TS politics

19:08 - May 17, 2017

నిజామాబాద్: ఓవైపు మిర్చి, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు సతమతమవుతుంటే మరో వైపు నిజామాబాద్ జిల్లాలో ఆమ్ చూర్ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తెచ్చిన సరుకు అమ్మకుందామంటే పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దళారుల నిలువుదోపిడి.. అధికారుల నిర్లక్ష్యంతో ఆవేదన చెందుతున్న నిజామాబాద్ ఆమ్ చూర్ రైతుల దయనీయ పరిస్థితిపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్...
హైదరాబాద్ తరువాత ఆమ్‌చూర్ కొనుగోళ్లకు ప్రసిద్ధి చెందింది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్. ఇక్కడకు అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చి సరుకును అమ్ముతుంటారు. ఏటా అంతంత మాత్రంగా ఉంటే ఆమ్ చూర్ ధర ఈసారి సగానికి సగం పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్‌చూర్ కు గిరాకి ఎక్కువ......
ఆమ్‌చూర్ కు ఉత్తరాది రాష్ర్టాల్లో గిరాకి ఎక్కువగా ఉంటుంది. డిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహర్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో చింతపండుకు బదులు ఈ ఆమ్ చూర్ ను వంటలలో వినియోగిస్తారు. మామిడికి ధర లేని సమయంలో రైతులు ఆమ్ చూర్ తయారు చేస్తారు. మామిడికాయల పొడుగ్గా ముక్కలుగా చేసి ఎండబెడతారు. పూర్తిగా ఎండిన మామిడి ముక్కలను మార్కెట్ కు తీసుకువస్తారు. ఈ ఏడాది మామిడి కాయలకు పెద్దగా గిట్టు బాటు ధర లేకపోవడంతో చాలామంది రైతులు ఆమ్ చూర్ ను తయారు చేసి పెద్ద మొత్తంలో సరుకును నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చారు.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వారం రోజులుగా అంచూర్ పంట తరలి వస్తోంది. అయితే ఇక్కడ కొనుగోళ్లు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ పంటకు ఎక్కడా కూడా పెద్దగా మార్కెట్ లేకపోవడంతో దాదాపుగా పది జిల్లాల నుండి రైతులు నిజామాబాద్ కు వచ్చి ఆమ్ చూర్ అమ్ముతున్నారు. అయితే ఈ పంటకు కొనుగోలు దారులు తక్కువగా ఉండటంతో దళారులుగా మారిన కొందరు వ్యాపారులు రైతుల్ని నిలువునా ముంచుతున్నారు. గతేడాది క్వింటా ఆమ్ చూర్ 26 నుండి 28 వేలు ధర పలికింది. దాంతో ఆశపడ్డ రైతులు పెద్ద మొత్తంలో మామిడి కాయలు ఆమ్ చూర్ గా మార్చేసారు. ప్రస్తుతం క్వింటాలు 13 నుంచి 17 వేల ధర పలుకుతుండటంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు.

క్వింటాకు నాలుగు కిలోలు తగ్గించి ...
మరోవైపు వ్యాపారులు సంచి బరువు పేరుతో క్వింటాకు నాలుగు కిలోలు తగ్గించి లెక్కకడుతుండటంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ లెక్కన రోజుకు లక్ష రూపాయల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే రైతులకు అప్పటికప్పుడు చెల్లింపులు చేస్తేనే ఇంటికి వెళ్లె పరిస్థితి. రైతుల బలహీనతను సాకుగా తీసుకుని పలికిన ధరకంటే తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని ఆమ్ చూర్ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దళారులను కట్టడి చేసి తమకు గిట్టుబాటు ధర ఇప్పించేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. 

18:21 - May 9, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తరువాత కూడా.. అధికారానికి దూరమై ప్రతిపక్షానికే పరిమితమైంది. ఎన్నికలు తరుముకొస్తుండటంతో కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. గతంలో చేజారిన పవర్‌ను 2019లో దక్కించుకొని.. సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న హస్తం నేతలను ఒక సవాల్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్‌ను సమర్థవంతగా ఢీ కొడితేనే 2019లో అధికారం సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ నేతలు నమ్ముతున్నారు. ఇందుకోసం చేయాల్సిన పనులపై దృష్టి పెట్టారు. కేసీఆర్‌ సంక్షేమ ప్రచారానికి ధీటుగా మ్యానిఫెస్టోను రూపొందించడంతో పాటు.. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక లీడర్‌ కావాలనే నిర్ణయానికి హస్తం నేతలు వచ్చారు.

అందరూ సీనియర్లే..
ప్రస్తుతం పార్టీలో ఉన్న వారంతా సీనియర్లే. అందరూ మంత్రులుగా పని చేసి.. సుదీర్ఘ కాలం పదవుల్లో ఉన్న వారే కావడంతో పార్టీలో నాయకులకు కొదవ లేదు. ఇదే ఇప్పుడు పార్టీకి సవాల్‌గా మారింది. అందరూ నాయకులే కావడం.. నేతల మధ్య ఆధిపత్య పోరు తోడు కావడంతో.. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఢిల్లీ పెద్దల ముందు తమ ప్రతిపాదనల చిట్టాను పెట్టినట్లు తెలుస్తోంది.

సీఎం రేసులో దాదాపు 12 మంది నేతలు..
ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం రేసులో దాదాపు 12 మంది నేతలున్నారు. వారిలో ఉత్తమ్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, డికే అరుణ, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ ఇలా మరి కొందరు నేతలు.. అవకాశం వస్తే తామే సీఎం అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఎన్నికలకు వెళ్లడం ద్వారా లాభం లేదని అంచనా కొచ్చిన నేతలు.. ఇప్పుడు సింగిల్ లీడర్ బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు. దీనికోసం.. తమలో ఎవరినైనా సరే.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. అతని నాయకత్వంలో వెళ్తామని చాలా మంది నేతలు రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం పార్టీకి ఎవరైతే లాభమనుకుంటే.. వారినే ఎంపిక చేయండని రాష్ట్ర నేతలు అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది.

