TTD

18:35 - February 21, 2018

చిత్తూరు : టిటిడిలో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తులకు ఊరట లభించింది. అన్యమత ఉద్యోగస్తులను తొలగించకూడదంటూ ఉభయ రాష్ట్రాల హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్యమతస్తులుగా ఉన్న 42 మందిని తొలగిస్తూ టిటిడి ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఉద్యోగస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా టిటిడి కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం కోర్టు విచారించింది. ఏన్నో ఏళ్లుగా పనిచేస్తున్న హైందవేతరులను ఎలా తొలగిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 

20:18 - February 5, 2018

దుబాయ్ : ఎడారి దేశంలో.. శ్రీనివాసుడి కల్యాణం..! అత్యంతం కమనీయం... కడు రమ్యం..! వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య... అన్నమయ్య గీతాలాపనల నడుమ.. అంగరంగ వైభవంగా సాగే మహోత్సవం... శ్రీనివాసుని వివాహం..! ఎడారి దేశంలో కూడా  ఆ ఏడుకొండలవాడి పెళ్లి.. కన్నులవిందుగా సాగింది.     

ప్రవాస భారతీయులు ముచ్చటగా జరుపుకునే మహోన్నత వేడుక శ్రీవారి కల్యాణం. దేశమేదైనా... ఆ ఏడుకొండలవాడి వివాహ మహోత్సవం వైభవంగా సాగాల్సిందే.. దీనికి ఏడారి దేశం కూడా  మినహాయింపు కాదు. దుబాయ్‌లో శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం ఓ పండుగగా జరిగింది. తిరుమల క్షేత్రంలో  జరిగే శ్రీవారి కల్యాణోత్సవానికి ఏ మాత్రం తీసిపోకుండా.. సంప్రదాయబద్ధంగా ఇక్కడ కూడా ఈ వేడుకను నిర్వహించారు. 

దుబాయ్‌ నగరానికి సమీపంలో అజ్మన్‌ అనే ప్రాంతంలో వెంకటేశ్వరస్వామి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.  భక్తుల గోవింద నామస్మరణతో దుబాయ్‌ నగరం మారుమోగింది.  పండితుల మంత్రోచ్ఛరణలు, వేల సంఖ్యలో  భక్తులు, చిన్నారుల అన్నమయ్య గీతాలాపనల మధ్య.. శ్రీవారి పెళ్లి కడు రమ్యంగా సాగింది.  తిరుపతి వేద పండితుల మంత్రాల నడుమ శ్రీవారు తమ ఉభయ దేవేరులకు మంగళసూత్రధారణ చేశారు. 

వేల సంఖ్యలో భక్తులు సతీసమేతంగా..ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యునైటెడ్‌ ఎమిరేట్స్ ప్రాంతాలైన దుబాయ్‌, అబుదాబి, అజ్మన్‌, పుజైరా, రస్‌ ఆల్‌ఖైమా, షార్జా, ఉమల్‌ క్వైన్‌ల నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు ఈ వేడుకను వీక్షించారు.  శ్రీవారి పెళ్లితో.. అజ్మన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. శ్రీనివాసుడి వివాహ వేడుకను వీక్షించిన భక్తులు..ఆనందోత్సహంలో మునిగిపోయారు. ఎంతో సంతోషంగా ఉందని.. తిరుపతిలో ఉన్నట్టే ఉందని.. సంతోషం వ్యక్తం చేశారు. అజ్మన్‌లో శ్రీవారి కల్యాణంతో పాటు.. పుష్ఫయాగాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. 

08:35 - January 30, 2018

చిత్తూరు : తిరుమ శ్రీవారి మెట్ల అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు భారీగా బయటపడ్డాయి. అందులో రెసిస్టర్లు, కెపాసిటర్లు, సర్య్కూట్ బోర్డులు ఉన్నాయి. వాటితో పాటు పోలీసులు సెల్ ఫోన్, వాకీటాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:42 - January 30, 2018

మహబూబ్ నగర్ : -మన్యం కొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం పలు రాష్ర్టాల నుంచి తిరుమలకు వెళ్ళే స్థోమత లేని పేదలు... మన్యంకొండలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని... మొక్కులు తీర్చుకుంటారు. అందుకే ఈ కొండ పేదల తిరుపతిగా పేరుగాంచింది.ఎత్తైన కొండపై గుహల్లో స్వయంభూగా వెలిసిన స్వామికి ఏడాదికి ఓసారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 15రోజుల పాటు సాగే ఉత్సవాల్సో భక్తులు లక్షలాదిగా పాల్గొంటున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కొండపైకి చేరుకునేందుకు రోడ్డు మార్గాన్ని నిర్మించారు. 24 గంటల పాటు విద్యుత్ సౌకర్యం, తాగు నీటికోసం కుళాయిలు, క్యూ లైన్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆళహరి వంశీయులు స్వామివారికి సేవలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ నెల 31న రథోత్సవం, గరుడ సేవ నిర్వహిస్తారు. నిండు పున్నమినాడు జరిగే రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తుతారు. మొక్కులు తీర్చుకునేందుకు దసాంగాలను సమర్పిస్తారు. మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి కోరిన కోర్కెలు తీర్చే దైవంగానూ ప్రసిద్ధి చెందారు.. ఆయన బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. స్వామి వారి దివ్యరూపాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంతో తరిస్తున్నారు.

