tsrtc

15:37 - March 3, 2018

మేడ్చల్ : జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డీసీఎం, నిల్వ ఉంచిన టైర్లు, ఆయిల్ కాలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఆఫీస్ పక్కనే అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. పెద్దగా ఆస్తినష్టం జరగలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:32 - January 25, 2018

హైదరాబాద్ : భాగ్యనగరం.. హైదరాబాదులో  ప్రయాణం అంటే నరకమే... అన్న విషయం తెలియని వారుండరు. అందునా ఆర్టీసీ బస్సులో ఐతే  ప్రత్యక్ష నరకమే. బస్సులోపలే కాదు.. బస్సు ఎక్కడానికి ముందు కూడా సమస్యలే...  సరైన షెల్టర్లు లేక  ఎండకు ఎండుతూ... వానకు నానుతూ... వచ్చిన బస్సును అందుకోలేక  నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మోడరన్‌ బస్టాపులు... ప్రత్యేక బస్‌బేలంటూ.. బల్దియా చెబుతున్న మాటలు నీటి మూటలను తలపిస్తున్నాయి.
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు
టెక్నాలజీ ఎంత పెరిగినా... హైదరాబాద్‌ ప్రయాణంలో మాత్రం అవస్థలు తీరడంలేదు.. ఓవైపు కాలంచెల్లిన ఆర్టీసీ బస్సులు... మరోవైపు గతుకుల రోడ్లు... ఇవి చాలవన్నట్లు  ట్రాఫిక్‌ జామ్‌లు.
బస్సుల కోసం రోడ్లపైనే పడిగాపులు..
అసలు తాము ఎక్కాల్సిన బస్సుకోసమే ప్రయాణీకులు గంటల పాటు ఎదురు చూడాలి.  పోనీ... ఓపిక పట్టి ఎదురు చూద్దామనుకున్నా... సరైన షెల్టర్ ఉండదు. ఎండాకాలంలో మండుటెండలో.. వర్షాకాలంలో జోరువానలో ప్రయాణీకులకు తిప్పలు తప్పడంలేదు..  చాలా చోట్ల రోడ్లపైనే   పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
తీవ్రంగా వేధిస్తున్న బస్‌బేల కొరత
నగరంలో బస్‌ బేల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి రోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణీకులను... గమ్యస్థానాలకు చేర్చడానికి 3800  బస్సులు తిరుగుతున్నాయి.  కానీ వాటిని నిలపడానికి ఏదో కొన్ని చోట్ల మినహా... మరెక్కడా స్థలం లేదు. అటు డ్రైవర్లతోపాటు ఇటు ప్రయాణీకులకు కూడా  ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే సారి ఎక్కువ బస్సులు వచ్చాయంటే.. పరుగులు తీసే ప్రయాణీకుల అవస్థలు మాటల్లో చెప్పలేం.
ఏళ్ళు గడుస్తున్నా.. పూర్తికాని షెల్టర్లు
ఎన్నేళ్ళు గడుస్తున్నా.. నగరంలో బస్‌షెల్టర్ల నిర్మాణం పూర్తికావడం లేదు. పదేళ్ళక్రితం బస్‌షెల్టర్ల నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది ఆర్టీసీ.  1832 బస్టాపులు అవసరమని బల్దియాకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. 
యాడ్‌ ఏజెన్సీలకు నిర్మాణ బాధ్యతలు  
బస్టాపుల నిర్మాణాన్ని యాడ్‌ ఏజెన్సీ ద్వారా బిల్ట్‌ ఆపరేట్‌  అండ్‌ ట్రాన్స్‌పర్‌ పద్ధతిలో  చేపట్టాలని నిర్ణయించారు గ్రేటర్‌ అధికారులు.. ఐదు సార్లు టెండర్లు నిర్వహిస్తే... కేవలం 840 బస్‌ షెల్టర్ల నిర్మాణమే జరిగింది. పలు ప్రాంతాల్లో  షెల్టర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన యాడ్‌ ఏజెన్సీలు..   యాడ్స్‌పై ఎక్కువ ఆదాయం  వచ్చే ప్రాంతాల్లో మాత్రమే నిర్మించారు. 
1200 బస్‌షెల్టర్ల కొరత : అధికారులు
బస్‌షెల్టర్ల నిర్మాణాలు అతివృష్టి.. అనావృష్టి తీరులో చేపట్టారు. ఒకటీ లేదా రెండు షెల్టర్లు మాత్రమే  అవసరమైన చోట్ల అవసరానికి మించి నిర్మించాయి యాడ్‌ కంపెనీలు. ప్రస్తుతం 1200 ప్రాంతాల్లో బస్‌ షెల్టర్ల కొరత ఉందంటున్నారు అధికారులు. 
55 ప్రాంతాల్లో   స్థలాల గుర్తింపు
బస్‌బేల నిర్మాణంకోసం... దాదాపు రెండేళ్ళ క్రితం నుంచీ అధికారులు  కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో 55 ప్రాంతాల్లో బస్‌బేల నిర్మాణానికి అధికారులు ప్రాథమికంగా స్థలాలను గుర్తించారు. వాటిని తమకు అప్పగించాలంటూ సంబంధిత శాఖలకు అర్జీలు కూడా పంపారు. బస్‌బేలు, బస్టాపుల నిర్మాణం, నిర్వహణల అధ్యయనం కోసమంటూ... ప్రజా ప్రతినిధులు, అధికారులు  స్టడీ టూర్‌లకు  తిరిగి వస్తున్నారు కానీ.... సమస్యకు మాత్రం చెక్‌ పెట్టడం లేదు..  మరికొద్ది నెలల్లో రానున్న వేసవి కాలానికైనా... ఈ సమస్య తీరుతుందో లేదో అధికారులు చెప్పాలి..

