ts government

17:26 - May 14, 2018

సిద్ధిపేట : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వివాదాస్పందంగా మారింది. తమ పొలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించవద్దు అంటు ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని చిన్నకోడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ స్థలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపడతోందనే ఆరోపణలో కొంతమంది రైతులు అడ్డుకున్నారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి చిన్నకోడూరు పీఎస్ కు తరలించారు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళా రైతు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో చిన్నకోడూరు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

07:15 - April 10, 2018

హైదరాబాద్ : వచ్చే నెల నుంచి రైతులకు పెట్టుబడి రుణం ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు రైతులకు చెక్కులు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చెక్కుల పంపిణీని పండుగలా నిర్వహించాలని మంత్రి పోచారం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా 3,300 గ్రామాల్లో చెక్కులు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రైతుబంధు పథకంపై మంత్రి పోచారం సమీక్ష..
తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధు పథకంపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్రస్థాయి బ్యాంక్‌ల కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు.

వచ్చే నెల నుంచి రైతులకు పెట్టుబడి రుణం అందజేత
రైతు బంధు పథకం అమలుకు రెవెన్యూ శాఖ ఇచ్చే డేటాను అధికారులు సమీక్షించి... చెక్కుల ముద్రణకు బ్యాంకులకు పంపుతారని పోచారం తెలిపారు. మొదటి విడతలో 3300 గ్రామాల వివరాలను చెక్కుల ముద్రణకు బ్యాంకులకు పంపామన్నారు. చెక్కుల పంపిణీని గ్రామంలో పండుగలా జరపాలన్నారు. చెక్కుల పంపిణీ కోసం రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్థానిక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధులు, అధికారులతో గ్రామసభ నిర్వహించి ప్రతి రైతుకు స్వయం చెక్కులు అందించాలన్నారు. గ్రామంలోని రైతులకు చెక్కులను అదేరోజు పంపిణీ చేయాలని సూచించారు.

గ్రామసభలో టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలి : పోచారం
ఎండాకాలం కావడంతో.. గ్రామసభలో టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడిపై రైతులందరూ సంతృప్తి వ్యక్తం చేయాలని.. ప్రతిపక్షాలు కూడా అభినందించాలన్నారు. రైతు బంధు పథకం అమలు పర్యవేక్షకుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తన జిల్లాలో ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామం, ఏడీఏలు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పర్యవేక్షించి తనిఖీ చేయాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలన్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం అమలుకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. 

18:18 - March 31, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని మోటకొండూరులోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జాయింట్‌ కలెక్టర్‌ రవినాయక్‌ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. 

 

13:25 - March 30, 2018

పెద్దపల్లి : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనలో హరీశ్ రావు బిజీ బిజీగా గడిపారు. ఈ పర్యటనలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పనులను కూడా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌కు వివరించారు.

13:01 - March 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుల శాసనసభ సభ్యత్వం రద్దుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో కాంగ్రెస్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే సోమవారం అనూహ్యంగా తెలంగాణ ఏజీ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వంతో విబేధాలే కారణమని వార్తలు వెలువడ్డాయి. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదనలు వినిపించారు. మధ్యాహ్నం 2.30కి కోర్టు వాయిదా వేసింది. తీర్పు ఎలా వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

13:14 - March 14, 2018

హైదరాబాద్ : తమ శాసనసభ సభ్యత్వం రద్దుపై కాసేపట్లో ఇద్దరు టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని... ప్రోసీడింగ్ ప్రాపర్‌గా జరగలేదని వాదనలు వినిపించనున్నారు. తమ వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రద్దు రూల్స్‌కు విరుద్ధమని ఇద్దరు సభ్యులు వాదించనున్నారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరనున్నారు. మధ్యాహ్నం తరువాత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

16:23 - March 11, 2018

హైదరాబాద్ : రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని అఖిల భారత రైతుల కూలీ సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వ్యవసాయానికి 10శాతం నిధులు కేటాయించాలని సారంపల్లి డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ రుణమాఫీ చేయని సర్కార్‌.. భవిష్యత్‌లో రైతులకు ఏమీ చేయదన్నారు. స్వామినాథన్‌ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని.. నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకోకపోతే.. మహారాష్ట్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడిన విధంగానే.. తెలంగాణలోనూ పరిస్థితి ఉంటుందని సారంపల్లి హెచ్చరించారు. 

 

17:43 - February 14, 2018

నిర్మల్ : జిల్లా కడం మండలంలో విషాదం జరిగింది. రేషన్‌ బియ్యం కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు అక్కడే మృతి చెందిన ఘటన గంగాపూర్‌లో చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీ అయిన లస్మవ్వ బియ్యం కోసం రేషన్‌ డీలర్‌ ఇంటికి వెళ్లగా ఈ పాస్‌ బయోమెట్రిక్‌ సిగ్నల్‌ లేకపోవడంతో నెట్‌ వర్క్‌ కోసం బిల్డింగ్‌ పైకి ఎక్కారు. వేలిముద్రల కోసం బిల్డింగ్‌ పైకి ఎక్కి దిగుతుండగా జారి పడి లస్మవ్వ అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే గిరిజన గ్రామాల్లో ఈ పాస్‌ విధానాన్ని తొలగించి పాత పద్దతినే కొనసాగించాలని గిరిజనులు కోరుతున్నారు. 

