టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష జరుగనుంది. 31 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. 8792 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 30వ తేదీ నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 30వ తేదీ నిర్ణయించారు. గతంలో అనేక సార్లు వాయిదా వేయడంతో టి.సర్కార్ కు సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే.

గురుకులాల్లో టీచర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల మాదిరిగానే ఈ టీచర్ల భర్తీ పరీక్షలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు : 1,950

సెకండరీ గ్రేడ్ టీచర్లు : 5,415

భాషా పండితులు : 416

పీఈటీలు : 416

మొత్తం పోస్టులు : 8,792.

Don't Miss

Subscribe to RSS - TRT Notification