12:14 - December 31, 2017


హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ ఎప్పుడు జరగనుంది? గత వేతన ఒప్పందం సందర్భంగా సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? వేతన సవరణకు ఆర్టీసి కార్మిక సంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలేంటి? పిఆర్సీ పట్ల ఆర్టీసి యాజమాన్యం వైఖరేంటి? అధికార పార్టీకి చెందిన గుర్తింపు సంఘం ఏమంటోంది? అనే అంశాలపై టెన్ టీవి స్పెషల్ స్టోరీ.. 
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురుచూపులు
తెలంగాణ ఆర్టీసీలో వేతన సవరణ గడువు ముగిసి ఎనిమిది నెలలు గడుస్తోంది. గత ఏప్రిల్‌లో కొత్త పీఆర్సీ ఇవ్వాల్సినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలే జరగడం లేదు. పే రివిజన్‌ కమిటీ వేసినప్పటికీ.. పీఆర్సీపై స్పష్టతే లేదని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. అయితే.. పీఆర్సీ సందర్బంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పీఆర్సీ ఆలస్యమైన కొద్దీ వేతన బకాయిలు భారం 
ఇక పీఆర్సీ ఆలస్యమైన కొద్దీ వేతన బకాయిల భారం పెరగనుంది. రాష్ట్ర విభజన సమయంలో బకాయిలు చెల్లించడం భారం కావడంతో విడతల వారీగా 50 శాతం... మిగిలిన 50 శాతం బాండ్ల రూపంలో చెల్లించారు. ఈసారి కూడా అదే పరిస్థి నెలకొనే అవకాశముందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. 
వేతన సవరణ ప్రతిపాదనలిచ్చిన ఆర్టీసీ సంఘాలు  
వేతన సవరణ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిన కమిటీకి... ఆర్టీసీ సంఘాలు వేతన సవరణ ప్రతిపాదనలు ఇచ్చాయి. టీఎంయూ 50 శాతం, ఎంప్లాయిస్‌ యూనియన్‌ 62 శాతం, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 70 శాతం వేతనం పెంచాలని ప్రపోజల్స్‌ ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు కమిటీ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. అయితే... 50 శాతం ఖచ్చితంగా వేతన సవరణ సాధిస్తామని గుర్తింపు సంఘమైన టీఎంయూ ధీమా వ్యక్తం చేస్తోంది. 
62శాతం వేతన సవరణ జరగాలి : ఈయూ 
ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనం రావాలంటే 62శాతం వేతన సవరణ జరగాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ అంటోంది. 
70శాతం వేతన సవరణ జరగాలన్న ఎస్ డబ్ల్యు ఎఫ్  
కనీస వేతనం 18 వేలు ఉండాలంటే.. 70శాతం వేతన సవరణ జరగాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకత్వమంటోంది. వేతన సవరణే కాకుండా సర్వీసు రూల్స్, రెగ్యూలేషన్స్ కూడా సవరించాలని డిమాండ్‌ చేస్తోంది. పీఆర్సీ విషయంలో యాజమాన్యం తీరు సరిగా లేదనడానికి గుర్తింపు సంఘం నిరసనలు, దీక్షలు చేపట్టడమే దానికి నిదర్శమని వామపక్షయూనియన్‌ నేతలంటున్నారు.  
పీఆర్సీ ఉసేత్తని సీఎం కేసీఆర్ 
గత వేతన ఒప్పందం సందర్భంగా.. వేతన సవరణ గడువుకు ముందే పీఆర్సీ ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. గడువు ముగిసి ఎనిమిది నెలలైనా ఆ ఊసే ఎత్తకపోవడంపై ఆర్టీసీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