08:48 - January 27, 2018

తూర్పుగోదావరి : అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి వారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. నేడు రాత్రి 11.27నిమిషాలకు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. తెలుగు రాష్ట్రాలనుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆరు రోజుల పాటు సాగనున్న వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అంతర్వేది. ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వారికి నేటి నుండి ఆరు రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ రాత్రి 11.29నిమిషాలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగనుంది. 28వ తేదీ ఆదివారం రోజున భీష్మేకాదశి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం స్వామి వారి రథోత్సవం ఘనంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.  ఈనెల 31న మాఘ పూర్ణమి సందర్భంగా స్వామి వారికి చక్రస్నానం  జరుపనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ మాఘ బహుళ పాడ్యమి నాడు తెప్పోత్సవంతో కార్యక్రమం క్రతువు ముగియనుంది.
స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్న టీటీడీ
స్వామి వారి కళ్యాణం కోసం  టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం రాత్రి 11.29నిమిషాలకు వేదపండితులు కళ్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి కళ్యాణం సందర్భంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను ఘనంగా చేపట్టారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు రానుండటంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖాధికారులు ఏర్పాటుచేశారు. సముద్రపు స్నానాలకు.. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా షెడ్‌లను ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు, బారీకేడ్ల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక పాసులు, వీఐపీ దర్శనాలను నిలిపివేశారు. భక్తుల కోసం కళ్యాణ పాసులు, ప్రసాదాలు సిద్ధం చేశారు. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు 50తో కళ్యాణ పాసులను ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టారు. 

 

21:38 - January 5, 2018

తిరుపతి : మార్చి రెండోవారం నుంచి తిరుపతిలోనూ సర్వదర్శనం టైంస్లాట్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలుచేస్తామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. తిరుపతిలో కూడా భక్తులు బస చేయడానికి వీలుగా 2 వేల 5 వందల వసతి గదుల నిర్మాణం చేపడతామని.. చెప్పారు. అలాగే సర్వదర్శనం టైంస్లాట్‌ విధానం విజయవంతమైందని అన్నారు.

 

11:59 - December 31, 2017

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఉద్యోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 44 మంది ఉన్నట్లు నివేదికలో బయటపడింది. టీటీడీలో అన్యమతస్తులు పని చేయడంపై సర్వత్రా విమర్శలు తలెత్తడంతో... వారిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు ఉన్నతాధికారులు.
ఉద్యోగులుగా అన్యమతస్తులు 
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఉద్యోగులుగా కొనసాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో అన్యమత ప్రచార నివారణకు గతంలో అనేక చట్టాలు చేశారు. అన్యమత ప్రచారానికి పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని... టీటీడీలో వారికి ఉద్యోగాలు ఇవ్వకూడదని 2007లో పాలకమండలి ఓ చట్టం తీసుకువచ్చారు. 
కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారం 
అయితే... టీటీడీలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో తిరుమలలో అన్యమత ప్రచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవోగా పని చేసే స్నేహలత డిసెంబర్‌ మొదటి వారంలో టీటీడీ వాహనంలో... చర్చికి వెళ్లినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై టీటీడీ వైఖరిని పీఠాధిపతులతో పాలు పలువురు తప్పుబట్టారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. అయితే... విచారణలో అనేక ఆసక్తికర అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. 
నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తులకు ఉద్యోగాలు 
గతంలో టీటీడీ ఈవోలుగా పని చేసినవారు నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు బయటపడింది. 1989-2007 మధ్య కాలంలో 37 మంది అన్యమతస్తులు.. రిజర్వేషన్లతో టీటీడీలో ఉద్యోగాలు పొంది.. బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే.. అన్యమతస్తులను ప్రాముఖ్యం కలిగిన విభాగాలు, ఆలయాల్లో విధులకు దూరంగా ఉంచాలని నిబంధనలున్నాయి. కానీ.. వాటిని అమలు చేయడంలో టీటీడీ విఫలమైందని పలువురంటున్నారు. 
అన్యమతస్తుల తొలగింపుకు టీటీడీ సిద్ధం
ఇక స్నేహలత వ్యవహారంపై విచారణ జరిపిన కమిటీ... టీటీడీలో మొత్తం 44 మంది అన్యమతస్తులు పని చేస్తున్నారని గుర్తించింది. దీంతో వారిని తొలగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం అంగీకరిస్తే వారందరిని సర్కార్‌కు హ్యాండ్‌ ఓవర్‌ చేయాలని టీటీడీ భావిస్తోంది. 

 

18:25 - December 3, 2017

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పవిత్రమైన ఈ ఆలయంలో పందుల సంచరించడం చర్చానీయాంశమైంది. మాడవీధుల వద్ద పటిష్ట బందోబస్తు ఉన్నా పందుల గుంపు ఒకటి వచ్చింది. దీనితో అక్కడ భద్రత పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ సిబ్బంది పందులను గదిమేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాటేజ్, అతిథి గృహాలకు సమీపంలో కనబడే పందులు మాడవీధుల్లో సంచరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

18:31 - November 24, 2017

చిత్తూరు : టీటీడీ ఆధ్వర్యంలో ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డిసెంబర్ 1 నుండి 3వ తేదీ వరకూ టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న మన గుడి కార్యక్రమంలో వినియోగించే పూజా సామాగ్రికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు అనిల్‌ కుమార్ చెప్పారు. అందులో భాగంగా 300 ఆలయాల్లో మన గుడి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు. 

18:34 - November 3, 2017

చిత్తూరు : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 15న ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 14, 21వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. 19వ తేదీన గజవాహనం, 20న స్వర్ణరథం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - TTD