10:43 - May 3, 2017

రాజన్న సిరిసిల్లా : జిల్లా కేంద్రములోని సుందరయ్య నగర్‌లో.. పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. వేములవాడ డిఎస్‌పి, సిరిసిల్ల ఇంచార్జ్‌ డిఎస్‌పి చంద్రశేఖర్‌.. నలుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, సుమారు నూట ఇరవై మంది కానిస్టేబుల్స్‌ ఈ కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య నగర్‌లోని ప్రతీ ఇంటిని సోదా చేశారు. అనుమానితులున్నారని, గుడుంబా తదితర అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించామని.. ఇంచార్జ్‌ డిఎస్‌పి చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో సుమారు 12 లీటర్ల సార దొరికిందని ఆయన అన్నారు. అంతే కాకుండా పత్రాలు సరిగా లేని వాహనాలను పట్టుకున్నామని, మొదటిసారి కాబట్టి హెచ్చరించి వారిని వదిలేశామని తెలిపారు. 

21:27 - February 12, 2017
20:03 - February 10, 2017

హైదరాబాద్: తెలంగాణ మంత్రులంతా ప్రజాబాట పట్టారు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం జనాల్లోనే ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.. మంత్రుల్లో ఈ మార్పుకు కారణమేంటి? స్పెషల్ స్టోరీ...

గ్రామాల్లో... పట్టణాల్లో వరుస పర్యటనలు..

తమ శాఖలపై పట్టు సాధించేందుకు తెలంగాణ మంత్రులు కృషి చేస్తున్నారు.. గతంలోకంటే భిన్నంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. బడ్జెట్‌ రూపకల్పనపై అధికారులతో సమీక్షలు చేస్తూనే ఇతర కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు..

స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులపై దృష్టి...

ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు.. స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులపైకూడా దృష్టిపెట్టారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా కృషిచేస్తున్నారు. నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తున్నారు. పార్టీలో చేరికలు, సభ్యత్వ నమోదును కూడా జోరుగా చేస్తున్నారు.. నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో ప్రజల మధ్య ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.. ప్రతిపక్షాల విమర్శలను కూడా తిప్పికొడుతున్నారు..

కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్‌ క్లాస్‌ ...

గత మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్‌ క్లాస్‌ పీకారని సమాచారం. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా తమ తమ శాఖలపై పట్టుసాధించలేక... ప్రతిపక్ష సభ్యుల విమర్శల్ని ఎదుర్కోలేకపోతున్నవారిపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.. ఇలాగైతే వచ్చేఎన్నికల్లో సమస్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.. సీఎం ఇలా ఆగ్రహించడంతో మంత్రుల తీరులో మార్పువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సచివాలయం వదిలి మంత్రులు ప్రజాబాట పట్టారు. రెండున్నరేళ్లలో తాము చేసిన కార్యక్రమాల్ని వివరిస్తున్నారు..

18:40 - January 29, 2017

సిద్ధిపేట : జిల్లాలో పోలీసుల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. సీపీ శివకుమార్ వేధిస్తున్నాడంటూ హుస్నాబాద్ సీఐ భూమయ్య ఆరోపణలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు వాహనం వాడవద్దని..కుర్చీలో కూర్చొవద్దంటూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. శివకుమార్ ఎస్పీగా ఉన్న సమయంలో అవకతవకలపై ప్రశ్నించడం జరిగిందని దీనితో ప్రస్తుతం ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ లో పోలీసు అమరవీరులు స్మారక నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వీటిపై ప్రశ్నించినందుకు వేధస్తున్నాడని భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

18:33 - January 29, 2017
18:32 - January 15, 2017

మహబూబాబాద్ : పల్లెపల్లెను పలకరిస్తూ.. ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. 91వ రోజు తమ్మినేని పాదయాత్ర బృందం మందకొమురమ్మ నగర్‌లో పర్యటించింది. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరు పేదలు తలదాచుకునేందుకు కనీసం ఇళ్లు కూడా ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ప్రభుత్వాలు అగ్రవర్ణ ధనికులకు కొమ్ముకాయడం వల్లే పేదలకు న్యాయం జరగడం లేదని తమ్మినేని అన్నారు.

21:29 - January 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పరిశ్రమలశాఖ, పోలీసుశాఖల పనితీరు మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పోలీసుల పనితీరు వల్ల క్రైమ్‌రేట్‌ గణనీయంగా తగ్గిందని చెప్పారు. పోలీసులు, పరిశ్రమలశాఖ అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. శాంతిభద్రతలు బాగున్నందునే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ప్రగతి భవన్‌లో హోంశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పోలీసులు మానవతా దృక్పథంతో నేరస్తులను బాగు చేస్తున్నారని చెప్పారు. ఈ సమీక్షలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మతోపాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల నియామకాల అంశాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

13:40 - January 11, 2017

ఢిల్లీ : చిన్నపట్టణాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తోందని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ప్రాంతీయ వైమానిక అనుసంధానంపై కేంద్ర పౌరవిమానశాఖ మంత్రితో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని విమానయానశాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి అశోక గజపతిరాజుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్కిల్ అకాడమి స్థాపనకు విమానయానశాఖ అంగీకారం తెలిపిందని కేటీఆర్ తెలిపారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - TS politics