17:17 - December 30, 2017
06:41 - December 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఎంప్లాయూస్‌ యూనియన్‌ మహాసభలు తీర్మానించాయి. వేతన సవరణ ఒప్పంద కాలపరిమితి ముగిసి 9 నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు కొత్త వేతన సవరణను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వ చర్యను మహాసభలు తప్పుపట్టాయి. వేతన సవరణ జరిగే వరకు 30 శాతం తాత్కాలిక భృతి చెల్లించాలని హైదారాబాద్‌లో జరిగిన టీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రెండో మహాసభలు డిమాండ్‌ చేశాయి.

ఈ మహాసభల్లో వేతన సవరణపై ప్రధానంగా చర్చించారు. కొత్త వేతన సవరణను వెంటనే చేపట్టాలని, అప్పటి వరకు కార్మికులు, ఉద్యోగులందరికీ 30 శాతం తాత్కాలిక భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఆర్టీసీలో కొన్ని విభాగాల మూసివేతలు, కార్మికులు తీసివేతలపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదువేల మంది కార్మికులు రిటైరైతే.. వీరి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టని యాజమాన్యం చర్యను ఎంప్లాయూస్‌ యూనియన్‌ మహాసభలు తప్పుపట్టాయి. కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న ఉద్యోగులపై రోజు రోజుకు పనిభారం పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమైంది. తెలంగాణలో అద్దె బస్సులు ఉండవని ఉద్యమంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ఆపాలని డిమాండ్‌ చేశాయి. తెలంగాణలో ప్రైవేటు బస్సు ఆపరేటర్ల అక్రమ రవాణను అరికడతామన్న కేసీఆర్‌... అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇవ్వడాన్ని మహాసభలు తప్పు పట్టాయి. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు ఆమోదించడంతో పాటు, పలు డిమాండ్లను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం ముందు ఉంచాయి.

ఆర్టీసీ ఆస్పత్రిలో డాక్టర్ల పోస్టులను భర్తీ చేయని సంస్థ యాజమాన్యం చర్యను ఎంప్లాయూస్‌ యూనియన్‌ మహాసభలు తప్పుపట్టాయి. మందుల పంపిణీ ప్రైవేటీకరణపై యూనియన్‌ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మిక వ్యతిరేక విధానాలు వంతపాడుతోందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ మహాసభలు ఆరోపించాయి. వీటిని ఆపకపోతే భవిష్యత్‌లో ఉద్యమం తప్పదని హెచ్చరించాయి. 

08:33 - December 12, 2017

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్టాఫ్‌ ఆండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్య్లూఎఫ్‌) నాయకులు వీఎస్‌ రావ్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. పని భారం పెంచుతున్నారు. కార్మిక చట్టాలు అమలు లేదు. పే స్కేల్‌ లేదు. ఇది ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్న మాట. వారి ఆందోళనకి దారి తీసిన పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తదితర అంశాలపై వీఎస్‌ రావ్‌ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

22:07 - October 30, 2017

యాదాద్రి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. యాదగిరిగుట్ట మండలంలోని భువనగిరి..ఆలేరు సమీపంలో బాహుపేట స్టేజి వద్ద ఆర్టీసీ వజ్ర బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆలో డ్రైవర్ సహా ఐదు మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

10:36 - October 20, 2017

 

చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నాగపట్టణం జిల్లా సోనచేనక తె బస్ బొపో గ్యారేజ్ కుప్పకూలిపోయింది. 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. అధికారులు సహాయకచర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

06:52 - October 19, 2017

హైదరాబాద్: ఉద్యోగాలు ఇస్తున్నట్టు కాల్‌ లెటర్లు పంపారు.. వచ్చిన వారికి నాలుగు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టింగులు ఇవ్వడం మరిచారు. ఘనత వహించిన తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీరని అన్యాయం జరుగుతోంది. పోస్టింగ్‌ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు . టీఎస్‌ ఆర్టీసీలో సంవత్సరాలుగా సాగుతున్న రిక్రూట్ మెంట్ పై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ.