16:16 - January 30, 2018

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి ఆస్తుల పంపకాల వ్యవహారం ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది. విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలపై ఇరు రాష్ర్టాల కమిటీలు ముచ్చటగా మూడు సార్లు భేటీ అయినా ఒక్క సమస్యకూ పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదు. ఇరువైపులా అంతా సుముఖమే అంటున్నా అడుగు ముందుకు పడకపోవడానికి కారణం ఏంటి? దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా?
నేటికీ పరిష్కారం కాని సమస్యలు
రెండు తెలుగు రాష్ర్టాలు విడిపోయి దాదాపు నాలుగేళ్ళు కావొస్తోంది. మరోసారి ఎన్నికలకు కూడా సిద్ధ పడుతున్నారు. 
విభజన సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయం,  వివిధ కార్పొరేషన్‌ భవనాలు, ప్రభుత్వ ఆఫీస్‌ బిల్డింగ్స్‌తోపాటు...  న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజన నేటికీ తెగలేదు. ఇక జలవివాదాలు, విద్యుత్‌ వివాదాలు, ఆర్టీసి ఆస్తులు సరేసరి. 9, 10వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజన అలాగే ఉంది.   హై కోర్టు, విద్యుత్‌ ఉద్యోగులు, ఎస్పీఎఫ్, నాలుగోతరగతి ఉద్యోగుల సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. 
కాలం గడిచే కొద్దీ  చల్లబడ్డ రాష్ర్టాలు
నీటి పంపకాల విషయంలోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ సమస్యలపై  రెండు రాష్ర్టాలు కోర్టు మెట్లెక్కడంతో కాలయాపన జరిగింది. దీంతో  కాలం గడిచే కొద్దీ రెండు రాష్ర్టాలు చల్లబడ్డాయి.  సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమన్న  నిర్ణయానికి వచ్చాయి. ఉమ్మడి గవర్నర్‌ మధ్యవర్తిగా.. ఇరు రాష్ట్రాలకు చెందిన కేబినెట్‌  మంత్రులతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో చర్చలకు ముందడుగు పడింది.
9వ షెడ్యూల్‌లోని 12 ఉమ్మడి సంస్థలపై ఏకాభిప్రాయం 
రాజ్‌భవన్‌ వేదికగా రెండు రాష్ర్టాల మంత్రులు గవర్నర్‌ సమక్షంలో మూడు సార్లు భేటీ అయ్యారు.  కీలకమైన 9వ షెడ్యూల్‌లోని 12 ఉమ్మడి సంస్థలపై ఏకాభిప్రాయం కుదిరిందని కూడా అప్పట్లో ప్రకటించారు. సమావేశం ఎప్పుడూ  హైదరాబాద్‌లోనే కాకుండా.. విజయవాడలోనో.. అమరావతిలోనో జరపాలని కూడా అనుకున్నారు. ఈ నిర్ణయం మాటలకే పరిమితమైంది. 
శిథిలమవుతోన్న ఏపీ ఆధీనంలోని భవనాలు
ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలన్నీ నిర్వహణలేక పాడైపోతున్నాయి.   హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన సచివాలయంలో మాత్రం 15మంది విధులకు హాజరవుతున్నారు. వీటికి విద్యుత్‌, నీటి బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. నిర్వహణలేక ఈ భవనాలు  దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యవహారంలో ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ముందు సెంటిమెంట్‌  పాలిటిక్స్‌ చేసేందుకు ఇరు రాష్ర్టాల సీఎంలు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారన్న  విమర్శలు వినిపిస్తున్నాయి.

07:39 - January 30, 2018

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడానికి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు విద్యాశాఖ, తెలుగుభాష అమలు సబ్‌కమిటీతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఫస్ట్‌క్లాస్‌ నుంచి ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలన్నారు. తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాలలో మాతృభాషను తప్పనిసరిగా అమలు చేస్తున్న విధానాన్ని ఈ సందర్భంగా చర్చించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సబ్‌ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి తమ ప్రతిపాదనలను కడియం శ్రీహరికి అందజేసింది.

ఐదో తరగతి వరకు తెలుగు భాష
ఐదో తరగతి వరకు తెలుగు భాషను చదువుకోని విద్యార్థులకు ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్దతిలో తెలుగు నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నట్టు సమావేశంలో చర్చించారు. ఏడో తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి ఎనిమిదో తరగతిలో... పది వరకు తెలుగురాని వారికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సులభంగా నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందించడంపై సమావేశంలో చర్చ జరిగింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని సబ్‌కమిటీ కడియంకు వివరించింది. తెలుగు భాష అమలులో వారికెలాంటి అభ్యంతరం తేదని చెప్పినట్టు కడియం దృష్టికి తీసుకొచ్చింది. తెలుగు భాష అమలుకు కావాల్సిన సిలబస్‌, పుస్తకాలను వెంటనే తయారు చేయాలని కడియం ఆదేశించారు.భాషా పండితుల అప్‌ గ్రెడేషన్‌పై అధికారులతో కడియం శ్రీహరి చర్చించారు. భాషా పండితులకు తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలని సూచించారు. ఇందుకోసం న్యాయ సలహా తీసుకుని.. అప్‌గ్రెడేషన్‌ జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ts government