ts assembly

17:43 - May 24, 2018

హైదరాబాద్ : హైకోర్టు తీర్పు ప్రకారం తమ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించడంతోపాటు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న సంపత్ కుమార్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేకపోతే డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. రాహుల్‌ అనుమతిలో టీఆర్‌ఎస్‌ అరాచకాలపై ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు.

 

08:54 - May 3, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో వాదనలు ముగిశాయి.ఈ కేసులో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌కి అప్పీల్‌ చేశారు. పిటిషనర్ల తరుపున వైద్యనాథన్‌  వాదనలు వినిపించారు.  కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ తరుపున అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. పిటిషన్‌ వేసిన 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పార్టీ ఫిరాయించిన వారేనని, ఇలాంటి వారు కేసు వేసే అర్హతలేదని సింఘ్వి వాదించారు. అయితే  సభలో సభ్యులకు కేసు వేసే అర్హత ఉందని వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వు చేసింది. 
 

 

17:28 - April 26, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వ రద్దు కేసులో కోర్టు తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దు కేసులో వారి సభ్వత్వం కొనసాగుతుందని కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేస్తు పిటీషన్ వేశారు. 12మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున వేసిన పిటీషన్ ను కోర్టు విచారించింది. టీఆర్ఎస్ తరపున న్యాయవాది వైద్యనాథన్ తన వాదనలకు వినిపించారు.కోమటిరెడ్డి, సంపత్ ల తరపున న్యాయవాది రవిశంకర్ తన వాదనలు వినిపించగా కేసు విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కారణం లేకుండా సభ్యుడి అసెంబ్లీ సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం కేసును రేపటికి వాయిదా వేసింది. కాగా అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై ఇయర్ ఫోన్ విసిరిన నేపథ్యంలో వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలకు అనుగుణంగా తీర్పుకూడా వెలువడింది. ఈ తీర్పును ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేస్తు పిటీషన్ దాఖలు చేసారు. 

06:35 - April 2, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ది మాటల ప్రభుత్వమే కానీ.. చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు సీఎల్పీనేత జానారెడ్డి. రాష్ట్ర బడ్జెట్‌లో లోటును కూడా మిగులుగా చూపిస్తూ.. కేసీఆర్‌ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రాష్ర్టం అప్పుల బాటలో నడుస్తోందని కాగ్ నివేదిక తేట తెల్లం చేసిందన్నారు. విపక్షాలు, ప్రజాసంఘాలపై ప్రభుత్వం అణచి వేత ధోరణిని అవలంబించడం మానుకోవాలని జానా సూచించారు. 

08:14 - March 31, 2018

రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ కాగ్‌ ఇచ్చిన నివేదికపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో చోటు చేసుకుంటున్న లోపాలను కాగ్‌ నివేదిక ఎత్తి చూపింది. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలో రాజ్యమేలుతున్న అవినీతిని కాగ్‌ బట్టబయలు చేసింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శివకుమార్ (టీఆర్ఎస్), వీరయ్య (విశ్లేషకులు), శ్రీకాంత్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

21:56 - March 30, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ కాగ్‌ ఇచ్చిన నివేధిక విపక్షాలకు ఆయుధంగా మారింది. కాగ్‌ రిపోర్టును పట్టుకుని ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలు పెట్టాయి. కాగ్‌ ప్రస్తావించిన పాలకపక్షం తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అప్పులను కూడా ఆస్తులుగా బడ్జెట్‌లోచూపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ముందుకు సాగుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో చోటు చేసుకుంటున్న లోపాలను కాగ్‌ నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు ఈ నివేదకను ఆయుధంగా చేసుకుని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన విషయాన్ని కాగ్‌ ప్రస్తావించింది. నత్తనడకన సాగుతున్న పథకాలు, కాంట్రాక్టర్లకు అధిక చెల్లింపులు, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలో రాజ్యమేలుతున్న అవినీతిని కాగ్‌ బట్టబయలు చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గుర్తు చేస్తున్నారు.  

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కాగ్‌ వేలెత్తి చూపిన విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో తెస్తున్న అప్పుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. కాగ్‌ రిపోర్టుపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ, మండలిని సమావేశపరచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులను కూడా ఆదాయంగా చూపిన టీఆర్‌ఎస్‌ సర్కారు వైఖరిని బీజేపీ తప్పు పట్టింది. ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని కాగ్‌  ప్రస్తావించిన విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ గుర్తు చేశారు. 


మిషన్‌ భగీరథ పనుల్లో నాణ్యత లోపించిందని కాగ్‌ ప్రస్తావించిన విషయాన్ని తెలంగాణ టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. కాగ్‌ నివేదిక రాష్ట్రానికి చెంపపెట్టని  ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తాము చేస్తున్న అవినీతి ఆరోపణలు వాస్తవమని నివేదిక ద్వారా రుజువైందని విపక్ష నేతలు చెబుతున్నారు. కాగ్‌ రిపోర్టుపై రేగుతున్న రాజకీయ దుమారాన్ని టీఆర్‌ఎస్‌ పాలకులు, నాయకులు ఎలా చల్లపరుస్తారో చూడాలి. 

21:50 - March 30, 2018

హైదరాబాద్ : గిరిజన తండాల్లో ఇక నుంచి మీరే నాయకులని లంబాడా ప్రతినిధులనుద్దేశించి అన్నారు సీఎం కేసీఆర్‌. తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించినందుకు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం రాష్ట్రంలో 3 వేల మంది గిరిజనులు సర్పంచులుగా ఉండే అవకాశం ఉందని... అందరూ కలిసి నూతన గిరిజన గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకుంటే... పేదరికం తొలగిపోతుందన్నారు సీఎం. తెలంగాణలో గిరిజనులు గొప్పగా ఉన్నారనే పేరు తెచ్చుకోవాలన్నారు.

17:47 - March 30, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాగ్‌ ఇదే విషయాన్ని బట్టబయలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న ఆర్థిక మోసాలను కాగ్‌ బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. వివిధ ఏజెన్సీల నుంచి తెచ్చిన అప్పులను కూడా ఆదాయంగా చూపడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే చెల్లిందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. 

 

17:44 - March 30, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని టీపీసీసీ విమర్శించింది. ప్రాజెక్టుల పేరుతో తెస్తున్న అప్పుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రాజెక్టుల్లోని డొల్లతనాన్ని కాగ్‌ వేలెత్తి చూపిందని, దీనిపై ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. కాగ్‌ రిపోర్టుపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ, మండలిని సమావేశపరచాలని డిమాండ్‌ చేశారు.

 

17:42 - March 30, 2018

హైదరాబాద్ : బడ్జెట్‌ సమావేశాలు రాజ్యాంగబద్దంగా కాకుండా.. తూతూమంత్రంగా నిర్వహించారన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య. 40 పద్దులపై 30 రోజులపాటు చర్చ జరగాల్సి ఉండగా.. కేవలం ఒక్కరోజులోనే అనేక పద్దులపై చర్చ పెట్టారన్నారు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రతిపక్షాలు ఏ సమస్యపై మాట్లాడినా.. ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు ఆర్‌.కృష్ణయ్య. 

Pages

Don't Miss

Subscribe to RSS - ts assembly