డ్రైవర్ పోస్టులకు 9 వేల మంది దరఖాస్తు

హైదరాబాద్‌ జోన్ పరిధిలోని జిల్లాల్లో ఉన్న ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు 9 వేల మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 387 మందిని సెలక్ట్‌ చేశారు. ఎంపికైన వారిలో 170 మందికి వెంటనే పోస్టింగులు ఇచ్చారు. మిగిలిన 217 మందికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మరో సారి డ్రైవర్ కమ్‌ కండక్టర్‌ ట్రైనింగ్‌ కూడా ఇప్పించారు. శిక్షణ పూర్తై దాదాపు నాలుగేళ్లు గడిచిపోయినా పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొంత మందికి ఉద్యోగాలు ఇచ్చి మరికొందరికి నియామక పత్రాలు ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. వీరంతా ఎన్నోసార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులను కలిసినా... ఖాళీలు ఏర్పడిన తర్వాత పోస్టింగ్‌ ఇస్తామన్న హామీతోనే సరిపెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు ఎంపికైన వారు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమకు ఇంకా ఉద్యోగాలే రాలేదని ఆందోళన చెందుతున్నారు.ఖాళీలు లేకుండా డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేసి, ఎలా ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఆర్టీసీ అధికారుల అనాలోచిత విధానానికి ఎంపికై, పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లే నిదర్శనమని కార్మిక నేతలు విమర్శిస్తున్నారు.

19:40 - October 13, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక శాఖ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లడం సాధారణ విషయం.  ఇలా వెళ్లే ఉద్యోగులు తమ మాతృసంస్థలో చేస్తున్న పనితో పాటు పొందుతున్న సౌకర్యాలు కూడా దాదాపు ఒకేలా ఉండేలా చూసుకుంటారు. కానీ ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు  డిప్యూటేషన్‌పై వెళ్లిన కార్మికుల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అగ్ని మాపక శాఖలో ఆర్టీసీ డ్రైవర్లు పడుతున్న అష్టకష్టాలపై 10 టివి ప్రత్యేక కథనం... 
అగ్ని మాపక శాఖలో డ్రైవర్ల కొరత 
అగ్ని మాపక శాఖలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఈ శాఖ అధికారుల రాత పూర్వక విన్నపం మేరకు ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిన డ్రైవర్లు ఇక్కడ ఇమడలేకపోతున్నారు. ఫైర్‌ సర్వీసెస్‌లో పరిస్థితులు  దారుణంగా ఉన్నాయని బాధపడుతున్నారు. 
డిప్యుటేషన్‌పై వెళ్లిన 76 మంది ఆర్టీసీ డ్రైవర్లు 
ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన   95 మంది డ్రైవర్లలో  76 మంది గత ఏడాది మే నుంచి అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే  అగ్నిమాపక శాఖ తమను రెండో తరగతి పౌరులుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి సొంత శాఖలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు.  ఆర్టీసీలో ప్రతినెల 5వ తేదీకల్లా జీతాలు పొందిన డ్రైవర్లకు అగ్నిమాపక శాఖలో మాత్రం అవస్థలు తప్పడంలేదు.
భత్యాల చెల్లింపులో కూడా వ్యత్యాసం 
ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిన డ్రైవర్లకు జీతాల సమస్యే కాదు.. భత్యాల చెల్లింపులో  కూడా వ్యత్యాసం, వివక్ష చూపుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీతో డిప్యుటేషన్‌ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు. సౌకర్యాలు కల్పించడంలేదని సొంత సంస్థకు మొరపెట్టుకుంటున్నారు. 
బస్సులు నడపలేక అధికారులు సతమతం 
డ్రైవర్ల కొరతతో  బస్సులు నడపలేక సంస్థ అధికారులు  సతమతమవుతున్నారు. నిత్యం సర్వీసులు రద్దు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై  ఆర్టీసీ డ్రైవర్లను పంపిన సంస్థ ఉన్నతాధికారుల చర్యను కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. అగ్నిమాపక శాఖకు పంపిన  ఆర్టీసీ  డ్రైవర్లను వెంటనే వెనక్కి రపించాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - tsrtc